300 మంది పిల్లల్ని మింగిన ద.కొరియా టైటానిక్ -ఫోటోలు


దక్షిణ కొరియాలో మహా విషాధం సంభవించింది. వందలాది మంది పాఠశాల పిల్లల్ని ఒక ద్వీపానికి విహార యాత్రకు తీసుకెళ్తున్న ఒక నౌక ప్రమాదానికి గురయింది. హఠాత్తుగా పక్కకు ఒరగడం మొదలు పెట్టిన నౌక క్రమంగా సాయంత్రానికి నీళ్ళల్లో దాదాపు పూర్తిగా మునిగిపోయింది. టైటానిక్ పడవ మధ్యలో విరిగిపోయినట్లు ఈ పడవ విరగలేదు గానీ బైటి జనం, ఫోటోగ్రాఫర్లు చూస్తుండగానే కాస్త కాస్త మునిగిపోతూ పెను విపత్కర దృశ్యాన్ని ప్రపంచం ముందు ఉంచింది.

నౌక మునిగిపోతున్నప్పటికీ దానిని వెంటనే ఖాళీ చేయాలన్న ఆదేశాలు ఇవ్వడంలో నౌకలోని అధికారులు విఫలం కావడంతో ప్రమాద నష్టం భారీగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. నౌకను ఖాళీ చేయాలని ఆదేశించడానికి బదులుగా ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలని ప్రయాణీకులకు చెప్పారని దానితో మెజారిటీ ప్రయాణీకులు ప్రమాదంలో చిక్కుకున్నారని తెలుస్తోంది. ప్రయాణంలో ఉన్న పిల్లల నుండి తమ తల్లిదండ్రులకు వెళ్ళిన ఫోన్ కాల్స్, ఎస్.ఎం.ఎస్ లు కూడా ఇదే విషయాన్ని ధృపరుస్తున్నాయి.

దక్షిణ కొరియా దక్షిణ తీరంలో జరిగిన ఈ ప్రమాదానికి సిబ్బంది స్పందించిన తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కెప్టెన్ నుండి ప్రయాణీకులకు వచ్చిన మొదటి ఆదేశం లైఫ్ జాకెట్ వేసుకుని ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలని. పక్కకు ఒరిగిపోతున్న నౌకను తిరిగి యధాతధ స్ధితికి తేవడానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నందున ప్రయాణీకులు తొక్కిడి జరిపితే వారి ప్రయత్నాలు విఫలం కావచ్చని సిబ్బంది భావించినట్లు తెలుస్తోంది. కానీ నౌక స్ధిరీకరణలో వారు విఫలం కావడంతో వారు ఇచ్చిన ఆదేశాలే వందలాది మంది ప్రమాదంలో చిక్కుకుని పోవడానికి కారణం అయ్యాయి.

ఎక్కడివారు అక్కడే ఉండాలన్న ఆదేశం ఇచ్చిన అరగంట తర్వాత ఖాళీ చేయాలని కెప్టెన్ ఆదేశాలు ఇచ్చినప్పటికి అవి ప్రయాణీకులకు చేరలేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదం జరగబోతున్న చివరి విలువైన క్షణాలు ఆ విధంగా వృధా కావడంతో బైటపడడానికి ప్రయాణీకులకు వీలులేకుండా పోయింది.

దక్షిణ తీర నగరం మొక్పోకు కొద్ది దూరంలోనే ఉన్న ద్వీపానికి స్కూల్ విద్యార్ధులు బుధవారం (ఏప్రిల్ 16) రాత్రి విహార యాత్రకు వెళ్లారు. మొత్తం 475 మంది ప్రయాణీకుల్లో 179 మంది ప్రాణాలు దక్కించుకోగా 9 మంది చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. ఇంకా 287 మంది జాడ తెలియలేదు. వారంతా చనిపోయి ఉంటారని భయపడుతున్నారు. పూర్తిగా తిరగబడ్డ పడవలో చిక్కుని ఉన్నందున వారికిక తప్పించుకునే మార్గం లేనేలేదు.

గురువారం తుఫాను గాలులతో కూడిన వర్షం కురవడంతో సహాయక చర్యలకు వీలులేకుండా పోయింది. 475 మంది ప్రయాణీకుల్లో 325 మంది విద్యార్ధులే కావడంతో దుర్ఘటన ప్రాంతం తల్లిదండ్రుల రోదనలతో నిండిపోయింది. టూరిస్టు కేంద్రంగా ప్రసిద్ధి చెందిన జెజు ద్వీపంకు వెళ్తున్న ఫెర్రీ పేరు ‘సెవొల్’. ప్రమాదం ఎందుకు జరిగిందో ఇంకా ఎవరికీ తెలియదు. మరో 3 గంటల్లో ద్వీపం చేరుతారనగా ప్రయాణం సంభవించింది.

ప్రమాదం జరిగిన చోట సముద్రం 121 అడుగుల లోతు ఉన్నట్లు తెలుస్తోంది. 12 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే అక్కడ ఉండడం వలన లోపల ఎవరన్నా జీవించి ఉంటే వారికి హైపోధర్మియా సోకవచ్చని భయపడుతున్నారు. 146 మీటర్ల పొడవు ఉన్న సెవొల్ లో 900 మంది ప్రయాణించే వీలుంది. మంగళవారం వాయవ్య ప్రాంత నగరం ఇంచ్యోన్ నుండి బయలుదేరిన నౌక 14 గంటలు ప్రయాణం చేసి జెజు చేరాల్సి ఉండగా మరో 3 గంటల్లో గమ్యం చేరుతామనగా ఒరిగిపోవడం మొదలు పెట్టింది.

నౌక కెప్టెన్ లీ జూన్-సియోక్ (68 సం) ను అధికారులు విచారిస్తున్నట్లు ది హిందు తెలిపింది. “తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. సిగ్గుపడుతున్నాను. ఇంతకు మించి ఏమి చెప్పాలో తెలియడం లేదు” అని ఆయన టి.వి కెమెరాల ముందు అన్నారని దక్షిణ కొరియా వార్తా సంస్ధ యోన్ హాప్ తెలిపింది.

ఈ ఫోటోలను ది అట్లాంటిక్ పత్రిక అందజేసింది.

4 thoughts on “300 మంది పిల్లల్ని మింగిన ద.కొరియా టైటానిక్ -ఫోటోలు

  1. ధన్యవాదాలు సర్,గత మూడు రోజులనుండి కొత్తటపా రాకపోవుటచే,కంగారు పడ్డాను!అసంధర్భంగా ప్రస్తావిచ్చుంటే,మన్నించండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s