చెంప దెబ్బ: నేనే ఎందుకు? -కార్టూన్


Why me

ఈ కార్టూన్ కి ఇక వివరణ అనవసరం. ప్రజలకు అందనంత దూరంలో ఎగిరిపోతూ, అందనంత ఎత్తులో స్టేజీ ఉపన్యాసాలు దంచుతూ, ఎస్.పి.జి, జెడ్ ప్లస్ లాంటి రక్షణ వలయాల వెనుక దాక్కుంటూ ప్రచారం చేసే నేతలు తమ ఆగ్రహం వెళ్లగక్కడానికి జనానికి ఎలాగూ అందుబాటులో ఉండరు. కాబట్టి అందినవారిపై తమ ప్రతాపం చూపుతున్నారు.

ఓ సినిమాలో (పెద్ద మనుషులు అనుకుంటాను) కమెడియన్ గా నటించిన సుధాకర్ తరుముకు వస్తున్న విలన్ నుండి తప్పించుకోవడానికి దాక్కోవడానికి ప్రయత్నిస్తూ, తగిన మాటు దొరకని పరిస్ధితిలో “పీకాల్సిన వాడు దొరక్కపోతే దొరికిన వాడిని పీకుతారే, ఇప్పుడెలా?” అని ఆందోళన పడతాడు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ది అదే పరిస్ధితని కార్టూన్ సూచిస్తోంది.

నాయకులంతా తమ పనులు జనానికి ఎలా వ్యతిరేకమో చక్కగా తెలిసినవారే. తాము తీర్చలేని హామీలు ఇస్తామనీ, ఆ హామీలు తీర్చనందున జనం ఆగ్రహంతో ఉంటారనీ వారికి బాగానే తెలుసు. కాబట్టి వారి ఏర్పాట్లు వారు చేసుకుంటారు. సవాలక్షా సాకులు చూపుతూ గన్ మెన్ లనూ, కుదరకపోతే ప్రైవేటు గూండాలను తమ చుట్టూ నియమించుకుంటారు.

ఎలాంటి రక్షణ లేకుండా జనంలో అరవింద్ ప్రచారంలో పాల్గొంటున్నారు. జనానికేమో పీకాల్సిన వాళ్ళు దొరకడం లేదు. అందుకని దొరికిన వాడిని పీకుతున్నారన్నమాట! అలాంటి వారయితే ఫర్వాలేదు గానీ తమ పార్టీల అవకాశాన్ని అరవింద్ గద్దలా తన్నుకుపోతున్నారన్న కక్షలో ఉన్న దురభిమానులతోనే చిక్కు వచ్చిపడుతోంది. తమ అభిమాన నాయకుడు ఎన్ని వేషాలు వేసినా సహిస్తూ ఆ నాయకుడు ప్రధాని కాకుండా ఎక్కడ అడ్డుపడతాడో అన్న దురభిమానంతో దాడి చేస్తేనే తీవ్ర అభ్యంతరకరం.

9 thoughts on “చెంప దెబ్బ: నేనే ఎందుకు? -కార్టూన్

 1. @ఈ కార్టూన్ కి ఇక వివరణ అనవసరం–అమ్మయ్య! ఇప్పటికైనా తెలుసుకున్నారు ! దీనికే కాదు , గతంలో మీరు ప్రచురించిన కార్టూన్లు అన్నింటికీ అనవసరమే! కార్టూన్లలో ఉన్న సహజ సిద్దమైన లయాత్మక భావనను మీ సుదీర్ఘమైన వ్యాఖ్యానం దారుణంగా చంపేసింది. కార్టూన్లు చూసి పెదవులు విచ్చుకుంటే స్పూన్ ఫీడింగ్ వివరణలు చదివి నొసల్లు ముడుచుకుంటాయి. మీరు కార్టూన్లు చూసి ఇన్స్పైర్ అయి వేరే వ్యాసాలు రాయండీ, ఆస్వాదిద్దాం…కానీ కార్టూన్లతో మీ వ్యాఖ్యానాన్ని(వ్యాసాన్ని) జత కలపకండి. మీరు నొచ్చుకున్నా సరే! మీ వ్యాసాలని అత్యంత అసక్తితో చదివే పాఠకుడిగా నాకు ఇలా సూచించే హక్కుందని అనుకుంటున్నాను.

 2. సతీష్ గారూ, మీ విచారం మీ స్వాతిశయాన్ని చూపుతోందంటే మరోలా భావించకూడదు.

  అందరూ ఒకే విధంగా పెరగరు. అందరి సామాజిక, ఆర్ధిక నేపధ్యాలూ ఒకటిగా లేవు. కనుక అందరూ సమాన పరిస్ధితుల్లో పెరగడం లేదు. వారి వారి నేపధ్యాలకు అనుగుణంగా వారి ఆలోచనా, గ్రహింపు స్ధాయిలు నిర్ణయం అవుతాయి తప్ప అవి వారి బలహీనతలో మరొకరి గొప్పతనాలో కావు. అంతెందుకు? ది హిందూ (కేశవ్) కార్టూన్ లు కొన్ని నాకూ ఒక్కోసారి అర్ధం కావు.

  కాబట్టి మీ విచారాన్ని అనవసరంగా వృధా చేసుకోకండి. వ్యాఖ్యానించే హక్కు మీకుంది నిజమే గానీ, ఇతరుల లేమి పైన విచారించే హక్కు మాత్రం ఉండదు. రాసేందుకు నేనున్నాను. చదివి ఆనందించడానికి పాఠకులున్నారు. కార్టూన్ ల వరకు వదిలేసి మిగిలిన టపాలు చదివి ఆనందించండి.

 3. స్వాతిశయం కాదు…..వ్యాఖ్య లో ఉన్న వ్యంగ్యం స్వాతిశయం కాదు. పైన నా వ్యాఖ్య పాఠకుల్ని ఉద్దేశించి రాసింది కాదు ! మీరు సరిగా అర్ధం చేసుకోలేదు అనే దానికంటే నేను సరిగా చెప్పలేకపోయాననటం కరక్టేమో! మీ పాఠకులు తెలివైన వాళ్ళు(ఎదో నాలాంటి వాళ్ళు మినహాయింపు అనుకోండి…!) అని చెప్పటమే నా ఉద్దేశ్యం !హక్కు అన్న మాట సరదాగా రాసింది! మీ బ్లాగుకొచ్చి నా హక్కు ఏమిటండీ ! దాన్ని బట్టుకున్నారేమిటి మీరు!

  @కార్టూన్ ల వరకు వదిలేసి మిగిలిన టపాలు చదివి ఆనందించండి.—–మీ సూచన ని స్వాగతిస్తున్నాను !

 4. కార్టూన్ ద్వారా…

  నేను కవర్ చేయని విషయాలను కవర్ చేసే ప్రయత్నం చేస్తుంటాను.
  కార్టూన్ నేపధ్యం తెలియని పాఠకులకు తెలియజెప్పే ప్రయత్నం కూడా.
  కొన్ని కార్టూన్ లు ఆయా అంశాన్ని లోతుగా చెబుతాయి. అందువల్ల వెంటనే అర్ధం కావు.
  కొన్ని కార్టూన్ ల వెనుక ఒక ఫిలాసఫీ ఉంటుంది;
  ఒక పెద్ద స్టోరీ ఉంటుంది;
  ఒక విశ్లేషణా ఉంటుంది.
  ఇవన్నీ వివరించినపుడు కొందరు పాఠకులకు చాలా సంతోషం వేస్తుంది.
  నాకు అర్ధం కానప్పుడు ఎవరన్నా పాఠకులు అర్ధం చేసుకుని చెబుతారన్న ఎదురుచూపుతో కూడా ఇక్కడ ఉంచుతాను.
  కార్టూన్ వివరణ వెనుక ఇవన్నీ ఉన్నాయి.
  ఇవేవీ లేకుండా చూడగానే అర్ధమయ్యే కార్టూన్ కి కూడా వివరణ ఇస్తే మీకు కలిగిన లాంటి భావాలు కలుగుతాయి. అందులో తప్పు లేదు. అందుకే మీకు హక్కు ఉంది అని అంగీకరించాను. మీ అభిప్రాయాన్ని పరిగణించినందునే ఈ వివరణ ఇస్తున్నాను.

 5. @ సతీష్ గారూ : కార్టూన్స్ ని వివరించి చెప్పడం మంచిపద్ధతేనండి. కొన్నిసార్లు కార్టూనిస్ట్ భావం మనకి ఎంతమాత్రం అర్ధంకాకపోవచ్చు. కావాలంటే ఈ కింది లింక్ చూడండి. నావంటి సాధారణ పాఠకులకి ఈ కార్టూన్ అర్ధం ఎంతమాత్రం అర్ధం కాదు వివరణలేకుండా..

  https://teluguvartalu.com/2014/02/13/%E0%B0%95%E0%B1%87%E0%B0%9C%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%AA%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%86%E0%B0%9C%E0%B0%BF%E0%B0%AF%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%B8%E0%B1%8D/

  “ఆజియన్ స్టేబుల్స్” అనేమాట ఈ కార్టూన్ గురించి శేఖర్ గారు చెప్పేవరకు నాకు తెలియదు.

 6. @నాగశ్రీనివాస్ గారు

  కార్టూన్లలో వాడబడిన పదాలకు అర్థం పాఠకులకు తెలియచెప్పాలని రచయిత భావించినపుడు..లేదా కార్టూన్ వలన తనకు ఒక ఆలోచన కలిగినప్పుడు దాన్ని వేరే వ్యాస రూపం లో రాయమని నా సూచన. అంటే కార్టూన్ కింద రాయకుండా పక్క పేజీలో రాయమని నా భావన..! తద్వారా కార్టూనుకుండే సహజ లక్షణాన్ని గౌరవిద్దామని నా ఆలోచన! హైకూని సాగదీస్తే సానెట్ అవదు..దేని సొగసు దానిదే అని నా భావం!

  ఒక యాబ్ స్ట్రాక్ట్ ఆర్ట్ గీసిన చిత్రకారుడు అసలు దీని అర్థం ఏమిటంటే అని రాయటం ఎలా ఉంటుంది? కార్టూనుకిదీ అర్థం అని ఒక కార్టూనిస్ట్ కింద నోట్ రాస్తే ఎలా ఉంటుంది?

  మనమందరం సాధారణ పాఠకులమే ! అసాధారణ పాఠకులంటూ ఎవరూ ఉండరు! తెలియటం తెలియకపోవడం అనేదే తేడా! అందరికి అన్నీ తెలియవు ! అందరం నిరంతర విద్యార్ధులమే…!

  ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s