ఇజ్రాయెల్ దేశాన్ని యూదు రాజ్యంగా గుర్తించాలన్న ఇజ్రాయెల్ డిమాండ్ ని అరబ్ లీగ్ దేశాలు ఖరాఖండీగా నిరాకరించాయి. యూదు రాజ్యంగా గుర్తిస్తే పాలస్తీనా అరబ్ ల పరిస్ధితి ఏమిటని ప్రశ్నించాయి. పాలస్తీనాలో యూదు సెటిల్మెంట్ల నిర్మాణాన్ని ముందు నిలిపేయాలని డిమాండ్ చేశాయి. కువైట్ లో ముగిసిన అరబ్ లీగ్ సమావేశాల అనంతరం అరబ్ లీగ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పశ్చిమాసియా శాంతి చర్చలు ముందుకు సాగకపోవడానికి ఏకైక కారణం ఇజ్రాయెల్ మాత్రమే అని అరబ్ లీగ్ ఎత్తి చూపింది.
పశ్చిమాసియాలో అమెరికా మళ్ళీ శాంతి చర్చల అంకానికి తెర తీసింది. అమెరికా మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్-పాలస్తీనా చర్చలు జరగడం, ఎవరి నిర్ణయాలు వారు ప్రకటించడం, చర్చలు ఆశాజనకం అని ప్రారంభంలో ప్రకటించడం, క్రమంగా ఎవరూ పట్టు విడవడం లేదని వార్తలు వెలువడం, చివరికి చర్చలు విఫలం అని ప్రకటించేయడం దశాబ్దాలుగా జరుగుతున్నా తంతు. ఈ తంతుకు ఆధ్వర్యం వహించేది అమెరికా కాగా ఐరోపా దేశాలు వంత పాటలో గొంతు కలుపుతాయి.
అమెరికా విదేశీ మంత్రి జాన్ కేర్రీ ప్రస్తుతం జోర్డాన్ లో ఉన్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా చర్చల వేదిక అక్కడ ఏర్పాటు చేశారు. ఈ చర్చలు కొనసాగడానికి ముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఒక షరతు విధించాడు. ఇజ్రాయెల్ ను యూదు రాజ్యంగా అరబ్ దేశాలన్నీ గుర్తించడం ఆ షరతు. దీనిని అరబ్ దేశాల కూటమి ‘అరబ్ లీగ్’ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది.
ఇజ్రాయెల్ ను యూదు రాజ్యంగా గుర్తించకుండా పశ్చిమాసియాలో శాంతి అసాధ్యం అని ఆ దేశ ప్రధాని నెతన్యాహూ మరోవైపు ప్రకటించారు. ఇజ్రాయెల్ ను యూదు రాజ్యంగా గుర్తిస్తే ఆ దేశం దురాక్రమణ వల్ల సొంత ఇళ్ళు, పొలాలు కోల్పోయి పొరుగు అరబ్ దేశాలకు వలసపోయిన పాలస్తీనీయులకు తిరిగి స్వస్ధలాలకు వచ్చే హక్కు కోల్పోతారని పాలస్తీనా వాదిస్తోంది. పాలస్తీనా ప్రధానమైన డిమాండ్లలో ఒకటి: స్వస్ధలాలకు తిరిగి వచ్చే హక్కు కల్పించడం. ఇజ్రాయెల్ దీనిని ససేమిరా నిరాకరిస్తోంది. మిగిలి ఉన్న పాలస్తీనా నీటి వనరులు, ఖనిజ వనరులను కూడా సెటిల్మెంట్ల పేరుతో ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటూ వస్తోంది ఇజ్రాయెల్.
“శాంతి ప్రక్రియలో పురోగతి లేకపోవడానికి ఏకైక బాధ్యత ఇజ్రాయెల్ దే అని మేము భావిస్తున్నాము. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్ధితులు ఇప్పటికీ కొనసాగడానికి కారణం కూడా ఇజ్రాయెలే. ఇజ్రాయెల్ ను యూదు రాజ్యంగా గుర్తించడానికి మా నిర్ణయాత్మక వ్యతిరేకతను ఇందుమూలంగా ప్రకటిస్తున్నాం” అని అరబ్ దేశాల ఉమ్మడి ప్రకటన పేర్కొందని ది హిందూ తెలిపింది.
“సెత్ల్మెంట్ల నిర్మాణం కొనసాగింపు, జెరూసలేం జూడాయీకరణ, ముస్లిం మరియు క్రైస్తవ ప్రార్ధనా మందిరాలపై దాడులు, పాలస్తీనా జనాభా నిష్పత్తిని సమూలంగా మార్చే ప్రక్రియ, భూభాగాల సరిహద్దులను నిరంతరంగా జరుపుతూ పోవడం… ఇవన్నీ ఇజ్రాయెల్ సాగిస్తున్న చర్యలు. వీటిని మేము స్ధిరంగా తిరస్కరిస్తున్నాం” అని కమ్యూనిక్ పేర్కొంది.
ఈ నేపధ్యంలో మార్చి 26 తేదీన ప్రారంభం అయిన చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండా ముగిసిపోయే పరిస్ధితి ఏర్పడింది. కనీసం మర్యాదపూర్వకంగా నయినా ఏదో చిన్న ఒప్పందం కుదిరినట్లు ప్రకటించకపోయినా అది మధ్యవర్తిత్వం వహిస్తున్న అమెరికా ప్రతిష్టకు భంగకరం. దానితో చర్చలను పొడిగించాలని ఇజ్రాయెల్ కోరుతోంది. చర్చలను పొడిగించడానికి ఇజ్రాయెల్ పాలస్తీనాకు ఒక ఆశ కూడా చూపింది. చర్చల సమయాన్ని పొడిగిస్తే కొత్తగా 400 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తాం అని చెప్పింది. ఈ మేరకు పాలస్తీనా చర్చల నేతలను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పత్రిక నివేదించినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇదింకా ధ్రువపడలేదు.
చర్చల కాలం పొడిగింపుకు నోచుకోకపోతే ఏప్రిల్ చివరికల్లా అవి ముగియాల్సి ఉంది. పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ మొదట గతంలో హామీ ఇచ్చిన ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేయడం విశేషం. దీర్ఘకాలిక ఖైదు విధించిన 104 మంది ఖైదీలను విడుదల చేస్తామని గతంలో (జులై 2013) హామీ ఇచ్చిన ఇజ్రాయెల్ 78 మందిని మాత్రమే విడుదల చేసింది. ముందు ఆ మిగిలిన 26 మందిని కూడా విడుదల చేయాలని అబ్బాస్ డిమాండ్ చేస్తున్నారు. పాత ఒప్పందం ప్రకారం ఖైదీలను విడుదల చేయకుండానే కొత్త హామీలను ఇజ్రాయెల్ గుప్పిస్తోంది.
ఇజ్రాయెల్ జైళ్ళలోలో ప్రస్తుతం 5,000 మందికి పైగా పాలస్తీనీయులు మగ్గుతున్నారు. వీరిలో అత్యధికులు చిన్న చిన్న కారణాలతో అరెస్టయి సంవత్సరాల తరబడి విచారణ లేకుండా బందీలుగా ఉన్నారు. రాళ్ళు విసిరారని, సరిహద్దు దాటి వచ్చారని, దూషించారనీ ఇలాంటి కారణాలతో మందబలంతో పాలస్తీనా ప్రజలను ఇజ్రాయెల్ సైనికులు అరెస్టు చేస్తారు. వారిపై టెర్రరిస్టులుగా ముద్ర వేసి ఖైదీలుగా ఉంచుకుంటూ చర్చలలో పై చేయి సాధించడానికి ఎరగా ఉపయోగిస్తారు.
పాలస్తీనా భూభాగాలను దురాక్రమించిన డెబ్బై యేళ్లుగా వలస పాలన సాగిస్తున్న ఇజ్రాయెల్ ‘దురాక్రమణ సమస్య’ ను ‘పాలస్తీనా సమస్య’ గా మాత్రమే గుర్తించడం పశ్చిమ కార్పొరేట్ పత్రికలు తెలివిగా చేసే పని. పాలస్తీనా అరబ్బులు ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్, గాజాలలోనే కాకుండా ఇజ్రాయెల్ లో సైతం రెండో తరగతి పౌరులుగా జీవనం సాగిస్తున్నారు. అరబ్ దేశాల పాలకుల మధ్య ఉన్న విభేదాలను ఎగదోస్తూ, తమ ప్రయోజనాలకు వినియోగించడంలో ఇజ్రాయెల్ సఫలం అవుతుండడంతో పాలస్తీనా ప్రజలు ఎడతెగని దురాక్రమణలో బతుకులు వెళ్లదీస్తున్నారు.
చమురు నేలలపై తమ ప్రతినిధిగా ఇజ్రాయెల్ ను ప్రతిష్టించిన పశ్చిమ సామ్రాజ్యవాదులు శాంతి చర్చల పేరుతో దశాబ్దాలుగా ఆడుతున్న నాటకాలు వాస్తవంలో సమస్యను మరింత సాగదీయడానికే దోహదపడుతున్నాయి. ఈ సంవత్సరం మళ్ళీ అదే నాటకాన్ని అమెరికా పునః ప్రారంభించింది. పశ్చిమాసియా శాంతి కోసం అమెరికా తీవ్రంగా శ్రమిస్తున్నట్లుగా పశ్చిమ కార్పొరేట్ పత్రికలు కధనాలు ప్రచురిస్తున్నాయి. ఈ కధానాల్లో అమెరికా శ్రమ జీవిగానూ, ఇజ్రాయెల్ తుంటరి గానూ, పాలస్తీనా ప్రజలు టెర్రరిస్టులు గానూ మనకు కనిపిస్తారు. ఈ నాటకాలకు అరబ్ దేశాలకు చెందిన దళారీ కూటమి అరబ్ లీగ్ యధాశక్తి సహకరిస్తుంది. పైకి మాత్రం ఇజ్రాయెల్ పై కారాలు మిరియాలు నూరుతుంటారు.
అరబ్ లీగ్ తాజా ప్రకటన కూడా ఈ కోవలోనిదే. లిబియాపై పశ్చిమ దేశాలు దురాక్రమణ దాడి చేయడానికి సహకరించిన అరబ్ కూటమి ‘అరబ్ లీగ్’. అమెరికా, సౌదీల మెప్పు కోసం సిరియాను అరబ్ లీగ్ నుండి బహిష్కరించిన కూటమి ‘అరబ్ లీగ్’ పశ్చిమ సాక్రాజ్యవాదులకు సేవలు చేయడంలో తరించిపోయే అరబ్ లీగ్ ఎంతగా గావుకేకలు పెట్టినా అవి తాటాకు చప్పుళ్లేనని ఇజ్రాయెల్ కే కాదు, అరబ్ ప్రజలకు కూడా తెలిసిన విషయమే.