అమెరికా: వడ్డీ రేటు ఇప్పట్లో పెంచేది లేదు


US Federal Reserve Bank

తమ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటును ఇప్పట్లో పెంచడం సాధ్యం కాదని అమెరికా సెంట్రల్ బ్యాంక్ ‘ఫెడరల్ రిజర్వ్’ ప్రకటించింది. చికాగో రాష్ట్ర ఫెడరల్ రిజర్వ్ అధ్యక్షుడు చార్లెస్ ఇవాన్స్ ఈ మేరకు స్పష్టం చేశారని రాయిటర్స్ తెలిపింది. వడ్డీ రేటు పెంచితే ఇప్పుడిప్పుడే దారిలో పడుతున్న అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మళ్ళీ గాడి తప్పుతుందని ఆయన అంచనా వేశారు. నిరుద్యోగం ఇంకా తీవ్రంగానే ఉన్నదని, బాగా తక్కువగా ఉన్న ద్రవ్యోల్బణం వడ్డీ రేట్ల పెంపు వల్ల మరింత పడిపోయి ప్రతి ద్రవ్యోల్బణానికి దారి తీయవచ్చని కాబట్టి స్వల్పకాలిక వడ్డీ రేటు (భారత రెపో రేటుకు సమానం) పెంచడం వీలుకాదని తెలిపారు.

2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం దరిమిలా అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేటును అత్యంత తక్కువ స్ధాయిలో 0.25 శాతం వద్ద కొనసాగిస్తోంది. ఈ వడ్డీ రేటును అందరూ జీరో వడ్డీ రేటుగానే చెబుతుంటారు. జనం సొమ్ము మరీ వడ్డీ లేకుండా పందేరం పెట్టడం బాగోదని వడ్డీ రేటు సున్నా కి తగ్గించలేదు గానీ వీలయితే అదీ చేసేవారే.

ఇలా ఒక దేశ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేటును తక్కువగా ఉంచడం వల్ల లబ్ది పొందేదీ అత్యున్నత స్ధాయి ధనిక వర్గాలే. జనాభాలో అందరి కంటే పై భాగాన ఉండే సూపర్ ధనికులకి దేశ సంపాదన అంతా కట్టబెడితే అది కింది దాకా ప్రవహిస్తుందని చెబుతూ పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు ‘ట్రికిల్ డౌన్ ధియరీ’ ని కనిపెట్టింది కూడా ఇలా జనం డబ్బును కొద్దిమందికి పంచి పెట్టడాన్ని సమర్ధించుకోడానికే.

ఆర్ధిక వ్యవస్ధ కాస్తయినా పుంజుకోకుండానే వడ్డీ రేట్లు పెంచితే ఆర్ధిక రికవరీ మొత్తం కూలబడే ప్రమాదం ఉందని ఇవాన్స్ హెచ్చరించారు. వడ్డీ రేటు తక్కువగా ఉంచడంతో పాటు ఫెడరల్ రిజర్వ్ ప్రతి నెలా 65 బిలియన్ డాలర్ల మేర అమెరికా ట్రెజరీ జారీ చేసే సార్వభౌమ ఋణ పత్రాలను (Soverign Debt Bonds) కొనుగోలు చేస్తోంది. (ఇది ఇటీవలి వరకు 85 బిలియన్లు ఉండేది. దీన్ని రెండు దఫాలుగా తగ్గించి 65 బిలియన్లకు చేర్చారు. ఇలా ఉద్దీపన మొత్తాన్ని తగ్గించడాన్ని ట్యాపరింగ్ అంటున్నారు.) అనగా అమెరికా ఋణ పత్రాలను కొనుగోలు చేసేవారు (లేదా అమెరికాకి అప్పు ఇచ్చేవారు) పెద్దగా లేరన్నమాట! ఇలా తమ అప్పు తామే ఇచ్చుకోకపోతే మార్కెట్ లో అమెరికా ట్రెజరీ బాండ్స్ కి ఉన్న విలువ పడిపోయి అప్పులు పుట్టడం ఇంకా పడిపోతుంది. ఈ పరిస్ధితి అమెరికాని ఋణ సంక్షోభంలోకి నెట్టివేస్తుంది. ఈ విధంగా ఆర్ధిక వ్యవస్ధను కృత్రిమంగా నిలబెడుతూ దానినే రికవరీ అని అమెరికా చెప్పుకుంటోంది.

ఆర్ధిక వ్యవస్ధను కృత్రిమంగా నెలబెట్టే సాధనాల్లో వడ్డీ రేటు కూడా ఒకటి. సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేటు తగ్గించడం అంటే వాణిజ్య బ్యాంకులు కూడా తక్కువ వడ్డీ రేట్లకు అప్పులు ఇస్తాయి. ఈ అప్పుల్ని ఎడా పెడా తీసుకుంటూ అమెరికా బహుళజాతి ద్రవ్య కంపెనీలు (వాల్ స్ట్రీట్ కంపెనీలు) మూడో ప్రపంచ దేశాల షేర్ మార్కెట్లతో ఆడుకుంటున్నాయి. కానీ అమెరికా ప్రజలు మాత్రం మరింత దరిద్రంలోకి జారిపోతున్నారు. మధ్య తరగతి వర్గానికి ఒకప్పుడు ప్రసిద్ధి చెంది వినియోగ సంస్కృతితో ప్రపంచం మొత్తానికి ముఖ్యమైన ఎగుమతి మార్కెట్ గా అలరారిన అమెరికా ఇప్పుడు పెరుగుతున్న దరిద్రుల సంఖ్యతో ఎగుమతి మార్కెట్ పై ఆధారపడ్డ దేశాలను కూడా కుదేలు చేస్తోంది. ఆ దేశాల్లో ఇండియా కూడా ఒకటి.

“అమెరికాలో ఇప్పటికీ నిరుద్యోగం అధికంగానే ఉంది. ద్రవ్యోల్బణం బాగా తక్కువగా ఉంది. కాబట్టి స్వల్పకాలిక వడ్డీ రేటు 2015 సం. వరకూ సున్నాకు దగ్గరగానే కొనసాగించాల్సి ఉంటుంది. వడ్డీ రేటు పెంచడం మొదలు పెట్టే సమయానికి దాదాపు సున్నా దగ్గర వడ్డీ రేటు ఇంచిన మొత్తం కాలం 7 సంవత్సరాలు ఉండాలి” అని చికాగో ఫెడ్ అధ్యక్షుడు ఇవాన్స్ తెలిపాడు. డిసెంబర్ 2008 లో మొదటిసారి ఫెడ్ వడ్డీ రేటు 0.25 శాతానికి తగ్గించారు. దీనికి 7 సం. లు కలుపుకుంటే డిసెంబర్ 2015 వరకూ వడ్డీ రేటు 0.25 శాతం దగ్గర ఉండాల్సిందేనని ఇవాన్స్ చెబుతున్నారు.

అమెరికాలో నిరుద్యోగం ప్రస్తుతం 6.7 శాతం ఉంది. ఇది మామూలుగానే ఎక్కువ. అయినాగానీ అసలు నిరుద్యోగం కంటే ఇది చాలా తక్కువ అని అనేకమంది అమెరికన్ ఆర్ధిక వేత్తల నిశ్చితాభిప్రాయం నౌరీల్ రౌబినీ లాంటి ఆర్ధిక వేత్తలు అమెరికా నిరుద్యోగం 13 శాతం నుండి 17 శాతం వరకు ఉంటుందని అంచనా వేశారు. అధికారిక నిరుద్యోగుల్లో కేవలం ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినవారినే లెక్కిస్తారు. ఉద్యోగాల కోసం వెతికి విసిగి వేసారి ఇక వెతకడం మానుకున్నవారిని లెక్క వేయరు. ఇలా వెతకడం మానుకున్న వారి సంఖ్య వెతికేవారి కంటే ఎక్కువగా ఉండడం అమెరికా నిరుద్యోగం ప్రత్యేకత. అనగా అమెరికాలో ఉద్యోగావకాశాలు ఆ స్ధాయిలో పడిపోతున్నాయి.

అలాగని కంపెనీల లాభాలు తగ్గుతున్నాయా అంటే అదేమీ లేదు. కంపెనీలు యధావిధిగా లాభాలు, డివిడెండ్లు ప్రకటిస్తూనే ఉన్నారు. సి.ఈ.ఓ లకీ, డైరెక్టర్లకి ఏటికేడూ వేతనాలు మిలియన్ల కొద్దీ పెంచుతూనే ఉన్నారు. ఉద్యోగాల్లో కోత పెట్టడం, పనిభారం విపరీతంగా పెంచడం, అధిక వేతనాలు చెల్లిచవలసిన పాత ఉద్యోగులను తొలగించి అతి తక్కువ వేతనాలకు కొత్త ఉద్యోగులను నియమించుకోవడం, ఉద్యోగుల సదుపాయాలు చెల్లింపు మానేయడం… ఇలాంటి చర్యల ద్వారా కంపెనీలు తమ లాభాలను కాపాడుకుంటున్నారు. అనగా కంపెనీలు తాము తెచ్చిన ఆర్ధిక సంక్షోభాన్ని జనం మీదికి మళ్లించారు. దానితో సంక్షోభం తెచ్చిన కంపెనీలు బాగానే ఉన్నాయి; జనం మాత్రం నిరుద్యోగం, దరిద్రం, నివాస లేమి సమస్యలలో పడిపోయారు.

పైన వివరించిన సావరిన్ బాండ్ల కొనుగోలు పధకాన్ని (ఉద్దీపన) క్రమంగా పూర్తిగా తగ్గించేసిన ఆరు నెలల్లో వడ్డీ రేటు పెంచుతామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జానేట్ యెల్లెన్ ప్రకటించారు. ఆమె అలా ప్రకటించడంతోనే ప్రపంచ షేర్ మార్కెట్లు ఒక్కసారిగా వణికిపోయాయి. జానేట్ ప్రకటించిన కాలం కంటే ఎక్కువ కాలమే వడ్డీ రేటు తక్కువగా ఉంచాలన్న ఇవాన్స్ ప్రకటనతో మార్కెట్ ప్లేయర్లు మళ్ళీ బుల్ ధోరణిలోకి వచ్చేయడం ఖాయం. ఈ మేరకు ఈ రోజు భారత షేర్ మార్కెట్లు మరో కొత్త రికార్డు స్ధాయికి పెరిగాయని పత్రికలు ఇప్పటికే వార్తలు రాశాయి కూడాను.

2 thoughts on “అమెరికా: వడ్డీ రేటు ఇప్పట్లో పెంచేది లేదు

  1. పింగ్‌బ్యాక్: అమెరికా: వడ్డీ రేటు ఇప్పట్లో పెంచేది లేదు | ugiridharaprasad

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s