ఐరాస మానవ హక్కుల సంస్ధలో ఇండియా శ్రీలంకకు అనుకూలంగా వ్యవహరించడంతో శ్రీలంక కృతజ్ఞత చూపింది. భారత్ చర్యకు కృతజ్ఞతగా శ్రీలంక జైళ్ళలో మగ్గుతున్న 98 మంది జాలర్లను విడుదల చేసింది. ఐరాసలో భారత దేశం అనుసరించిన వైఖరికి ప్రతి సుహృద్భావ చర్యగానే భారత జాలర్లను విడుదల చేస్తున్నామని చెప్పి మరీ విడుదల చేసింది. ఉపఖండంలో మారుతున్న ధోరణులకు భారత్-శ్రీలంక చర్యలు అద్దం పడుతున్నాయి.
ఐరాస మానవ హక్కుల సంస్ధ (United Nations Human Rights Commission) లో శ్రీలంక విషయమై గురువారం (మార్చి 27) అమెరికా మరోసారి తీర్మానం ప్రవేశపెట్టింది. 2009లో ముగిసిన ఎల్.టి.టి.ఇ – శ్రీలంక ల యుద్ధం చివరి రోజుల్లో శ్రీలంక సైనికులు తమిళ ప్రజలపై సాగించిన మారణ హోమంపై అంతర్జాతీయ విచారణ చేయాలని ఈ తీర్మానంలో అమెరికా ప్రతిపాదించింది. 47 సభ్య దేశాలున్న ఐరాస మానవ హక్కుల సంస్ధ తీర్మానం 23-12 ఓట్ల తేడాతో నెగ్గింది. కాగా 12 దేశాలు ఓటింగులో పాల్గొనలేదు. వీటిల్లో ఇండియా ఒకటి.
గతంలో శ్రీలంక మానవ హక్కుల ఉల్లంఘనను అభిశంసిస్తూ మానవ హక్కుల సంస్ధలో రెండుసార్లు అమెరికా తీర్మానం పెట్టగా ఇండియా ఆ రెండు సందర్భాల్లోనూ తీర్మానాన్ని సమర్ధించింది. ఈసారి మాత్రం న్యూట్రల్ లైన్ తీసుకుంది. తటస్ధ వైఖరి అవలంబించడం ద్వారా శ్రీలంకను సంతృప్తిపరిచింది. ఫలితంగా తమ జైళ్ళలో ఉన్న భారత జాలర్లు అందరినీ విడుదల చేయాలని శ్రీలంక అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశాడు.
శ్రీలంక అధ్యక్షుడి నిర్ణయం తమిళనాడు పార్టీలకు, ఆ మాటకొస్తే భారత ప్రభుత్వానికి కూడా ఒక సంకట పరిస్ధితిని తెచ్చింది. అక్కడి జైళ్లలోని భారతీయ జాలర్లను విడుదల చేసినందుకు సంతోషించాలా లేక 2009 నాటి మారణహోమంలో తమిళ ప్రజలను ఊచకోత కోయించి కూడా తానేమీ తప్పు చేయలేదని దబాయిస్తున్నందుకు ఆగ్రహించాలా అన్నదే ఆ సంకటం.
అమెరికా విపరీతమైన ఒత్తిడి తేవడం వల్లనే ఐరాస మానవ హక్కుల సంస్ధలో తీర్మానం నెగ్గిందని శ్రీలంక ఆరోపించింది. అసలు తమ మానవ హక్కుల రికార్డు పైన ఐరాసలో చర్చ జరగాల్సిన అవసరమే లేదని శ్రీలంక వాదిస్తోంది. కానీ భారత ప్రధాని దగ్గర్నుండి తమిళనాడు రాజకీయ పార్టీల వరకూ ఇంతకాలం చెబుతూ వచ్చింది దానికి విరుద్ధం. యుద్ధం చివరి రోజుల్లో జరిగిన ఘటనలపై నిస్పాక్షిక విచారణ జరగాలని శ్రీలంక తమిళులకు అధికారాలు పంచాలని భారత్ క్రమం తప్పకుండా బోధిస్తోంది.
ఇంతకీ శ్రీలంకపై అమెరికా ఇంతగా కక్ష కట్టడానికి ఏమిటి కారణం? తమిళుల మానవ హక్కులపై అమెరికాకు నిజంగానే ఆపేక్షా?
కానే కాదు. నిజానికి అది చైనా మహిమ.
శ్రీలంక క్రమ క్రమంగా చైనాకు దగ్గరవుతోందని అమెరికా అనుమానం. దీన్ని నిరోధించడంలో ఇండియా విఫలం అవుతోందని కూడా అమెరికాకు అసహనంగా ఉంది. చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి ఇండియా సహాయం చేస్తుందని, సహకరిస్తుందని అమెరికా చాలా ఆశలు పెట్టుకుంది. కానీ చైనా ప్రాబల్యం మాత్రం విస్తరిస్తోందే తప్ప తగ్గడం లేదు.
శ్రీలంకకు చైనా ఒక రేవు పట్టణం నిర్మించి పెట్టింది. 500 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ మెగా పోర్టును కొలంబో ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ (సి.ఐ.సి.టి) గా పిలుస్తున్నారు. ఈ మొత్తంలో 350 మిలియన్ డాలర్లు చైనా డవలప్ మెంట్ బ్యాంకు రుణంగా సమకూర్చింది. ఈ రేవు పట్టణం నిర్మాణంతో హిందూ మహా సముద్రంలో శ్రీలంక ఒక ముఖ్యమైన అంతర్జాతీయ సముద్ర రవాణా కేంద్రంగా అభివృద్ధి చెందనుందని నిపుణుల అంచనా. ప్రాంతీయంగానే కాకుండా ప్రపంచ స్ధాయిలోనూ తమ పోర్టు ఇతర ముఖ్యమైన ప్రపంచ స్ధాయి పోర్టులతో పోటీ పడుతుందని శ్రీలంక ప్రభుత్వం నమ్ముతోంది.
సి.ఐ.సి.టి ని చైనాకు చెందిన ‘చైనా మార్చంట్స్ హోల్డింగ్స్ ఇంటర్నేషనల్’ కంపెనీ బి.ఓ.టి (Build-Operate-Transfer) ప్రాతిపదికన నిర్మించింది. ఈ కాంట్రాక్టు ప్రకారం 35 యేళ్ళ పాటు చైనాయే పోర్టును నిర్వహిస్తుంది. గతేడు ఆగస్టులో ఒక టెర్మినల్ ప్రారంభం కాగా మరో రెండు టెర్మినళ్ళు నిర్మాణంలో ఉన్నాయి. దక్షిణాసియాలో ఇదే అతి పెద్ద డీప్ సీ పోర్ట్ అని కూడా కొందరు చెబుతున్నారు.
అమెరికాకు ఇది ససేమిరా ఇష్టం లేదు. శ్రీలంక పోర్టు మునుముందు చైనా మిలట్రీ స్ధావరంగా మారనుందని అమెరికా గట్టి నమ్మకం. ఈ అనుమానాలను చైనా అనేకసార్లు కొట్టిపారేసింది. వ్యాపారం చేయడం తప్ప మరో ఆలోచన తనకు లేదని చైనా చెబుతోంది. కొలంబో పోర్టు వల్ల చైనా అంతర్జాతీయ వాణిజ్యం కూడా బాగా పెరుగుతుంది. హిందూ మహా సముద్రంలో నమ్మకమైన షిప్పింగ్ మార్గం చైనాకు లభిస్తుంది. తూర్పు, పశ్చిమ దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచే మరో ప్రత్యామ్నాయ మార్గంలో భాగంగా కొలంబో పోర్టును చైనా పరిగణిస్తోంది. ఇందులో భాగంగా పాక్, నేపాల్ లకు కూడా చైనా పోర్టులను నిర్మిస్తోంది.
ప్రపంచంలోని ప్రధాన జల రవాణా మార్గాలన్నీ ప్రధానంగా అమెరికా, ఐరోపా చేతుల్లోనే ఉన్నాయి. దానివల్ల చైనా వాణిజ్యానికి ఎప్పుడైనా సమస్యే. రష్యా-ఉక్రెయిన్-ఇ.యు & అమెరికా వ్యవహారంలో ఇది రుజువయింది కూడా. రష్యా పొరుగు దేశంలో మార్పులు జరుగుతున్నా రష్యా స్పందించడానికి వీలు లేదని అమెరికా, ఐరోపాలు శాసించాయి. దాన్ని తిరస్కరించినందుకు రష్యా పై ఆంక్షలు సైతం విధించాయి. జి8 కూటమిని రద్దు చేసుకున్నాయి. ఇంకా మరిన్ని వాణిజ్య ఆంక్షలు విధిస్తామని బెదిరిస్తున్నాయి.
ఇదే పరిస్ధితి రేపు చైనాకూ రావచ్చు. అందుకే చైనా తన సొంత రవాణా మార్గాలను అభివృద్ధి చేసుకుంటోంది. భారత పాలకులు సరిగ్గా ఉపయోగించుకోగలిగితే ఈ రవాణా మార్గాల వల్ల మనకు కూడా బోలెడు ఖర్చు కలిసి వస్తుంది.
ఈ నేపధ్యంలోనే అమెరికా శ్రీలంకను సాధిస్తోంది. తీర్మానం ఆమోదం పొందిందే తడవుగా ఐరాస శ్రీలంక మానవ హక్కుల ఉల్లంఘనపై విచారణ ప్రారంభించింది కూడా. ఈ చర్యలో తటస్ధ వైఖరి అవలంబించడం ద్వారా ఇండియా ఏమి సందేశం ఇచ్చిందన్నదీ ప్రస్తుతానికి ఒక నిర్ధారణకు రావడం కష్టం. కానీ అది అమెరికాకు పెడగా, చైనాకు కాస్త దగ్గరగా జరిగిందన్న అర్ధం వచ్చేట్లుగా ఉందని ఎవరన్నా అంటే అందులో కాస్త నిజం లేకపోలేదు. భవిష్యత్తులో అమెరికా తీసుకునే చర్యలు, వాటికి ఇండియా స్పందించే వైఖరిని బట్టి మరికొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
భారత పాలకులకు గో.పి వైఖరి అలవాటైన ధోరణే. అది ఎప్పుడూ పరిశీలకులు ఒక నిర్ధారణకు వచ్చేదిగా ఉండదు. గో.పి వైఖరే అంత.
sir, i am daily reading your website, small doubt, please explain, Nepal port? its a land locked country…
హరి గారూ, సముద్రంకి దూరంగా ఉన్న చోట్ల కూడా పోర్టులు నిర్మిస్తారు. వాటిని డ్రై పోర్టు లేదా ఇన్ లాండ్ పోర్ట్ అంటారు. ఇక్కడ షిప్పింగ్ కంటైనర్ లని డీల్ చేసేందుకు అవసరమైన సౌకర్యాలు నిర్మిస్తారు. వేర్ హౌస్. కంటైనర్ (పెద్ద పెద్ద పెట్టెలు) ల లోడింగ్, అన్ లోడింగ్, దేశంలోని ఇతర ప్రాంతాలను కనెక్ట్ చేసే రోడ్లు, కస్టమ్స్ విభాగాల కార్యాలయాలు… ఇలాంటివి నిర్మిస్తారు. మామూలుగా అయితే వీటిని సమీపంలోని ఓడరేవుకు కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు రెండు దేశాల సరిహద్దుల మధ్య నిర్మించే కస్టమ్స్, రవాణా కేంద్రాలని కూడా డ్రై పోర్టుగా పిలుస్తున్నారు. ఏదన్నా ఓడరేవుకు కనెక్ట్ చేసినట్లయితే వాటిపైన ఉండే ఒత్తిడిని ఈ డ్రై పోర్ట్ లు తగ్గిస్తాయి. రేవు పట్టణమే కాకుండా లోపలి ప్రాంతాలు కూడా అభివ్రుద్ధి కావడానికి ఇవి దోహదపడతాయి.
శ్రీలంక విషయంలో తటస్థ వైఖరి ప్రదర్శించడానికి ప్రధానకారణం దేశంలో నెలకున్న ప్రస్తుతపరిస్తుతిలేనని నా అభిప్రాయం! “కర్రవిరగకూడదు పాము చావకూడదు”
శ్రీలంకతో మొదటి నుంచి కొంచెం ముందు చూపుతో….సంయమనం పాటిస్తూ… మంచి సంబంధాలు కొనసాగించి ఉంటే….మనకు ఎన్నో ఉపయోగాలుండేవి. కానీ ఎటూ తేల్చుకోలేక పోవడం ద్వారా మన పాలకులు ఏమీ సాధించలేకపోయారు. మన అలసత్వమే చైనాకు అవకాశంగా మారింది. ఫలితంగా మనం పైచేయి సాధించాల్సిన హిందూ మహాసముద్రంలోనూ….చైనా తన పట్టు సాధించింది. ముందు చూపు…, దౌత్య సంబంధాల ద్వారా….భౌగోళిక ప్రతికూల పరిస్థితుల్ని కూడా అధిగమించి ఎలా ముందుకు సాగవచ్చో చైనా మరోసారి నిరూపించింది.
ఇంతకాలం ప్రాంతీయ పార్టీల కోసం విదేశీ సంబంధాల్ని పణంగా పెట్టిన మన పాలకులు…. చైనా వేగంగా దూసుకుపోతుండడంతో ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగమే శ్రీలంక పై ఓటింగ్ కు దూరంగా ఉండడం. ఇప్పటికైనా ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తే….మన దేశానికే కాదు…, దక్షిణాసియా మొత్తానికి మంచి జరుగుతుంది.
లంకలో జరిగిన మారణహోమాన్ని కచ్చితంగా ఖండించాల్సిందే. ఐతే భారత్ లాంటి పెద్ద దేశం శ్రీలంక లో జరుగుతున్న పరిణామాలపై మొదట్లోనే కొంచెం పెద్దరికంగా వ్యవహరించి, తమిళ జాతి సమస్య ఎప్పుడో సామరస్యంగా పరిష్కారమై ఉండేది. కానీ తమ దేశంలోని సమస్యలనే పట్టించుకోని భారత పాలకులు ఇక తన పొరుగు దేశాల్లోని సమస్యల పట్ల పెద్దరికం వహిస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది.
చందు తులసి గారు,
దక్షినాసియా దేశాల్లో ప్రాంతియంగా మనదేశం నిస్సందేహంగా పెద్దన్న పాత్ర వహిస్తున్నది. మీరు అను కుంటున్నట్లుగా // తమ దేశంలోని సమస్యలనే పట్టించుకోని భారత పాలకులు ఇక తన పొరుగు దేశాల్లోని సమస్యల పట్ల పెద్దరికం వహిస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది.//అనేది అర్ద సత్యమే. భడా పెట్టుబడి దారుల ప్రయోజనాలరీత్య పొరుగు దేశాలకు కావలసిన అన్ని హంగులు సమకూర్చి పెడుతుంది. రాజకీయ ప్రయోజనాలరీత్య పాలక వర్గాలు సరిగ్గా మీరు ఆశిస్తున్నదే వారు ఆశిస్తున్నారు.