MH370: చైనా శాటిలైట్ చిత్రంలో విమాన శిధిలాలు?


హిందూ మహా సముద్రంలోనే విమాన శిధిలాలు ఉన్నట్లు అనుమానించేందుకు మరో సాక్ష్యం లభించినట్లు తెలుస్తోంది. ఈసారి చైనా దేశానికి చెందిన శాటిలైట్ ‘గావోఫెన్ –1’ రికార్డు చేసిన చిత్రంలో తాజా ఆనవాళ్ళు లభ్యం అయ్యాయి. మార్చి 18 మధ్యాహ్నం సమయంలో శాటిలైట్ గ్రహించిన ఇమేజ్ లో 22 మీ. పొడవు, 30 మీ వెడల్పు ఉన్న వస్తువు కనపడినట్లు చైనా సమాచారం ఇచ్చిందని మలేషియా రవాణా మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ కౌలాలంపూర్ లో విలేఖరులకు తెలిపారు.

ఆస్ట్రేలియా మిలట్రీ అధికారులు తమకు కనపడిందని చెప్పిన చోటుకు సమీపంలోనే చైనా గుర్తించిన చోటు ఉండడం గమనార్హం. పెర్త్ కు నైరుతి దిశలో 2,500 కి.మీ దూరంలో MH370 శిధిలంగా భావిస్తున్న వస్తువు కనపడిందని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ ప్రకటించారు. ఈ చోటుకు పశ్చిమంగా 75 మైళ్ళ దూరంలో చైనా శాటిలైట్ గుర్తించిన చోటు ఉన్నట్లు డెయిలీ మెయిల్ తెలిపింది.

అమెరికాకు చెందిన ప్రైవేటు శాటిలైట్ కంపెనీ ‘డిజిటల్ గ్లోబ్’ వారి చిత్రాన్నే ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇది మార్చి 16 తేదీన తీసిన తీసినది. ఆస్ట్రేలియా, చైనాలు గుర్తించింది ఒకే వస్తువు అయినట్లయితే శిధిలాలు రెండు రోజుల్లో 75 మైళ్ళ దూరం ప్రయాణించినట్లు భావించవచ్చు. ఇప్పుడయితే సరిగ్గా ఈ వస్తువు ఉన్న చోటికే ఒక భారీ తుఫాను ప్రయాణిస్తోంది. కాబట్టి అన్వేషణ మరింత కష్టం అవడమే కాకుండా సదరు వస్తువు మరింత దూరం ప్రయాణించే అవకాశం ఉంది. తుఫాను గాలుల్లో అది ఎటు ప్రయాణిస్తుందో ఊహించడం కష్టం కావచ్చు.

ఆస్ట్రేలియా చెప్పిన వస్తువు 72 అడుగుల పొడవు, 42 అడుగుల వెడల్పు ఉందని చెప్పగా చైనా గుర్తించిన వస్తువు మాత్రం 22 మీ (72 అడుగులు) పొడవు, 30 (98 అడుగులు) ఉన్నట్లుగా చైనా రాయబారి సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. అయితే 30 మీటర్ల వెడల్పు అన్నది పొరబాటున రాసింది కావచ్చని డెయిలీ మెయిల్ తెలిపింది. మలేషియాలోని చైనా రాయబారి చేతితో రాసి పంపిన సమాచార కాగితాన్ని మలేషియా రవాణా మంత్రి హిషాముద్దీన్ విలేఖరులకు చూపారు. (కింద ఫొటోల్లో చూడవచ్చు.)

“(హిందూ మహా సముద్రం లోని) దక్షిణ కారిడార్ లో తేలియాడుతున్న వస్తువుల ఫోటోలను చైనా రాయబారికి అందాయి. ఆ వస్తువులను అన్వేషించడానికి వారు (చైనా) తమ నౌకలను పంపిస్తున్నారు. నేను ఈ అంశాన్ని వెంటనే ఫాలో అప్ చేస్తాను” అని మలేషియా రవాణా మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ విలేఖరులకు వివరించారు.

తమ శాటిలైట్ చిత్రాల్లో కనుగొన్న వస్తువులు ఏదన్నా వాణిజ్య నౌక నుండి జారిపడిన సరుకు పెట్టెలయినా కావచ్చునని అంతకుముందు ఆస్ట్రేలియా ప్రధాని వ్యాఖ్యానించడం చిన్నపాటి దుమారం లేపింది. తాము ఇస్తున్న సమాచారం విశ్వసనీయమైనదని, MH370 ఉనికి దాదాపు దొరికినట్లే అన్నట్లుగా వ్యాఖ్యానించిన ప్రధాని దానిని వెనక్కి తీసుకోవడం ఈ దుమారానికి కారణం. ప్రధాని చెప్పిన వస్తువులను వెతకడానికి వెళ్ళిన ఆస్ట్రేలియా విమానాలు వెనక్కి వచ్చి తమకు ఏవీ కనపడలేదని చెప్పిన తర్వాత ఈ విధంగా తన మాటలను ఆస్ట్రేలియా ప్రధాని కాస్త వెనక్కి తీసుకున్నారు. అయితే చైనా శాటిలైట్ చిత్రాల్లో కూడా ఈ వస్తువులు కనపడడంతో మళ్ళీ ఆశ చిగురించినట్లయింది.

ఆయా దేశాలు తమ తమ మిలట్రీ రాడార్లు కనిపెట్టిన సమాచారాన్ని వెల్లడి చేయడానికి వెనకాడుతున్నాయని కొందరు నిపుణులు ఆరోపిస్తున్నారు. చైనా ఆర్ధిక, వాణిజ్య, మిలట్రీ  ప్రభావాలు క్రమ క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో మిలట్రీ రాడార్ల సమాచారం సున్నితంగా మారిందనీ అందుకే వివిధ దేశాలు ఆ సమాచారాన్ని వెల్లడి చేయడం లేదనీ వారి ఆక్షేపణ. ఇది కొంతవరకు వాస్తవం కూడా. మలేషియా కూడా తమ మిలట్రీ రాడార్ సమాచారాన్ని త్వరగా వెల్లడించలేదు. ఒక దశలో చైనీయ బాధిత కుటుంబాలు మలేషియా అధికారుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.

ఈ ఆరోపణలు పరోక్షంగా భారత దేశంపై కూడా ఎక్కుపెట్టబడ్డాయి. అండమాన్ ద్వీప కల్పంలో భారత దేశం పెద్ద ఎత్తున మిలట్రీ వసతులు కలిగి ఉంది. కానీ భారత్ మాత్రం తమవద్ద సమాచారం ఏమీ లేదని చెప్పింది. నిజానికి విమానం అండమాన్ సమీపంలోకి రావడం ఇప్పటికీ ధ్రువపడింది. కాబట్టి ఇండియా రాడార్లు ఆ విమానాన్ని రికార్డు చేయకపోవడం సాధ్యం కానే కాదు. భారత అధికారులు దీనికి ఇచ్చిన వివరణ మన రాడార్లు అవసరం ప్రాతిపదికపైనే ఏర్పాటు చేసినవని. అంటే అవి ప్రతి రోజూ 24 గంటలూ పని చేయవు. కేవలం అవసరం అనుకున్నపుడే పనిలో పెడతారు.

కానీ మిలట్రీ రాడార్ల ఉద్దేశ్యమే అక్రమ చొరబాట్లను కనిపెట్టడం. విదేశీ గూఢచార విమానాలు అక్రమంగా చొరబడకుండా రాడార్ల ద్వారా కాపలా కాయడం ప్రతి దేశమూ చేసే పనే. అలాంటి మిలట్రీ రాడార్ల అవసరం 24×7 ఉంటుంది. కాబట్టి భారత రాడార్లు మన అధికారులు చెప్పినట్లుగా విమానం ప్రయాణాన్ని కనిపెట్టలేకపోవడం నిజం కాకపోవచ్చు. కానీ భారత మిలట్రీ అవసరాలు సమాచారాన్ని వెల్లడించకూడని పరిస్ధితి కల్పించాయి. సరిగ్గా ఇదే పరిస్ధితి ఇతర దేశాలు కూడా ఎదుర్కొంటున్నాయని, చైనా ఎదుగుదల, ఈ అవసరాన్ని మరింత కఠినం చేశాయని భావించవచ్చు. ప్రభావ విస్తరణ కోసం చైనా, దాన్ని నిరోధించడానికి అమెరికా-ఇ.యు, కృషి చేస్తున్న నేపధ్యంలో ఇలాంటి అమానవీయ పరిస్ధితులు లేకపోతేనే ఆశ్చర్యం.

One thought on “MH370: చైనా శాటిలైట్ చిత్రంలో విమాన శిధిలాలు?

  1. ఇదిగొ పులి అంటే అదిగో తోక అన్నటుగా ఉంది!ఇన్ని దాగుడు మూతలు ఎందుకు?ఎవరిని మభ్యపెట్టడానికి ఈ తతంగమంతా! ఇందులో రాజకీయకోణాలు చాలా కనిపిస్తున్నాయి!బాదిత కుటుంబాలగూర్చి పట్టించుకోకపోవడం ఇందులో అత్యంత విషాదాంతంశం! లోగుట్టు పెరుమాళ్ళకెరుక!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s