దర్యాప్తు అధికారులు వెల్లడించిన కొన్ని అంశాలు MH370 అదృశ్యంపై కొత్త వెలుగును ప్రసరింప జేశాయి. ఈ అంశాలు మలేషియా అధికారుల దృష్టిలో మొదటి నుండీ ఉన్నప్పటికీ ప్రపంచానికి తెలియడం ఇదే తొలిసారి. డెయిలీ మెయిల్ పత్రిక ఈ అంశాలను వెల్లడి చేసింది. తనను తాను గుర్తించడానికి నిరాకరించిన మలేషియా దర్యాప్తు అధికారిని ఉటంకించిన డెయిలీ మెయిల్ (సి.ఎన్.ఎన్ ద్వారా), విమానం 35,000 అడుగుల ఎత్తు నుండి ఒక్కసారిగా 12,000 అడుగుల ఎత్తుకు దిగి వచ్చిందని తెలిపింది.
ఏవియేషన్ నిపుణులు ఇలా విమానం ఒక్కసారిగా కిందికి దిగడాన్ని ముఖ్యమైన సమాచారం అని చెబుతున్నారు. వీరి ప్రకారం కాక్ పిట్ లో అత్యవసర పరిస్ధితి ఏర్పడినప్పుడే పైలట్లు ఇలా విమానాన్ని కిందికి దించుతారు. విమానం ఉద్దేశ్యపూర్వకంగా దిశ మార్చుకుని వెనక్కి మళ్లిందని మలేషియా విమానయాన అధికారులు ప్రారంభంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. ఇలా దిశ మార్చుకోవడం, ఒక్కసారిగా తక్కువ ఎత్తులోకి రావడం అన్నవి పైలట్లు ఎదుర్కొన్న అత్యవసర పరిస్ధితిని సూచిస్తున్నాయని నిపుణులు తెలిపారు.
మలేషియా మిలట్రీ రాడార్ ప్రకారం MH370 (బోయింగ్ 777-200) ను చివరిసారిగా గుర్తించిన సమయం మార్చి 8 తెల్లవారు ఝాము గం. 2:15 ని.లు. ఆ సమయానికి అది మలేషియాకు చెందిన పెనాంగ్ ద్వీపానికి వాయవ్య దిశగా 200 నాటికల్ మైళ్ళ దూరంలో ఉంది. అనగా మలక్కా ద్వీపకల్పం సమీపంలో అండమాన్ సముద్రంపై ఎగురుతోంది. దీనికి దాదాపు గంటకు ముందు విమానం కౌలాలంపూర్ నుండి బీజింగ్ కు ఈశాన్య దిశలో ఎగురుతూ ఒక్కసారిగా వెనక్కి మళ్ళింది. కొద్దిసేపటి అనంతరం పశ్చిమ దిక్కుగా ప్రయాణించింది.
ఈ రోజు సి.ఎన్.ఎన్ ద్వారా వెలువడిన సమాచారం ప్రకారం విమానం వెనక్కి మళ్లిన వెంటనే 35,000 అడుగుల ఎత్తు నుండి 12,000 అడుగుల ఎత్తుకు దిగింది. రాడార్ ట్రాకింగ్ వ్యవస్ధ ద్వారా ఈ సంగతిని గుర్తించారు. ఆ విధంగా తక్కువ ఎత్తుకు దిగిన కొద్ది సేపటికి విమానం అదృశ్యం అయిపోయింది. అనగా ట్రాన్స్ పాండర్లు సిగ్నల్స్ పంపడం ఆగిపోయింది. ఇది ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందా, ప్రమాదవశాత్తూ జరిగిందా అన్నది ఇంకా తేలలేదు. మలేషియా అధికారులు ఏ అవకాశాన్నీ కొట్టిపారేయలేదు.
మలేషియా అధికారులు చెబుతున్నదాని ప్రకారం విమానం వెనక్కి మళ్లిన చోటు విమానాలకు బాగా రద్దీగా ఉండే చోటు. అనగా నిరంతరం ఆ మార్గంలో విమానాలు ప్రయాణిస్తుంటాయి. విమానాల రద్దీ నుండి తప్పించుకోవడానికే పైలట్ తమ విమానాన్ని బాగా తక్కువ ఎత్తుకు దించాడని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇది స్టాండర్డ్ ప్రాక్టీస్ లో భాగమే అని నిపుణులు చెప్పారని డెయిలీ మెయిల్ తెలిపింది.
“విమాన సిబ్బంది ఎలాంటి తప్పు పని చేయలేదనడానికి ఇప్పుడు సాక్ష్యం లభించినట్లయింది. నిజానికి ఇప్పుడు మనం ప్రాధమికంగా భావించవలసింది ఏమిటంటే పైలట్లు గుడ్ నైట్ చెప్పిన కొద్ది సేపటికే ఏదో జరగరానిది జరిగిందని” అని తమ ఏవియేషన్ నిపుణుడు మైల్స్ ఓ’బ్రెయిన్ చెప్పారని సి.ఎన్.ఎన్ తెలిపింది. విమానంలో ఏర్పడ్డ సంక్షోభం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవలసిన అవసరం పైలట్లకు వచ్చి ఉంటుందని, అందుకోసమే వారు ఎక్కువ గాలి లభించే తక్కువ ఎత్తుకు దిగి ఉంటారని ఆయన తెలిపాడు.
“10,000 అడుగుల ఎత్తుకు ఎందుకు దిగుతారంటే, ఆ ఎత్తులో ఒత్తిడి గురించి చింతపడాల్సిన అవసరం ఉండదు. (ఆ ఎత్తులో) వాతావరణంలో తగినంత గాలి ఉంటుంది. సహజంగానే ప్రయాణీకులను బతికించేందుకు ఈ పని చేస్తారు…. అతి వేగంగా ఒత్తిడిని తగ్గించే ప్రక్రియలో -దీనినే హై డ్రైవ్ అంటారు- ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా తక్కువ ఎత్తుకు చేరుతారు” అని మైల్స్ తెలిపారు. అయితే 35,000 అడుగుల ఎత్తు నుండి 12,000 ఎత్తుకు ఎంత సమయంలో దిగిందీ వివరాలు వెల్లడి కాలేదు.
అమెరికా రవాణా విభాగం మాజీ ఇనస్పెక్టర్ జనరల్ మేరీ షియావో కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. “గతంలో తెలిసిన వివరణాలలో ఇమడనటువంటి చాలా ముక్కలకు ఇప్పుడు సరైన అర్ధాలు లభిస్తున్నాయి. ఏదైనా జరగకూడనిది జరిగిన పరిస్ధితి ఏర్పడితే, విమానం డ్రమేటిక్ మలుపు తీసుకుని 35,000 అడుగుల నుండి 12,000 అడుగుల ఎత్తుకు దిగి ఉంటుంది. విమానం కాక్ పిట్ లో అనుకోని విధంగా తీవ్ర ప్రమాదం తలెత్తినపుడు పైలట్ ఇలాగే చేయాలి. వేగంగా ఒత్తిడి తగ్గించాల్సిన పరిస్డితి ఏర్పడడం, అగ్ని ప్రమాదం, పేలుడు… ఇలాంటివి జరిగినప్పుడు తక్కువ ఎత్తుకు చేరి, వెనక్కి మళ్లి, ప్రమాదంలో ఉన్న విమానం దిగడానికి చోటు ఇవ్వగల సమీపంలోని విమానాశ్రయానికి చేరుకొని విమానాన్ని దించాలి” అని మేరీ తెలిపారు.
ఈ సమాచారం నిజం అయినట్లయితే పైలట్లు గానీ లేదా ప్రయాణీకుల్లో ఎవరైనా గానీ టెర్రరిస్టు చర్యకు పాల్పడి ఉండవచ్చన్న ఊహా గానాలకు తెర వేయాలి. కానీ ఇతర అంశాల్లాగానే ఇందులోనూ సమాధానం దొరకని ప్రశ్నలు ఇంకా ఉన్నాయని తెలుస్తోంది.
ఇలా ఉండగా, ఆస్ట్రేలియా, చైనాల శాటిలైట్లకు కనపడ్డాయని చెబుతున్నా శిధిలాలు ఏవీ ఇంతవరకు దొరకలేదు. వాటి కోసం వెతికి వెతికి విమానాలు, నౌకలు నీరసించాయి. ఈ లోగా ఫ్రాన్స్ మరో శిధిలాల సమూహం ఆచూకీ కనిపెట్టినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫ్రాన్స్ శాటిలైట్ లు గుర్తించిన వస్తువుల కోసం వేట సాగుతోంది. చైనా, ఆస్ట్రేలియాల శాటిలైట్ల చిత్రాలలో కనిపించిన వస్తువుల కోసం వెతకడం మానుకున్నారు. చైనా అయితే తమ సమాచారాన్ని ఉపసంహరించుకుంది కూడా.