అమెరికాలోని యుటా (Utah) రాష్ట్రంలో హోలీ పండుగ ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ హోలీ జరుపుకునేది హిందువులు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. క్రైస్తవ మతంలో ఇటీవల శతాబ్దాల్లో ఒక శాఖగా అవతరించిన మర్మోన్లు ఇక్కడ హోలీని పెద్ద ఎత్తున జరుపుకుంటారట. ఈ అలవాటు ఎప్పటినుండి ఆచరణలో ఉన్నదో తెలియదు గానీ ఈ సంవత్సరం మాత్రం భారీ సంఖ్యలో మర్మోన్లు హోలీ జరుపుకున్నారు. అది కూడా శ్రీ శ్రీ రాధా కృష్ణ ఆలయం దగ్గర!
మార్చి 29 నుండి రెండు రోజుల పాటు జరిగిన హోలీ సంబరాలలో హిందువులు కూడా పాల్గొన్నప్పటికీ వారి సంఖ్య తక్కువే. చలికాలం ముగిసే రోజుల్లో వచ్చే హోలీ పండగను చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుతారని చెబుతుంటారు. కానీ యుటా లోని స్పానిష్ ఫోర్క్ లో ఉన్న రాధా కృష్ణ ఆలయం వద్ద మాత్రం డ్రగ్స్, ఆల్కహాల్ తో ఎంజాయ్ చెయ్యడానికే ఎక్కువగా వస్తారని అసోసియేటెడ్ ప్రెస్ (ఎ.పి) వార్తా సంస్ధ చెబుతోంది.
స్పానిష్ ఫోర్క్ లోని రాధా కృష్ణ గుడి దగ్గర ఈ సంవత్సరం కనీసం 70,000 మంది వరకూ హోలీ సంబరాల్లో మునిగి తేలారని ఎ.పి తెలిపింది. సంబరాలంటే మరేమీ లేదు. చెవులు చిల్లులు పడే మ్యూజిక్ హోరుకు అనుగుణంగా ఆడుతూ, పాడుతూ గెంతడం, రంగులు జల్లుకోవడం. ఆనక డ్రగ్స్, మద్యం సేవించి మరింత హుషారుగా చిత్తం వచ్చిన పనులకు దిగడం. హోలీ పండగ సందర్భంగా రాధా కృష్ణ గుడి దగ్గర (లోపల కాదు) డ్రగ్స్, మద్యం విచ్చలవిడిగా అందుబాటులోకి వస్తాయని ఎ.పి తెలిపింది. విచిత్రంగా ఈ సంబరాల్లో యోగా కూడా ఆచరిస్తారట.
సాల్ట్ లేక్ ట్రిబ్యూన్ పత్రిక ప్రకారం సమీపంలోని బ్రిఘామ్ యంగ్ యూనివర్సిటీ నుండి వేలాది మంది విద్యార్ధులు హోలీ సందడిలో పాల్గొన్నారు. వారి కంటే ఎక్కువగా మర్మోన్లు హాజరై మరింత సందడి చేశారు.
అసోసియేటెడ్ ప్రెస్ ద్వారా వివిధ పత్రికలు అందించిన ఫొటోలివి.