ఢిల్లీ మెట్రోల్లో మహిళా జేబుదొంగలే ఎక్కువ


Delhi metro

ఢిల్లీ నమోదు చేసిన విచిత్రం ఇది. ఢిల్లీ మెట్రో రైళ్లలో గత నెలలో 27 మంది జేబు దొంగలని అరెస్టు చేయగా వారిలో 26 మంది మహిళలే. ఈ నేపధ్యంలో మహిళా జేబు దొంగల సంఖ్య బాగా పెరుగుతోందని ఢిల్లీ పోలీసులు మొత్తుకుంటున్నారు.

గతేడు 400 పిక్ పాకెట్ కేసుల్ని ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. అందులో 90 శాతం వరకూ మహిళలే ముద్దాయిలుగా దొరికిపోయారని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. వీళ్ళెవరూ సంఘటిత గ్యాంగులకు చెందిన వారు కారని దర్యాప్తు అనంతరం ఢిల్లీ పోలీసులు నిర్ణయించుకున్నారట. మహిళలు జేబు దొంగలుగా దొరికిపోయిన కేసులన్నీ ఇలా ఒంటరి (isolated) కేసులే అని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు చెప్పారని ది హిందు తెలిపింది.

మహిళా జేబు దొంగలెవరూ తాము అనుమానించి పట్టుకున్నవారు కాదనీ, దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తమకు అప్పజెప్పినవారేనని సదరు పోలీసు అధికారి చెబుతున్నారు. సహజంగా ఒక మహిళ జేబు దొంగతనానికి పాల్పడుతుందని ఎవరూ అనుమానించారనీ దానితో వారి పని మరింత సులువయిందన్నది పోలీసుల అవగాహన.

దొరికిపోయిన మహిళా జేబు దొంగల్లో బాగా చదువుకున్నవారు కూడా ఉండడం మరో విశేషం. “వారిలో ఎక్కువ మంది చాలా సౌమ్యంగా మృదు భాషిలా కనిపిస్తున్నారు. బాగా చదువుకున్నవారు కూడా ఉన్నారు. అందువల్ల వారెందుకు అలా చేస్తున్నారో ప్రొఫైలింగ్ చేయడం కష్టంగా మారింది” అని పోలీసు అధికారి చెప్పారు.

ఢిల్లీ మెట్రో రక్షణ బాధ్యతలు నిర్వహించే కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు మహిళా నేరస్ధులను అరికట్టడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారట. బాగా రద్దీగా ఉండే స్ధలాలకు వెళ్ళే మెట్రోల్లో ఎక్కువగా జేబు దొంగతనాలు జరుగుతున్నాయని వారు నిర్ధారించారు.

“ఉదాహరణకి చాందిని చౌక్, చవ్రి బజార్ లాంటి యెల్లో లైన్ స్టేషన్లకి చాలా మంది వస్తూ పోతుంటారు. దానితో జేబు దొంగలకు మరిన్ని అవకాశాలు వస్తాయి. అలాంటి స్టేషన్లను వారు ఎంచుకోవడానికి మరొక కారణం అనేకమంది బైటివారు ఇక్కడ వ్యాపారం కోసం రావడం” అని పోలీసు అధికారి చెప్పారు.

ఇదో కొత్తరకం సమస్య కావచ్చు. దీనిని జెండర్ సమస్యగా చూడాలా లేక సాధారణ నేరాల సమస్యగా చూడాలా అన్న డైలమాలోకి సామాజిక పరిశీలకులను, విశ్లేషకులను నెట్టివేసే సమస్య. జెండర్ సమస్యగా చూసేవారిపైన పురుష పుంగవులు విరుచుకుపడగల అవకాశం ఉన్న సమస్య కూడాను.

చదువుకున్నవారు, సౌమ్యులుగా, మృదుభాషులుగా కనిపిస్తున్నవారు జేబు దొంగలుగా పట్టుబడుతున్నారంటే ఏ పరిస్ధితులు వారినా స్ధితికి నేడుతున్నాయో తప్పనిసరిగా ఆలోచించాల్సిన విషయం. వేగంగా మారిపోతున్న సంస్కృతీ విలువలు పురుషులతో పాటు స్త్రీలనూ వివిధ ఆర్ధిక ఒత్తిడిల లోకి నెట్టివేస్తున్నాయి. ఆర్ధిక ఒత్తిడిలు మహిళలను వ్యభిచారం లోకి దిగేందుకు ప్రోత్సహిస్తున్నాయని సామాజికవేత్తలు ఎప్పటి నుండో చెబుతున్న విషయం. బహుశా ఆ స్ధాయికి వెళ్ళిన వారు లేదా వెళ్లలేని వారూ ఈ విధంగా జేబు దొంగలు అవుతున్నారా?

అన్ని తరహాల చిన్న చిన్న నేరాలకు మల్లే జేబు దొంగతనం కూడా సమాజం సృష్టించిన నేరమే. అందులోకి మహిళలు కూడా ప్రవేశించడం సామాజికార్ధిక సమస్యల తీవ్రతను మాత్రమే తెలియజేస్తున్నది.

7 thoughts on “ఢిల్లీ మెట్రోల్లో మహిళా జేబుదొంగలే ఎక్కువ

 1. నా వ్యక్తిగత అనుభవం. పారిస్ మెట్రోలో నా పాస్ పోర్టు, కొంత నగదు ఉన్న సంచీని ఇద్దరు విద్యార్ధినులు కత్తిరించారు. చిత్రం ఏంటంటే .చాలా సులువుగా దొరికిపోయారు. ఇలాంటి నేరాలకు ఆర్ధిక ఒత్తిడి కారణమేనని ఒప్పుకోవచ్చు. దానితోబాటు మారుతున్న విలువలు కూడా చూడవచ్చు. అంతకన్న నాకు అనిపించింది మహిళల సంఖ్య హెచ్చుగా ఉందంటే చోరకళలో వారు పురుషులకన్న వెనకబడి కూడా ఉండొచ్చుగదా

 2. లింగబేధం లేని అసమాపక క్రియ చోరవిద్య. మగవాడు ఆడదాని శీలాన్ని దోచుకుంటాడని గగ్గోలు పెట్టే సభ్య సమాజం నోరు నొక్కాలంటే ఆడవాళ్ళ హస్తలాఘవంతో మగవాడి పర్సు నొక్కక తప్పదు. ప్రతి శారీరక లాభం వెనక ఒక ఆర్ధిక లబ్ది ముడివేసుకుంటుంది.

 3. నేర ప్రవృత్తికి ఆడ,మగ అనే భేదం ఏముంటుంది. పరిస్థితులు ఎవరినైనా దొంగలుగా మార్చవచ్చు.
  ఇక మీరన్నట్లుగానే వేగంగా పెరిగిపోతున్న సంస్కృతీ విలువలు….వస్తువులపై పెరుగుతున్న మోహం మనుషుల్ని ముఖ్యంగా యువతను అవసరాలకోసం ఎంతకైనా తెగించేలా చేస్తున్నాయి. మన రాష్ట్రంలో మహిళల చైన్ స్నాచింగ్ చేస్తూ పట్టుబడుతున్న యువకుల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉన్నారంటే.., పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో అర్థమవుతుంది.

 4. శేఖర్ గారు ఈ వార్తను ఢిల్లీ పోలీసులతో సహా మీడియా కూడా తప్పుగా అర్థం చేసుకుందేమో అనిపిస్తోంది. దీన్ని ఢిల్లీ మెట్రోల్లో మహిళా దొంగలే ఎక్కువ దొరికిపోతున్నారని అర్థం చేసుకోవాలేగానీ మహిళా దొంగలు పెరిగిపోయారని కాదు. ఎందుకంటే పురుషులంత తేలిగ్గా మహిళలు డబ్బు సంపాదనకు పిక్ పాకెటింగ్‌ ను ఎంచుకోరనేది నా అభిప్రాయం. పిక్ పాకెటింగ్ చేసే దశలో ఉన్నా కాస్త సంతోషించ వచ్చేమో. ఎందుకంటే వ్యభిచార కూపాల్లో, వెట్టి చాకిరీలో మగ్గిపోవడంతో పోల్చితే అది కాస్త నయమే(వాళ్ల దృష్టిలో).

 5. తులసి గారూ మీరు చెప్పింది పరిశీలనకు తీసుకోవాల్సిన అంశం. వివినమూర్తిగారు చెప్పినట్లు అలవాటు లేని చోరకళలో నైపుణ్యం లేక ఎక్కువగా దొరికిపోతున్నారని భావించవచ్చు. చోరకళలో దొరికిపోయాక పోలీసులు వారిని అక్కడితో వదిలిపెట్టరు. అది వారికి మరింత కష్టంగా మారుతుంది.

  మొత్తం మీద చూస్తే ఇది ప్రగతిశీల శక్తుల వైఫల్యం. ఇలాంటి సామాజిక పరిస్ధితి ఆ శక్తులకు అదునుగా ఉన్న క్షేత్రం లాంటిది. సమాజం మార్పుకు అనువైన పరిపక్వ దశకు చేరుకున్నప్పుడు బాహ్య శక్తులు చేయి అందించకపొతే సమాజం లోలోపల కుళ్లిపోతుంది. ఏ మార్గం దొరకని జనం పోరుదారి మాని ఇలాంటిదార్లు ఎంచుకోవడాన్ని అందులో భాగంగా చూడాలి. పక్వానికి వచ్చిన పరిస్ధితులను అనువుగా మార్చుకొని బలపడాల్సి ఉండగా ప్రగతి శక్తులు అందులో విఫలం అవుతున్నారు.

 6. బాగా చెప్పారు శేఖర్‌ గార్‌,
  ప్రగతి వాధ శక్తుల వైపల్యమే ఈ లాంటి లెంపెన్‌ వర్గాన్ని సృష్టిస్తుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s