ఉక్రెయిన్ సంక్షోభం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. ఉక్రెయిన్ కేంద్ర ప్రభుత్వంలో తమ అనుకూలురను ప్రతిష్టించడం ద్వారా కుంభస్తలాన్ని కొట్టామని అమెరికా, ఐరోపాలు సంతోషపడుతుండవచ్చు. కానీ రష్యా పెద్దగా ఆర్భాటం లేకుండా, ఖర్చు లేకుండా తనపని తాను చేసుకుపోతోంది. ఒక్క గుండు కూడా పేల్చకుండా క్రిమియా ప్రజలే తమ ప్రాంతాన్ని రష్యాలో కలిపేలా పావులు కదిపింది, ఇప్పుడు ఉక్రెయిన్ ప్రధాన భూభాగంలోని తూర్పు రాష్ట్రం దోనెట్స్క్ ప్రజలు కూడా తమ రాష్ట్రాన్ని ఉక్రెయిన్ నుండి విడివడిన స్వతంత్రం దేశంగా ప్రకటించుకున్నారు.
ఉక్రెయిన్ లో పశ్చిమ ప్రేరేపిత సంక్షోభం బద్దలయినప్పటి నుండీ దోనెట్స్క్ లో అశాంతి రగులుతూ వచ్చింది. హింసాత్మక ఆందోళనల ద్వారానూ, నయా నాజీ తీవ్రవాదుల హింసాత్మక చర్యల అండతోనూ అమెరికా, ఇ.యు లు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో అశాంతి రగిలించాయి. అమెరికా, ఇ.యు లకు చెందిన అధికారులు, నేతలు స్వయంగా కీవ్ వచ్చి ఉక్రెయిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగాలు ఇచ్చి, కుకీలు పంచి ప్రభుత్వాన్ని కూల్చమని ప్రోత్సహించి మరీ వెళ్లారు.
తాము రెచ్చగొట్టిన ఆందోళనకారులను తమ వారితోనే పదుల సంఖ్యలో స్నైపర్ల ద్వారా చంపించడం ద్వారా పోలీసులను, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ఎత్తుగడ పన్నారు. కానీ ఎస్టోనియా, ఇ.యు విదేశాంగ మంత్రుల ఫోన్ సంభాషణల ద్వారా ఆందోళనకారులను చంపించింది కూడా నూతనంగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వమే అన్న సంగతి వెల్లడి అయింది.
దానితో ఉక్రెయిన్ నూతన ప్రభుత్వంకు వ్యతిరేకంగా తూర్పు, దక్షిణ రాష్ట్రాల ప్రజలు ఆందోళనలు తీవ్రతరం చేశారు. ముఖ్యంగా ఖార్కోవ్, లుగాన్స్క్, దోనెట్స్క్ లలో ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ కార్యాలయాలపైనా, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలపైనా రష్యా జెండాలు ఎగరవేయడం ప్రారంభించారు. ఒకపక్క తెరవెనుక రష్యా, ఇ.యు, అమెరికాల మధ్య ఉక్రెయిన్ భవితవ్యంపై చర్చలు జరుగుతున్నప్పటికీ మరోపక్క గత వారం రోజులుగా ఈ మూడు రాష్ట్రాల్లో ఆందోళనలు తీవ్రం అయ్యాయి.
ఆదివారం దోనెట్స్క్ పార్లమెంటు భవనాలను, మంత్రిత్వశాఖల కార్యాలయాలను ఆక్రమించుకుని ఉక్రెయిన్ నూతన ప్రభుత్వం నియమించిన పాలకులను వెళ్లిపోవాలని కోరిన ఆందోళనకారులు సోమవారం నాటికి స్వతంత్రం ప్రకటించుకున్నారు. స్వతంత్రం ప్రకటించుకోవడమే కాకుండా ఉక్రెయిన్ నుండి మిలట్రీ బలగాలు అణచివేతకు దిగే ప్రమాదం ఉన్నందున రష్యా తమ సైన్యాలను పంపాలని కోరుతూ విజ్ఞాపనలు జారీ చేశారు.
ఆదివారం ప్రాంతీయ ప్రభుత్వ కేంద్ర కార్యాలయాన్ని ఆక్రమించుకున్న ఆందోళనకారులు సోమవారం ‘పీపుల్స్ కౌన్సిల్ ఆఫ్ దోనెట్స్క్’ పేరుతో తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. తమ ప్రాంతం ఇక ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ దోనెట్స్క్’ పేరుతో స్వతంత్ర సార్వభౌమ దేశంగా అవతరించిందని వారు ప్రకటించారని ది హిందూ తెలిపింది. అంతటితో ఆగకుండా మే 11 తేదీ లోపల రిఫరెండం నిర్వహిస్తామని ప్రకటించారు. ఉక్రెయిన్ నుండి విడిపోయి రష్యాలో కలవాలని తాము నిర్ణయించుకున్నామని రిఫరెండం కూడా ఈ అంశం పైనే జరుపుతామని పీపుల్స్ కౌన్సిల్ ప్రకటించింది.
మే 25 తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని ఉక్రెయిన్ నూతన తాత్కాలిక ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆ తేదీ లోపలే రిఫరెండం నిర్వహిస్తామని ప్రకటించడం ద్వారా దోనెట్స్క్ ఆందోళనకారులు తగిన జాగ్రత్త పాటించినట్లు తెలుస్తోంది. “దోనెట్స్క్ ప్రాంత పాలనా సరిహద్దుల పరిధిలోనే దోనెట్స్క్ రిపబ్లిక్ ఏర్పడుతుంది. రిఫరెండం అనంతరం ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది” అని పీపుల్స్ కౌన్సిల్ ప్రకటించిందని ఆర్.టి, ది హిందూ పత్రికలు తెలిపాయి.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ని ఉద్దేశిస్తూ పీపుల్స్ కౌన్సిల్ మరో ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. తాత్మాలిక శాంతి సైనికులుగా పని చేయడానికి రష్యా సైనికులను పంపాలని ఆ ప్రకటన కోరింది. “మీ మద్దతు, రష్యా మద్దతు లేకుండా కీవ్ (ఉక్రెయిన్ రాజధాని) సైనిక ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడడం మాకు చాలా కష్టం” అని సదరు ప్రకటన అభ్యర్ధించింది. ఉక్రెయిన్ బలగాలు దాడికి దిగుతాయన్న అంచనాతో ఆందోళనకారులు ప్రభుత్వ భవనం చుట్టూ కారు టైర్లతో బ్యారీకేడ్ నిర్మించారు. ముళ్ళ కంచే కూడా ఏర్పాటు చేసుకున్నారు.
ఖార్కోవ్, లుగాన్స్క్ రాష్ట్రాల్లో కూడా దాదాపు ఇదే పరిస్ధితి నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ కూడా రష్యా అనుకూల ఆందోళనకారులు ప్రభుత్వ పాలనా భవనాలను ఆక్రమించి రష్యా జెండాలు ఎగరవేశారు. రష్యా పతాకాలను సూచించే బేనర్లను కట్టారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఇ.యు అనుకూల ఆందోళనలు జరుగుతున్నపుడు లైవ్ కవరేజి వార్తల తోనూ వీడియోలు, ఫోటోలతోనూ పేజీలకు పేజీలు నింపిన పశ్చిమ కార్పొరేట్ పత్రికలు ఈసారి మాత్రం ఉక్రెయిన్ ఎక్కడ ఉందో తెలియనట్లుగానే నటిస్తున్నాయి. ఆర్.టి తప్ప సవివరమైన కధనాలను అందిస్తున్న పశ్చిమ పత్రికలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దోనెట్స్క్ చివరికి స్వతంత్రం ప్రకటించుకున్నాక మాత్రమే అనివార్యంగా వార్తను ప్రచురించాల్సి వచ్చింది.
ఖార్కివ్, లుగాన్స్క్ ప్రాంతాలను కూడా సంప్రదిస్తున్నామనీ, వారి కార్యాచరణకు అనుగుణంగా తాము కూడా రిఫరెండం నిర్వహిస్తున్నామని దోనెట్స్క్ ఆందోళనకారులు చెప్పారని ది హిందూ తెలిపింది. అనగా కొద్ది రోజుల్లో ఆ రెండు ప్రాంతాలు కూడా ఉక్రెయిన్ నుండి స్వతంత్రం ప్రకటించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ లో ఈ మూడు ప్రాంతాలే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు. సాంస్కృతికంగా, భాషాపరంగా కూడా ఇవి రష్యాకు దగ్గరగా ఉంటాయి. దక్షిణ ప్రాంత రాష్ట్రాలదీ ఇదే పరిస్ధితి. పశ్చిమ ప్రాంతాలు మాత్రం రష్యాకు దూరంగా ఉంటూ తమను తాము ఐరోపా వాసులుగా భావిస్తారు. రష్యా వ్యతిరేక ఆందోళనలకు పశ్చిమ ప్రాంతాల్లో ఎక్కువ ఆదరణ లభించగా, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో రష్యా అనుకూల ఆందోళనలకు ఆదరణ లభించడం ఈ కారణాల వల్లనే.
దోనెట్స్క్ స్వతంత్ర ప్రకటనను ఉక్రెయిన్ తాత్కాలిక ప్రభుత్వం ఖండించింది. క్రిమియా తరహా రష్యా ఆపరేషన్ లో రెండవ దశగా దోనెట్స్క్ ప్రకటనను ఉక్రెయిన్ ప్రధాని ఒలెక్సాండర్ తుర్చినోవ్ అభివర్ణించాడు. స్ధానిక భద్రతా బలగాలు తగిన చర్యలు తీసుకోకుండా మిన్నకున్నాయనీ, ‘టెర్రరిస్టులను అణచివేయడానికి’ త్వరలో పోలీసులను పంపుతానని ప్రకటించాడు. ఉక్రెయిన్ ను అస్ధిరీకరించి విదేశీ శక్తుల బలగాలను ఆహ్వానించడానికి పధకం రచించారని ప్రధాని యట్సెన్యుక్ ఆరోపించడం విశేషం. ఆందోళనకారులు బహిరంగంగానే రష్యా బలగాలను ఆహ్వానిస్తుండగా ‘పధకం రచించారని’ చెప్పడం అర్ధరహితం. ఉక్రెయిన్ ప్రభుత్వ నిస్సహాయతను మాత్రమే ఈ ప్రకటనలు తెలియజేస్తున్నాయి.
రష్యా అనుకూల ఆందోళనలు తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ లలో ఒక విధమైన సవాలు కాగా ఇ.యు, అమెరికా అనుకూల వ్యక్తులు అధికారం చేపట్టడానికి సహకరించిన మితవాద తీవ్రవాద గ్రూపుల నుండి నూతన ప్రభుత్వం మరో విధమైన సవాలు ఎదుర్కొంటున్నది. కీవ్ లో హింసాత్మక ఆందోళనల్లో చురుకుగా పాల్గొన్న రైట్ సెక్టార్ మితవాద గ్రూపు తమ డిమాండ్ లు నెరవేర్చాలని కోరుతూ నూతన ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. పదవీచ్యుతుడిని గావించిన మాజీ ప్రధాని విక్టర్ యనుకోవిచ్ మద్దతుదారులు ఎవరినీ ప్రభుత్వ ఉద్యోగాల్లో లేకుండా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ తో వారు సోమవారం జరిగిన జడ్జిల సమావేసంపై దాడి చేశారు. తమ డిమాండ్ కి ఆమోదం తెలిపాలని కోరుతూ పలువురు జడ్జిలను నెట్టివేస్తూ, పిడి గుద్దులు కురిపించారు.
నాటిన విత్తనమే కాయలు కాస్తుంది గానీ ఒక విత్తనం నాటి మరో కాయ కాయమంటే ఎలా కాస్తుంది?