ముంబై లోని శక్తి మిల్స్ అత్యాచారం ఘటన ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనకు ఏ మాత్రం తీసిపోనిదని ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి శాలిని ఫన్సల్కర్ తన తీర్పులో వ్యాఖ్యానించారు. నిర్భయ ప్రాణం కోల్పోవలసి రాగా ముంబై బాధితురాలు తట్టుకుని నిలబడ్డారని ఆమె ఇచ్చిన సాక్ష్యం కేసుకు అత్యంత బలమైన మూలాధారం అనీ జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. బాధితురాలితో పాటు ఆమెతో వెళ్ళిన ఆమె స్నేహితుడు కూడా చివరి వరకూ నిలబడి పోరాడిన తీరు అభినందనీయం అని జడ్జి అభినందించారు. జడ్జి అభినందన మరింత మంది బాధితులకు ధైర్యంగా అండగా నిలవడానికి తగిన భూమిక కాగలదు.
“ఆమె ఏకైక సాక్ష్యమే అత్యంత దృఢమైనది. మొత్తం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై ఉజ్వల కాంతి ప్రసరించేలా వివరిస్తూ వాస్తవ సంఘటనల క్రమాన్ని శక్తివంతంగా చెప్పగలిగారు. ఆ సాక్ష్యం ఎంత శక్తివంతంగా ఉన్నదంటే మరో మాటకు తావు లేకుండా కేసును ముగించడమే ఇక మిగిలింది. నిందితుల నేరాన్ని రుజువు చేయడానికి అన్ని కోర్టుల్లోనూ ఆమె ఇచ్చిన ఒక్క సాక్ష్యమే సరిపోతుంది. ఆమె కోర్టు ముందుంచిన సాక్ష్యం రాయిలా నిలబడి పోయింది. కోర్టులో సాక్ష్యం ఇస్తున్న క్రమంలో తాను మరోసారి ఆ దుర్ఘటనలోకి వెళ్ళిపోయి బాధాపరితప్త హృదయంతో జీవించిన తీరు హృదయాన్ని కలచివేసింది. ఆ సజీవ సాక్ష్యం ఎంతగా హృదయాలను తాకిందంటే ఆమెను నమ్మకుండా ఉండగల ధైర్యం ఎవరూ చేయలేరు” అని జస్టిస్ శాలిని ఫన్సల్కర్ తన తీర్పులో పేర్కొన్నారని ది హిందు తెలిపింది.
శక్తి మిల్స్ లో అత్యాచారానికి గురయిన ఫోటో జర్నలిస్టు కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. పలువురు సామాజికవేత్తలు మరణ శిక్షలను ఆమోదించడం లేదు. రిపీట్ అఫెండర్స్ (మళ్ళీ మళ్ళీ అత్యాచార నేరానికి పాల్పడేవారు) అన్న లాజిక్ శక్తి మిల్స్ నిందితులకు వర్తించదని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకసారి అత్యాచారం చేశాక నేరం రుజువై శిక్ష పడిన తర్వాత మళ్ళీ అదే నేరానికి పాల్పడితే రిపీట్ అఫెండర్ అవుతారని, ఈ కేసులో అలా జరగలేదని వారి అభిప్రాయం. గత నేరాలు తాజా నేరం సందర్భంగానే వెలుగులోకి వచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. మరణ శిక్ష ద్వారా నేరస్ధులు తమ ప్రవర్తనను సరిచేసుకునే అవకాశం లేకుండా పోయిందనీ, ఒకసారి శిక్ష పడ్డాక కూడా అదే నేరం చేస్తే మరణ శిక్ష విధించాలని చట్టం చెబుతోంది తప్ప ఈ కేసులో లాగా కాదని వారు చెబుతున్నారు. బహుశా వీరి వాదన పై కోర్టులో పరిగణనలోకి వస్తుందేమో చూడవలసి ఉంది.
బాధితురాలి స్నేహితుడిని కూడా కోర్టు అభినందించింది. ఆయన ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించి బాధితురాలికి చివరివరకూ తోడు నిలిచారని కొనియాడింది. “దుర్ఘటన జరిగిన వెంటనే బాధితురాలు, ఆమె స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా సాహసోపేతంగా వ్యవహరించారు. (న్యాయం పొందడానికి) ఆమె చేసిన ప్రయత్నాలన్నింటా ఆయన వెంట ఉన్నారు. దుర్ఘటన జరిగినప్పుడు ఆమెను కాపాడడానికి ప్రయత్నించడం, పోలీసుల వద్దకు రావడమే కాకుండా ట్రయల్ లో కూడా నిలబడినందుకు ఆయనను అభినందించి, ప్రోత్సహించాలి” అని కోర్టు తీర్పు పేర్కొంది. కోర్టు పరిశీలన మరింత మంది సాక్ష్యులకు ప్రోత్సాహకరం అవుతుందనడంలో సందేహం లేదు.
శక్తి మిల్స్ అత్యాచార ఘటన సమాజం ఉమ్మడి చేతనకు దిగ్భ్రాంతిని కలుగజేసిందని కోర్టు వ్యాఖ్యానించింది. “నిర్భయ ఘటనకు సంబంధించిన ఆందోళన, పరితాపం ఇంకా చల్లబడకముందే ఈ ఘటన జరిగింది. కఠిన చట్టాలు రూపొందిస్తున్నప్పటికీ, యువకులు ఇటువంటి క్రూరమైన, అమానవీయ ఘటనలకు పదే పదే పాల్పడుతున్నారు. మానవ జీవితానికి ఉన్న పవిత్రత పట్ల ఏ మాత్రం గౌరవం చూపకుండా వ్యక్తిగత సమగ్రతను ఉల్లంఘిస్తున్నారు. ఆ క్రమంలో శాంతి భద్రతలకు, చట్టాల అమలుకు తీవ్ర విఘాతంగా మారుతున్నారు. వారి ప్రవర్తన సహనశీలతకు ఏ మాత్రం అందుబాటులో లేదు. సమాజం అర్ధం చేసుకునేందుకు ఎంత మాత్రం తగనిది” అని తీర్పు పేర్కొంది.
శక్తి మిల్స్ ఘటన ముంబై ప్రతిష్టను దెబ్బ తీసిందని, మహిళలకు భద్రమైన నగరంగా పేరు పొందిన ముంబై పేరుకు నష్టం కలిగించిందని కోర్టు వ్యాఖ్యానించడం ఒక విచిత్రం. నిందితుల నేర ప్రవర్తన ఒక నిర్దిష్ట నగరంతో ముడి పడి ఉంటుందా లేక దేశంలోని సామాజిక విలువలతో ముడిపడి ఉంటుందా? అత్యాచారం అన్నది కేవలం నిందితుల శారీరక వాంఛలకు మాత్రమే సంబంధించినది అన్న అవగాహన నుండి ఇలాంటి అభిప్రాయం వ్యక్తం అయి ఉండవచ్చు. కానీ అత్యాచారం అన్నది ప్రధానంగా ఆధిపత్యానికి, అణచివేతకు సంబంధించిన దూర్మార్గపూరిత వ్యక్తీకరణ అన్న సంగతి ఎప్పటికి కోర్టులు, ప్రభుత్వాల దృష్టికి వచ్చేను?
(అదీ గాక ముంబై మహిళలకు భద్రమైన నగరం అనడం సత్యదూరం. ఈ లింక్ లు చూడండి:
నా జీవితంకోసం పోరాడి గెలిచాను -30 సం. క్రితం సొహైలా
గాయపడింది నేను, నా గౌరవం కాదు -సొహైలా అబ్దులాలి
బాధితురాలి తరపున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికం వ్యక్తం చేసిన అభిప్రాయాలూ కూడా దాదాపు ఇదే విధంగా ఉన్నాయి. “అత్యాచారం అనేది మహిళ శరీరంపై దాడి మాత్రమే కాదు. ఆమె మనసు, శీలం, ప్రతిష్ట, ఆత్మ గౌరవం లపైన దాడి కూడా. బాధితురాలు చనిపోతే తప్ప ఆ గాయాలు మానిపోవు” అని ఉజ్వల్ నికం కోర్టులో వాదించారు. అత్యాచారానికి గురయిన స్త్రీ చనిపోవడం తప్ప మరో మార్గం లేదని చెప్పే వాదన ఎంత ఘోరం, ఎంత లోపభూయిష్టం! స్త్రీల శీలం, పరువు ప్రతిష్టలు అత్యాచారం వల్ల పోతాయని చెప్పడం కంటే మించిన పితృస్వామిక ఆధిపత్య భావజాల వ్యక్తీకరణ మరొకటి ఉంటుందా?
సర్,మానవజీవితానికి ఉన్న పవిత్రత ఏమిటొవివరిస్తారా?
ఈ సందర్భం వరకూ చూస్తే… సాటి మనిషి (లేదా సమాజం) సమగ్రతను గౌరవించడం ఒక మనిషి జీవితానికి ఉన్న పవిత్రతగా భావించాలి. వ్యక్తిగత సమగ్రత అంటే శారీరక, భావాత్మక హక్కుల కలయిక. ప్రతి వ్యక్తికీ తనకంటూ కొన్ని హక్కులు ఉంటాయి. బాధ్యతలూ ఉంటాయి. తన సమగ్రత ఉల్లంఘనకు గురికాకుండా కాపాడుకోవడం హక్కు అయితే, తోటి వ్యక్తి సమగ్రతను తాను ఉల్లంఘించకపోవడం బాధ్యత. అనగా వ్యక్తి సమగ్రత సమాజంలోని ఇతర వ్యక్తుల సమగ్రతల కలయిక, వాటి సంరక్షణలతో ముడిపడి ఉన్న విషయాన్ని గుర్తించడం అత్యవసరం.
భార్య సమగ్రతను భర్తా, భర్త సమగ్రతను భార్యా గుర్తించి గౌరవిస్తే వారి కుటుంబ సమగ్రత గౌరవం పొందుతుంది. ఒకరి సమగ్రతను మరొకరు ఉల్లంఘించిన సందర్భాల్లోనూ కుటుంబ గౌరవం చెక్కు చెదరని పరిస్ధితి ఉండవచ్చు. కానీ అలాంటి చోట్ల అంతర్గతంగా ఎంతో అణచివేత, హింస దాగి ఉంటాయి. అనగా పైకి కనపడే సమగ్రత బూటకం అన్నమాట! ఇదే అంశాన్ని వ్యక్తుల మధ్య ఎలాంటి సంబంధం లేని చోట్ల కూడా వర్తింపజేసుకోవచ్చు. సమాజం శాంతియుతంగా కనపడుతుంది. కానీ అంతర్గతంగా ఒక వర్గంపై మరో వర్గం, ఒక సెక్షన్ పై మరో సెక్షన్ అణచివేత సాగించడం ద్వారా అలాంటి పైపై శాంతి సాధిస్తారు. అది బూటకపు శాంతి. అలాగే బూటకపు సమగ్రత. సమాజంలోని ప్రతి వ్యక్తీ ఎలాంటి భయమూ, దోపిడీ, అణచివేతా లేని జీవనం గడపగలిగితే ఆ సమాజం నిజమైన సమగ్రతతో జీవిస్తున్నట్లు! అటువంటి సామాజిక సమగ్రతను గుర్తించిన వ్యక్తి యొక్క వ్యక్తిగత సమగ్రత సహజంగానే మెరిసిపోతూ కనిపిస్తుంది. బహుశా ఆ మెరుపు సాధించగలిగిన వ్యక్తి మానవ జీవిత పవిత్రతను ప్రతిఫలిస్తుంటాడు/స్తుంది.
ఇవి నాకు అర్ధం అయిన, నేను అర్ధం చేసుకున్న విషయాలు. మీరు ఏకీభవించవచ్చు, లేకపోనూవచ్చు.
17వ శతాబ్దంలొ ఒకసారి దొంగతనం చేసి దొరికితే అతని వేళ్ళు తెగనరికేవాళ్ళు. రెండవసారి దొరికితే అతన్ని పట్టిచ్చినవానికి బానిసను చేయవచ్చు. మూడవసారి దొరికితే మరణశిక్ష. యివి ఎంతగా అమలు చేసినా యేటికేడు నేరాలు పెరిగాయేగాని తగ్గలేదు.ఇది చరిత్రనుంచి మనం తెలుసుకోవలసిన సత్యం. వార్తా ఛానళ్ళల్లొ యే అమ్మాయిని కదిపి చూసినా నడిరోడ్డులో ఉరి తీస్తె యిలాంటి ఘటనలు మళ్ళి జరగవు అని చెప్పారు. దాదాపు అందరు అమ్మాయిలూ యిదే అభిప్రాయం చెప్పారు. 2009లో యాసిడ్ దాడి చేసిన ముగ్గురినీ అదేరాత్రి పొలీసులు కాల్చి చంపేశారు. మరి వాళ్ళ ప్రకారం అలాంటి ఘటనలు మళ్ళి మళ్ళీ జరగకూడదు. మరి ఇంకా ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళు గుర్తుంచుకోవలసింది ఒకటే. కేవలం చట్టాలు చేసినంత మాత్రాన లేదా శిక్షలు వేసినంత మాత్రాన నేరాలు తగ్గవని. అనగా బాహ్య పరిస్ధితులు మారనంతవరకు అవి కొనసాగుతాయి.
శేఖర్ గారు,
మీరు చదివారో లేదో ఈ ఆర్టికల్స్, లింకులు ఇస్తున్నాను. కొత్త చట్టం గురించి అందరు తెలుసుకోవలసిన అవసరం ఉందనిపించింది.
“సెక్షన్ 354కి అదనంగా 354 (ఎ) అనే క్లాజ్ చేర్చారు. దాని ప్రకారం సెక్సువల్ ఫేవర్ కోసం బతిమాలినా, పోర్నోగ్రఫీ చూపినా, సరససంభాషణ జరిపినా, శృంగారపరమైన వ్యాఖ్యలు చేసినా కూడా నేరమే. మూడేళ్ల వరకు శిక్ష పడవచ్చు. అంగీకారం వుంటే ఏదైనా ఓకే, లేకపోతే ఏం చేసినా తప్పే అని గ్రహించాలి. అయితే అంగీకారానికి నిర్వచనం ఏమిటి? చట్టం ప్రకారం అంగీకారం నిర్ద్వంద్వంగా వుండాలిట. మగవాడు తన శరీరంలోకి చొరబడిపోతూ వుంటే ఆమె అడ్డుకోనంత మాత్రాన అంగీకారం యిచ్చినట్లు లెక్క కాదట. ఈ విధంగా చూస్తే ‘వచ్చి నన్ను అనుభవించు’ అని స్త్రీ లిఖితపూర్వకంగా రాసి యిస్తే తప్ప మగవాడు చొరవ తీసుకోకూడదు. అలా యిచ్చినా నన్ను బెదిరించి అలా రాయించుకున్నాడు అని ఆమె తర్వాత అంటే వీడు చచ్చేడే! చట్టం ఎంత కఠినంగా రూపొందిందో తేజ్పాల్ కేసు చూశాక అందరికీ తెలిసివచ్చింది. ఈ వ్యాసం చదివాక. ‘ఇంతకీ తేజ్పాల్ చేసినదేమిటి? అతనిపై యువజర్నలిస్టు చేసిన ఆరోపణలు ఏ మేరకు నిజం?’ అన్న సందేహాలు కలగడం సహజం.
http://telugu.greatandhra.com/articles/mbs/mbs-tejpal-case-nerpe-patam-51694.html
http://telugu.greatandhra.com/articles/mbs/mbs-tejpal-case-nerpe-patam-2-51720.html
What The Elevator Saw
http://www.outlookindia.com/article.aspx?289993
//మగవాడు తన శరీరంలోకి చొరబడిపోతూ వుంటే ఆమె అడ్డుకోనంత మాత్రాన అంగీకారం యిచ్చినట్లు లెక్క కాదట//
దీనివెనుకనున్న వాస్తవికతను గుర్తించాలి. ఒక పురుషున్ని ఏ స్త్రీ రేప్ చెయ్యలేదు. కాని ఒకస్త్రీని పురుషుడు ఆమె అంగికారం ఉన్నా లేక పోయినా చేయగలడు. స్త్రీ నిద్ర పోతున్నపుడో, మతిస్తిమితం లేనపుడో ఆమె యోనిలో స్కలించి పిల్లలు కలగ చేయగలడు.
పురుషాదిక్య సమాజంలో ఉన్న వారికి ఈ వాస్త విక ఆలోచన రాదు.
పవిత్రత గురించి నా అభిప్రాయం ఇది :
పవిత్రత, పరమార్ధం అనేవి కృత్రిమ పదాలు. విశ్వంలో ఎదీ పవిత్రమైనది కాదు. అలాగని ఏదీ అపవిత్రమైనదీ కాదు. మనుషులుగా మన విధిమాత్రం ఇంకొకర్ని బాధించకుండా ఆనందంగా జీవించడమ్మాత్రమే. ఇది కేవలం బాధ్యతే కాదు. హక్కుకూడా!