విమానాల్లో అత్యంత ముఖ్యమైన భాగం బ్లాక్ బాక్స్, విమానాలు ప్రమాదానికి గురయినపుడు ఆ ప్రమాదం గురించిన వివరాలను బ్లాక్ బాక్స్ నుండి సేకరిస్తారు. విమానం కాక్ పిట్ లో జరిగిన సంభాషణలను కూడా ఇది రికార్డు చేస్తుంది. విమానానికి ఎదురయిన వివిధ సాంకేతిక ఇబ్బందుల సమాచారాన్ని కూడా ఇది పట్టిస్తుంది. మలేషియా విమానం MH370 బ్లాక్ బాక్స్ కోసం ప్రస్తుతం అన్వేషణ సాగుతోంది. బ్లాక్ బాక్స్ సంకేతాలు అనదగ్గ సిగ్నల్స్ ను చైనా నౌక రికార్డు చేసిందన్న వార్త ప్రస్తుతం సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
ప్రమాదం జరిగాక బ్లాక్ బాక్స్ 30 రోజులు మాత్రమే సంకేతాలు వెలువరిస్తుంది. ఆ తర్వాత దాని బ్యాటరీలు బలహీనపడతాయి. కాబట్టి 30 రోజులు దాటిపోతే ఇక విమానం శకలాలు కనుగొనగల అవకాశాలు పూర్తిగా సన్నగిల్లుతాయి. దానితో పలు దేశాలు తమ శక్తియుక్తులు అన్నింటినీ వినియోగించి MH370 కోసం హిందూ మహా సముద్రాన్ని జల్లెడ పడుతున్నాయి. అమెరికా అందించిన పరికరాలను వినియోగిస్తూ ఆస్ట్రేలియా ప్రయత్నాలు చేస్తుండగా చైనా తన సొంత నౌకలతో తన ప్రయత్నాలు తాను చేస్తోంది.
చైనా, ఆస్ట్రేలియాలకు చెందిన నౌకలు బ్లాక్ బాక్స్ నుండి వెలువడిన సంకేతాలుగా భావిస్తున్న ఎకౌస్టిక్ సంకేతాలను రికార్డు చేసిన వార్త ప్రస్తుతం ఆశలు రేకెత్తిస్తోంది. మార్చి 8 తేదీన విమానం అదృశ్యం అయింది. అనగా ఏప్రిల్ 6 తేదీతో 30 రోజులు పూర్తయ్యాయి. బహుశా ఇక నుండి బ్లాక్ బాక్స్ నుండి ఇక సిగ్నల్స్ వెలువడకపోవచ్చు. లేదా బలహీన సంకేతాలను మరికొన్ని రోజులపాటు వెలువరిస్తుందా అన్న అంశం గురించి ఏ పత్రికా సమాచారం ఇవ్వలేదు.
చైనా నౌక శనివారం రెండు సార్లు ఎకౌస్టిక్ (అలలు అలలుగా వెలువడే సంకేతాలు) సిగ్నల్స్ ను రికార్డు చేయగా ఆస్ట్రేలియా నౌక ఆదివారం అలాంటి సంకేతాలను రికార్డు చేసింది. కానీ చైనా, ఆస్ట్రేలియాలు గుర్తించిన సంకేతాలు వెలువడిన ప్రాంతాల మధ్య 300 కి.మీ పైగా దూరం ఉన్నట్లు తెలుస్తోంది. చైనా రికార్డు చేసిన రెండు సంకేతాల మధ్య దూరం కొన్ని మీటర్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి చైనా, ఆస్ట్రేలియా… ఇరు దేశాలు గుర్తించిన ప్రదేశాల్లో ఏదో ఒక చోట మాత్రమే బ్లాక్ బాక్స్ ఉండే అవకాశం ఉంది. అసలు లేకుండా ఉండే అవకాసాలూ లేకపోలేదనీ, సదరు సంకేతాలు మరో వస్తువుకు సంబంధించినవి కూడా కావచ్చని ఆస్ట్రేలియా అధికారుల మాటల ద్వారా తెలుస్తున్నది.
చైనా నౌక రికార్డు చేసిన సంకేతాల ఫ్రీక్వెన్సీ 37.5 కిలో హార్ట్జ్ (kHz) గా పత్రికలు తెలిపాయి. బ్లాక్ బాక్స్ వెలువరించే సంకేతాల ఫ్రీక్వెన్సీ కూడా ఇదే కావడంతో ఆశలు చిగురించాయి. ఈ ప్రాంతంలో కేంద్రీకరించి వివిధ దేశాలకు చెందిన నౌకలు, విమానాలు అన్వేషణ సాగిస్తున్నాయి. చైనాకు చెందిన విమానం ఒకటి బ్లాక్ బాక్స్ సంకేతాలు వెలువడిన ప్రాంతానికి సమీపంలోనే నీటిలో తేలుతున్న తెల్లని వస్తువులను ఫోటోలు తీయడంతో ఆశలు మరింత బలపడుతున్నాయి. కానీ అప్పుడే ఆశలు పెంచుకోవద్దని అధికారులు హెచ్చరిస్తుండడంతో తదుపరి నిర్ధారిత ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
ఇరు దేశాలు గుర్తించిన పింగ్ సంకేతాలను ఇంకా గుర్తించలేదనీ, అవి MH370 కి చెందిన బ్లాక్ బాక్స్ నుండే వచ్చాయా అన్నది పరిశోధిస్తున్నారని రష్యా టుడే పత్రిక తెలిపింది. “ప్రతి సిగ్నల్ నీ మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఈ ప్రాంతాలను వదిలి రావడానికి ముందు ఈ సంకేతాలు MH370 కి చెందినవి కావని మేము నిర్ధారణకు రావలసి ఉంటుంది” అని ఆస్ట్రేలియా ఏజన్సీ తరపున అన్వేషణలో పాల్గొంటున్న రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అంగస్ హోస్టన్ పెర్త్ (ఆస్ట్రేలియా) లో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారని ఆర్.టి తెలిపింది.