చందోగ్రఫి: లండన్ లో తెలుగుదనం -ఫోటోలు


లండన్, న్యూయార్క్ నగరాల్లో ఓ తెలుగు కుర్రాడు తన కెమెరాలో బంధించిన అద్భుత దృశ్యాలివి.

తనను తాను అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ గా పోలేపెద్ది చంద్ర శేఖర్ (ఈ బ్లాగ్ లో వ్యాఖ్య ద్వారా) చెప్పుకున్నారు. కానీ ఆయన తీసిన ఈ ఫోటోలు చూస్తే మాత్రం ఆయన అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ అంటే నమ్మ బుద్ధి అయ్యేలా లేవు. చేయి తిరిగిన (కన్ను తిరిగిన అనాలేమో!) ఫోటోగ్రాఫర్ తీసిన ఫొటోలివి అని చెప్పినా ఇట్టే నమ్మొచ్చు.

ఈ ఫొటోల్లో మనుషులు లేని చోటా, ఉన్న చోటా కూడా అప్పటి ప్రకృతికి సంబంధించిన మూడ్ ని ఫోటో గ్రాఫర్ అద్భుతంగా పసిగట్టడం మనం గమనించొచ్చు. ఆ మొదటి ఫోటోలోని కమలం బురదలో పూసిందో ఎక్కడ పూసిందో తెలియదు గానీ, ఎంత శుభ్రంగా కనిపిస్తోంది! కమలం పక్కన ఉన్న ఆకుల పచ్చదనంలోని వివిధ ఛాయలను (shades) రికార్డు చేసిన తీరును అభినందించకుండా ఉండలేం. ఫోటోలోని వస్తువుల మూడ్ ని పట్టిచ్చేది ఈ ఛాయలే కదా!

సంధ్యా దీపం పేరుతో తీసిన ఆ ప్రమిద ఫోటో అయితే పరమాద్భుతం. దీన్నే నేను లండన్ లో తెలుగుదనం అన్నాను. భారత ప్రజల సాంస్కృతిక జీవనంలో ప్రమిదకు ఉన్న స్ధానం కొత్తగా చెప్పనవసరం లేదు. గూట్లో ప్రమిద! ఇది, బహుశా ముప్ఫై, నలభై యేళ్ళ క్రితం వరకూ భారతీయ పల్లెలకు వెలుగు ఇచ్చిన దీపం అంటే అతిశయోక్తి కాదు.

న్యూయార్క్ నగరంలో ప్రయాణీకుల కష్టాలను బ్లాక్ అండ్ వైట్ లో ఉంచడం ద్వారా చందు ఏమన్నా చెప్పదలిచారా? అందులోని వ్యక్తుల విశ్రాంతి అవస్ధలను బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కావడం వల్లనే మరింత చక్కగా ప్రతిబింబించాయనుకుంటాను.

స్టామ్ ఫోర్డ్ మంచు తుఫాను శీర్షికన ఉన్న ఫోటోని చూడండి. అందులోని మసక వెలుతురులో నిలబడ్డ ప్రతి వస్తువూ మనతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లుగా లేవూ? తెలిసే ఇచ్చారో, తెలియకుండానే ఇచ్చారో ఫొటోల్లోని వివిధ వస్తువులకు మనకు వినపడని వాయిస్ ఇవ్వడం గొప్ప కళాత్మకత. ఏదో యధాలాపంగా చిత్రించడం కాకుండా గంటలు గంటలు వేచి చూసినప్పుడే ఇలాంటి ఫోటోలు ఆవిష్కృతం అవుతాయి.

‘ది ట్రియో’ లో మంచు దుప్పటి కప్పుకున్న ఆ కార్లు కూడా గోడవార ఏదో గుసగుసలాడుకుంటున్నట్లు అనిపిస్తోంది. సాయంత్రం పూట పనులన్నీ అయ్యాక, పిల్లల్ని బొజ్జోపెట్టి, భర్తల రాకకోసం ఎదురు చూస్తూ ప్రహరీ గోడల దగ్గర చేరిన ఇల్లాళ్ళ లాగా ఆ కార్లు! ఇల్లాళ్ళ లాగే కార్లకి కూడా సేవ చేయడం తప్ప మంచులో తడుస్తున్నామన్న ఫిర్యాదు చేయవు మరి!

‘స్టామ్ ఫోర్డ్ లో సాయంత్రం’ ఫోటోలో ఆ వ్యక్తి వెనక్కి చూడడం యధాలాపంగా జరిగిందా లేక ఉద్దేశ్యపూర్వకంగానా? దానివల్ల ఫోటోలో మనిషి కంటే ఇతర వస్తువులు, ఆ సాయం సమయంలో అవి వ్యక్తం చేస్తున్న ఉద్వేగాల పైనే దృష్టి పెట్టడానికి వీలు కలిగింది.

లోన్లీ ఫ్లవర్ ఫోటో మరో అద్భుతం. ఆ పువ్వులోని ప్రతి డీటైల్ నీ ఫోటోగ్రాఫర్ చక్కగా పట్టుకున్నారు. ఒంటరిగానే ఉన్నా పగలబడి పలవరిస్తున్నట్లుగా ఉంది కదూ! ఫ్రెండ్స్ ఫోటోలోని పక్షుల్లో మొదటి పక్షిపై ఫోకస్ చేయడం, అవతలి పక్షి దగ్గరికి వెళ్ళేకొద్దీ బ్లర్రింగ్ పెరుగుతూ పోవడం అదో కొత్త అందం లా ఉంది. బహుశా ఫొటోల్లో ఇది మామూలేనేమో.

‘హోమ్ బ్యాక్ యార్డ్’ లో గడ్డి పువ్వుకి విలువ ఇవ్వడం బాగుంది. అయితే ఇందులోని పువ్వుపై ఇంకాస్త ఫోకస్ పెంచాలనుకుంటా.

‘లండన్ ఈవినింగ్’ ఫోటో భలేగా ఉంది. అన్నింటిలో ఇది నాకు బాగా నచ్చింది. కారణం స్పష్టంగా తెలియడం లేదు. బహుశా ఫోర్ గ్రౌండ్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి భావాన్నీ వదలకుండా పట్టుకున్నందుకేమో. చివరికి ఆ వెనక్కి తిరిగి చూస్తున్న పెద్దాయనది కూడా. మొఖం చూపకుండా ఆ వ్యక్తి ఫీలింగ్ వ్యక్తం అయ్యేలా చూడడం ఒక ఫీట్. (న్యూయార్క్ సబ్ వే ఫోటోలో కూడా ఈ చాతుర్యం గమనించవచ్చు.) ఈ ఫోటోలో లైటింగ్ మహా చక్కగా కుదిరింది.

‘లండన్ ఈవినింగ్’ అన్న శీర్షిక పెట్టడం ఒక సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్నది కేవలం గరిక మాత్రమే. లండన్ లాంటి మహా మహా నగరంలోని ఒక సాయంత్రం మొత్తాన్ని ఒక గరిక పీచులో కూర్చడం అంటే మాటలా? గరికపై ఫోకస్ చేస్తూనే బ్యాక్ గ్రౌండ్ లో ‘ఇది లండన్ నగరంలో’ అని శక్తివంతంగా చెప్పే వస్తువొకటి బ్లర్రింగ్ లో అయినా ఉంటే ఇంకా బాగుండేది అనుకుంటాను.

న్యూయార్క్ లో చిపోటిల్ (హోటల్?) లో ఆ ఇద్దరి మిత్రుల సరదా మూడ్ ని బ్లాక్ అండ్ వైట్ లో చూపడం ఒక ప్రత్యేకతను తెచ్చింది.

బహుశా చంద్ర శేఖర్ తన ఫోటోలను పోటీలకు పంపడం మొదలు పెట్టాలేమో! ఆయనకి అభినందనలు! 

8 thoughts on “చందోగ్రఫి: లండన్ లో తెలుగుదనం -ఫోటోలు

 1. చంద్రశేఖర్ గారి ఫోటోలు మంచి అనుభూతిని పంచాయి . చాల personal గా ,మంచి
  కవిత్వంలా ఉన్నాయి . మూడ్ ని పట్టుకోవటంలో అయన సక్సెస్ అయ్యారు . ఆయనకు
  అభినందనలు !

 2. @విశేఖర్,
  చందు కి ఈ శీర్షిక, మంచి ఫ్రోత్సాహకారి.

  @Chandu,
  These complements, definitely gives you a good encouragement.. Good job.

 3. మాన్యమిత్రులు వి. శేఖర్ గారికి శుభాకాంక్షలు. మా కుమారుడు చంద్రశేఖర్ తీసిన ఫొటోలను గురించిన మీ వ్యాఖ్యను చదివాను. చందు ఫొటోలు బాగున్నై. మీ వ్యాఖ్య ఇంకా బాగున్నది. సంతోషం. ” విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమ: ” అని మన ఆర్యోక్తి. ఒక కళాకారుడి విద్యలోని విలువను ఆ రంగానికి చెందిన మరొక సహృదయ కళాకారుడు మాత్రమే గమనించగలడు. మీ వ్యాఖ్య ఫొటోగ్రఫీలో మీకున్న నైపుణ్యానికి మణిదర్పణంగా ఉన్నది. ” తరు: ప్రసూతే పుష్పాణి, మరుద్వహతి సౌరభం ” మొక్కలు పూలను పూస్తాయి. అంతవరకే. కానీ వాటిలోని సుగంధాన్ని ఒక చోటినుండి మరొక చోటికి తీసుకొని వెళ్లి ఆ పుష్ప సౌగంధ్యాన్ని సార్ధకం చేసేది గాలి. అదేవిధంగా మా చందు మంచి నైపుణ్యంతో ఫొటోలను తీశాడు. మీరు ఆ ” నైపుణ్యాన్ని ” గుర్తించి వేలాదిమందికి తెలియజేశారు. మరొక మాట. ” మణినా వలయం, వలయేన మణి: ” మణిని పొదగటం వలన బంగారు కంకణానికి, కంకణంలో పొదగటం వలన మణికి విలువ పెరుగుతై. అట్లాగే మా అబ్బాయి ఫొటోలు, మీ వ్యాఖ్య పరస్పరమూ విలువలను పెంచుకొన్నాయి. మీ సహృదయతకు మరొక్క మారు కృతజ్ఞతలను తెలియజేస్తూ….
  మీ
  -డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి.

 4. డాక్టర్ గారికి,

  నమస్కారం. మీ సంతోషం, మీరు చెప్పిన మంచి మాటలు నాకూ ఆనందాన్ని పంచాయి.

  ఫొటోగ్రఫీకి సంబంధించి నాకు నైపుణ్యం ఏమీ లేదు, పరిశీలన తప్ప.

  మీ అబ్బాయికి మీరు ఇస్తున్న ప్రోత్సాహం అభినందనీయం. చంద్ర శేఖర్ కేంద్రీకరిస్తే మంచి ఫొటోగ్రాఫర్ కాగలరనడంలో సందేహం లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s