భారత ప్రభుత్వం రష్యాకు మద్దతుగా నిలబడింది. రష్యాపై ఏకపక్ష ఆంక్షలకు తాము సమర్ధించడం లేదని స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా క్రిమియాలో రష్యా ప్రయోజనాలు ఉన్నాయని గుర్తిస్తున్నామని తెలిపింది. క్రిమియా ప్రజలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఉన్నదనీ అదే సమయంలో ఆ ప్రాంతంలో రష్యా ప్రయోజనాలను కూడా తాము గుర్తిస్తున్నామని తెలిపింది.
ఈ ప్రకటనతో చైనా తర్వాత రష్యాకు మద్దతు ప్రకటించిన దేశాల్లో రెండో దేశంగా ఇండియా నిలిచింది. ఇండియా, రష్యా, చైనా దేశాలు బ్రిక్స్ కూటమిలో సభ్య దేశాలని ఈ సందర్భంగా గమనంలో ఉంచుకోవాలి.
“ఏ దేశంపైనైనా ఏక పక్షంగా ఆంక్షలు విధించడాన్ని ఇండియా ఎప్పుడూ సమర్ధించలేదు. అది ఇరాక్ కావచ్చు, ఇరాన్ కావచ్చు. కాబట్టి ఒక దేశం గానీ, కొన్ని దేశాల సమూహం గానీ ఏకపక్షంగా (ఇప్పుడు) ప్రకటించిన చర్యలను కూడా మేము సమర్ధించము” అని ప్రభుత్వ వర్గాలు చెప్పాయని ది హిందు తెలిపింది.
భారత దేశం తీసుకున్న అవగాహనకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. భారత దేశం తీసుకున్న నిర్ణయం సహనశీలత తోనూ, ఆధారాలతో కూడుకున్నాట్టిదిగానూ ఉందని కొనియాడారు. క్రిమియా తిరిగి రష్యాలో కలుస్తున్న సందర్భంగా పార్లమెంటు ఉభయ సభల సభ్యుల సమావేశాన్ని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. ఈ ప్రసంగం సందర్భంగా ఆయన చైనా, ఇండియాలకు కృతజ్ఞతలు తెలిపారు.
“క్రిమియా పట్ల మేము తీసుకున్న చర్యలను అర్ధం చేసుకున్నవారందరికి మేము ఋణపడి ఉన్నాము. క్రిమియాలో పరిస్ధితిని చారిత్రక, రాజకీయ సమగ్రతా దృష్టితో పరిశీలిస్తున్న చైనా ప్రజలకు ధన్యవాదాలు. భారత దేశపు సహనశీలతను, వాస్తవిక దృక్పధాన్ని మేము ఉన్నతమైనదిగా భావిస్తున్నాం” అని పుతిన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
మార్చి 6 తేదీన అటూ ఇటూ కాకుండా మధ్యస్ధ అవగాహనను ప్రకటించిన ఇండియా ఈ సారి మాత్రం రష్యావైపు మొగ్గు చూపుతున్నట్లుగా అవగాహనను ప్రకటించింది. “5,000 మందికి పైగా భారతీయులు ఉక్రెయిన్ లో ఉన్నారు. వారి భవిష్యత్తు పట్ల మాకు ఆందోళనగా ఉంది. ఉక్రెయిన్ మరియు దాని పొరుగు దేశాల మధ్య సమస్యలను స్ధిరమైన రాయబార ప్రయత్నాల ద్వారా పరిష్కరించుకోవాలని మేము కోరుతున్నాం” అని అప్పటి విదేశాంగ శాఖ ప్రకటన పేర్కొంది.
తాజాగా పశ్చిమ దేశాలు దూకుడుగా ప్రకటిస్తున్న ఆంక్షల పట్ల ఇండియా కాస్త భిన్నంగా స్పందించింది. “(క్రిమియాలో) న్యాయబద్ధమైన రష్యా ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. వాటిని సమగ్రంగా చర్చించి పరిష్కరించుకోవాలని మేము భావిస్తున్నాం” అని జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ ప్రకటించారు.
భారత్ ప్రకటనకు ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఫోన్ చేసి క్రిమియా పరిస్ధితిని క్షుణ్ణంగా వివరించారు. ఈ సంభాషణ జరిగిన ఒక రోజు తర్వాత రష్యాపై ఏకపక్ష ఆంక్షలను సమర్ధించేది లేదని ఇండియా ప్రకటించింది.
గత కొద్ది రోజులుగా రష్యాపై పశ్చిమ పత్రికలు పచ్చి విష ప్రచారం చేస్తున్నాయి. గురివింద గింజ తన నలుపు ఎరుగదు అన్నట్లుగా స్వతంత్ర దేశాల్లో తమ అనుకూల ప్రభుత్వాలను నిలపడానికి కూల్చివేతలకు, అంతర్గత కుట్రలకు, మిలట్రీ కుట్రలకు నిరంతరం పాల్పడే అమెరికా దుశ్చర్యలను ప్రజాస్వామ్య సంస్ధాపనగా కొనియాడడం పశ్చిమ పత్రికలు విధిగా భావిస్తాయి. కానీ క్రిమియాలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ ఓటింగ్ ను మాత్రం ‘అన్యాయం’గానూ చట్ట విరుద్ధంగానూ కొట్టి పారేస్తున్నాయి.
ఇవే పత్రికలు దక్షిణ సూడాన్ విడిపోవడాన్ని సమర్ధించాయి. అక్కడ జరిగిన ప్రజాభిప్రాయ సేకరణను గొప్ప ప్రజాస్వామ్య ప్రక్రియగా కొనియాడాయి. యు.కె నుండి విడిపోవడానికి స్కాట్లాండ్ లో జరగనున్న రిఫరెండం ను కూడా ఇవి సమర్ధిస్తున్నాయి. అలాంటిది క్రిమియా ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చట్టవిరుద్ధం అయిందో, ఏ చట్టాలకు, ఎవరి ప్రయోజనాలకు విరుద్ధమైందో అవి చెప్పడం లేదు.
పచ్చి అబద్ధాల ప్రచారం చాలక రష్యా, క్రిమియాలకు చెందిన అనేక మంది రాజకీయ, ప్రభుత్వ నాయకులపైనా, అధికారులపైనా ఆంక్షలు విధించాయి అమెరికా, ఇ.యు లు. వివిధ నేతలపై వీసా ఆంక్షలు కూడా విధించాయి. అయితే ఈ ఆంక్షల గురించి పశ్చిమ పత్రికలు టాం టాం చేసుకోవడం తప్పించి వాస్తవంగా వాటిని లెక్క చేస్తున్నవారు లేరు. ఒకవైపు ఆంక్షల చప్పుళ్ళు చేస్తుండగానే మరోవైపు క్రిమియాలో జరగవలసింది జరిగిపోతోంది. రష్యా ఫెడరేషన్ లో చేరికకు క్రిమియా పెట్టుకున్న దరఖాస్తును రష్యా పార్లమెంటు ఆమోదించింది.
క్రిమియాలో ఇంకా మిగిలి ఉన్న ఉక్రెయిన్ బలగాలను కూడా క్రిమియా వాలంటీర్ దళాలు ఉక్రెయిన్ కి పంపేశారు. ఘర్షణలు ఏవీ జరగకుండానే ఉక్రెయిన్ బలగాలు తమ నేవీ బేస్ ను వదిలి వెళ్లిపోయాయి. ఉక్రెయిన్ లోని పశ్చిమ అనుకూల నూతన ప్రభుత్వ నేతలు క్రిమియా సందర్శిస్తామని ప్రకటించారు. కానీ వారిని ఎవరూ ఆహ్వానించలేదనీ, ఒకవేళ వారు వచ్చినా సరిహద్దుల దగ్గరే తిప్పి ప్ంపేస్తామని క్రిమియా ప్రభుత్వం ప్రకటించింది.
క్రిమియా వ్యవహారంతో మరోసారి అమెరికా దాని తోక దేశాలు తమ దివాలాకోరుతనాన్ని…, స్వార్థబుద్ధిని ప్రపంచానికి చాటుకుంటున్నాయి.