అమెరికాలో ఆంధ్ర మైనింగ్ స్కామ్


KVP

ఆంధ్ర ప్రదేశ్ మైనింగ్ కుంభకోణం వీరులు అమెరికా కోర్టులో కూడా ప్రవేశించి రికార్డు సృష్టించారు. వై.ఎస్.రాజశేఖర రెడ్డి మరణించిన ఐదేళ్ల తర్వాత ఆయన ఆత్మ బంధువుగా పేరుగాంచిన కె.వి.పి.రామచంద్ర రావు తెలుగు నేల ఖ్యాతిని ఈ విధంగా దిగంతాలను దాటించారు. మరో ముద్దాయిపై కూడా నేరాభియోగం నమోదు చేసిన అమెరికా కోర్టు ఆయన పేరు మాత్రం వెల్లడించలేదు. తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు ఆయన వై.ఎస్ పుత్రుడు వై.ఎస్.జగన్ అని ఆరోపిస్తున్నారు. కాగా అమెరికా కోర్టులు విచారణ చేపట్టిన నేరాభియోగాలు అంతర్జాతీయ మనీ లాండరింగ్, రాకేటీరింగ్ లకు సంబంధించినవి కావడం గమనార్హం.

ఇల్లినాయిస్ ఉత్తర జిల్లా లోని ఫెడరల్ కోర్టు వివిధ దేశాలకు చెందిన మొత్తం 6గురు వ్యక్తులపై అభియోగాలు నమోదు చేసింది. వారిలో ఇద్దరు భారత దేశానికి చెందినవారు కాగా ఆ ఇద్దరిలో ఒకరు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్ర రావు. మరోవ్యక్తి పేరు ఇంకా వెల్లడి కాలేదు. కోర్టు రికార్డుల ప్రకారం ఇతర నిందితులు: ఉక్రెయిన్ పారిశ్రామికవేత్త దిమిట్రి ఫిర్టాష్ (48); హంగేరి వ్యాపారవేత్త అండ్రాస్ నాప్ (75); ఉక్రెయిన్ కి చెందిన మరో వ్యక్తి సురేన్ గెవోర్గ్యాన్ (40); అమెరికా ఎన్.ఆర్.ఐ గజేంద్ర లాల్ (50); శ్రీలంక వ్యక్తి సుందర్ అలియాస్ పెరియసామి సుందర లింగం.

నిందితులు అంతర్జాతీయ రాకేటీరింగ్ కుంభకోణంలో పాల్గొన్నారని ఇల్లినాయిస్ ఫెడరల్ కోర్టుకు చెందిన గ్రాండ్ జ్యూరీ అభియోగాలు మోపింది. ఆంధ్ర ప్రదేశ్ లోని టైటానియం గనులను తవ్వి తీయడానికి కావలసిన అనుమతులు పొందడానికి వీలుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వడం ద్వారా నిందితులు కుట్రలో పాల్గొన్నారని జ్యూరీ పేర్కొంది. టైటానియం ఖనిజం అరుదుగా దొరికేది. ఇలాంటి అరుదైన ఖనిజాలను ఏ ప్రభుత్వమూ అప్పనంగా విదేశీ కంపెనీలకు అప్పగించడానికి ఇచ్చగించదు. దేశభక్తి, ప్రజల పట్ల బాధ్యత ఉన్న నాయకులు, అధికారులు అసలే ఇష్టపడరు. అరుదైన ఖనిజాన్ని సైతం లంచాలు మింగే స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించేందుకు ప్రయత్నించడం బట్టి మన నేతలు ఎంతకు తెగించగలరో అర్ధం అవుతోంది.

కె.వి.పి.రామచంద్ర రావు పక్కా సమైక్యవాదిగా దేశ, రాష్ట్ర ప్రజల ముందు ఫోజులు పెట్టిన వ్యక్తి. రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై చర్చ జరిగినన్ని రోజులూ గంటల తరబడి సమైక్యాంధ్ర ప్లకార్డులు ప్రదర్శించిన నాయకుడు. రాష్ట్రంలో లభించే అరుదైన ఖనిజాన్ని విదేశీ కంపెనీలకు అప్పగించడానికి బేరసారాలు నడిపిన వ్యక్తి నిజంగా సమైక్యాంధ్ర ప్రయోజనాలకు, అలాంటివి ఏవన్నా ఉన్నట్లయితే, కట్టుబడి ఉండగలడా? దేశ ప్రజలకు ఉపయోగపెట్టాల్సిన ఖనిజవనరులను లంచాలు భోంచేసి బైటి దేశాలకు తరలించే నాయకులు ఏ విధంగా ఆంధ్ర ప్రదేశ్ సమైక్యత గురించిన భావోద్వేగాలు కలిగి ఉండగలరు? సమైక్యాంధ్ర అంటూ కన్నీళ్లు కార్చిన నేతల నిజస్వరూపం, వారి వాదనలోని నిజాయితీ ఏమిటో కె.వి.పి ఉదంతం తెలియజేస్తోంది.

టైటానియం ఖనిజం తవ్వకాలకు అనుమతి (లైసెన్స్) ఇచ్చినందుకు 18.5 మిలియన్ డాలర్ల (దాదాపు రు. 115 కోట్లు) మేర లంచాలు స్వీకరించడానికి ఒప్పందం కుదిరిందని కోర్టు అభియోగాలు మోపింది. ఈ అనుమతి ఇచ్చినట్లయితే సదరు కంపెనీకి టైటానియం ఉత్పత్తుల అమ్మకం ద్వారా సాలీనా 500 మిలియన్ డాలర్ల మేర వ్యాపార లబ్ది చేకూరి ఉండేదని తెలుస్తోంది. కంపెనీ పేరు ఏమిటన్నదీ ఇంకా వెల్లడి కాలేదు. ‘కంపెనీ ఎ’ అని మాత్రమే కోర్టు పత్రాలలో పేర్కొనబడిందని ది హిందు తెలిపింది.

విదేశాల్లో మైనింగ్ లాంటి కార్యకలాపాల కోసం లైసెల్స్ లు సంపాదించడానికి లంచం చెల్లించడం కొన్ని సందర్భాల్లో అమెరికా చట్టాలకు వ్యతిరేకం. లాబీయింగ్ పేరుతోనూ, చర్చల పేరుతోనూ డబ్బు బదలాయించడం అక్కడ చట్టబద్ధమే అయినప్పటికీ కొన్ని విదేశీ కార్యకలాపాలను అరికట్టడానికి ‘విదేశీ అవినీతి కార్యకాలాపాల చట్టం’ (U.S. Foreign Corrupt Practices Act) ప్రయోగిస్తారు. కె.వి.పి తదితరుల పైన కూడా ఇదే చట్టాన్ని ప్రయోగించారు.

కోర్టు పత్రాల ప్రకారం నిందితులు వివిధ కంపెనీల పేరుతో, వివిధ సందర్భాల్లో భారత అధికారులను కలిశారు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డిని కూడా వారు కలిశారు. “ప్రాజెక్టు గురించి, దాని ప్రగతి గురించి చర్చించడానికి వారు కలిశారు. అనధికారికంగా 18.5 మిలియన్ డాలర్ల మేర డబ్బును లంచాలుగా ఇండియాలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులకు చెల్లించడానికి ఈ సమావేశాలు జరిగాయి. తద్వారా ప్రాజెక్టుకు అనుమతి సంపాదించే ప్రయత్నాలు జరిగాయి” అని కోర్టు అభియోగ పత్రాలు పేర్కొన్నాయి.

ఈ పత్రాల ప్రకారం ఫిబ్రవరి 2007లో కంపెనీ ఎ, రెండు విదేశీ కంపెనీల (ఆస్ట్రియా కంపెనీ ఆస్కెమ్ హోల్డింగ్, స్విట్జర్లాండ్ కి చెందిన బోత్లి ట్రేడ్) ద్వారా ఒక ఒప్పందంలోకి ప్రవేశించింది. ఈ ఒప్పందం మేరకు ఈ రెండు కంపెనీలు, కంపెనీ ఎ కి 5 మిలియన్ పౌండ్ల నుండి 12 మిలియన్ పౌండ్ల వరకు టైటానియం స్పాంజ్ ఖనిజాన్ని సరఫరా చేయాల్సి ఉంది.

ఈ సందర్భంగా శ్రీలంక దేశస్ధుడు సుందర్, మొత్తం ఎంత లంచం చెల్లించాలో తెలుసుకోవడానికి కె.వి.పి రామచంద్ర రావును కలిశారు. కె.వి.పి తో సమావేశం అయిన అనంతరం సుందర్ తన సమావేశ వివరాలను ఇతర నిందితులకు తెలియజేశాడు. కె.వి.పి తరపున విదేశాల్లో బినామీ పేర్లతో ఉన్న వివిధ ఖాతాల వివరాలను కె.వి.పి నుండి సుందర్ తెలుసుకున్నాడు. ఇవే వివరాలను సుందర్ ఇతర నిందితులకు తెలియజేశాడు. కె.వి.పి, తన కోసం, ఇతరుల కోసం లంచం డిమాండ్ చేశారని, అందుకు ఫలితంగా టైటానియం మైనింగ్ లైసెన్స్ లు ఇప్పిస్తానని చెప్పారని అభియోగపత్రాలు పేర్కొన్నాయి. చెల్లింపులు చేయని పక్షంలో భారత దేశంలోని వివిధ అవినీతి నిరోధక సంస్ధలు ప్రాజెక్టు పైన విచారణ చేసే అవకాశం ఉందని కూడా ఇతర నిందితులను కె.వి.పి హెచ్చరించినట్లు తెలుస్తోంది.

అదీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి ఆత్మ బంధువు గారి కధ! కె.వి.పి పైన వై.ఎస్.ఆర్ ఎందుకు ఆధారపడింది కూడా అమెరికా ప్రభుత్వం మోపిన అభియోగాలు తెలియజేస్తున్నాయి. నిజానికి ఇది రహస్యం ఏమీ కాదు. తెలుగు దిన పత్రికలు ఎప్పటి నుండో ఆయా కధనాలు ప్రచురించాయి. కానీ టైటానియం ప్రాజెక్టు వ్యవహారం తెలియడం మాత్రం ఇదే మొదటిసారి. అది కూడా అమెరికా కోర్టు ద్వారా తెలియడం మరో విశేషం. భారత పాలకులను దళారీ పాలకులని అనడం ఎందుకో ఈ ఉదంతం ద్వారా అర్ధం చేసుకోవచ్చు.

4 thoughts on “అమెరికాలో ఆంధ్ర మైనింగ్ స్కామ్

 1. కె.వి.పి. వై.ఎస్.ఆర్. ను వి.పి.ని చేసి ఆంధ్రా ప్రకృతి ఖనిజాలను ఆకృతి లేకుండా ఊడ్చే ప్రయత్నాలలో ప్రముఖంగా వ్యవహరించారు. వై.ఎస్.ఆర్. కచేరీలో వాయిలెన్స్ క్రిమినల్ . గుడిని మింగుదునా, గుళ్ళో లింగాని మింగే తీరులోనె ప్రవర్తన రాజకీయ నాయకుల నిలువు దోపిడికి ప్రత్యక్ష తార్కాణం.

 2. బొగ్గు,
  ఇనుము ,
  టైటానియము,
  ఏదైనా ఖనిజమే !
  పట్ట పగలే దోపిడి, ఇది నిజమే !
  దోచే వారందరిదీ, దోపిడీ మతమే !

  ప్రతి ఒక్కరిదీ, విలువైన ఓటే !
  వేశాక, ప్రజాస్వామ్యానికి, లోతు గా కత్తి పోటే !
  కానీ,నాయకులందరూ, మంచివారే !
  ‘బ్రూటస్’ లందరూ, నిజాయితీ పరులే !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s