మన్మోహన్ తన భార్య పేరు రాయలేదుగా? -బి.జె.పి


Ravishankar Prasad

Ravishankar Prasad

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి వివాహం, భార్య అంశాలపై రాహుల్ గాంధీ దాడి ఎక్కుపెట్టిన నేపధ్యంలో బి.జె.పి తన సొంత ఆయుధం తెరపైకి తెచ్చింది. ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా తన భార్య పేరును అఫిడవిట్ లో ఇవ్వలేదన్న సంగతిని ఎత్తి చూపింది. 2013లో జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా మన్మోహన్ సింగ్ తన నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్ లో తన భార్య పేరు ఇవ్వలేదని బి.జె.పి నేత రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.

“రాజ్యసభ (రిటర్నింగ్ ఆఫీసర్) ముందు మన్మోహన్ సింగ్ ఉంచిన అఫిడవిట్ ఇది. ఈ అఫిడవిట్ లో మన్మోహన్ తన భార్య పేరు రాయలేదు. ఇలాంటి అంశాల గురించి మనం ఎందుకు మాట్లాడాలి?” అని బి.జె.పి ప్రతినిధి రవిశంకర్ ప్రశ్నించారు. ఆయన తన చేతిలో ఉన్న కాగితాన్ని ఎత్తి చూపుతూ ఈ ప్రశ్న సంధించారు. సదరు అఫిడవిట్ ఏ సంవత్సరానికి సంబంధించినదో రవిశంకర్ చెప్పలేదనీ, అయితే బి.జె.పి వర్గాలు మాత్రం అది 2013 నాటి రాజ్యసభ నామినేషన్ అఫిడవిట్ గా చెప్పారని ది హిందు తెలిపింది.

రాజ్యసభ నామినేషన్ తో జత చేసిన అఫిడవిట్ లో మన్మోహన్ తన భార్య పేరు రాయకపోవచ్చు. కానీ ఆయన తన వివాహాన్ని ఎన్నడూ దాచిపెట్టలేదు. ప్రధానిగా ఆయన నిర్వహించిన ప్రతి బహిరంగ కార్యక్రమం లోనూ తన భార్యతో పాటు హాజరయ్యారు. అనేక విదేశీ పర్యటనలకు తన భార్యను తీసుకెళ్లారు. కానీ మోడి పరిస్ధితి అది కాదు కదా!

మోడి భార్య ఒక పక్క సాధారణ టీచర్ గా పని చేస్తున్నప్పటికీ మోడి ఆమెను తన భార్యగా చెప్పుకోవడానికి ఎందుకు ఇష్టపడలేదు? పైగా ఆయన దేశసేవ కోసం పెళ్లిని త్యాగం చేశారని కొందరు చెబుతుంటే ఆయన ఆజన్మ బ్రహ్మచారి అని సంఘ్ పరివార్ కార్యకర్తలు, అభిమానులు గట్టిగా త్రికరణ శుద్ధిగా నమ్మారు, వాదించారు. అదీ కాక మన్మోహన్ సింగ్ తన భార్య పేరు రాయకపోతే అది మోడి తన వివాహాన్ని దాచి ఉంచిన వాస్తవాన్ని కప్పిపెట్టబోదు కదా! ఒకరి తప్పు మరొకరి తప్పును ఒప్పు చేయగలదా?

ఇప్పుడు కూడా ఆయన పెళ్లి నామమాత్రమేననీ, సామాజిక మర్యాద కోసం జరిగిన పెళ్లి అనీ బి.జె.పి నేతలు వాదిస్తున్నారు. ఒక నాయకుడైతే ఏకంగా మోడిని సైనికులతో పోల్చుతున్నారు. తమ భార్యలను ఇంటివద్ద వదిలి పోరాటంలోకి వెళ్ళే సైనికుల వలెనే మోడి తన భార్యను ఇంటివద్ద వదిలి దేశసేవకు అంకితమయ్యారని ఇటీవల కాంగ్రెస్ నుండి బి.జె.పి లోకి దూకిన సత్పాల్ ప్రకటిస్తున్నారు. 

మోడి సైతం తాను అవినీతికి పాల్పడని నేతగా చెప్పుకోవడానికి తన వైవాహిక స్ధాయిని కారణంగా చూపారు. తనకు కుటుంబ బంధాలు లేవు కాబట్టి అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకున్నారు. అక్కడికి లక్షల కోట్ల అవినీతికి పాల్పడేవారు కేవలం తమ కుటుంబాల కోసమే అలా చేస్తున్నట్లు? ఎన్ని తరాలు కూర్చొని తినడానికి అన్నన్ని కోట్ల అవినీతికి రాజకీయ నాయకులు, అధికారులు, దొంగలు, మాఫియాలు పాల్పడుతున్నారని మోడి చెప్పదలిచారు?

అవినీతి లక్ష్యం కుటుంబ పోషణ కానే కాదని బడా బాబుల కుటుంబ జీవనం చక్కగా చెబుతుంది. డబ్బు సంపదలు పేరుకునే కొద్దీ కుటుంబ విలువలు పతనం కావడమే మనకు తెలుసు తప్ప, డబ్బు వల్ల కుటుంబ సంబంధాలు దృఢం అయిన సందర్భాలు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనపడవు. ఆ మాట కొస్తే డబ్బు లేని చోటనే మానవ సంబంధాలు మరింత సజీవంగా నిలబడి ఉండడం మనం గమనించవచ్చు. కాబట్టి అవినీతి రచ్చలోకి కుటుంబాలను లాగడమే అసందర్భం.

అవినీతి అన్నది దోపిడీ వ్యవస్ధల అవిభాజ్య లక్షణం. దానికి కుటుంబాలు, వంశాలతో పని లేదు. ఒక వర్గం మరొక వర్గాన్ని దోపిడీ చేస్తూ అణచివేతలకు పాల్పడే వ్యవస్ధలలో భాగంగా అవినీతిని చూడలేకపోతే లోక్ పాల్ లాంటి చట్టాల ద్వారా అవినీతిని రూపుమాపవచ్చన్న మూఢ నమ్మకంలోకి వెళ్లాల్సి వస్తుంది. అవినీతి, నిరుద్యోగం, దరిద్రం… లాంటి మౌలిక సమస్యలు వ్యవస్ధ మార్పుతోనే సాధ్యం అవుతాయి. అది ప్రజల చేతుల్లో ఉంది తప్ప చట్టాల చేతుల్లో లేదు.

2 thoughts on “మన్మోహన్ తన భార్య పేరు రాయలేదుగా? -బి.జె.పి

  1. డబ్బు సంపదలు పేరుకునే కొద్దీ కుటుంబ విలువలు పతనం కావడమే మనకు తెలుసు తప్ప, డబ్బు వల్ల కుటుంబ సంబంధాలు దృఢం అయిన సందర్భాలు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనపడవు.

  2. భార్యభర్తల అనుబంధాలను రాజకీయ విమర్శలకు పణంగా పెట్టడం భారతదేశ సాంప్రదాయ సంస్కృతికి పట్టిన దౌర్భాగ్యం. దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s