ఉక్రెయిన్ లో నీతి బోధ, సిరియాలో రొయ్యల మేత


Syrian Embassy in Washington, D.C.

Syrian Embassy in Washington, D.C.

ఉక్రెయిన్-క్రిమియా విషయంలో ప్రజాస్వామ్యం గురించీ, దేశాల సార్వభౌమ హక్కులు, ప్రాదేశిక సమగ్రతల గురించి తెగ బాధపడిపోతూ రష్యా, క్రిమియా నాయకులపై వ్యాపార, వీసా ఆంక్షలు విధించిన అమెరికా సిరియాకు వచ్చేసరిగా తన కుక్క బుద్ధి మార్చుకోలేకపోతోంది. ఊరందరికి రొయ్యలు తీనొద్దని చెప్పిన పంతులుగారు ఇంటికెళ్ళి భార్యను రొయ్యల కూర చేయమని కోరిన చందంలో సిరియా ప్రజాస్వామ్యం తన పని కాదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఉక్రెయిన్-క్రిమియా విషయంలో రష్యాపై ఏ ఆరోపణలనైతే గుప్పిస్తున్నదో సరిగ్గా అవే నీతి బాహ్య కార్యకలాపాలకు మరోసారి తెగబడుతోంది.

సిరియా రాయబార కార్యాలయాన్ని, ఇతర నగరాల్లో ఉన్న రెండు కాన్సలేట్ కార్యాలయాలను మూసేయాలంటూ అమెరికా ఆదేశాలు ఇవ్వడాన్ని రష్యా తీవ్రంగా ఖండించింది. ఐరాసకు చెందిన అంతర్జాతీయ రసాయన ఆయుధాల నిర్మూలనా సంస్ధ సభ్యత్వం తీసుకోవడమే కాకుండా ఐరాస ఒప్పందం మేరకు సమస్త రసాయన ఆయుధాలను సిరియా నాశనం చేస్తోందని అయినప్పటికీ ఏకపక్షంగా ఆ దేశ ఎంబసీ, కాన్సలేట్ లను మూసేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని రష్యా ప్రశ్నించింది. సిరియా సంక్షోభం పరిష్కారానికి రాయబార మార్గంలో పోవడం అమెరికాకు ఇష్టం లేదని దుయ్యబట్టింది.

ఉక్రెయిన్ లో తాము బలవంతంగా, హింసాత్మక అల్లర్లతో అధికారంలో కూర్చుండబెట్టిన ప్రభుత్వానికి అంతర్జాతీయ న్యాయబద్ధత సమకూర్చడానికి అమెరికా, ఇ.యు లు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఉక్రెయిన్ విషయంలో రష్యాతో కూడిన కాంటాక్ట్ గ్రూప్ ఏర్పాటు చేయడానికి అమెరికా ఒత్తిడి తెచ్చింది. రష్యా దీనికి నిరాకరించింది. క్రిమియా ప్రజలు తమ భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకునే హక్కు కలిగి ఉన్నారని, ఇందులో తాము కొత్తగా చేసేది ఏమి లేదని రష్యా తెగేసి చెప్పింది. ఉక్రెయిన్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం లాక్కున్న ఫాసిస్టు శక్తులను గుర్తించేది లేదని రష్యా స్పష్టం చేసింది. ఉక్రెయిన్ సమస్యను రేపింది అమెరికాయే కనుక అమెరికాతో చర్చించడానికి తాము సిద్ధమని తెలిపింది.

దీనితో అమెరికా రష్యా పై కన్నెర్ర చేసింది. రష్యా, క్రిమియాలకు చెందిన అనేకమంది నాయకులపై వాణిజ్య, ఆర్ధిక ఆంక్షలు విధించింది. వీసా ఆంక్షలూ విధించింది. క్రిమియాను కలుపుకోవడం ద్వారా ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను రష్యా ఉల్లంఘించ్చిందని ఆరోపించింది. క్రిమియాను రష్యా దురాక్రమించిందని కూడా ఆరోపించింది. కానీ సిరియా వద్దకు వచ్చేసరికి ఉక్రెయిన్-సిరియాల విషయంలో తాను చెబుతున్నా నీతులకు సరిగ్గా విరుద్ధంగా అమెరికా వ్యవహరిస్తోంది.

అమెరికా చర్యను రష్యా విదేశాంగ శాఖ ఖండించింది. “ఆ విధంగా ఏకపక్ష చర్య తీసుకోవడం ద్వారా మా అమెరికా భాగస్వాములు, సారాంశంలో సిరియాలో రాజకీయ నియంత్రణా ప్రక్రియలోని తన సహ భాగస్వామ్య పాత్రను తనకు తానే దూరం చేసుకుంటోంది” అని రష్యా విదేశాంగ శాఖ అమెరికా చర్యలను విమర్శించింది. సిరియాలో సామూహిక విధ్వంసక మారణాయుధాలను (రసాయన ఆయుధాలు) పూర్తిగా నాశనం చేయడం కంటే ఆ దేశంలో ఎలాగైనా ప్రభుత్వాన్ని కూలదోయడానికే అమెరికా కంకణం కట్టుకుందని ఆరోపించింది. రెండున్నరేళ్ల హింస నుండి సిరియా ప్రజలను విముక్తి చేసే ఉద్దేశ్యం అమెరికాకు ఏ కోశానా లేదని ఆరోపించింది.

రష్యా, అమెరికాలో జెనీవా 1 మరియు జెనీవా 2 చర్చల ద్వారా సిరియా శాంతి చర్చలను నిర్వహించాయి. సిరియా తిరుగుబాటు సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు జెనీవా 1 సమావేశంలో విధి విధానాలను రూపొందించి ఒక ఒప్పందానికి వచ్చాయి. అయితే ఈ ఒప్పందం అమలుకు అమెరికా, ఇ.యు లు ఏ మాత్రం సహకరించలేదు. సిరియాలోని ఆల్-ఖైదా తీవ్రవాదులకు మరిన్ని ఆయుధాలు, డబ్బు సరఫరా చేసి మరింత రక్తపాతానికి ఒడిగట్టాయి. టెర్రరిస్టులు, తిరుగుబాటుదారులపై సిరియా ప్రభుత్వం పై చేయి సాధించడంతో సమయం కూడదీసుకోవడానికి జెనీవా 2 సమావేశానికి అంగీకరించింది. కానీ ఈ సమావేశంలో ఎలాంటి ఒప్పందాలూ కుదరలేదు. ఎటువంటి ఫలితం లేకుండానే అవి ముగిసిపోయాయి.

అయితే సిరియా మాత్రం తాను అంగీకరించినట్లుగా రసాయన ఆయుధాలన్నింటిని నాశనం చేస్తోంది. ఈ మేరకు ఐరాస సంస్ధ OPCW (ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్) కూడా వరుస నివేదికలు వెలువరించింది. ఒక పక్క రసాయన ఆయుధాల వినాశనం సాగుతుండగానే మరో పక్క తిరుగుబాటుదారులకు సరికొత్త ఆయుధాల సరఫరాను అమెరికా ప్రకటించింది. స్టింగర్ క్షిపణులు సరఫరా చేసి సిరియా వైమానిక బలగాలపై పైచేయి సాధించే శక్తిని సమకూర్చడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

తమ రాయబార, కాన్సలేట్ కార్యాలయాలను మూసేయాలన్న అమెరికా నిర్ణయాన్ని సిరియా ప్రభుత్వం ఖండించింది. ఈ ఏకపక్ష చర్యతో  రాయబార సంబంధాలకు సంబంధించి వియన్నా (అంతర్జాతీయ రాయబార) ఒప్పందాలను అమెరికా ఉల్లంఘించిందని స్పష్టం చేసింది. అమెరికా విదేశీ మంత్రి జాన్ కేర్రీ తమ చర్యను సమర్ధించుకున్నాడు. అస్సాద్ ప్రభుత్వ చట్ట విరుద్ధత స్పష్టంగా కనిపిస్తోందని తన సమర్ధనకు కారణం చూపాడు. ఇదే సిరియా ప్రభుత్వంతో జెనీవా 1, జెనీవా 2 చర్చలు జరిపిన సంగతిని అమెరికా ఈ విధంగా పూర్వపక్షం చేసేసింది. తనకు ఒక నీతి అనేది లేదని, తన ప్రయోజనమే తన ఏకైక నీతి అని అమెరికా చాటుకుంది.

ఎందుకు మూసేయడం?

ఉన్నట్లుండి సిరియా ఎంబసీ, కాన్సలేట్ లను అమెరికా ఎందుకు మూసేసింది? దీనికి ఒకే ఒక్క సమాధానం: సిరియాలో టెర్రరిస్టులపై అక్కడి ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు. తాము డబ్బు, ఆయుధాలు సరఫరా చేసి పోషిస్తున్న ఉగ్రవాద మూకలు నానాటికీ చావు దెబ్బలు తింటుండడంతో అక్కసుతో ఓర్వలేక, కక్షతో తాను చేయగలిగిన పని చేస్తోంది. ఆ పని చేయడానికి అమెరికాకు ఎలాంటి సూత్రాలు, కారణాలు అవసరం లేదు.

సిరియా లెబనాన్ సరిహద్దులోని వ్యూహాత్మక పట్టణం యాబ్రౌడ్ ను సిరియా ప్రభుత్వ బలగాలు సాయుధ టెర్రరిస్టుల నుండి స్వాధీనం చేసుకున్నాయి. దీని ద్వారా లెబనాన్, సిరియాల మధ్య ఉండే రవాణా మార్గాలపై ప్రభుత్వం పట్టు సంపాదించింది. తద్వారా లెబనాన్ నుండి ఉగ్రవాద మూకలకు అందుతున్న ఆయుధ, ఆహార సరఫరా మార్గాలను ప్రభుత్వ బలగాలు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నాయి. అంతటితో ఆగకుండా యాబ్రౌడ్ చుట్టూ పక్కల ప్రాంతాల్లోనూ ప్రభుత్వ బలగాలు పురోగమిస్తున్నాయి. ఈ పురోగమనం వల్ల లెబనాన్, సిరియా సరిహద్దులపై చాలా వరకు ప్రభుత్వ బలగాలకు అదుపు వచ్చి చేరుతోంది. దానితో అమెరికాకు పిచ్చి పడుతోంది.

లెబనాన్ సరిహద్దుల వెంబడి ఉన్న కాలమౌన్ పర్వత ప్రాంతాల నుండి కూడా సిరియా బలగాలు ఉగ్రవాదులను ఏరి వేస్తున్నాయి. రాజధాని డమాస్కస్ కు పశ్చిమ శివార్లలోనూ ఉగ్రవాద మూకాలను ఏరివేయడంలో ప్రభుత్వ బలగాలు విజయాలు సాధించాయి. యాబ్రౌడ్ కి నైరుతి దిశలో ఉన్న ప్రాంతంలో తమ పట్టు మరింత బిగించే పనిలో ప్రభుత్వ బలగాలు ప్రస్తుతం నిమగ్నమై ఉన్నాయని సిరియా వార్తా సంస్ధ SANA ద్వారా తెలుస్తున్నది.

ఈ పరిణామాలు జీర్ణించుకోలేని అమెరికా తమ దేశంలోని సిరియా ఎంబసీని, రెండు కాన్సలేట్లను మూసేయాలని ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేసింది. రసాయన ఆయుధాలు నిర్మూలిస్తే తాను సాయుధ దాడి చేయబోనని శాంతి ప్రక్రియకు సహకరిస్తానని హామీ ఇచ్చిన అమెరికా ఈ విధంగా తన హామీని తానే తుంగలో తొక్కి పారేసింది.

One thought on “ఉక్రెయిన్ లో నీతి బోధ, సిరియాలో రొయ్యల మేత

  1. ఒక ప్రక్క అమెరికా ఆఫ్గాన్ లో అల్కైదా తో పోరాడుతుంది , ఇంకో ప్రక్క సిరియా లో అమెరికా అల్కైదా కి సహాయం చేస్తుంది , ఈ రెండు చర్యలు వ్యతిరేకంగా ఉన్నాయి. దీనిని వివరించ గలరు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s