ఉక్రెయిన్ ఎక్కడ ఉంది అనడిగితే అమెరికన్లకు తెలియదు. కానీ అమెరికా జాతీయ భద్రత పేరుతో మిలట్రీ దాడి చేయడానికి మాత్రం మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అమెరికాకే చెందిన యూనివర్శిటీల ప్రొఫెసర్ల బృందం ఒకటి జరిపిన సర్వేలో ఈ సంగతి తెలిసింది. యువకుల దగ్గర్నుండి పెద్దవారి దాకా ప్రపంచంలో ఉక్రెయిన్ ఎక్కడుందో గుర్తించమంటే సరిగ్గా గుర్తించినవారు నూటికి 16 మంది మాత్రమే.
ఉక్రెయిన్ ని సరిగ్గా గుర్తించినవారు మిలట్రీ దాడికి వ్యతిరేకత వ్యక్తం చేయగా అసలు చోటుకు దూరంగా ఉందని గుర్తించినవారే దాడికి మద్దతు ఇచ్చారు. దూరం వెళ్ళే కొద్దీ మిలట్రీ దాడికి మద్దతు ఇవ్వడం పెరుగుతూ పోయిందని సర్వే నిర్వహించిన ప్రొఫెసర్లు తెలిపారు. అమెరికా సాగించిన అనేక దురాక్రమణ యుద్ధాల పట్ల అమెరికన్లకు ఉన్న అవగాహన ఇంత హోరంగా ఎడిచిందన్నమాట! చిత్రం ఏమిటంటే ఉక్రెయిన్ తమ దేశంలోనే ఒక భాగంగా ఉందని గుర్తించగలిగిన గొప్ప విజ్ఞానులు కూడా అమెరికాలో ఉండడం.
ఐవీ లీగ్ ప్రొఫెసర్లు ముగ్గురు ఈ సర్వే నిర్వహించారని రష్యా టుడే తెలిపింది. తాము సర్వే జరిపిన ప్రతి 6 గురు అమెరికన్లలో కేవలం ఒక్కరు మాత్రమే ఉక్రెయిన్ ఎక్కడ ఉన్నదీ సరిగ్గా గుర్తించగలిగారని వారు తెలిపారు. ప్రపంచ పటంలో ఉక్రెయిన్ ఉన్న అసలు చోటుకు దూరంగా ఉన్నట్లుగా గుర్తించేవారిలో కూడా కొన్ని తేడాలు ఉన్నాయని సర్వే నిర్వాహకులు తెలిపారు. తాము ఉక్రెయిన్ గా గుర్తించే చోటు అసలు ఉక్రెయిన్ ఉన్న చోటుకు దూరం జరిగే కొద్దీ అమెరికా మిలట్రీ జోక్యాన్ని సమర్ధించడం కూడా పెరుగుతూ పోయిందని వారు తెలిపారు.
అనగా ఉక్రెయిన్ ను దాని అసలు స్ధానానికి ఎంత దూరంగా గుర్తిస్తే అంత గట్టిగా అమెరికా మిలట్రీ జోక్యాన్ని సమర్ధించారన్నమాట! సర్వే వివరాలను వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తమ బ్లాగ్ లో ప్రచురించింది. డార్ట్ మౌత్ కాలేజీలో రాజకీయ శాస్త్రం బోధించే కైల్ డ్రాప్, హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జోషువా డి. కెర్ట్ జర్, ప్రిన్స్ టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ధామస్ జీట్ జాఫ్ లు ఈ సర్వే నిర్వహించారని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.
మార్చి ప్రారంభంలో రష్యా బలగాలు క్రిమియాలో ప్రవేశించాయని పశ్చిమ కార్పొరేట్ పత్రికలు అదే పనిగా వార్తలు ప్రచురించాయి. రష్యా క్రిమియాను ఆక్రమించుకుందని, రష్యాలో కలిపేసుకుందని, ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి దాడి చేయడానికి సిద్ధంగా ఉందనీ పెద్ద ఎత్తున వార్తలు ప్రచురించాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో జరిగిన హింసాత్మక ఆందోళనలను, పరమ కిరాతక హత్యలను ప్రజాస్వామిక ఉద్యమంగా ప్రచారం చేసిన ఈ పత్రికలు క్రిమియాలో ఒక్క తుపాకి గుండు కూడా పేలనప్పటికీ, క్రిమియా ప్రజలు స్వయంగా రిఫరెండంలో పాల్గొన్నప్పటికీ దానిని రష్యా దురాక్రమణగా ప్రచారం చేశాయి. రాజకీయ, వ్యక్తిగత ఆంక్షలు విధించడం ద్వారా ఏదో ఘోరం జరిగిపోయినట్లుగా ప్రభావం పడవేయగలిగాయి.
ఈ నేపధ్యంలోనే అమెరికన్ల ఉక్రెయిన్ ఆలోచనలు ప్రభావితం అయ్యాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉక్రెయిన్ లో అమెరికా సైనిక జోక్యం చేసుకోవాలనో లేదా మరొకటో అభిప్రాయం ఏర్పరచుకోవడం ఒక విషయం అయితే అసలు ఉక్రెయిన్ అన్న దేశం ఎక్కడ ఉందో కూడా తెలుసుకోకుండా ఆ అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం మరీ ఘోరం. ఆ దేశం ఎక్కడ ఉందో తెలియకుండానే అమెరికా వెళ్ళి చొరబాటుకు దిగాలని కోరుకోవడం ఇంకా దౌర్భాగ్యం. అమెరికా పాలకులు అంత నిర్లజ్జగా, అక్రమంగా స్వతంత్ర దేశాలపై సైనిక దురాక్రమణలకు ఎలా దిగగలుగుతున్నారో, అన్ని అక్రమాలకు పాల్పడుతూ కూడా దేశంలో ప్రజల మద్దతు ఎలా కూడగడుతున్నారో సర్వే వివరాల ద్వారా స్పష్టం అవుతోంది.
మార్చి ప్రారంభం నుండి వివిధ మీడియా సంస్ధలు జరిపిన సర్వేలను కూడా సర్వే నిర్వాహకులు క్రోడీకరించి ఫలితాలు రాబట్టారని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. క్రిమియాను రష్యా ఆక్రమించింది కనుక అమెరికా ఎలా ప్రతిస్పందించాలో చెప్పాలని పత్రికలు అమెరికన్లను కోరాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 2/3 వంతుల మంది తాము ఉక్రెయిన్-క్రిమియా పరిణామాలను శ్రద్ధగా పరిశీలిస్తున్నామని చెప్పినప్పటికీ వాస్తవంలో వారికి తెలిసింది చాలా తక్కువని సర్వేల్లో తెలిసింది. చాలా మందికి ఉక్రెయిన్ ఎక్కడుందో కూడా తెలియదని వెల్లడి అయింది.
మార్చి 28-31 తేదీల మధ్య తాము 2,066 మంది అమెరికన్లను సర్వే చేశామని ప్రొఫెసర్లు తెలిపారు. సర్వే సాంప్లింగ్ ఇంటర్నేషల్ (ఎస్.ఎస్.ఐ) అనే సంస్ధ ద్వారా వారు తమ ప్రశ్నలను జనం ముందు ఉంచారు. ఉక్రెయిన్ సంక్షోభం నేపధ్యంలో అమెరికా విదేశాంగ విధానంపై అమెరికన్ల అవగాహనను పరిశీలించడానికి ప్రశ్నలు సంధిస్తూనే ఉక్రెయిన్ ఎక్కడ ఉన్నదో కూడా ప్రపంచ పటంలో గుర్తించాలని వారు కోరారు. ఉక్రెయిన్ ఎక్కడ ఉన్నదీ వారికి ఉన్న అవగాహనను బట్టి ఆ దేశం పట్ల అమెరికా వ్యవహరించవలసిన తీరుపై వారు అవగాహన ఏర్పరుచుకున్నారా అన్నది పరిశీలించాలని నిర్వాహకులు భావించారు. సర్వే ఫలితాలు వారిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. వారు ఇలా పేర్కొన్నారు:
We found that only one out of six Americans can find Ukraine on a map, and that this lack of knowledge is related to preferences: The farther their guesses were from Ukraine’s actual location, the more they wanted the U.S. to intervene with military force.
ఉక్రెయిన్ భౌగోళిక స్ధానం పట్ల అవగాహన లేనివారే ఆ దేశంలో సైనిక జోక్యానికి దిగాలని సూచించారు. పైగా ఉక్రెయిన్ స్ధానాన్ని దాని అసలు స్ధానానికి దూరంగా గుర్తించే కొద్దీ వారి విదేశాంగ విధాన అవగాహన మరింత దుర్భరం అవుతూ పోయింది. హై రిసోల్యూషన్ ప్రపంచ పటం పైన ఉక్రెయిన్ ఎక్కడ ఉన్నదీ క్లిక్ చేసి చూపాలని నిర్వాహకులు కోరగా సర్వే అనంతరం వారు చూసిన పటం ఇది:
ఉక్రెయిన్ దక్షిణ అమెరికా ఖండంలో ఉందని గుర్తించేవారు కొందరయితే, హిందూ మహా సముద్రంలోనూ, ఆస్ట్రేలియాలోనూ ఉందని గుర్తించేది మరి కొందరు. ఇక అమెరికా, కెనడాల్లో ఉక్రెయిన్ ఉన్నట్లు గుర్తించేవారి గురించి అనుకోకపోవడమే మేలు తూర్పు యూరప్ దేశంగా ఉక్రెయిన్ ని గుర్తించినవారు కేవలం 16 శాతం మంది మాత్రమే. ఎక్కువమంది ఉక్రెయిన్ యూరప్ లో గానీ ఆసియాలో గానీ ఎక్కడో ఉందని గుర్తించగా సగటున అసలు స్ధానానికి 1800 మైళ్ళ దూరంలో ఉక్రెయిన్ ఉందని గుర్తించారు. యూరప్ లో ఉందని గుర్తించినవారు పశ్చిమాన పోర్చుగల్, తూర్పున కజకిస్ధాన్, ఉత్తరాన ఫిన్లాండ్, దక్షిణాన సూడాన్ వరకూ వెళ్ళి ఉక్రెయిన్ దేశాన్ని గుర్తించారు.
వయసు రీత్యా చూస్తే యువకులు ఎక్కువ సంఖ్యలో ఉక్రెయిన్ ని సరిగ్గా గుర్తించగలిగారు. 18-24 సం.ల వయసు వారిలో 27 శాతం మంది సరిగ్గా గుర్తించారు. అనగా 73 శాతం మంది యువకులకి ఉక్రెయిన్ ఎక్కడ ఉన్నదీ తెలియదు. 65 సం.లు దాటినవారిలో 14 శాతం మాత్రమే ఉక్రెయిన్ ని గుర్తించగలిగారు. సోవియట్ రష్యా నుండి ఉక్రెయిన్ విడిపోయింది 1990లోనే గనుక పెద్దవారిని ఆ మాత్రం అర్ధం చేసుకోవచ్చేమో.
లింగపరంగా చూస్తే పురుషులే ఎక్కువ సంఖ్యలో ఉక్రెయిన్ స్ధానాన్ని సరిగ్గా గుర్తించారు. పురుషుల్లో 20 శాతం మంది కరెక్ట్ గా గుర్తించగా స్త్రీలలో 13 శాతం మాత్రమే సరిగా గుర్తించారు. మరింత ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే మిలట్రీ కుటుంబాలు కూడా ఉక్రెయిన్ ని గుర్తించలేకపోవడం. వారిలో 16.1 శాతం మాత్రమే ఉక్రెయిన్ స్ధానం గుర్తించారు. అనగా మొత్తం జనాల్లో 16 శాతం మంది సరిగ్గా గుర్తించగలిగితే వారి కంటే కేవలం 0.1 శాతం మాత్రమే మిలట్రీ కుటుంబాలు ఎక్కువ భౌగోళిక జ్ఞానం కలిగి ఉన్నారు.
రాజకీయ భావాల పరంగా చూస్తే తమను తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వని స్వతంత్ర భావాలు కలిగినవారుగా చెప్పుకున్నవారే ఎక్కువ సంఖ్యలో సరైన ఫలితాన్ని ఇచ్చారు. స్వతంత్రులలో 29 శాతం మంది సరిగా ఉక్రెయిన్ ని గుర్తించగా డెమొక్రాట్లలో వారి సంఖ్య 14 శాతం, రిపబ్లికన్లలో 15 శాతం. చదువుల పరంగా చూస్తే కాలేజీ గ్రాడ్యుయేట్లు 21 శాతం మంది సరైన చోట ఉక్రెయిన్ ని గుర్తిస్తే గ్రాడ్యుయేట్ కానివారిలో 13 శాతం మాత్రమే సరైన చోటు గుర్తించారు. అనగా కాలేజీ గ్రాడ్యుయేట్లలో 79 శాతం మందికి ఉక్రెయిన్ ఎక్కడ ఉందో తెలియదు. అమెరికా అధ్యక్షుడు ఒబామా ముస్లిం అని గుర్తించిన కాలేజీ పట్టబధ్రుల కంటే ఉక్రెయిన్ ని సరైన చోట గుర్తించిన పట్టబద్రుల సంఖ్య కాస్త మాత్రమే ఎక్కువని సర్వే నిర్వాహకులు చెప్పారు.
ఉక్రెయిన్ లో మిలట్రీ జోక్యం విషయానికి వస్తే చాలా మంది అమెరికా ఏం చేయాలన్నదీ నిర్ణయించుకోలేదు. యుద్ధం వల్ల ఆర్ధిక వ్యవస్ధపై భారం కనుక వ్యతిరేకిస్తున్నట్లు 45 శాతం మంది చెప్పగా 13 శాతం మంది అమెరికన్లు ఉక్రెయిన్ లో సైనిక జోక్యాన్ని పూర్తిగా సమర్ధించారు. ఈ అంకెలతో ఉక్రెయిన్ భౌగోళిక స్ధానం పట్ల వారి అవగాహనతో పోల్చి చూసినపుడే దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడి అయ్యాయి.
ఉక్రెయిన్ భౌగోళిక స్ధానం పట్ల ఎంత తక్కువ అవగాహన ఉంటే అంత ఎక్కువగా సైనిక జోక్యానికి మద్దతు ఇవ్వడం సర్వేలో తేలిన దిగ్భ్రాంతికరమైన అంశం. తమ దేశం ఒక దేశంపై యుద్ధానికి దిగాలని భావించినా, సైన్యం దించాలని భావించినా ఆ దేశం ఎక్కడ ఉన్నదీ వారికి కనీస అవగాహన ఉండాలని ఆశించడం పెద్ద ఆశ ఏమీ కాదు. అసలా దేశం ఎక్కడ ఉందో కూడా తెలియకుండా ఆ దేశంలో సైనిక జోక్యం చేసుకోవాలని కోరడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
చాలామందికి తమతమ దేశాల విదేశాంగ విధానం ఏమిటో సరిగ్గాతెలియదు! వారుచేసేదుశ్చర్యలను గుడ్డిగా మద్ధతిస్తారు! దానివలన తమకు పెద్దగా కలిగే నష్టంలేదనుకొంటారు. అంతేకాకుండా దానినే జాతీయవాదమనుకొంటారు!