ఢిల్లీలో ప్రచారం చేస్తుండగా మంగళవారం (ఏప్రిల్ 8) ఒక ఆటోవాలా చేతిలో చెంపదెబ్బ తిన్న అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు సదరు ఆటోవాలాకు తనదైన స్పందనను రుచి చూపించాడు. తన చెంప ఛెళ్ళుమానిపించిన ఆటో వాలా ఇంటికి స్వయంగా వెళ్ళి ఆయన ఎందుకు అలా చేయవలసి వచ్చింది కనుక్కునేందుకు ప్రయత్నించాడు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించనందునే తాను అలా చేయవలసి వచ్చిందని సదరు వ్యక్తి చెప్పడంతో ఆయనను క్షమించినట్లు కేజ్రీవాల్ ప్రకటించారు.
వాయవ్య ఢిల్లీలోని సుల్తాన్ పురి ఏరియాలో అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు ఆయనకు పూలమాలలు వేశారు. ఒక వ్యక్తి పూలదండ వేసినట్లు వేసి అకస్మాత్తుగా అరవింద్ చెంప ఛెళ్ళుమనిపించాడు. ఆ వెంటనే ఎ.కె చుట్టూ ఉన్న ఎఎపి కార్యకర్తలు, పోలీసులు ఆటోవాలాను చుట్టుముట్టి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆయన్ను స్టేషన్ కి తీసుకెళ్లినప్పటికీ ఎ.కె నుండి ఫిర్యాదు అందకపోవడంతో వెంటనే విడుదల చేశారు.
సంఘటన జరిగిన వెంటనే ప్రచారాన్ని అర్ధాంతరంగా నిలిపివేసిన అరవింద్ అక్కడి నుండి రాజ్ ఘాట్ కు బయలుదేరి వెళ్లారు. గాంధీ సమాధి దగ్గర గంటపాటు మౌన దీక్ష చేపట్టారు. అనంతరం తనపై పదే పదే దాడి జరగడం వెనుక పెద్ద కుట్ర ఉన్నదని ఆరోపించారు. “ప్రధాని మంత్రి కావడానికి కొంతమంది హింసకు ఎందుకు పాల్పడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు. మా పైన దాడి చేయడం ద్వారా మా నోరు మూయించగలమని భావించినట్లయితే మీరు పొరపడుతున్నట్లే” అని కేజ్రీవాల్ హెచ్చరించారు.
కేజ్రీవాల్ ను కొట్టిన వ్యక్తి పేరు లాలి అని తెలుస్తోంది. లాలి పైన ఫిర్యాదు చేయడానికి ఎ.కె నిరాకరించారు. భద్రతను అంగీకరించడానికి కూడా నిరాకరించారు. అరవింద్ పై జరిగిన దాడి ముందే పధకం వేసి జరిపిన ఘటనగా బి.జె.పి అభివర్ణించింది. ఢిల్లీ ప్రజల ఆగ్రహానికి ప్రతిరూపంగా లాలి చర్యను కాంగ్రెస్ పేర్కొంది. అయితే ఇరు పార్టీలు ఘటనను ఖండించాయని ది హిందూ తెలిపింది.
మంగళవారం దాడి జరగ్గా బుధవారం అరవింద్ లాలి ఇంటిని సందర్శించారు. ఔటర్ ఢిల్లీలోని అమన్ విహార్ నివాసి అయిన 38 యేళ్ళ లాలి తమ ఆటోవాలాల సమస్యలను పరిష్కరించనందుకే కొట్టానని చెప్పినట్లు తెలుస్తోంది. లాలి చెంపదెబ్బ ఫలితంగా ఎ.కె కళ్ళజోడు పగిలిపోయింది. కంటికి స్వల్ప గాయం కూడా అయింది. లాలి ఇంటిని సందర్శించిన అనంతరం అతన్ని క్షమించానని అరవింద్ ప్రకటించారు.
అరవింద్ కేజ్రీవాల్ గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంలో చెంప దెబ్బలు తింటున్నారు. పోలీసు రక్షణ లేకపోవడంతో ఆయనను సమీపించడం అందరికీ తేలికగా ఉన్నట్లు కనిపిస్తోంది. హర్యానాలో మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు దాద్రి వద్ద ఒక యువకుడు ఆయనను కొట్టారు. ఇదే నియోజకవర్గంలో హర్యానా కాంగ్రెస్ మంత్రి కిరణ్ చౌదరి పైన కూడా దాడి జరిగినట్లు తెలుస్తోంది.
దాద్రి లో ఎ.కె పై దాడి చేసిన వ్యక్తి పేరు జితేందర్ సంగ్వాన్. ఎ.కె రోడ్ షో చూస్తూ అకస్మాత్తుగా ఆయనపై దాడి చేసి మెడపై కొట్టాడు. వెంటనే ఎఎపి కార్యకర్తలు అతన్ని చుట్టుముట్టి కొట్టబోగా ఎ.కె వారించినట్లు తెలుస్తోంది. సంఘటన జరిగింది భివానీ జిల్లాలో. ఆనంతరం భివానీ జిల్లా ఎస్.పి పత్రికలతో మాట్లాడుతూ ఎ.కె పై దాడి చేసినప్పుడు జితేందర్ తాగి ఉన్నాడని, ఆయన లా గ్రాడ్యుయేట్ అని తెలిపారు. అన్నా హజారే ఆందోళనను ఎ.కె హైజాక్ చేశారని భావిస్తూ జితేందర్ దాడి చేశారని ఎస్.పి తెలిపారు.
తనపై దాడి చేసినవారి పట్ల హింసాత్మకంగా వ్యవహరించవద్దని తమ కార్యకర్తలను కోరుతూ సంఘటన అనంతరం ఎ.కె ట్విట్టర్ లో సందేశం పెట్టారు. “ఈ ఉద్యమంలో మీరు భాగస్వాములయినట్లయితే దాడి ఎంత పెద్దది అయినప్పటికీ ప్రతిదాడి చేయబోమని మీరు మాట ఇవ్వాలి” అని ఆయన ట్విట్టర్ లో కోరినట్లు ది హిందు తెలిపింది.
‘rangam’ movie screen play i think…