భారత క్రికెట్ సామ్రాజ్యాన్ని ఏలుతున్న శ్రీనివాసన్ కు ఊహించని వైపు నుండి కొరడా దెబ్బ ఛెళ్ మని తగిలింది. ఐ.పి.ఎల్ కుంభకోణం నేపధ్యంలో ఒకవైపు చెన్నై సూపర్ కింగ్స్ టీం యజమానిగా ఉంటూ మరోవైపు బి.సి.సి.ఐ అధిపతిగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించింది. అల్లుడి మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ కార్యకలాపాలపై నిస్పాక్షిక విచారణ జరగాలంటే బి.సి.సి.ఐ అధ్యక్ష పదవికి శ్రీనివాసన్ రాజీనామా చేయవలసిందేనని తేల్చి చెప్పింది. ‘మీరే తప్పుకుంటారా లేక మమ్మల్ని తప్పించమంటారా?’ అని సూటిగా ప్రశ్నించింది. కమిటీ సభ్యులను లోబరుచుకుని పదవిలో కొనసాగడమే కాకుండా మరోసారి అధ్యక్ష పదవికి ఎన్నికయిన శ్రీనివాసన్ కు సుప్రీం కోర్టు ఆగ్రహంతో తప్పుకోక తప్పని పరిస్ధితి ఎదురయింది.
జస్టిస్ ఎ.కె.పట్నాయక్, జస్టిస్ ఇబ్రాహీం కలీఫుల్లా లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం ఈ మేరకు బి.సి.సి.ఐ కి ఆదేశాలు ఇచ్చింది. “మీరు శ్రీనివాసన్ ని దిగిపొమ్మని చెప్పండి. లేకపోతే ఆయన్ని దిగిపొమ్మని మేమే ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది” అని బి.సి.సి.ఐ కౌన్సెల్ కు స్పష్టం చేసింది. “మీకు మా జడ్జిల మీద కంటే, శ్రీనివాసన్ పైనే ఎక్కువ నమ్మకం ఉన్నట్లుంది” అని బి.సి.సి.ఐ ని దెప్పి పొడిచింది. శ్రీనివాసన్ పదవి నుండి తప్పుకోకపోతే ఆయన అల్లుడిపై నిస్పాక్షిక విచారణ ఎలా సాధ్యం అని ప్రశ్నించింది.
“బి.సి.సి.ఐ అధ్యక్షుడు పదవి నుండి దిగిపోకుండా నిస్పాక్షిక విచారణ జరిగే అవకాశం లేదని మేము కనుగొన్నాము. అత్యున్నత పదవిలో ఉన్న ఆ వ్యక్తి వెంటనే దిగిపోవాలి. మీరు (శ్రీనివాసన్) ఇంకా ఎందుకు పదవిని అంటిపెట్టుకుని ఉన్నారు? మీరు (శ్రీనివాసన్ లాయర్ సుందరం) ఒక కౌన్సెల్ గా నిజాయితీతో వ్యవహరించాలి తప్ప శ్రీనివాసన్ లాయర్ గా వ్యవహరించకూడదు” అని జస్టిస్ పట్నాయక్ నిలదీశారు. “నిజాయితీగా, నిస్పాక్షికంగా విచారణ జరగాలంటే శ్రీనివాసన్ తప్పుకుని తీరాలి” అని జస్టిస్ కైఫుల్లా స్పష్టం చేశారు.
శ్రీనివాసన్ అల్లుడు మీయప్పన్ వ్యవహారంపైన జస్టిస్ ముకుల్ ముదుగల్ నేతృత్వంలోని కమిటీ విచారణ జరిపింది. సుప్రీం ఆదేశాల మేరకు నియమిమించబడిన ముదుగల్ కమిటీ తన నివేదికను ఈ కమిటీ సీల్డ్ కవర్ లో సుప్రీం కోర్టుకు అందజేసింది. నివేదికను పరిశీలించిన ద్విసభ్య ధర్మాసనం ఈ రోజు విచారణ జరుపుతూ నివేదికలోని అంశాల పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇంత స్పష్టమైన, తీవ్రమైన ఆరోపణలు ఉండగా మీయప్పన్ బంధువు శ్రీనివాసన్ అత్యున్నత పదవిలో కొనసాగడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
మ్యాచ్ ఫిక్సింగ్ లో భారత టీం కెప్టెన్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కూడా అయిన ధోనీకి కూడా భాగస్వామ్యం ఉన్నట్లుగా ముదుగల్ కమిటీ గుర్తించినట్లుగా కొన్ని పత్రికలు తెలిపాయి. ఈ ఆరోపణలపై స్పందించిన ధోనీ జీ న్యూస్ పై పరువు నష్టం దావా కూడా వేశారు. సుప్రీం కోర్టు మాత్రం ఇంతవరకు ధోనీ పాత్ర గురించి ఏమీ వ్యాఖ్యలు చేయలేదు.
న్యాయమూర్తుల వ్యాఖ్యలకు స్పందిస్తూ శ్రీనివాసన్ కౌన్సెల్ సుందరం తమకు నివేదిక ప్రతులు చూపించలేదని తెలిపారు. నివేదికలో ఉన్న అంశాలేమిటో తమకు తెలియదని కాబట్టి నివేదికకు స్పందించే అవకాశం తమకు లేదని ఆయన తెలిపారు. దానికి స్పందించిన జస్టిస్ పట్నాయక్ ఆయనను తనకు దగ్గరగా రమ్మని చెప్పి నివేదిక చివర ఉన్న కంక్లూజన్ భాగాన్ని చూపారు.
విచారణ సందర్భంగా సుప్రీం జడ్జిలు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవి ఇలా ఉన్నాయి.
జస్టిస్ పట్నాయక్: “సీల్డ్ కవర్ లో ఉన్న నివేదికలో నిర్దిష్ట నిర్ధారణలు ఏమీ లేనప్పటికీ, ఆరోపణలు చాలా తీవ్రమైనవి. వాటిపై మరింత విచారణ జరగవలసి ఉంది. బి.సి.సి.ఐ తనకు తానుగా విచారణ చేయలేదు గనుక బైటి సంస్ధ చేత విచారణ చేయించాలి. అందుకే మేము నిస్పాక్షిక విచారణ జరగడానికి వీలుగా శ్రీనివాసన్ ను పదవి నుండి తప్పుకోవాలని కోరుతున్నాము… బి.సి.సి.ఐ అనే సంస్ధను కాపాడుకోవాలని మేము భావిస్తున్నాము. బి.సి.సి.ఐ ని నియంత్రిస్తున్న పెద్దలు ఎలాంటి చర్యా తీసుకోకపోవడం వల్లనే అది (బెట్టింగ్) జరిగింది.”
బి.సి.సి.ఐ అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించిందన్న సుందరం వ్యాఖ్యకు స్పందిస్తూ జస్టిస్ పట్నాయక్: “నిస్పాక్షిక విచారణ జరగడానికి వీలుగా మీరు పదవి నుండి ఎందుకు దిగిపోరు? మీరు పదవి నుండి దిగకపోతే మేము మా తీర్పు ప్రకటిస్తాము. సమస్య ఏమిటంటే మీకు మా ఇద్దరు జడ్జిలపైన నమ్మకం లేదు గానీ మీ మనిషి (శ్రీనివాసన్) పైన బాగా నమ్మకం ఉంది. ఆయన తనంత తానుగా తప్పుకుంటే మంచిది. ఆయన దిగిపోటారో లేదో ఆయన నుండి సూచనలు తీసుకోండి. మేము మళ్ళీ గురువారం మీ వాదనలు వింటాము.”
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అధికారి, శ్రీనివాసన్ అల్లుడు అయిన గురునాధ్ మీయప్పన్ బెట్టింగ్ కు పాల్పడ్డారని, జట్టు సమాచారాన్ని బైటివారికి అందజేశారని వచ్చిన ఆరోపణలు రుజువైనాయని ముగ్గురు సభ్యులా ముదుగల్ కమిటీ తేల్చి చెప్పింది. చెన్నై సూపర్ కింగ్స్ యజమాని మీయప్పనే అనేందుకు స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయని కమిటీ ధ్రువపరిచింది. శ్రీనివాసన్ మాత్రం సి.ఎస్.కె జట్టులో ఆయన ఒక ఉద్యోగి మాత్రమే అని వాదించారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై మాత్రం మరింత విచారణ జరగాలని కమిటీ సిఫారసు చేసిందని ది హిందు తెలిపింది.
అత్యుత్తమ న్యాయస్థాన తీర్పు విధాయకం, హర్షదాయకం. ఇంతకాలం న్యాయపరంగా ఉపేక్షించడమే స్రీనివాసన్ పదవికాంక్షకు పోసిన ఊపిరి. పదిమందికి మంచి చెప్పవలసిన వయసులో ఇటువంటి దోపిడి నైజానికి బానిసకావడం మానవతా విలువలకు తిలోదకాలు చెప్పడమే !