నేత: నాది చాలా భద్రమైన సీటు. అందుకే నాకు చాలా అభద్రతగా ఉంది.
గెంటివేయబడ్డాక: మా నాయకుడి కోసం నా భద్రమైన సీటును త్యాగం చేయడానికైనా నేను సిద్ధం!
వార్తలు: … ఆ విధంగా మొదటి ఫలితం వెలువడింది. XXX గారు తన పార్టీకే చెందిన సిటింగ్ ఎం.పి ని ఒడిస్తూ భద్రమైన సీటును గెలుచుకున్నారు…
***
మోడి ఆలోచనా విధానం భారతీయ జనతా పార్టీని శాసిస్తున్నాయా? ఆ పార్టీ సీనియర్ నేతల సణుగుడులు చూస్తే అలానే తోస్తోంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని మోడి భావించింది మొదలుకొని ఆ పార్టీలో ఒక్కో సీనియర్ నేతా పక్కకు తప్పుకోవాల్సిన పరిస్ధితులు వరుసగా జరుగుతూ వస్తున్నాయి.
కొడితే కుంభ స్ధలాన్నే కొట్టాలన్నట్లుగా నరేంద్ర మోడి ప్రారంభంలోనే అత్యంత సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ చిరకాల వాంఛకే ఎసరు పెట్టారు. ప్రధాన మంత్రి పదవిలో కూర్చోవాలన్న ఆశలను ఎన్నడూ దాచుకోలేదు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నపుడే ఆయన ఆర్.ఎస్.ఎస్ సహాయంతో ఆయన్ని తప్పించాలని చూశారని ఒక దశలో ఊహాగానాలు సాగాయి.
ఈ ఊహాగానాల నేపధ్యంలో వాజ్ పేయి ఓ సారి అకస్మాత్తుగా పార్లమెంటులోనే అలిగి బైటికి వెళ్ళిపోయారు. అద్వానీ కదలికలకు వ్యూహాత్మకంగా చెక్ పెట్టే ఉద్దేశ్యంతో ఆయన రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారని కూడా కొన్ని పత్రికలు గోణిగాయి. మొత్తం మీద అద్వానీకి ఉప ప్రధాని పదవి కట్టబెట్టడం ద్వారా ఆయనను సంతృప్తిపరిచారు.
ఎన్.డి.ఏ ప్రభుత్వం చివరి కాలంలో దేశంలో బి.జె.పి అనుకూల పవనాలు బలంగా వీస్తున్నాయన్న అంచనాతో తొందరపడి ముందే ఎన్నికలకు పోయింది బి.జె.పి. అద్వానీని తదుపరి ప్రధానిగా కూడా ప్రకటించింది. మా ప్రధాని అభ్యర్ధిని ప్రకటించామ్, మీ అభ్యర్ధి ఎవరు అంటూ కాంగ్రెస్ కి సవాలు కూడా విసిరింది. ‘భారత్ వెలిగిపోతోంది’, ‘అంతా బాగుంది’ అంటూ నినాదాలిచ్చి ఇక గెలవడమే తరువాయి అని భావించింది.
తీరా చూస్తే జనం యు.పి.ఏ కి అధికారం కట్టబెట్టారు. ఎన్నికల తీర్పుకు స్పందించాలన్న మర్యాదను కూడా విస్మరించేంతగా పాపం బి.జె.పి షాక్ తిన్నది. ఆ విధంగా అద్వానీ ఆశలు ఆవిరైపోయాయి. 2009 లోనూ బి.జె.పి/ఎన్.డి.ఏ కోలుకోలేక పోయింది. పదవీ వియోగ నైరాశ్యం వారిని అంతలా చుట్టేసింది మరి. 2014 నాటికి వారికి మోడి ఆ పార్టీకి ఆపద్భాందవుడే అయ్యారు. ఆయన చుట్టూ ఉబ్బించిన కృత్రిమ గాలి హోరులో అద్వానీ కొట్టుకుని పోయారు. అస్త్ర సన్యాసం చేస్తానని అద్వానీ శపధం చేసినా అదీ వెనక్కి తీసుకోక తప్పలేదు. ఆర్.ఎస్.ఎస్ ఆదేశాలు తనకు శిరోధార్యం అని చెబుతూ అద్వానీ తన తీవ్ర శపధాలను తాటాకు చప్పుళ్ళుగా తానే తేల్చేశారు.
కుంభ స్ధలాన్ని కొట్టాక ఇక ఎదురేముంది? బతికినా వెయ్యే, చచ్చినా వెయ్యే అన్న పేరు సంపాదించుకున్న ఏనుగే దారికొచ్చాక ఛోటా మోటా నాయకులు ఏ మూలకి? ఆ విధంగానే జైట్లీ, సుష్మా స్వరాజ్, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి తదితర అగ్ర నాయకత్వం అంతా మోడి ఆజ్ఞలను శిరసా వహిస్తున్నారు.
ఆ మధ్య అసరం బాపు లీలలు బైటికి వచ్చినపుడు ఉమా భారతి లాంటి నేతలు ఉత్సాహంగా ఆయనకు మద్దతు వచ్చారు. కానీ వారంతా మరుసటి రోజు నోరు మెదపలేదు. మోడి ఆదేశాలతోనే వారంతా గప్ చుప్ అయ్యారని పత్రికలు తెలిపాయి.
సుష్మా స్వరాజ్ చివరి వరకు అద్వానితోటే ఉన్నట్లు కనిపించారు. కానీ అధ్యక్షుడు రాజ్ నాధ్, ఆర్.ఎస్.ఎస్ నేతలతో సహా అంతా మోడికే మద్దతు ఇవ్వడంతో అద్వానీని ఒంటరిని చేసి ఆమె వెళ్లిపోక తప్పలేదు. జైట్లీ ప్రారంభంలో మోడికి వ్యతిరేకంగా ఒకటి రెండు పరోక్ష ప్రకటనలు చేసినా చాలా ముందుగానే మోడి పక్షం వెళ్ళిపోయారు.
వారి వరుసలో తాజాగా చేరిన నేత మురళీ మనోహర్ జోషి. బి.జె.పి మాజీ అధ్యక్షులు కూడా అయిన జోషి ఎన్.సి.ఈ.ఆర్.టి గ్రంధాలను మతతత్వ భావాజాలంతోనూ, కల్పిత చరిత్రలతోనూ నింపేయడంలో చురుకుగా వ్యవహరించిన ఆరోపణలు ఆయనపైన తీవ్రంగా వచ్చాయి. ఆయన ధోరణికి నిరసనగా రొమిలా ధాపర్ లాంటి ప్రఖ్యాత చరిత్రకారులు సైతం తమ తమ పదవులకు రాజీనామా చేయడమో, ఆయనే తప్పించడమో జరిగింది.
అంతోటి నాయకుడు సైతం మోడి దెబ్బకు గిలగిలా కొట్టుకున్నారు. వారణాసి నుండి మోడి పోటీ చేస్తారన్న వార్తలు వచ్చినపుడు జోషి అంతర్గతంగా తిరుగుబాటు లేవదీశారని వార్తలు వచ్చాయి. తన సిటింగ్ సీటును ఖాళీ చేసేది లేదని, మోడి మరోచోటు చూసుకోవాల్సిందేనని చెప్పినట్లు పత్రికలు తెలిపాయి. పత్రికల్లో వస్తున్న ఊహాగానాలకు వివరణ ఇవ్వాలని ఆయన పార్టీ నేతలను కోరినట్లు వార్తలు వచ్చాయి.
ఇప్పుడేమో పార్టీ ఆదేశిస్తే పార్టీ కోసం ఏమైనా చేస్తానని జోషి గౌరవంగా పక్కకు తప్పుకున్నట్లు తాజాగా వెలువడుతున్న విశ్లేషణలు చెబుతున్నాయి. వారణాసి నుండి మోడి పోటీ చేస్తారని ఖాయం అయ్యాక జోషికి పార్టీ విధేయత, సైద్ధాంతీక నిబద్ధతలు ఆటోమేటిక్ గా శరణ్యం అయ్యాయి. అవి తప్ప తన లొంగుబాటుకు మరో గౌరవప్రదమైన కారణాలు బహుశా ఆయనకు లేకపోవచ్చు.
మురళీ మనోహర్ జోషి మరియు అలాంటి అగ్రశ్రేణి నాయకుల గౌరవభంగ వివరణలను ఈ కార్టూన్ చక్కగా ప్రతిబింబిస్తోంది. బహుశా దీనికి మోడి ఆలోచనా విధానం అని పేరు పెట్టాలేమో!
రాజ్యం వీర భొజ్యం. మోడి, రాహుల్, ములాయం, మాయవతి, నితీష్, జయలలిత, మమత, చంద్రబాబు, జగన్, కచరా,నవీన్, ఈ పార్టిలన్నిటిలొ, ఒక్క భాజపా మాత్రమే ఏక వ్యక్తి పార్టి కాదు. ఇప్పుడు అది కూడ మిగత వాటితొ కలిసిపొయింది అంతె తేడ.
“మోడీ” ఛాందస్స భావాలకు, మోడల్ రాజకీయాలకు సరైన “జోడీ”. దాడి చేసే వైరి పక్షాలను ప్రక్షాలణ చెయ్యడంలో యుగంధర పాత్రకు సమర్ధుడు. ఈ లక్షణాలు పాలనా వైవిధ్యానికి అక్రమార్క రాజకీయాలకు ఆగ్ మార్క్. రాబోయే ఐదు సంవత్సరాల పాలనను గంగిరెద్దు భావాల కాంగ్రెస్, సొనియమ్మతో తాన తందానానే భజన మేళాకు దూరంగా బి.జే.పి., తీరంగా ప్రజలు అధికారం కట్టబెట్టడంలో రాజకీయ సానుకూలతను ప్రోతాహించడమే.