మోడీజీ, అది ఎ.కె-49 కాదు చీపురు! -కార్టూన్


AK49

బి.జె.పి ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్ర మోడి ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు ఆ పదవికి పోటీ పడుతున్న వ్యక్తికి ఉండాల్సిన స్ధాయికి తగిన విధంగా లేవని ఎప్పటినుండో వినిపిస్తున్న విమర్శ. ఆ విమర్శకు తగినట్లుగానే నరేంద్ర మోడి నిన్న (మార్చి 26) మరో చవకబారు విమర్శను ఎక్కుపెట్టారు.

జమ్ము & కాశ్మీర్ లో ఓ ఎన్నికల సభలో ప్రసంగించిన మోడి దేశంలో మూడు ఏ.కె లు పాకిస్తాన్ కి సహాయం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఒకటి టెర్రరిస్టులు ధరించే ఎ.కె-47 అనీ, రెండోది రక్షణ మంత్రి ఎ.కె ఆంటోని అనీ, మూడోది కొత్త పార్టీ పెట్టిన ఎ.కె 49 అనీ ఆయన విమర్శించారు.

ఎ.కె 47 తుపాకి ప్రాణం లేని ఒక నిర్జీవ వస్తువు. కాబట్టి దాని తరపున ఈ విమర్శకు స్పందించడానికి ఎవరూ ఉండరు. ప్రజలకు ఏమి చేస్తామో చెప్పాల్సిన ఎన్నికల ర్యాలీలో ఎవరి చేతుల్లో ఉంటే వారి ప్రయోజనాలను నెరవేర్చే వస్తువుపై విమర్శ చేయడం ‘చవకబారు’ అని కూడా చెప్పలేని విమర్శ.

రక్షణ మంత్రి ఎ.కె ఆంటోని, మోడి విమర్శకు ఇంకా స్పందించలేదు. ఆయనకి మోడి విషయం తెలుసు కాబట్టి స్పందించి దండగ అని భావించి ఉండొచ్చు. ఒక భారతీయ సైనికుడి తల తొలగించి పట్టుకుపోయిన దుర్మార్గం గురించి ఎ.కె ఆంటోని పార్లమెంటులో ప్రకటన చేస్తూ “పాక్ సైనికుల దుస్తులు ధరించిన వ్యక్తులు ఆ పని చేశారని” చెప్పారు. ఆ తర్వాత రోజు మళ్ళీ వివరణ ఇస్తూ పాక్ సైనికులే ఆ పనికి పాల్పడ్డారని విచారణలో తేలినట్లు చెప్పారు.

మోడి గారి విమర్శ ఏమిటంటే పాక్ దుస్తులు ధరించిన వ్యక్తులు ఆ పని చేశారని చెప్పడం అంటే పాకిస్ధాన్ కి సహాయం చేయడమే అని. ఈ విమర్శలన్నీ పార్లమెంటులో అయ్యాయి. దానికాయన ఘటనపై విచారణ జరుగుతున్నందున పాక్ సైనికులే ఆ పని చేశారని చెప్పలేం అని చెప్పారు. విమర్శల ఒత్తిడికి తలే ఒగ్గారో, లేక నిజమే అదో తెలియదు గానీ విచారణలో పాక్ సైనికులే ఘటనకు బాధ్యులని చెప్పారు. దాన్ని ఎన్నికల ప్రచారంలో అది కూడా కాశ్మీర్ లో ఉపయోగించుకోవడం అంటే సెంటిమెంట్లు రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవడానికే కాదా?

ఇంతకీ ఎన్.డి.ఎ పాలనలో వాజ్ పేయి ప్రధానిగా ఉండగా భారత్ – పాక్ సంబంధాలు బాగా మెరుగుపడ్డాయని ఇప్పటికీ పత్రికలు చెబుతుంటాయి. ఓట్లలో నెగ్గి అధికారం చేపట్టిన ప్రభుత్వాన్ని మిలట్రీ కుట్రతో కూల్చి మరీ పాక్ అధ్యక్ష పదవిలో కూర్చున్న పర్వేజ్ ముషారఫ్ ను ప్రధాని వాజ్ పేయి ఇండియాకు ఆహ్వానించారు కూడా. ఆయన తన స్వస్ధలాన్ని సందర్శించే వీలు కల్పించిన ఘనత ఎన్.డి.ఎ ప్రభుత్వానిది. కాశ్మీర్ వేర్పాటు నాయకులతో తలుపులు మూసుకుని సమావేశం అయ్యే అవకాశం కూడా ముషారఫ్ కు కల్పించబడింది.

ఇంత జరిగినందుకు అప్పటి ప్రధాని వాజ్ పేయిని పాకిస్ధాన్ కు సహాయం చేశారని ఆరోపించవచ్చా?

అంతెందుకు? బి.జె.పి ప్రభుత్వ పాలన కాలంలో టెర్రరిస్టులు ఒక భారతీయ విమానాన్ని హైజాక్ చేసిన సందర్భంలో బి.జె.పి విదేశీ మంత్రి జశ్వంత్ సింగ్  జైలులో ఉన్న టెర్రరిస్టులను వెంటబెట్టుకుని వెళ్ళి కాందహార్ లో దించి వచ్చారు. దానిపై ఇప్పటికీ విమర్శలు చేసేవారు ఉన్నారు. నేరుగా టెర్రరిస్టులనే విడిపించిన బి.జె.పి ప్రభుత్వాన్ని ఇంకేం అనాలి?

అరవింద్ కేజ్రీవాల్ ను ఎ.కె 49 గా మోడీ అభివర్ణించడం మరింత చవకబారు… కాదు కాదు, నేలబారు విమర్శ. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఎఎపి 49 రోజులు ప్రభుత్వం నిర్వహించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మోడీ ఈ విమర్శ చేశారు. ఆ లెక్కన 1996లో ఏర్పడిన బి.జె.పి ప్రభుత్వం కేవలం 13 రోజులు మాత్రమే అధికారం నెరిపింది. బి.జె.పి ని ఏ.కె-13 ప్రభుత్వం అని పిలవాలా?

మోడి గతంలో కూడా ఇలాంటి చవక విమర్శలు చాలానే చేశారు. ఓసారి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ జె.ఎం.లింగ్డో క్రైస్తవుడు కనుక సోనియాకు సహకరిస్తున్నారని విమర్శించిన పెద్ద మనిషి నరేంద్ర మోడి. ఇంతా చేసి జె.ఎం.లింగ్డో నాస్తికుడు. సమాజంలో మతం అంటూ పాటించని వ్యక్తులు కూడా తెలియని అజ్ఞాని మోడి అని లింగ్దో అప్పట్లో మోడి విమర్శని తిప్పికొట్టారు.

అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా గుజరాత్ వెళ్ళి మోడి అపాయింట్ మెంట్ అడిగారు. కానీ ఏ.కె తో మాట్లాడడానికి ఆయనకి ధైర్యం చాలలేదు. ముఖేష్ అంబానీ / రిలయన్స్ కంపెనీ ప్రయోజనాల కోసం కాంగీ ప్రభుత్వం గ్యాస్ ధరలను రెట్టింపు చేసిందని ఇది అక్రమ చర్య అని చెబుతూ, ఆ పని చేసిన వీరప్ప మొయిలీతో పాటు అంబానీ పైనా ఏ.కె ప్రభుత్వం అవినీతి కేసు పెట్టింది. దానిపై మోడీ అభిప్రాయం కోరింది. కానీ ఘనత వహించిన మన ప్రధాని అభ్యర్ధి ఆ అంశంపై ఇంతవరకు నోరు విప్పలేదు. చివరకు మోడి చేస్తున్న వారణాసిలోనే ఏ.కె పోటీ చేస్తున్నట్లు ప్రకటిస్తే తప్ప మోడి నోరు పెగల్లేదు. తీరా పెగిలాక ఇలా చవకబారు విమర్శ తప్ప అసలు అడిగిన సమాధానాలు మాత్రం లేవు.

విషయం ఏమీటంటే వారణాసిలో ఏ.కె పోటీ చేస్తుండడంతో మోడీ, తదితర బి.జె.పి నాయకులకు ఓటమి భయం పట్టుకున్నట్లుంది. దానితో ఏఏపి చీపురు కూడా ఏ.కె 47 తుపాకి లాగా వారికి కనిపిస్తోంది.

2 thoughts on “మోడీజీ, అది ఎ.కె-49 కాదు చీపురు! -కార్టూన్

  1. దేశమంటే మట్టి కాదోయ్‌ ! దేశమంటే మనుషులోయ్‌ ! అన్నారు గురజాడ వారు. దేశమంటే నేల ఎల్లలు తప్ప మనుషులు కాదన్నది ఈ నాటికి కొందరి పెద్దమనుషులకు మారని దృక్పదం. శ్రీ శ్రీ గారందంచిన పాట. వినండి.
    http://vulimirighantasala.blogspot.in/search/label/గా-పి.సుశీల-బృందంతో

  2. ఇక్కడ జరిగిన చర్చ మళ్ళీ చూస్తే చాలా రోతగా కనిపించింది. దాన్నుండి ఎవరూ నేర్చుకోదగింది ఏమీ లేదు. అందువల్ల తొలగించాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s