క్రిమియాను వదిలేసిన ఉక్రెయిన్, జి8 మీటింగ్ రద్దు


g8sochiఉక్రెయిన్ కేంద్రంగా మరో రెండు గుర్తించదగిన పరిణామాలు జరిగాయి. ఒకటి: క్రిమియా నుండి ఉక్రెయిన్ తన సైన్యాలను పూర్తిగా ఉపసంహరించుకుంది. రెండు: జూన్ లో రష్యా నగరం సోచిలో జరగవలసిన జి8 శిఖరాగ్ర సమావేశాన్ని జి7 గ్రూపు దేశాలు రద్దు చేశాయి.

ఉక్రెయిన్ నుండి పూర్తి స్వాతంత్ర్యం కోరిన తీర్మానాన్ని క్రిమియా ప్రజలు పెద్ద సంఖ్యలో బలపరచడంతో క్రిమియా పార్లమెంటు తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఆ వెంటనే రష్యన్ ఫెడరేషన్ లో సభ్య ప్రాంతంగా చేర్చుకోవాలని రష్యాకు దరఖాస్తు చేసుకుంది. ఈ దరఖాస్తును ఆమోదిస్తూ పార్లమెంటు నిర్ణయం తీసుకోగా అధ్యక్షుడి పుతిన్ సంతకంతో అది చట్టం అయింది.

క్రిమియా రిఫరెండంను చట్ట వ్యతిరేకంగా ప్రకటించిన పశ్చిమ దేశాలు ప్రతిగా రష్యాపై ఆంక్షలు ప్రకటించాయి. రష్యాకు చెందిన వ్యాపారులు, ప్రభుత్వాధికారులు రెండు డజన్ల మంది వరకూ ఈ ఆంక్షల పరిధిలోకి తెస్తున్నట్లు ప్రకటించాయి. ఆంక్షలకు అమెరికా నేతృత్వం వహిస్తుండగా ఐరోపా దేశాలు గొణుక్కుంటున్నాయి. రష్యా గ్యాస్ ను అతి తక్కువ ధరలకు ఆ దేశాలు పొందుతున్నాయి. దానితో ఒక మాదిరి వాణిజ్య ఆంక్షలను కూడా అవి ప్రతిఘటిస్తున్నాయి.

క్రిమియా ప్రాంతం రష్యన్ ఫెడరేషన్ లో ఒక భాగంగా మారిపోయాక అక్కడ ఉన్న ఉక్రెయిన్ సైనికులు పలువురు క్రిమియాకు విధేయత ప్రకటించారు. ఉక్రెయిన్ నుండి వివిధ రాజకీయ నాయకులు, నూతన ప్రభుత్వంలోని అధికారులు క్రిమియా రావడానికి ప్రయత్నించినప్పటికీ క్రిమియా ఆత్మ రక్షణ దళాలు వారిని నిరోధించాయి. ప్రజలు ప్రదర్శనలు తీస్తూ ఉక్రెయిన్ సైనికులను వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. దానితో క్రిమియాలోని పలు ఉక్రెయిన్ సైనిక స్ధావరాలలో సైనికులు బిక్కు బిక్కు మంటూ గడిపారు.

ఈ నేపధ్యంలో క్రిమియాలోని ఉక్రెయిన్ విధేయ సైనికులను వెంటనే అక్కడి నుండి వెనక్కి రప్పించుకుంటామని సోమవారం తాత్కాలిక అధ్యక్షుడు ఒలెక్సాండర్ తుర్చినోవ్ పార్లమెంటులో ప్రకటించాడు. ఆ వెంటనే ఉక్రెయిన్ బలగాలు, వారి కుటుంబాలు క్రిమియా నుండి వెనక్కి వచ్చేయాల్సిందిగా ఆదేశాలు వెళ్ళాయి. తద్వారా క్రిమియాతో ఉన్న చివరి నామమాత్ర బంధాన్ని ఉక్రెయిన్ తెంచుకున్నట్లు అయింది.

క్రిమియా ఓడరేవు నగరం ఫియోడోసియా నగరంలో ఉక్రెయిన్ కు మరైన్ స్ధావరం ఉన్నది. రష్యా అనుకూల ఆత్మ రక్షణ బలగాలు సోమవారం ఈ స్ధావరంపైకి వెళ్ళి స్వాధీనం చేసుకున్నాయి. దానితో తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోక తప్పని పరిస్ధితి ఉక్రెయిన్ కు ఏర్పడింది. సోమవారం సాయంత్రానికల్లా క్రిమియాలో తమ బలగాలు ఎవరూ లేరని ఉక్రెయిన్ ప్రకటించింది.

“ఉక్రెయిన్ సైనికులంతా రష్యాకు విధేయత ప్రకటించడం అయినా చేశారు, లేదా క్రిమియాను వదిలి వెనక్కి రావడం అయినా చేశారు” అని ఉక్రెయిన్ ఉప ప్రధాని రుస్తమ్ తెమిర్గాలియేవ్ పత్రికలకు తెలిపారు.

క్రిమియాలో ఉక్రెయిన్ కు 189 మిలట్రీ వసతులు ఉన్నాయనీ వాటన్నింటిపైనా ఇప్పుడు రష్యా పతాకాలు ఎగురుతున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారమే రక్షణ మంత్రి సెర్గీ షోయిగు క్రిమియా సందర్శించారు. సేవాస్తపోల్ లోని రష్యా నౌకా స్ధావరాన్ని సందర్శించాక ఉక్రెయిన్ బలగాలతో మాట్లాడారు. క్రిమియాలోనే ఉన్నట్లయితే రష్యా సైనికులకు ఇచ్చే వేతనాలే వారికీ చెల్లిస్తామని చెప్పారు. ఉక్రెయిన్ వేతనాల కంటే రష్యా వేతనాలు ఎక్కువ. దానితో పలువురు సైనికులు రష్యాకు విధేయత ప్రకటించుకున్నారు.

జి8 సమావేశం రద్దు

మరోవైపు పశ్చిమ దేశాలు రష్యాపై ప్రతీకార చర్యలను కొనసాగించారు. జూన్ లో జరగనున్న జి8 గ్రూపు దేశాల సమావేశం తాము రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. జి7 గ్రూపు దేశాలు, రష్యా కలిసి జి8 గ్రూపు ఏర్పడింది. ఏప్రిలో జరగవలసిన జి8 దేశాల విదేశీ మంత్రుల సమావేశాలను కూడా రద్దు చేసుకోవాల్సిందిగా సలహా ఇచ్చామని జి7 కూటమి తెలిపింది.

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడా దేశాలు జి7 కూటమిలో సభ్య దేశాలు. ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాలివి. రష్యా ఒకప్పుడు అమెరికాతో పోటీగా ఆధిపత్యం చెలాయించిన నేపధ్యం, రష్యా వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధ సంపద, సహజ వనరులు… వీటన్నింటి దృష్ట్యా జి7 దేశాలు రష్యాతో కలిపి జి8 కూటమిని ఏర్పాటు చేశాయి. కానీ జి7 ను మాత్రం అవి రద్దు చేయలేదు.

క్రిమియాలో రిఫరెండం జరిగితే జి8 సమావేశాన్ని రద్దు చేసుకుంటామని క్రిమియా సంక్షోభం మొదలయినప్పటి నుండీ జి7 కూటమి ప్రకటిస్తూ వచ్చింది. ఫ్రాన్స్ అయితే జి8 నుండి రష్యాను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఫ్రాన్స్ ప్రకటనను నిర్ధారిస్తూ ఇతర దేశాలేవీ ఇంతవరకు ప్రకటన జారీ చేసినట్లు లేదు.

ఈ నేపధ్యంలో మంగళవారం జి7 నిర్ణయం వెలువడింది. ఉక్రెయిన్ పై మిలట్రీ చర్యకు ప్రతీకారంగా సమావేశం రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం జి7 దేశాల మధ్య నెదర్లాండ్స్ రాజధాని హేగ్ లో చర్చలు జరిగాయని పత్రికలు తెలిపాయి.

అణు భద్రతా శిఖరాగ్ర సమావేశం (న్యూక్లియర్ సెక్యూరిటీ సమిట్) కోసం హేగ్ లో సమావేశం అయిన సందర్భంగా జి7 సభ్య దేశాలు ఉక్రెయిన్ (క్రిమియా) విషయమై చర్చలు జరిపి లాంఛన ప్రాయంగా రద్దు నిర్ణయం ప్రకటించాయి. 

“రష్యా తన ధోరణి మార్చుకునే వరకూ జి8 లో మేము పాల్గొనడాన్ని సస్పెండ్ చేస్తున్నాము. జి 8 సమావేశాలు సజావుగా జరిగే వాతావరణం ఏర్పడే వరకూ ఈ పరిస్ధితి కొనసాగుతుంది. జూన్ లో తలపెట్టిన జి8 సమావేశాలకు బదులుగా జి7 సమావేశాలు జరుపుతాము. సోచికి బదులు బ్రసేల్స్ లో సమావేశం జరుగుతుంది” అని జి7 దేశాల ఉమ్మడి ప్రకటన పేర్కొంది.

“మేము ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించాము. ఐరోపా, కెనడా, జపాన్ దేశాలతో సమన్వయ పరుస్తూ ఈ ఆంక్షలు విధించాము.  సంక్షోభాన్ని రష్యా ఇంకా పెంచుకుంటూ పోతే మేము మరింత తీవ్ర చర్యలకు దిగుతాము. రంగాలవారీగా ఆంక్షలు విధిస్తాము. రష్యా ఆర్ధిక వ్యవస్ధపై గణనీయమైన ప్రభావం పడేట్లుగా చర్యలు తీసుకుంటాము” అని జి7 కూటమి అధికారి ఒకరు చెప్పారని ది హిందు తెలిపింది.

ఇలా చెబుతున్నప్పటికీ రష్యాపై ఆంక్షలు విధించడంలో అమెరికా, ఐరోపాల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా యూరో జోన్ నాయకుడు జర్మనీకే ఆంక్షలు మరింత ముందుకు వెళ్ళడం ఇష్టం లేదు. రష్యా అవసరం వారికి ఆ స్ధాయిలో ఉన్నది. కానీ అమెరికా ఒత్తిడితో ఐరోపా దేశాలు కూడా ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించక తప్పలేదు. వ్యక్తిగత స్ధాయికే పరిమితమైన ఈ ఆంక్షలు వివిధ రంగాల మీదికి మళ్ళే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. రష్యాపై ఆంక్షలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధపైకి మళ్లే అవకాశం ఉందని అమెరికా పాలకులే ప్రైవేటుగా అంగీకరిస్తున్నారని కొన్ని పత్రికలు చెప్పడం విశేషం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s