వాతావరణ మార్పుల గురించి ముందే హెచ్చరించే సాంకేతిక పరిజ్ఞానం మనకు తెలిసి ఇటీవల కాలానిదే. కానీ ప్రాచీన ఈజిప్టు నాగరికతలో కూడా అలాంటి పరిజ్ఞానం ఒకటుండేదన్న సంగతి వెలుగులోకి వచ్చింది. 3,500 సంవత్సరాల క్రితం నాటి కాల్సైట్ (కాల్షియం కార్బొనేట్) రాతి పలక పైన వాతావరణ మార్పుల గురించిన నివేదికను అమెరికాలోని పరిశోధకులు కనుగొన్నారు. 6 అడుగుల ఎత్తున ఉన్న ఈ కాల్సైట్ పలక పైన ఉన్న 40 లైన్ల పాఠ్యాన్ని ఇటీవలే చదవగలిగారని ఫ్రీ ప్రెస్ జర్నల్ ద్వారా తెలుస్తోంది.
ఈ కాల్సైట్ పలకను ‘టెంపెస్ట్ స్టెలా’ అని పిలుస్తున్నారు. దానిపై లిఖించబడి ఉన్న లిపిని ఛేదించిన తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే అది అప్పటి వాతావరణం గురించి రాసిందని. అయితే ఇది ముందస్తు హెచ్చరికగా రాసిందా లేకపోతే అప్పటికి అనుభవంలోకి వస్తుండగా రాసిందా అన్నది పత్రికలు చెప్పలేదు. వర్షం, చీకటి, ఆకాశం తదితర అంశాల గురించిన వివరణ అందులో ఉంది. “ఆకాశం విడవకుండా పట్టిన తుఫానుతో, జనసందోహాల హోరును మించిన శబ్దంతో నిండి ఉంది” అని అర్ధం వచ్చేలా సదరు లిపి ఉన్నదని పరిశోధక శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
యూనివర్సిటీ ఆఫ్ చికాగో లోని ‘ఓరియెంటల్ ఇనిస్టిట్యూట్’ లో పని చేస్తున్న పరిశోధకులు ఈ విషయం వెల్లడించారు. అసాధారణ వాతావరణం గురించిన ఈ వివరణ ధెరా అనే చోటులో ఉన్న అగ్ని పర్వతం భారీ స్ధాయిలో బద్దలయిన అనంతర వాతావరణాన్ని వర్ణిస్తోందని పరిశోధకులు తెలిపారు. ఈ ధెరా అన్నది మధ్యధరా సముద్రంలో ఇప్పటి ‘శాంటోరిని’ ద్వీపం అని వారు తెలిపారు. అగ్ని పర్వతం బద్దలయినప్పుడు అది వాతావరణం పైన కూడా ప్రభావం చూపుతుంది గనుక ధెరా పేలుళ్లు ఈజిప్టులో గణనీయమైన స్ధాయిలో అల్లకల్లోలం సృష్టించి ఉండవచ్చని తెలిపారు.
తాజా పరిశోధన ఫలితాల ద్వారా చరిత్రకు సంబంధించి కొత్త కోణంలో వ్యాఖ్యానం చేయాల్సి రావచ్చని చికాగో యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఈజిప్షియన్ ఫెరో అయిన ‘అహమోస్’ మరియు ధెరా పేలుళ్లను ఒకరికొకరు రిఫరెన్స్ గా పేర్కొంటూ చరిత్ర పరిశోధకులు వ్యాఖ్యానం చేయడం కద్దు. తాజాగా వెల్లడి అయిన కాల్సైట్ ఫలకంను బట్టి అహమోస్, ధెరా పేలుళ్ళ మధ్య కాలం గతంలో భావించినదానికంటే తక్కువే ఉండవచ్చని ఇప్పుడు భావిస్తున్నారు. మానవ వికాస చరిత్రలో తామ్ర యుగానికి సంబంధించి ఇప్పటివరకూ చరిత్రకారులకు ఉన్న అవగాహనలో ఇది మార్పులు తెస్తుందని కూడా వారు చెబుతున్నారు.
అహమోస్ 18వ రాజవంశానికి చెందిన మొదటి ఫెరో. ఈయన కాలంలోనే ‘టెంపెస్ట్ స్టెలా’ రూపొందిందని పరిశోధకుల అంచనా. ది హిందూ ప్రకారం ఈయన కాలం నుండే నూతన సామ్రాజ్యం మొదలయింది. ఈయన కాలంలోనే ఈజిప్టు శక్తి మునుపెన్నడూ ఎరగని నూతన శిఖరాలకు చేరింది. ఇప్పుడు దొరికిన ఫలకం ముక్కలు ముక్కలయిన దశలో అహమోస్ పాలించిన ధెబెస్ (ఇప్పటి లక్సర్) లో దొరకడం విశేషం. ఆ విధంగా ఈజిప్టు సామ్రాజ్యం, తామ్ర యుగాలపై అవగాహన గురించిన కొత్త వెలుగులను ఫలకం ప్రసరింపజేస్తోంది.
ధెరా పేలుళ్ళ అనంతర దృశ్యాన్నే ఈ స్టెలా వర్ణించినట్లయితే అహమోస్ పాలనా కాలాన్ని 30 నుండి 50 సంవత్సరాల వరకు వెనక్కి జరపాల్సి ఉంటుందని తెలుస్తోంది. అహమోస్ 1550 బి.సి లో జీవించినట్లు ఇప్పటివరకూ ఉన్న అవగాహన. అనగా స్టెలా రాతలు ధెరా పేలుళ్ళ అనంతర పరిస్ధితికి చెందినవే అయితే అహమోస్ కాలం 1500 బి.సి నుండి 1520 బి.సి అయి ఉండాలి.
ఇది ఈజిప్షియన్ ఆర్కియాలజీ గురించి అధ్యయనం చేస్తున్న స్కాలర్లకు చాలా ముఖ్యమైన విషయమని చికాగో యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నాడినే మొయిల్లర్ చెప్పారని ఫ్రీ ప్రెస్ జర్నల్ తెలిపింది.