2002 నాటి గుజరాత్ మారణకాండ కాలంలో అప్పటి ప్రధాని వాజ్ పేయ్, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలు త్వరలో బహిరంగం కావచ్చని తెలుస్తోంది. అయితే దీనికి గుజరాత్ ప్రభుత్వం మరియు, ముఖ్యమంత్రి మోడిల అనుమతిని ప్రధాన మంత్రి కార్యాలయం కోరుతున్నట్లు తెలుస్తోంది.
గోధ్రా రైలు దహనం అనంతర కాలంలో ప్రధాని, ముఖ్యమంత్రి ల మధ్య జరిగిన సంభాషణను వెల్లడి చేయాలంటూ ఆర్.టి.ఐ కార్యకర్త ఒకరు దరఖాస్తు చేయగా దానిని ప్రధాన మంత్రి కార్యాలయంలోని అధికారి మొదట తిరస్కరించారు. పి.ఏం.ఓ లోని సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సి.పి.ఐ.ఓ) ఎస్.ఇ.రిజ్వీ ఈ మేరకు దరఖాస్తును తిరస్కరిస్తూ ఆరి.టి.ఐ చట్టంలోని సెక్షన్ 8(1)(h) ప్రకారం సదరు సమాచారం వెల్లడి చేయడం కుదరదని చెప్పారు.
అయితే ఆర్.టి.ఐ చట్టం సెక్షన్ 8(1)(h), తన దరఖాస్తుకు ఏ విధంగా వర్తిస్తుందో సి.పి.ఐ.ఓ చెప్పలేకపోయారని దరఖాస్తుదారు పై అధికారికి అప్పీలుకు వెళ్లారు. సెక్షన్ 8(1)(h) ప్రకారం ఒక సమాచారాన్ని వెల్లడి చేయడం వలన ఏదన్నా కేసుకు దర్యాప్తుకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నా, నిందితులపై దాడి లేదా వేధింపులు జరిగే అవకాశం ఉన్నా ఆ సమాచారాన్ని వెల్లడి చేయరాదు. ఈ సెక్షన్ తన దరఖాస్తుకు వర్తించదనీ, కనీసం ఎలా వర్తిస్తుందో చెప్పడంలో సి.పి.ఐ.ఓ విఫలం అయ్యారని దరఖాస్తు దారు అప్పీలు చేశారు.
సి.పి.ఐ.ఓ పై అధికారి అయిన పి.ఎం.ఓ డైరెక్టర్ కృష్ణ కుమార్ ఈ అప్పీలును ఆమోదిస్తూ నిర్ణయం వెలువరించారు. సి.పి.ఐ.ఓ తీసుకున్న నిర్ణయం సరికాదని పి.ఎం.ఓ డైరెక్టర్ తేల్చి చెప్పారు. సమాచారం ఇవ్వకుండా నిరాకరించడానికి తగిన కారణాలు చూపడంలో సి.పి.ఐ.ఓ విఫలం అయ్యారన్న దరఖాస్తుదారు అభిప్రాయంతో ఏకీభవించారు.
తాను కోరిన సమాచారం 11 సంవత్సరాల క్రితం నాటిదని దరఖాస్తుదారు అయిన ఆర్.టి.ఐ కార్యకర్త తన అప్పీలులో గుర్తు చేశారు. ఇంత కాలం అయ్యాక కూడా సమాచారం వెల్లడి వలన నిందితులకు ప్రమాదం జరుగుతుందని, వేధింపులు ఎదురవుతాయని చెప్పడం అసంబద్ధం అని ఆయన ఎత్తి చూపారు. ఈ వాదనతో అప్పీలేట్ ఆధారిటీ ఏకీభవించింది. దరఖాస్తుదారు కోరిన వివరాలను వెంటనే విడుదల చేయాలని సి.పి.ఐ.ఓ ను ఆదేశించింది.
15 పని దినాల లోపల దరఖాస్తుదారు కోరిన వివరాలను అందజేయాలనీ, సి.పి.ఐ.ఓ పి.ఎం.ఓ ఈ మేరకు తాజాగా సమాచారం సేకరించి అందజేయాలని అప్పీలేట్ ఆధారిటీ అయిన పి.ఎం.ఓ డైరెక్టర్ కృష్ణ కుమార్ ఆదేశాలు ఇచ్చారు.
డైరెక్టర్ ఆదేశాలను అమలు చేయడానికి తాము గుజరాత్ ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని సి.పి.ఐ.ఓ రిజ్వీ ఆర్.టి.ఐ దరఖాస్తుదారుకు లిఖిత పూర్వకంగా తెలియజేశారని ది హిందూ పత్రిక తెలిపింది. గుజరాత్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మోడిలతో సంప్రతింపులు జరుపుతున్నామనీ, ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే తగిన సమాచారం ఇస్తామని రిజ్వీ చెప్పినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 27, 2002 – ఏప్రిల్ 30, 2002 తేదీల మధ్య అప్పటి ప్రధాని అతల్ బిహారీ వాజ్ పేయ్, ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ల మధ్య జరిగిన అన్నీ ఉత్తర ప్రత్యుత్తరాల కాపీలను ఇవ్వాలని దరఖాస్తుదారు కోరారు. ఇవి కనుక వెల్లడి అయితే 2002 నాటి గుజరాత్ మారణకాండకు సంబంధించి మరిన్ని వివరాలు దేశ ప్రజలకు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.
కానీ పూర్తి వివరాలు వెల్లడి అయ్యే అవకాశం ఉందా అన్నది అనుమానమే. ఎందుకంటే ఆ దిశగా జరిగిన అన్నీ ప్రయత్నాలనూ విఫలం చేయడంలో అదృశ్య శక్తులు సఫలం అయ్యాయి. మాయా కొడ్నానీ, బాబూ భజరంగి లాంటి కొన్ని తలలు దొర్లి పడ్డాయి కూడా. వారిని త్యాగం చేసిందే అసలు నిందితులను కాపాడడానికన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.