దక్షిణ అమెరికా దేశం చిలీలో ప్రకృతి తీవ్రంగానే ఆగ్రహించింది గానీ స్వల్ప నష్టంతో వదిలేసింది. పసిఫిక్ మహా సముద్రంలో చిలీ తీరానికి దగ్గరలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలు పైన 8.2 గా నమోదయింది. భూకంపం ఎంత తీవ్రంగా ఉన్నదంటే ప్రధాన భూకంపం తర్వాత సంభవించిన ప్రకంపనాలు (after shocks) కూడా దాదాపు అంతే తీవ్రంగా నమోదయ్యాయి. ఉదాహరణకి 8.2 పాయింట్ల భూకంపం తర్వాత అనేక డజన్ల సార్లు భూమి కంపించగా అందులో 18 సార్లు 5 పైనే తీవ్రతను నమోదు చేశాయి. రెండు సార్లయితే 7.6 తీవ్రతతో అనంతర కంపనాలు నమోదయ్యాయి.
సముద్రం అడుగున తీరానికి దూరంలో భూకంప కేంద్రం ఉండడం వలన సునామీ కూడా తీరాన్ని ముంచెత్తింది. చిలీ, పెరు, ఈక్వడార్ లకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే ఒక్క చిలీ మాత్రమే సునామీ అలలను ఎదుర్కొంది. ఏప్రిల్ 2 తేదీన చిలీ ఉత్తర నగరం ఇకియుకే నగరానికి సమీపంలో సముద్ర అడుగు భాగానికి ఇంకా 12.5 మైళ్ళ అడుగున భూకంప కేంద్రం ఉన్నట్లుగా పరికరాలు గుర్తించాయి.
ఈ భూకంపం, సునామీలకు సంబంధించిన ఆశ్చర్యకర పరిణామం ఏమిటంటే నష్టం పెద్దగా జరగకపోవడం. 8.2 పాయింట్ల భూకంపం అంటే సాధారణ స్ధాయి కంటే చాలా చాలా ఎక్కువ. అయినప్పటికీ 6 గురు మాత్రమే చనిపోగా ఆస్తి నష్టం మాత్రం భారీగానే సంభవించింది. అనేకచోట్ల మంటలు ఎగిసిపడ్డాయి. చిన్న చిన్న నిర్మాణాలు తక్కువ నష్టపోగా భారీ కట్టడాలు ఎక్కువగా నష్టానికి గురయ్యాయి. అనేకచోట్ల రోడ్లు విరిగిపోయి, చీలిపోయి, ప్రయాణానికి పనికిరాకుండా పోయాయి. జనం మాత్రం ఆరుబయట, రోడ్ల మీదికి వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇళ్ళు కూలిపోవడంతో ఇప్పటికీ అనేకమంది రోడ్లపైనే గడుపుతున్నారు.
ముందస్తు హెచ్చరికలు జారీ చేసి జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల ప్రాణ నష్టం బాగా తగ్గిపోయిందని భావిస్తున్నారు. ఈ విషయంలో అధికారులు, ప్రభుత్వం చురుకుగా వ్యవహరించారని ప్రశంసలు కురిసాయి. చనిపోయినవారిలో కొందరు గుండె పోటుకు గురై చనిపోగా మిగిలినవారు శిధిలాల నడుమ చిక్కుకుని చనిపోయారు. సునామీ అలలు 2 మీటర్ల ఎత్తున ఎగిసి పడడం వలన పెద్దగా జల ప్రళయం లాంటిది కూడా సంభవించకుండా బైటపడగలిగారు. మరుసటి రోజు సాయంత్రానికల్లా సునామీ హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. కొన్ని చోట్ల పడవలు రోడ్ల మీదికి కొట్టుకువచ్చాయి. పలు వాహనాలు భూకంపం శిధిలాల కిందపడి నలిగిపోయాయి.
Photos: The Atlantic