ఆస్ట్రేలియా, చైనాలది అయింది. ఇప్పుడిక ఫ్రాన్స్ వంతు వచ్చింది!
ఫ్రాన్స్ శాటిలైట్ లు కూడా హిందూ మహా సముద్రంలో MH370 విమాన శిధిలాలుగా భావించ దగిన వస్తువుల్ని కనిపెట్టాయిట! విమానం అదృశ్యం అయి రెండు వారాలు పైనే అయింది. తమ వారి పరిస్ధితి ఏమయిందో తెలియక బాధితులు రెండు వారాలుగా తీవ్ర ఆవేదన చెందుతుంటే… ఇప్పుడు తీరిగ్గా మా శాటిలైట్లు అప్పుడే కనిపెట్టాయంటూ ఆయా దేశాలు మెల్లగా చెప్పడం విడ్డూరం.
ఫ్రాన్స్ తమ శాటిలైట్ తీసిన చిత్రాలను మలేషియాకు అందజేసింది. వీటి ప్రకారం హిందూ మహా సముద్రంలో తేలియాడుతున్న వస్తువులు ఏవో ఉన్నాయి. సదరు వస్తువులు ఉన్న ప్రదేశం ఆస్ట్రేలియా, చైనా శాటిలైట్లు కనిపెట్టిన చోటికి దగ్గరగానే ఉందని ది హిందూ తెలిపింది. ఎంత దగ్గరగా ఉన్నదన్న వివరాలు పత్రిక ఇవ్వలేదు. సదరు వస్తువుల వివరాలు కూడా ఇవ్వలేదు.
డెయిలీ మెయిల్ పత్రిక కొన్ని వివరాలు ఇచ్చింది. ఆ పత్రిక ప్రకారం పెర్త్ కు నైరుతి దిశలో 1550 మైళ్ళ (2,500 కి.మీ) దూరంలో జరుగుతున్నా అన్వేషణకు నాయకత్వం వహిస్తున్న ఆస్ట్రేలియాకు మలేషియా, ఫ్రాన్స్ ఫోటోలు ఇచ్చింది. అనగా కొత్త చిత్రాలు కూడా దాదాపు ఆస్ట్రేలియా, చైనాలు కనిపెట్టిన వస్తువులనే చూపుతున్నట్లు అర్ధం అవుతోంది.
ఫ్రాన్స్ సమకూర్చిన కొత్త చిత్రాల వల్లనో ఏమో తెలియదు గానీ ఆస్ట్రేలియా విమానం ఆచూకీ కనిపెట్టగలమన్న నమ్మకం ఇంకా బలపడుతోందని చెబుతోంది. హిందూ మహా సముద్రంలోని దక్షిణ కారిడార్ లో అన్వేషణకు ఆస్ట్రేలియా ప్రభుత్వమే నాయకత్వం వహిస్తోంది. అందువల్ల ఫ్రాన్సు శాటిలైట్ చిత్రాలను ఆస్ట్రేలియాకు కూడా మలేషియా అందజేసింది. ఈ చిత్రాల్లోని వస్తువులు MH370కి చెందిన వస్తువులే కావచ్చని మలేషియా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. వివరాలు మాత్రం ఇవ్వలేదు.
హిందూ మహా సముద్రంలో వస్తువులు కనపడినట్లు ఆస్ట్రేలియా చెప్పిన తర్వాత నాలుగు రోజులు గడిచాయి. అప్పటి నుండి వివిధ దేశాలకు చెందిన నౌకలు, విమానాలు ఈ ప్రాంతంపై కేంద్రీకరించి వెతుకుతున్నాయి. కానీ ఇంతవరకు వాటి జాడ మాత్రం లేదు.
వాటికి బదులుగా ఒక ఆస్ట్రేలియా అన్వేషణ విమానానికి కొన్ని కొత్త వస్తువులు కనపడినట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు. ఒక చెక్క పాలేట్ (సరుకుల పెట్టెలని జరపడానికి వినియోగించే చదరపు బల్ల లాంటిది), దాని చుట్టూ వివిధ రంగుల్లో ఉన్న సీటు బెల్టులు ఈ వస్తువుల్లో ఉన్నాయి. ఇవి MH370 విమానానికి చెందినవే కావచ్చని మలేషియా, ఆస్ట్రేలియా అధికారులు నమ్ముతున్నారు. కాని న్యూజిలాండ్ విమానం ఒకటి ఈ చెక్క పాలెట్ తదితర వస్తువులను వెతకడానికి వెళ్ళగా అవి మళ్ళీ కనిపించలేదని తెలుస్తోంది.
మరోవైపు మలేషియా పోలీసులు విమాన సిబ్బంది నేపధ్యాన్ని తరిచి చూసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా విమాన పైలట్ మాజీ భార్యను విచారించాలని మలేషియా పోలీసులు నిర్ణయించుకున్నారు. అమెరికాకి చెందిన ఫెడరల్ పోలీసు సంస్ధ ఎఫ్.బి.ఐ ఆమెను విచారించాలని మలేషియాపై తీవ్రంగా ఒత్తిడి తేవడంతో పోలీసులు ఈ నిర్ణయానికి వచ్చారని డెయిలీ మెయిల్ తెలిపింది.
మలేషియా సంప్రదాయాల ప్రకారం దుఃఖంలో ఉన్న కుటుంబాల పైన విచారణ పరమైన ఒత్తిడులు తేవడానికి అధికారులు వెనకాడతారు. MH370 పైలట్ భార్య నిజానికి ఆయన నుండి విడాకులు తీసుకున్నారు. కానీ పిల్లలతో ఒకే చూరు కింద నివసిస్తున్నారు. ఇప్పుడామెను విచారించాల్సిందేనని ఎఫ్.బి.ఐ ఒత్తిడి తెస్తోంది.
అసలు మలేషియా పోలీసులు ఏం చేయాలో ఎఫ్.బి.ఐ ఒత్తిడి తేవడం ఏమిటో బొత్తిగా అర్ధం కాని విషయం. విమానం అదృస్యానికి సంబంధించి ఎవరిని విచారించాలో, విచారించకూడదో నిర్ణయించుకోవాల్సింది మలేషియా పోలీసులు లేదా మలేషియా ప్రభుత్వం. వారికి బదులు ఎఫ్.బై.ఐ నిర్ణయించడం, దానికి మలేషియా తల ఒగ్గడం బట్టి మలేషియా-అమెరికాల సంబంధాలను అర్ధం చేసుకోవచ్చు.
- Relatives of Chinese passengers
- New Zealand search plane
- Journalists await for clinching news
- A grafic provided by Australia
- Australian PM Tonny Abbot
- Japanese Lockheed P3C plane going for search operation
ఈ విషయంలో మన తెలుగు సామెతా “ఇదిగో పులంటే అదిగో తోక”నే సామెత అంతర్జాతీయంగా ప్రాచూర్యత చెందింది.