గూగుల్ Vs బైదు (చైనా): అమెరికాలో వింత తీర్పు


మనకి భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ఎలాగో అమెరికాలో ఫస్ట్ అమెండ్ మెంట్ అలాగ. ఈ ఫస్ట్ అమెండ్ మెంట్ ని అడ్డం పెట్టుకుని చైనా సర్చ్ ఇంజన్ బైదు పైన దెబ్బ కొట్టాలని చూసిన చైనీస్ అమెరికన్ ప్రముఖులు కొందరు అమెరికా కోర్టు ఇచ్చిన ఓ విచిత్రమైన తీర్పుతో తామే ఖంగు తినాల్సి వచ్చింది.

చైనా ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే భావాలను చైనాలో అడుగు పెట్టకుండా బైదు సర్చ్ ఇంజన్ ఫిల్టర్ చేసి అడ్డుకుంటోందని దీనివల్ల తమ ప్రజాస్వామిక భావాలు చైనాలో వ్యక్తం కావడం లేదని పిటిషన్ దారులు ఆరోపించారు. తద్వారా తమకు తీవ్ర నష్టం జరిగిందని కాబట్టి బైదు కంపెనీ తమకు 16 మిలియన్ డాలర్లు చెల్లించాలని వారు కోరారు. ఈ పిటిషన్ ను న్యూయార్క్ లోని జిల్లా కోర్టు జడ్జి జెస్సే ఫర్మెన్ కొట్టివేశారు.

చైనాలో ప్రజాస్వామ్యం నెలకొల్పాలంటూ ఉద్యమించిన పలువురు చైనీయులకు అమెరికా ఆశ్రయం ఇస్తోంది. చైనాలో ప్రజాస్వామ్యం పేరుతో అమెరికా చొరబాటుకు వీలు కల్పించే అమెరికా అనుకూల ప్రచారం వీరు చేసే పని. వీరిలో ఎనిమిది మంది రచయితలు, వీడియో నిర్మాతలు చైనా సర్చ్ ఇంజన్ బైదు పై పిటిషన్ వేశారు.

చైనాలో ఇంటర్నెట్ సర్చ్ మార్కెట్ లో మెజారిటీ బైదు ఆధీనంలోనే ఉంటుంది. ప్రపంచంలో గూగుల్ ఎలాగో చైనాకు బైదు అలాంటిది. ఈ కంపెనీ వాటా చాలా తక్కువే అయినా, అమెరికాలో కూడా మార్కెట్ కలిగి ఉంది. అమెరికాలోని చైనీయులు పిటిషన్ వేసింది అమెరికాలోని బైదు విభాగం పైన.

బైదు సర్చ్ ఇంజన్ చైనాలో ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే భావాలను తన శోధన ఫలితాల్లో (search results) ఫిల్టర్ చేసి పాఠకులకు అందకుండా చేస్తోందని పిటిషనర్లు ఆరోపించారు.

ఈ వాదనను అమెరికా కోర్టు నిరాకరించింది. బైదు ఫిల్టరింగ్ సాఫ్ట్ ఫేర్ (algorithms) కు అమెరికా రాజ్యాంగం లోని ఫస్ట్ అమెండ్ మెంట్ రక్షణ ఇస్తోందని కోర్టు తీర్పు చెప్పింది.

బైదు సర్చ్ ఇంజన్ ను కోర్టు ఒక పత్రిక ఎడిటర్ తో పోల్చింది. ఒక పత్రికలో ఏయే వార్తలు, వ్యాసాలు ప్రచురించబడాలో నిర్ణయించే అధికారం ఆ పత్రిక ఎడిటర్ కి ఉన్నట్లే ఒక సర్చ్ ఇంజన్ కి కూడా తన వినియోగదారులకు ఏయే శోధనా ఫలితాలు చూపాలో నిర్ణయించుకునే హక్కు, అవకాశం ఉన్నాయని కోర్టు తేల్చేసింది.

అనగా పిటిషన్ దారులు తమ భావ ప్రకటనా స్వేచ్ఛను బైదు నుండి కాపాడాలని పిటిషన్ వేయగా కోర్టు, అదే భావ ప్రకటనా స్వేచ్ఛ కింద బైదుకి రక్షణ కల్పించి పిటిషన్ కొట్టిపారేసింది. వినియోగదారులు కావాలనుకుంటే ఒక పత్రిక కాకపోతే మరో పత్రిక చూసే అవకాశం ఉన్నట్లే ఒక సర్చ్ ఇంజన్ కాకపోతే వేరే సర్చ్ ఇంజన్ ని వినియోగించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కాబట్టి పిటిషనర్ల భావ ప్రకటనకు ఆటంకం లేదని పరోక్షంగా తెలిపింది.

“ప్రజాస్వామ్యేతర ప్రభుత్వ వ్యవస్ధల (చైనా లేదా ఇతర చోట్ల) భావాలను ప్రచారం చేసేందుకు బైదుకు గల హక్కులకు ఫస్ట్ అమెండ్ మెంట్ రక్షణ కల్పిస్తుంది. పిటిషన్ దారులకు ప్రజాస్వామ్యం గురించి ప్రచారం చేసుకునేందుకు గల హక్కులాంటిదే ఇది” అని కోర్టు నిర్ధారించింది.

ఇదే విషయాన్ని మొరటుగా చెప్పాలంటే: అమెరికాకు పారిపోయి చైనా వ్యతిరేక ప్రచారం చేసుకునే హక్కు పిటిషన్ దారులకు ఎలా ఉంటుందో చైనా ప్రభుత్వాన్ని సమర్ధించే బైదు కంపెనీకి కూడా తమ ప్రభుత్వ అనుకూల భావాలను ప్రచారం చేసుకునే హక్కును కలిగి ఉందన్నమాట! ‘ఒక పత్రిక ఎడిటర్ కి ఉన్న ఎడిటోరియల్ జడ్జిమెంటు లాంటిదే ఇది’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

సర్చ్ ఇంజన్ల శోధన ఫలితాలను దాదాపు అన్నిరకాల పౌర పిటిషన్ల నుండీ, ప్రభుత్వ నియంత్రణ నుండీ ఫస్ట్ అమెండ్ మెంట్ కాపాడుతుందన్నా వాదన బలంగా ఉనికిలో ఉందని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. గూగుల్, మైక్రో సాఫ్ట్ బింగ్, యాహూ తదితర సర్చ్ ఇంజన్లు తమ ఇష్టా యిష్టాలకు అనుగుణంగా శోధన ఫలితాలను నెట్ వినియోగదారులకు చూపించవచ్చు అన్న వాదనను కోర్టు తీర్పు తేల్చి చెప్పినట్లయింది.

దీనిని పిటిషనర్ తరపు న్యాయవాది ఇలా భాష్యం చెప్పారు: “కోర్టు నిఖార్సయిన వైరుధ్యాన్ని నెలకొల్పింది. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో భావ ప్రకటనా స్వేచ్చను అణచివేయడానికి అది అనుమతించింది.” చాలా ఆసక్తికరమైన చర్చ!

పిటిషనర్లు పై కోర్టుకు అప్పీలు చేయాలని నిర్ణయించుకున్నారు.

పిటిషన్ అవడానికి బైదు Vs చైనా సో కాల్డ్ ప్రజాస్వామిక ఉద్యమకారుల మధ్య అయినప్పటికీ ఇది వ్యాపారపరంగా గూగుల్ Vs బైదు లాగానే విశ్లేషకులు పరిగణిస్తున్నారు. దానికి కారణం 2010లో చైనా, గూగుల్ ల మధ్య చెలరేగిన రగడ.

చైనాలో ఇంటర్నెట్ సర్చ్ మార్కెట్ లో దాదాపు 75 శాతం వరకు బైదు ఆధీనంలోనే ఉంది. గూగుల్ వాటా 16 శాతం వరకూ ఉంది. 2010 వరకూ గూగుల్ వాటా 30 శాతం వరకూ ఉండేది. గూగుల్ కూడా దాదాపు ఇదే వాదన చేస్తూ తమ సర్చ్ ఫలితాలపై చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించిందని వాటిని ఎత్తివేస్తే తప్ప చైనాలో కార్యకలాపాలు నిర్వహించబోమని చైనాతో వివాదానికి దిగింది.

చైనా ప్రభుత్వం అదరలేదు, బెదరలేదు. చైనాలో వ్యాపారం చేయాలంటే మా నిబంధనలు పాటించాల్సిందే. ఇష్టం లేకపోతే శుభ్రంగా వెళ్లిపోవచ్చు అని గూగుల్ కి తేల్చి చెప్పింది. గూగుల్ కి అనుకూలంగా మద్దతు సమకూర్చడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. అప్పటి అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ స్వయంగా రంగంలోకి దిగి గూగుల్ చేసినట్లే చేయాలని యాహూ, మైక్రో సాఫ్ట్ లపై ఒత్తిడి తెచ్చింది. కానీ అలా చేయడానికి అవి నిరాకరించాయి.

చివరికి చేసేదేమీ లేక గూగుల్ కంపెనీయే చైనా దారికి వచ్చింది. చైనాలో 130 కోట్ల జనాభాను వదులుకోలేకపోయింది. చచ్చినట్లు చైనా నిబంధనలు అమలు చేస్తూ అక్కడ కొనసాగుతోంది. ఈ గలాటాలో తన మార్కెట్ ను దాదాపు సగం కోల్పోయింది. ఇలాంటివి ఇండియాలో చస్తే జరగవు.

One thought on “గూగుల్ Vs బైదు (చైనా): అమెరికాలో వింత తీర్పు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s