మోడి పెళ్లి: మరిన్ని ప్రశ్నలు రేపుతున్న బి.జె.పి జవాబులు


Nirmala

మోడి వివాహం గురించి ఊహించినట్లే రగడ చెలరేగుతోంది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ (అనధికారిక) ప్రధాని అభ్యర్ధే ఈ అంశం పైన దాడి ఎక్కుపెట్టారు. మోడి నామినేషన్ తిరస్కరించాలని కూడా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బి.జె.పి నేతలేమో మోడి వ్యక్తిగత వ్యవహారాలపై దాడికి దిగవద్దని చేయొద్దని హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే గాంధీ వంశస్ధుల వ్యక్తిగత వివరాలను కూడా వీధిలోకి లాగవలసి వస్తుందని బెదిరింపులకు దిగుతున్నారు. మోడి వివాహ వ్యవహారానికి సంబంధించి వారు ఇస్తున్న సమర్ధనలు, జవాబులు మరిన్ని ప్రశ్నలను రేకెత్తడానికే దారి తీయడం విశేషం.

మోడిపై మొదటిసారిగా తీవ్ర స్ధాయిలో దాడి ఎక్కుపెట్టిన రాహుల్ గాంధీ తన వైవాహిక సమాచారాన్ని మోడి ఉద్దేశ్యపూర్వకంగానే ఇన్నాళ్లూ దాచి ఉంచారని ఆరోపించారు. బి.జె.పి పార్టీ, వారి ప్రధాని అభ్యర్ధి మోడి ప్రబోధించే విలువలకు వారి నాయకుల ఆచరణకు భారీ వ్యత్యాసం ఉందని ఎత్తి చూపారు. “ఆయన ఎన్ని ఎన్నికల్లో పోటీ చేశారో నాకు తెలియదు. కానీ ఆయన తన రాజకీయ జీవితంలో మొదటిసారిగా తనను తాను వివాహిత వ్యక్తిగా చెప్పుకున్నారు. ఢిల్లీలో ఈ వ్యక్తులే మహిళల గురించీ, వారి సాధికారిత గురించీ మహా గొప్పగా పోస్టర్లలో చెబుతారు” అని రాహుల్ అపహాస్యం చేశారు.

బైటపడాల్సిన మోడి రహస్యాలు ఇంకా ఎన్ని ఉన్నాయని రాహుల్ ప్రశ్నించారు. గుజరాత్ లో ముఖ్యమంత్రి మోడి  ఒక యువతి వెంట పడ్డారని ఆయన ఆరోపించారు. గుజరాత్ పోలీసులను నియోగించి సదరు యువతి ఏకాంతాన్ని ఉల్లంఘించారని, అధికారిక స్ధాయిని, వనరులను స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించారని ఎత్తిపొడిచారు. “ఇది ఇలాంటి మహిళా సాధికారత? ఎలాంటి మహిళా గౌరవం? నేను తెలుసుకోగోరుతున్నాను” అని రాహుల్ ప్రశ్నించారు. బి.జె.పి పాలిత రాష్ట్రాల్లో మహిళలు భయంతో గడుపుతున్నారని, అందుకు ఆ పార్టీ సిగ్గుపడాలని కోరారు. కర్ణాటక అసెంబ్లీలో బి.జె.పి సభ్యులు కొందరు తమ సెల్ ఫోన్లలో బూతు సినిమాలు చూసిన సంగతిని కూడా రాహుల్ కాశ్మీర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా గుర్తు చేశారు.

రాహుల్ విమర్శలకు బి.జె.పి ప్రతినిధి నిర్మలా సీతారామన్ జవాబు చెప్పారు. “అఫిడవిట్ ను జాగ్రత్తగా చదవాలని నేను రాహుల్ గాంధీని కోరుతున్నాను. మోడి ఏ సమాచారం ఇచ్చారో అదంతా వాస్తవ సమాచారమే. ఆయన ఎప్పుడూ ఈ విషయంలో అబద్ధాలు చెప్పలేదు. అఫిడవిట్ చూడకుండా తొందరపాటుతో రాహుల్ మాట్లాడకూడదు” అని ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో నిర్మలా సీతారామన్ తెలిపారు. మహిళా సంఘాలు సైతం మోడిని విమర్శించిన సంగతిని గుర్తు చేయగా ఆమె “ఆ మహిళా గ్రూపులను కొన్ని ప్రశ్నలు వేద్దాం. బాల్య వివాహాలను వారు సమర్ధిస్తున్నారా? వారిద్దరూ బహిరంగంగా ముందుకు వచ్చి తమ విషయం ఏమిటో చెప్పారు. మోడీ సోదరుడు కూడా వివరించారు. ఆమె (భార్య) బాధితురాలేమీ కాదిక్కడ” అని వివరించారామే.

మోడి అనేక యేళ్లుగా తన వైవాహిక సమాచారాన్ని దాచి పెట్టిన విషయాన్ని నిర్మలా సీతారామన్ ‘బాల్య వివాహం’ అంశం ద్వారా సమాధానం చెప్పదలిచారు. బాల్య వివాహాలను సమర్ధించరాదు కాబట్టే మోడి ఇన్నాళ్ళు తన ఎన్నికల అఫిడవిట్ లలో భార్య పేరు ఎదుట ఖాళీ వదిలారా? అదే నిజం అయితే ఈసారి అఫిడవిట్ లో కూడా ఖాళీ వదిలేయాలి కదా? తన భార్య పేరు ‘యశోదా బెన్’ అని ఎందుకు రాసినట్లు? ఈసారి తన భార్య పేరు యశోదా బెన్ అని రాశారు కనుక మోడి కూడా బాల్య వివాహాలను సమర్ధిస్తున్నట్లేనా? బాల్య వివాహాలను సమర్ధించలేక ఇన్నాళ్లూ ఖాళీ వదిలిన నరేంద్ర మోడి ఇప్పుడు ఖాళీ పూర్తి చేయడం ద్వారా కొత్తగా బాల్య వివాహాలను సమర్ధిస్తున్నారా?

ఈసారి ఖాళీ వదలకపోవడానికి అసలు కారణం వేరే ఉంది. గత సెప్టెంబర్ లో సుప్రీం కోర్టు ఒక రూలింగ్ ఇస్తూ ఎన్నికల అఫిడవిట్ లలో అభ్యర్ధులు అవసరం అయిన చోట తగిన సమాచారం ఇవ్వకుండా ఖాళీ వదిలితే వారి నామినేషన్ ను తిరస్కరించే అధికారం ఎన్నికల కమిషన్ కు ఉంటుందని స్పష్టం చేసింది. అందుకే మోడి తన భార్య పేరు రాయలవలసిన చోట ఎప్పటిలాగా ఖాళీ వదల్లేకపోయారు. ఈ అవకాశం కోసమే కాచుకు కూర్చున్న పత్రికలు, పార్టీలు ఇదే అదనుగా మోడీపై దాడి ఎక్కుపెట్టారు. నిజానికి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీలో ఏది నిజంగా మహిళలను గౌరవించే పార్టీ? ప్రతి పార్టీలోనూ మహిళలను నిరాదరించే వీరులున్నారు. భార్య ఉండగా ఇతర మహిళలను రెండవ, మూడవ భార్యలుగా చేసుకున్నవారు ఉన్నారు.

మోడీపై వ్యక్తిగత దాడికి దిగడం సరికాదని ప్రకాష్ జవదేకర్ లాంటి నేతలు హెచ్చరిస్తునారు. “ఈ ఎన్నికల్లో అవినీతి, ద్రవ్యోల్బణం లాంటి అంశాలపై పోరాడుతున్నాం. కాంగ్రెస్ అందులోకి వ్యక్తిగత అంశాలను లాగడానికి ప్రయత్నిస్తోంది. గాంధీలకు సంబంధించి మేము కూడా వివిధ వ్యక్తిగత అంశాలను బహిర్గతం చేయవచ్చు. వాటికి వారినుండి సమాధానమే ఉండదు” అని ప్రకాష్ బెదిరించారు. నిజానికి వ్యక్తిగత దాడి చేయడంలో బి.జె.పి ఎప్పుడూ వెనుకబడి లేదు. నరేంద్ర మోడి యే స్వయంగా అనేకసార్లు రాహుల్, సోనియా, శశి ధరూర్ లాంటి వారిపై వ్యక్తిగత దాడికి దిగిన సందర్భాలు ఉన్నాయి. శశిధరూర్ భార్యను 59 కోట్ల రూపాయల గర్ల్ ఫ్రెండ్ గా మోడి ఒకసారి అభివర్ణించారు. మాజీ ఎన్నికల కమిషనర్ జె.ఎం.లింగ్డో క్రైస్తవుడు కనుకనే సోనియాకు మద్దతు ఇస్తున్నారని ఆయనోసారి ఆరోపించారు. రాహుల్ ను యువరాజా అని అభివర్ణించిందీ ఆయనే. అరవింద్ కేజ్రీవాల్ ను ఏ.కె-49 అంటూ పరిహాసం ఆడిన వ్యక్తి కూడా మోడీయే. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ నేతలు అవకాశం వచ్చినపుడు నోరు మూసుకుని ఉంటారని భావించడం అత్యాశే కాగలదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s