టికెట్ వచ్చింది, ఎక్కడో తెలియదు -కార్టూన్


Election mania

*********

: నాకు టికెట్ వచ్చిందోచ్, ఈ నియోజకవర్గం ఎక్కడుందో కాస్త (గూగుల్ లో) వెతికి పెట్టు.

: సిటింగ్ ఎం.పి కి టికెట్ ఇవ్వకూడదని మీరు నిర్ణయించుకున్నా టికెట్ నాకే ఇవ్వొచ్చు. (ఎందుకంటే) వాళ్ళకి అసలు నేనెప్పుడూ మొఖం చూపిందే లేదు.

: ఆ, ఆ, ప్రాంతీయ పార్టీతో సీట్ల పంపిణీ చర్చలు భేషుగ్గా సాగుతున్నాయ్. వాళ్ళు నాకు ఓ భద్రమైన సీట్ కూడా ఆఫర్ ఇచ్చారు. నేను వాళ్ళ పార్టీలోకి చేరిపోతున్నాను!

*********

ఎన్నికల జాతర లోకి అడుగు పెట్టాక రాజకీయ పార్టీలు, వాటి నాయకులు వేసే విచిత్ర వేషాలకు అంతూ పొంతూ అంటూ ఉండదు. జనం నాడి పసి గట్టి సురక్షిత పైన రాజకీయ ఛత్రం నీడలో చేరడానికి ఉరుకులు పరుగులు సాగించండంతో మొదలయ్యే ఈ జాతర ఎన్నికలు ముగిసి గులాములు చల్లుకోవడం, ‘ప్రజల తీర్పును మన్నిస్తున్నాం” అంటూ మేకపోతు గాంభీర్యాల ప్రదర్శనలతో ఇవి ముగిసిపోతాయి. ఎన్నికల్లో ఎవరు గెలిచి ఎవరు ఓడినా జీవితంలో ఓడిపోయేది మాత్రం ఎప్పుడూ సగటు ఓటరే.

ఎన్నికల జాతరలను స్ధూలంగా నాలుగు దశలుగా విభజించవచ్చు.

మొదటి దశ, కప్పల తక్కెడ. ఎన్నికలు సమీపిస్తునాయి అనుకున్న సమయంలో ఈ దశ ప్రవేశిస్తుంది. హఠాత్తుగా వివిధ నాయకుల రాజకీయ విధేయత మారిపోతుంది. ఒక పార్టీలోని నాయకుడు ప్రత్యర్ధి పార్టీ నేతను/నేతలను పొగడ్డం మొదలు పెడతాడు. మరో నాయకుడు అప్పటిదాకా పొగిడిన తమ సొంత నేతలను తెగనాడడం మొదలు పెడతాడు. మా పార్టీలో ప్రజాస్వామ్యం లేనే లేదని బాధపడతాడు మరోకాయన. అక్కడికి ఆయనేదో ప్రజల స్వామ్యాన్ని గౌరవిస్తున్నట్టు. దేవత అన్న నోటితోనే దయ్యం అని తిట్టేస్తాడు.

కప్పల తక్కెడ దశలో గోడ దూకుళ్ళు జోరుగా నడుస్తాయి.  కొద్ది రోజులు లేదా వారాల వ్యవధిలోనే పార్టీలన్నీ చుట్టి వచ్చే నేతలు కూడా మనకి కనిపిస్తారు. టికెట్ ఇవ్వరేమోనన్న భయంతో ముందుగానే ప్రత్యర్ధి పార్టీలతో బేరసారాలు జరిపేది కొందరయితే దూకిన తర్వాత చూసుకోవచ్చన్న ధైర్యంతో దూకేదీ కొందరు. ఆ విధంగా ముందు నేనే దూకా అన్న క్రెడిట్ కొట్టేస్తారు.

అలకలు, బుజ్జగింపులు కూడా ఈ దశలో ప్రారంభ దశలో ఉంటాయి. కానీ పెద్దగా బైటికి కనపడవు. కానీ వారి ప్రకటనలను పరిశీలిస్తే వారి మాటల్లో నేరుగా వచ్చే అర్ధాలు కాకుండా ఇంకేదో అర్ధం చూపే ప్రయాస కనిపిస్తుంది. ఆ విధంగా “నేను ముందే చెప్పా కదా” అని నిలదీయడానికి, లేక “నేనెప్పుడు అన్నాను” అని దబాయించడానికి కావలసిన అవకాశాలను దగ్గరే ఉంచుకుంటారు.

రెండో దశ, టికెట్ల దశ. ఆయా రాజకీయ పార్టీలు ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు తరహాలో ఒకటో జాబితా, రెండో జాబితా అంటూ చివరి నిమిషం దాకా పత్రికలకు భారీ మేత వాములు సమకూర్చి పెడతాయి. టికెట్ల జాతరలో ప్రధానంగా కదిలేది రాజకీయ నేతలే. ఎక్కే గడప దిగే గడప అన్నట్లుగా సిఫారసుల కోసం అటూ ఇటూ పరుగెడుతుంటారు. విమాన ప్రయాణాలు జాస్తి అవుతాయి. వారి అనుచరుల సంగతి చెప్పనే అవసరం లేదు. ఎన్నికలప్పుడే గదా అనుచర గణాలకు కాస్త ఆదాయం.

టికెట్ల దశలో కూడా గోడ దూకుళ్ళు జరిగినా అవి కాస్త నెమ్మదిస్తాయి. రాజకీయ నాయకులు ఇక తమకు టికెట్ దొరికిన పార్టీలో ప్రజా స్వామ్యం గురించి సెంటిమెంట్లు గుమ్మరిస్తారు. ఈ దశలో కొన్ని బ్యాంకు ఖాతాల్లో బ్యాలెన్స్ లు పెరుగుతూ పోతుంటే కొన్ని ఖాతాల్లో బ్యాలెన్స్ లు అమాంతం పడిపోతాయి. పోలీసులకు దొరికేటట్లుగా లక్షలు దాటిస్తూ, దొరక్కుండా కోట్లు తరలిస్తుంటారు.

రాజకీయ నేతలు ఛానెళ్లలో తెరపై కనిపిస్తూ నానా రకాల వెర్రి మొర్రి వేషాలు వేస్తారు. తాము వేసే వేశాలన్నింటికీ జనాన్ని అడ్డం పెట్టుకుంటారు. ఆ రకంగా వేషాలు వేయకపోతే ఇక ప్రజా సేవ చేయలేమని ఒట్టు పెడతారు. తరచుగా “ప్రజలే నిర్ణయిస్తారు” అని ప్రకటిస్తుంటారు. తాము బతికేదే ప్రజల కోసం అని నమ్మబలుకుతారు.

టికెట్ల దశ ప్రారంభంలో కమిషన్ దశ అనే ఒక చిన్న ఉపదశ ఉంటుంది. దీనిని టికెట్ల దశకు నాందీ దశ అని కూడా అనొచ్చు. ఈ ఉప దశలో ఎన్నికల కమిషన్ హఠాత్తుగా జూలు విదిల్చిన సింహం లాగా వీరంగం ఆడుతుంది. ఈ వీరంగం చూస్తే ‘ఆహా, మనది కదా అసలు సిసలైన ప్రజాస్వామ్య వ్యవస్ధ’ అని మన భుజాలు మనమే చరుచుకోవాలనిపిస్తుంది. ఇదే ప్రజాస్వామ్యం గొప్పతనం అని పత్రికలు తెగ మురిసిపోతాయి. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు అంటూ అంతర్జాతీయ కార్పొరేట్ పత్రికలు కూడా కాస్త హడావుడి చేస్తాయి. పనిలో పనిగా నీతి బోధలు కూడా చేస్తాయి.

మూడో దశ సవారీ దశ. టికెట్లు దొరికాక సవారీ మొదలవుతుంది గదా. బస్సు టికెట్ దొరికితే బస్సు సవారీ; రైలు టికెట్ దొరికితే రైలు సవారీ; పార్టీ టికెట్ దొరికితే జనం సవారీ. జనాన్ని వేపుకు తినే దశ ఇది. ఈ దశలో శబ్ద కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. రోడ్డు మీది కొస్తే మైకుల రొద. ఇంట్లో కూచుంటే ఛానెళ్ల రొద. వార్తలు అస్సలు చూడ/విన బుద్ధి కాదు. న్యూస్ ఛానెళ్లను కట్టేస్తారని ముందే అనుమానించే నేతలు ఎంటర్ టైన్ మెంట్ ఛానెళ్లలోకి కూడా జొరబడతారు. పెయిడ్ న్యూస్ కి రాచ మార్గంగా ప్రకటనల ప్రచారం సాగించడం నేటి రోజుల్లో ఒక కళ. ఇక దిన పత్రికలంటే అసహ్యం వేసేస్తుంది. ఎన్నికలు ఎప్పుడు ముగుస్తాయా అన్న వేదన పట్టుకుంటుంది.

సవారీ దశలో కింది స్ధాయి కార్యకర్తలకు బోలెడు పనీ, కాస్త ఆదాయం. ఈ దశలో వాళ్ళకి రోజులు చాలా వేగంగా గడిచిపోతాయి. పొద్దు పోయేదాకా జీపుల్లో, కారుల్లో తిరిగీ, తిరిగీ చివరికి బార్లలో తేలతారు. లేదా తామే అనధికారిక బార్లు తెరుచుకుంటారు. రోజుకో కార్యకర్త ఇల్లు బార్ గా మారినా మారొచ్చు. వాహనాల తాకిడికి ఇళ్ళు, ఆఫీసులు దుమ్ముపట్టి పోతే మనుషుల చెవులు గుబులు పట్టిపోతాయి.

సవారీ దశ చివర్లో అంతా సైలెంట్ అయినట్లు కనిపిస్తుంది. కానీ అసలు రాజకీయాలు జరిగేది ఆ రెండు, మూడు రోజుల్లోనే. శిబిరాలకు శిబిరాలు ఒక్క రాత్రిలోనే విధేయత మార్చేస్తాయి. కూలీ జనానికి పని లేని ఆదాయం వచ్చేది అప్పుడే. బైబిలు, భగవద్గీత లాంటి గ్రంధాలు కూడా రంగం మీదికి వస్తాయి. ఒక చేతికి నోటిచ్చి ఇంకో చేతిని బైబిల్/గీత పైకి లాగుతారు. పిల్లకాయలకి క్రికెట్ కిట్లు బోనస్ గా వస్తాయి. ఆ కిట్లలో ఒకటుంటే మరొకటుండదు. 6 వికెట్లు ఉండాల్సింది 2, 3 తో సరిపెడతారు. వికెట్ కీపర్ కి ఒకటే గ్లౌజ్. బ్యాట్స్ మేన్ కి ఒకటే లెగ్ ప్యాడ్. టీం మెంబర్లందరికీ ఒకటే జాక్ (జాక్ స్ట్రాప్)… ఇలా అనేక విచిత్రాలు క్రికెట్ కిట్ల పంపిణీలో చోటు చేసుకుంటాయి.

ఈ మధ్య కాలంలో కరెన్సీ నోటు తో పాటు జాకెట్ ముక్కలు, ఉంగరాలు, చీరలు… లాంటివి కూడా పంచుతున్నారు. ఈ నాయకులు ఎంత సంపాదిస్తే ఈ విధంగా డబ్బు పారిస్తారు? ఈ చైతన్యం జనానికి రాకూడదు. పైకి తెలియదు గానీ, జనానికి చైతన్యం రాకుండా ఉండడానికి, తద్వారా ఎన్నికలంటే కరెన్సీ నోట్లు, క్రికెట్ కిట్లు, జాకెట్ ముక్కలు అన్న భ్రమల్లోనే ఉంచడానికీ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు పడే శ్రమ మామూలుది కాదు. ఎన్నో వ్యూహాలు వారు ప్రతేడూ అమలు చేస్తుంటారు.

ఇక చివరి దశ అలసట దశ. ఈ దశ అందర్నీ సమానంగా చూస్తుంది. గెలిచినోడు, ఓడినోడు అన్న తేడా లేకుండా అందరూ అలిసిపోయి ఉంటారు. కార్యకర్తలు తిని, తాగి, తిరిగి అలిసిపోయి ఉంటారు. పోలింగు సిబ్బంది ప్రయాణాలు చేసి టి.ఏ, డి.ఏ ల కోసం పోరాడి అలసి ఉంటారు. పత్రికలు, ఛానెళ్ల సిబ్బంది రొటీన్ లో పడడంతో జనానికి కాస్త తెరిపిడి చిక్కుతుంది. గెలిచినోడు, ఓడినోడు ఇద్దరూ ఆస్తులు కోల్పోయి ఉంటారు. గెలిచినోడికి సంపాదించుకోవచ్చన్న భరోసా దక్కితే ఓడినోడికి 5 యేళ్ళు ఆగితే తానూ గెలవచ్చు అన్న ఆశ మిగులుతుంది. జనం మాత్రం అన్ని విధాలా చెడి ఉంటారు. పాత దొర పోయి కొత్త దొర రావడం తప్ప వాళ్ళ బతుకుల్లో మార్పేమీ ఉండదు.

మొత్తం మీద ఎన్నికలనేవి ఒక జాతర. ఒక నాటకం. ఒక మోసం. ఒక కాలుష్యం. ఒక వంచన. ఒక హిపోక్రసీ. ఒక మాయ. ఒక ముసుగు. ఒక స్టేటస్ కో.

3 thoughts on “టికెట్ వచ్చింది, ఎక్కడో తెలియదు -కార్టూన్

  1. పింగ్‌బ్యాక్: టికెట్ వచ్చింది, ఎక్కడో తెలియదు -కార్టూన్ | ugiridharaprasad

  2. కాంగెస్ కోటరిలో బ్లాకులో కోట్ల పరిధిలో అమ్ముడుపోయే టికెట్లు, నేడు డిస్కౌంట్ ఇచ్చినా తీసుకోవడానికి జంకుతున్నారు. ఓటమి మాట పక్కనుంచి, ధరావతు గల్లంతయ్యే ప్రమాదాన్ని చూసి ముందుగానే జాగ్రతపడుతున్నారు. రాజకీయ కతలు బెడిసికొట్టిన మిడిసిపాటు ఫలితం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s