చైనా నౌకా విన్యాసాలు: ఇండియా ఇన్, అమెరికా ఔట్


INS Shivalik Arieal View

INS Shivalik Arieal View

చైనా నిర్వహిస్తున్న అంతర్జాతీయ నౌకా విన్యాసాల సమీక్షలో ఒక విశేషం చోటు చేసుకుంది. ఎన్నాళ్లనుండో పాల్గొంటుందని భావిస్తున్న జపాన్ కు చైనా ‘నో’ చెప్పడంతో అమెరికా కూడా తప్పుకుంది. ఆసియాలో తన అనుంగు మిత్రుడు జపాన్ కు ప్రవేశం లేని చోటకు నేనూ రాను అని చెప్పేసింది. కాగా చైనా కోరిక మేరకు విన్యాసాల్లో పాల్గొనేందుకు ఇండియా తన సంసిద్ధతను ప్రకటించడంతో విన్యాసాలకు ప్రాముఖ్యత ఏర్పడింది. చైనాకు కౌంటర్-వెయిట్ గా నిలపాలని అమెరికా భావిస్తున్న ఇండియా, చైనా విన్యాసాల్లో అమెరికా లేకుండా పాల్గొనడం ఒక విశేషంగా పరిశీలకులు భావిస్తున్నారు.

భారత దేశ నౌకా బలగంలో ముఖ్యమైన అస్త్రంగా చెప్పే ఐ.ఎన్.ఎస్ శివాలిక్ ను చైనా అంతర్జాతీయ నౌకా విన్యాసాలు, సమీక్షలో పాల్గొనేందుకు పయనమై వెళ్తోంది. ఏప్రిల్ 23 తేదీన చైనా నేవీ ఈ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు జపాన్ ను ఆహ్వానించడానికి చైనా తిరస్కరించింది. దానితో అమెరికా తనకు ఆహ్వానం ఉన్నప్పటికీ పాల్గొనడానికి తిరస్కరించింది. తద్వారా ప్రాంతీయంగా తాను జపాన్ పక్షమే అని అమెరికా చాటింది. అమెరికా నిర్ణయంతో నౌకా విన్యాసాలకు అదనపు ప్రాముఖ్యత వచ్చి చేరింది.

చైనా ఈశాన్య నౌకాశ్రయం క్వింగ్ దావో లో జరిగే ‘అంతర్జాతీయ నావికా విన్యాసాలు మరియ సమీక్ష’ రెండు రోజుల పాటు జరగనున్నాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కి చెందిన నావికా విభాగం జపాన్ ను ఆహ్వానించడానికి నిరాకరించింది. విన్యాసాల్లో పాల్గొనడానికి ఇప్పటివరకూ 10 దేశాలు అంగీకరించాయి. వాటిలో ఇండియా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, న్యూ జీలాండ్, ఇండోనేషియా, పాకిస్తాన్ లు ఉన్నాయి. ఈ దేశాలన్నీ అమెరికా మిత్ర దేశాలే కావడం గమనార్హం. రానున్న రోజుల్లో మరిన్ని దేశాలు ఈ జాబితాలో చేరవచ్చని భావిస్తున్నారు.

ఇండియా, పాకిస్ధాన్ లు కలిసి ఒకే చోట నౌకా విన్యాసాల్లో పాల్గొనడం మరొక ప్రత్యేకత. మిలట్రీ విన్యాసాల విషయంలో దాయాది దేశాలను ఒకచోటికి చేర్చిన ఘనత అమెరికాకు కూడా లేదు. కోల్డ్ వార్ పర్యంతం ఇండియాకు రష్యా అన్ని విధాలుగా మిత్రుడుగా వ్యవహరించగా పాకిస్ధాన్ అమెరికాను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అమెరికాతో పాటుగా చైనా కూడా పాకిస్ధాన్ కు దగ్గరి మిత్రదేశంగా వ్యవహరించింది. 1962 నాటి చైనా-ఇండియా యుద్ధం పాక్, చైనాల మధ్య మరింత సాన్నిహిత్యం పెరగడానికి దోహదం చేసింది. సోవియట్ యూనియన్ కుప్ప కూలిన తర్వాత ఇండియా సైతం అమెరికా మిత్రదేశంగా అవతరించడానికి ఆసక్తి చూపింది. కానీ ఒకవైపు అమెరికా ఆర్ధిక శక్తి సన్నగిల్లడం, మరోవైపు ఇరాన్, చైనా, రష్యాలకు వ్యతిరేకంగా అంతకంతకూ ఎక్కువ డిమాండ్లను అమెరికా, ఇండియా ముందు ఉంచడంతో భారత పాలకులు డైలమాలో పడిపోయారు.

ఈ నేపధ్యంలో చైనా నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్ధాయి నౌకా విన్యాసాలకు ఇండియాకు ఆహ్వానం అందడం, జపాన్ కు ఆహ్వానం ఇవ్వనందుకు నిరసనగా అమెరికా కూడా దూరంగా ఉండడంతో ఈ విన్యాసాలకు ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ విన్యాసాలు జరిగే సమయంలోనే అమెరికా నేతృత్వంలోని పశ్చిమ పసిఫిక్ నేవీ సింపోజియమ్ (Western Pacific Naval Symposium) వార్షిక సమావేశం జరుగుతోంది. ఈ సింపోజియంలో ఇండియాకు సభ్యత్వ హోదాను అమెరికా ఇవ్వలేదు. కేవలం పరిశీలక హోదా మాత్రమే ఇచ్చింది. ఆస్ట్రేలియా, కెనడా, రష్యా, జపాన్, దక్షిణ కొరియా, చైనా… తదితర 20 దేశాలకు సింపోజియంలో సభ్య దేశాలు కాగా ఇండియా, బంగ్లాదేశ్, మెక్సికోలు పరిశీలక దేశాలని ది హిందూ తెలిపింది.

చైనా నావికా బలగాలు ఉనికిలోకి వచ్చి 65 సం.లు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ అంతర్జాతీయ నావికా విన్యాసాలను చైనా నిర్వహిస్తోంది. 2009లో 60 యేళ్ళు పూర్తయిన సందర్భంగా కూడా చైనా ఈ తరహా విన్యాసాలు నిర్వహించింది. అప్పుడు కూడా ఇండియా పాల్గొంది. పి.ఎల్.ఏ అధిపతిగా చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ కూడా ఇందులో పాల్గొంటారు. ఆయన కోరిక మేరకే ఇండియాకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. పాకిస్ధాన్ నావలతో కలిసి ఇండియా నావ శివాలిక్ ఒక నౌకా విన్యాసంలో పాల్గొనడం ఇదే మొదటిసారి కావచ్చు.

శివాలిక్ నౌక చైనా సందర్శించడం ఇది రెండోసారని పాక్ పత్రిక ‘పాకిస్ధాన్ డిఫెన్స్’ తెలిపింది. గత సంవత్సరం గుడ్ విల్ విజిట్ లో భాగంగా షాంఘై నౌకాశ్రయాన్ని ఐ.ఎన్.ఎస్ శివాలిక్ సందర్శించింది. శివాలిక్ తాజా చైనా సందర్శన ఇరు దేశాల మధ్య అభివృద్ధి చెందుతున్న స్నేహ సంబంధాలకు తార్కాణం అని చైనాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించడం గమనార్హం.

పసిఫిక్ సింపోజియంలో పాల్గొనేందుకు జపాన్ నేవీ అధిపతిని చైనా ఆహ్వానించినప్పటికీ అంతర్జాతీయ నావికా విన్యాసాలు, సమీక్షలో పాల్గొనేందుకు జపాన్ ను ఆహ్వానించడానికి చైనా నేవీ తిరస్కరించింది. చైనా తీసుకున్న నిర్ణయం దురదృష్టకరం అని జపాన్ రక్షణ మంత్రి అభివర్ణించాడు. భారత నావికాదళాధిపతి విన్యాసాల్లో పాల్గొనాలని చైనా నేవీ ఆహ్వానించింది. అయితే ప్రస్తుతం భారత నావికా బలగాలకు అధిపతి లేరు. అడ్మిరల్ జోషి సబ్ మెరైన్ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ కొన్ని రోజుల క్రితం రాజీనామా చేశారు. అందువల్ల ఉన్నత స్ధాయి ప్రతినిధి బృందాన్ని పంపించడానికి భారత నేవీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

2 thoughts on “చైనా నౌకా విన్యాసాలు: ఇండియా ఇన్, అమెరికా ఔట్

  1. “కానీ ఒకవైపు అమెరికా ఆర్ధిక శక్తి సన్నగిల్లడం, మరోవైపు ఇరాన్, చైనా, రష్యాలకు వ్యతిరేకంగా అంతకంతకూ ఎక్కువ డిమాండ్లను అమెరికా, ఇండియా ముందు ఉంచడంతో భారత పాలకులు డైలమాలో పడిపోయారు.”

    Not sure if this is your opinion or a mere translation. Considering the fact we are still sucking-up to the American foreign policy (and we might go ahead with the same full-sail), I find it hard to agree with the above statement.

    But yes! we should welcome the development of an opportunity to form a stronger bond with our neighbors. It’s time we start playing the role we used to play in ‘The Nehruvian Times’.

  2. That’s an intelligent observation!

    It’s not translation, but one of my recent but unsubstantiated calculation. It is just a start. We have plenty to fill up the blanks to substantiate it. Actually, it should be like: డైలమాలో పడినట్లు కనిపిస్తోంది.

    Anyway, thanks for your insightful input.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s