ఆమ్ ఆద్మీ పార్టీ తరపున లోక్ సభకు పోటీ చేయడానికి ముందుకు వచ్చిన అభ్యర్ధులనుండి ఆ పార్టీ నాయకులు డబ్బు డిమాండ్ చేసిన సంగతి వెలుగులోకి వచ్చింది. ఒక టి.వి ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఈ సంగతి వెల్లడి అయిన వెంటనే సదరు నాయకులను పార్టీ నుండి తొలగిస్తున్నట్లు ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
న్యూ ఢిల్లీ, తిలక్ లేన్ లో ఉన్న తన నివాసం వద్ద విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసిన ఎ.కె ఎఎపి నేతల తొలగింపు విషయాన్ని ప్రకటించారు. ఉత్తర ప్రదేశ్ లోని అవధ్ జోన్ కన్వీనర్ అరుణ సింగ్, హర్దోయి ట్రెజరర్ అశోక్ కుమార్ లను పార్టీ నుండి తొలగించామని ఎ.కె తెలిపారు. పార్టీ టికెట్ ల కోసం వచ్చిన అభ్యర్ధుల నుండి వీరు ఇరువురు డబ్బు డిమాండ్ చేసినట్లు రుజువయిందని ఆయన తెలిపారు.
“అభ్యర్ధులుగా నిలబెట్టగల అవకాశం ఉన్నవారి నుండి వీరిద్దరు డబ్బు డిమాండ్ చేశారు. మాకు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులకు సాక్ష్యాలు చూపాలని కోరాము. సాక్ష్యాధారాలను పరిశీలించాక ఆరోపణలు నిజమేనని గ్రహించాము… అయితే డబ్బులు చేతులు మారడం అంటూ జరగలేదు” అని అరవింద్ వివరించారు.
సీతాపూర్ కి చెందిన రాజేష్ కుమార్ అనే వ్యక్తి తనను డబ్బు అడిగినట్లు ఫిర్యాదు చేశారని ఒక ఎఎపి నాయకుడు ఇచ్చిన సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆరోపణలు వచ్చినవారిపై ఒక న్యూస్ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది.
“మొదట, ఆడియా రికార్డు మా చేతికి వచ్చినపుడు అది స్పష్టంగా లేదు. అందుకని మరో సారి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించాలని మేము టి.వి చానెల్ రిపోర్టర్ ని కోరాం. రెండోసారి జరిపిన స్టింగ్ లో ఆరోపణలు రుజువయ్యాయి. వెంటనే చర్యలు తీసుకున్నాం” అని సదరు నాయకుడు చెప్పారని ది హిందు తెలిపింది.
మును ముందు కూడా టికెట్ కోసం ఎవరన్నా డబ్బులు డిమాండ్ చేస్తే ఇలాగే స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి తమ దృష్టికి తేవాలని ఎ.కె కోరారు. టి.వి ఛానెళ్లు గానీ, అభ్యర్ధులు గానీ ఎవరు ఈ స్టింగ్ నిర్వహించినా తమకు సమ్మతమే అని తెలిపారు. “ఆ పని ఎవరు చేసినా వారిపైన స్టింగ్ జరపండి. మేము పరిశీలించి వెంటనే చర్య తీసుకుంటాం” అని కేజ్రీవాల్ ప్రకటించారు.
స్టింగ్ ఆపరేషన్ నిర్వహించినపుడు తాము ఒరిజినల్ ఫుటేజీని మాత్రమే పరిగణిస్తామని ఎ.కె స్పష్టం చేశారు. స్టింగ్ లో రికార్డ్ అయిన గొంతును సరిచూసుకున్న తర్వాతే చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాజా చర్యల ద్వారా ఎవరన్నా టికెట్ కోసం డబ్బులు చెల్లిస్తే వారి డబ్బు వృధా అవుతుందని ఈ చర్య ద్వారా సందేశం ఇవ్వదలిచామని, సదరు అభ్యర్ధికి టికెట్ కూడా దక్కదని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్.
కాంగ్రెస్, బి.జె.పి, ఎస్.పి, బి.ఎస్.పి, టి.డి.పి ఇత్యాది పార్టీలు ఇలాంటి చర్యలు తీసుకోగలవా? చస్తే తీసుకోరు. ఆ పార్టీలు పుట్టిందే అక్రమ సంపాదన కోసం, అక్రమంగా సంపాదించిందాన్ని కాపాడుకోవడం కోసం.
అయితే అవినీతి అంటే కేవలం లంచం మాత్రమే కాదు. ఆర్ధిక విధానాల ద్వారా జరిగేది అసలు అవినీతి. సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు అక్రమ సంపాదనాపరులకు రాచ మార్గాలు. వీటిని తిరస్కరించకుండా అవినీతిని నిర్మూలిస్తామని చెప్పడం అంటే క్యాన్సర్ పుండును టింక్చర్ అయోడిన్ తో మాన్పుతామని చెప్పడమే. కానీ ఎఎపి ఇంతవరకు ఈ విధానాలపై ఒక్క మాటా చెప్పలేదు. ఎఎపి డొల్లతనం అంతా అక్కడే ఉంది.
ఇలా పార్టీ కార్యకర్తలు దొడ్డిదారి నుంచి నిధులు పోగుచేస్తుంటే వీధుల్లో ఈయనగారు అవినీతి ప్రక్షాళన గురించి ఉపన్యాసాల విన్యాసాలు చేసి జనాలను సన్నాసులను చేస్తుంటే ఎన్ని కలలో అవినీతి రహిత రాజ్యాంగం ఎప్పుడు మేలుకుంటుంది?