సూర్యనెల్లి పిల్లకు న్యాయం, 24 మందికి శిక్షలు


Suryanelli protest

ఎట్టకేలకు సూర్యనెల్లి అత్యాచార బాధితురాలికి న్యాయం జరిగింది. కానీ న్యాయం దక్కడానికి అప్పటి బాలికకు, ఇప్పటి సమాజ వంచితకు 18 యేళ్ళ కాలం పట్టింది. మధ్యలో ఎన్నో కుట్రలు మరెన్నో మలుపులు ఆమెను, ఆమె కుటుంబాన్ని పట్టి పల్లార్చాయి. ఆమెను ఎలాగైనా దారికి తెచ్చుకోవడానికి, పెద్దవారితో పెట్టుకున్నందుకు తగిన ఫలితం అనుభవించేలా చేయడానికి జరగని ప్రయత్నం లేదు. ఆ పిల్ల తండ్రి అన్నట్లు ఢిల్లీ బస్సు సామూహిక అత్యాచారం జరగనట్లయితే తన కూతురి పట్ల కోర్టులు ఇంత దయతో వ్యవహరించేవి కావు. ఆయన దృష్టిలో ఢిల్లీ విద్యార్ధిని జ్యోతి సింగ్ పాండే అమరత్వం పొందిన ఒక సాహసి!

(కేసు వివరాల కోసం ఈ లింక్ లోకి వెళ్ళండి:  ఈ “చెడిపోయిన” సూర్యనెల్లి పిల్ల, మరో మహానది!? )

గతంలో కింది కోర్టు (సెషన్స్ కోర్టు) విధించిన వివిధ కాలాల కారాగార శిక్షలను కొట్టివేసిన కేరళ హై కోర్టే ఈసారి శిక్షలను ఖరారు చేయడం విశేషం. సెషన్స్ కోర్టు శిక్షలను కొట్టివేసిన అప్పటి హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బసంత్, కేసు పునర్విచారణను ప్రభావితం చేయడానికా అన్నట్లు బాలికను ‘చెడిపోయిన పిల్ల’గా అభివర్ణిస్తూ ఒక టి.వి చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చినప్పటికీ ఇప్పటి హై కోర్టు న్యాయమూర్తులు ప్రభావితం కావడానికి నిరాకరించారు. అయితే సెషన్స్ కోర్టు అప్పట్లో 35 మందికి శిక్షలు విధించగా ఇప్పటి హై కోర్టు 24 మందికి శిక్షలు ఖరారు చేసింది. జస్టిస్ కె.టి.శంకరన్, జస్టిస్ ఎం.ఎల్.జోసెఫ్ ఫ్రాన్సిస్ లతో కూడిన హైకోర్టు స్పెషల్ బెంచి తాజా తీర్పును వెలువరించింది.

కండక్టర్ రాజును బాలిక ప్రేమించిందని, వివాహం చేసుకుంటాడని ఆశపడిందని, అందుకే అతని వెంట ఇంట్లో బంగారం తీసుకుని మరీ వచ్చిందని స్పెషల్ బెంచి గుర్తించింది. బాలిక ప్రేమను అవకాశంగా మలుచుకున్న రాజు ఆమెను ధర్మరాజు అనే లాయర్ కీ, ఉష అనే మరో స్త్రీకి అప్పగించాడని ఆ విధంగా బాధితురాలు బాలికా వేశ్య అని నిందితులు భావించేవిధంగా మార్చబడిందని వ్యాఖ్యానించింది. అయితే గత హై కోర్టు తీర్పు పేర్కొన్నట్లుగానూ, నిందితులు వాదించినట్లుగానూ ఆమెను బాలికా వేశ్యగా గుర్తించడానికి ఇప్పటి స్పెషల్ బెంచి నిరాకరించింది. ఆమెను చెడిపోయిన పిల్లగా నిందితులు చెప్పడం అసంగతం అని పేర్కొంది.

మోసపోయిన సమయంలో ఇంకా మైనర్ గానే ఉన్న బాలికను తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోని అనేక చోట్లకు తిప్పారు. 40 రోజుల పాటు ఆమెను బందీగా ఉంచుకుని శారీరకంగా వినియోగించుకున్నారు. చివరికి ఫిబ్రవరి 26, 1996 తేదీన ఆమెను వదిలిపెట్టారు. 40 మందికి పైగా మానవ మదోన్మత్తుల చేతుల్లో హింస అనుభవించిన బాలిక ఎలాగో ధైర్యం చేసి, వివిధ సంస్ధల మద్దతుతో కోర్టును ఆశ్రయించినప్పటికీ రాజకీయ, అధికార పలుకుబడి కలిగిన నిందితుల నుండి పలు బెదిరింపులు, ప్రమాదాలు ఎదుర్కొంది. బాధితురాలిగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వగా ఆమెపై అవినీతి ఆరోపణలు చేసి ఉద్యోగం ఊడబీకడానికి కూడా ప్రయత్నించారు.

కోర్టు ముందుకు 36 మంది నిందితులుగా ప్రవేశపెట్టగా వారిలో 5గురు ట్రయల్స్ జరుగుతుండగానే చనిపోయారు. ఏడుగురు నిందితులను నిర్దోషులుగా హై కోర్టు స్పెషల్ బెంచి విడుదల చేసింది. మిగిలిన 24 మంది నిందితులకు 5 నుండి 13 సం.ల వరకు కారాగార శిక్షలు విధించింది. 23 మందికి అదనంగా జరిమానా విధించింది. కారాగార శిక్ష పడిన నిందితుల్లో ధర్మరాజన్, రాజు, ఉషలు ఉన్నారు. బస్ కండక్టర్ రాజు మొదటి నిందితుడు కాగా ఉష రెండవ నిందితురాలు. ధర్మరాజు మూడో నిందితుడు. ఈ ముగ్గురికి 13 యేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించారు. మైనర్ బాలికను వలలో వేసుకుని ఇతర నిందితులకు అప్పగించారన్న నేరం వీరిపై రుజువయిందని కోర్టు తీర్పు పేర్కొంది.

బాలిక పైన నిందితులు చేసిన ఆరోపణలను, అభిప్రాయాలను కోర్టు తిరస్కరించింది. నిందితుల ఆధీనంలో ఉండగా బాలిక తప్పించుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదన్న వాదనను అంగీకరించలేదు. “ఆమెను ఒక వలలో వేశారు. ఆమెను భయోత్పాతానికి గురి చేశారు. ధర్మరాజు ఆమెను బెదిరించాడు” అని కోర్టు పేర్కొంది. బాధితురాలు చెడిపోయిందన్న వాదనను కూడా కోర్టు తిరస్కరించింది. బాలిక తాను రాజుతో ప్రేమలో పడ్డానని చెప్పిందని, అందుకే బంగారంతో సహా వచ్చేశానని చెప్పిందని గుర్తు చేస్తూ “కాబట్టి ఆమెను చెడిపోయిన పిల్లగా చెప్పడం సరయింది కాదు” అని పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్య ద్వారా ‘చెడిపోయిన ఆడ పిల్లలు’ కూడా ఉంటారని కోర్టు భావిస్తోందా అన్న అనుమానాన్ని కోర్టు మిగిల్చింది. సామాజిక పరిస్ధితుల వల్ల వివిధ రకాలుగా మోసపోయే ఆడపిల్లలు ఉంటారు తప్ప చెడిపోయిన ఆడపిల్లలు ఎలా ఉంటారు?

కోరికతో, డబ్బు కోసం ఆమె ఇంటినుండి వచ్చేసిందన్న వాదనను కూడా నిందితులు వినిపించారు. దీనికి తగిన భౌతిక సాక్ష్యాలు ఏవీ లేవని కోర్టు నిర్ధారించింది. ఆమెను ‘బాలికా వేశ్య’ కూడా కాదని చెప్పింది. కేరళలో మహిళలపైనా, బాలికలపైనా నేరాలు ఒకపక్క పెరిగిపోతున్న నేపధ్యంలో వాస్తవ పరిస్ధితిని విస్మరించలేమని తెలిపింది.

“అత్యాచారం వల్ల బాధితురాలి శరీరం భౌతికంగా విధ్వంసానికి గురవుతుంది. ఆమె శరీరం హత్య చేయబడుతుంది” అన్న ట్రయల్ కోర్టు పరిశీలనతో హై కోర్టు స్పెషల్ బెంచి ఏకీభవించింది. కేరళ ట్రయల్ కోర్టు, ఇప్పటి హై కోర్టు ఇచ్చిన తీర్పులు భారత దేశంలో అత్యాచారాల బాధితులకు ఆదరువుగా ఉండగలదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s