పూర్ వరుణ్, ఏమన్నా తంటాయే! -కార్టూన్


Poor Varun

అప్పుడు: ప్రత్యర్ధులకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగం చేస్తేనేమో ఎలక్షన్ కమిషన్ కు నచ్చదాయే….

ఇప్పుడు: మంచి పని చేసినందుకు ప్రత్యర్ధులను ప్రశంసిస్తేనేమో, అది పార్టీకి నచ్చదాయే…

(ఎలా చచ్చేది!!!)

***

బి.జె.పిలో ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించిన వరుణ్ గాంధీ ప్రస్తుతం తమ పార్టీవారి నుండే విమర్శలు ఎదుర్కొంటున్నారు. సోదరుడు రాహుల్ గాంధీని పొగిడినందుకు స్వపార్టీ నేతల ఖండన మండనలకు తోడు తన తల్లి మేనకా గాంధీ నుండి మందలింపు సైతం ఎదుర్కొన్నారాయన.

మంగళవారం అమేధి నియోజకవర్గాన్ని సందర్శించిన బి.జె.పి జనరల్ సెక్రటరీ వరుణ్ గాంధీ అక్కడ తన సోదరుడు/పెత్తల్లి తనయుడు రాహుల్ గాంధీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయారుట. సుల్తాన్ పూర్ లో కొంతమంది ఉపాధ్యాయులతో మాట్లాడిన వరుణ్, స్వయం సహాయక బృందాల ద్వారా అమేధీలో రాహుల్ స్త్రీలకు సాధికారత కల్పించారని ప్రశంసలు కురిపించారు.

మామూలుగానైతే ఈ మాటలు పెద్దగా లోకానికి తెలిసేది కాదేమో. కానీ ఇంటర్నెట్ యుగంలో, అందులోనూ సెల్ ఫోన్ రూపంలో అత్యధిక సంఖ్యాకులకు వీడియో రికార్డింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన యుగంలో ఏమి చేసినా, ఏమి మాట్లాడినా ప్రపంచం అంతా వ్యాపించి పోతోంది. వరుణ్ గాంధీ మాటల్ని ఎవరు రికార్డు చేశారో గానీ బి.జె.పి నేతలతో పాటు ఆమె తల్లిగారు కూడా స్పందించక తప్పింది కాదు.

“నేనూ అమేధి వెళ్ళాను. అక్కడ అభివృద్ధి అనేదేమీ లేదు. తమ కళ్ళతో స్వయంగా చూసేవరకూ ఎవరూ ఏ విషయం పైనైనా వ్యాఖ్యలు చేయడం సరికాదు. అమేధిలో మంచి పనులు జరిగాయని ఆయనకి చెప్పి ఉండొచ్చు. వాటినే ఆయన చెప్పారు. వరుణ్ ఇలాంటి ప్రకటనలు ఇచ్చేటప్పుడు తన హృదయాన్ని కాకుండా మెదడుని ఉపయోగించాలి” అని మేనకా గాంధీ గురువారం విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఆమె ఫిలిబిత్ నియోజకవర్గం నుండి లోక్ సభకు పోటీ చేస్తున్నారు.

గత ఎన్నికల సందర్భంగా వరుణ్ గాంధీ దూకుడుగా హిందూత్వ ప్రకటనలు, ప్రసంగాలు చేసి ఎలక్షన్ కమిషన్ నుండి తాఖీదులు పొందారు. ఆ తర్వాత ఆలాగో ఆ లంపటం నుండి బైటపడ్డా, అప్పటి ఫైర్ బ్రాండ్ ఇమేజి మాత్రం ఆయన్ని అంటిపెట్టుకుని కొనసాగుతోంది. అప్పటి సందర్భాన్ని, ఇప్పటి క్లాస్ ను పోలుస్తూ కార్టూనిస్టు వరుణ్ గాంధీ అయోమయాన్ని ఈ విధంగా చిత్రీకరించారు.

వరుణ్ గాంధీ అయోమయంలో ఉన్నారని మేనకా గాంధీ బోధనే చెబుతోంది. ఆయన హృదయానికీ, మెదడుకీ జరుగుతున్న సంఘర్షణే ఆయన అయోమయానికి కారణం కావచ్చని ఆమె సూచించారు. ఒకవైపు తన మనసుకు దగ్గరగా ఉన్న సోదరుడి కృషిని మెచ్చుకోవాలా లేక తన మెదడుతో ఆలోచించి ఫైర్ బ్రాండ్ గా జనానికి కనిపించాలా అన్నది ఆయన సమస్య కావచ్చు. అమేధిలో ఆయన చూస్తున్న అభివృద్ధి మనసులో నుండి రాగా, చూడలేని అభివృద్ధి మెదడు నుండి వస్తుందని కూడా మేనకా గాంధీ సూచిస్తున్నారు. ఆ లెక్కన మేనకా గాంధీ హృదయాన్ని వదిలేసి మెదడును మాత్రమే ఉపయోగిస్తున్నారని భావించాలా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s