విమానం హైజాక్: ఆత్మహత్య, టెర్రరిజం అనుమానాలు -ఫోటోలు


మలేషియా విమానం హైజాక్ అనేక మలుపులు తిరుగుతోంది. ఎన్ని అనుమానాలపై విచారణ జరిపినా, ఎంతగా తలలు బద్దలు కొట్టుకున్నా, చివరికి ఆచూకీ మాత్రం దొరకడం లేదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ విన్న చివరి మాటలను పలికింది పైలట్ కాదని, కో-పైలట్ ఆ మాటలు అన్నారని తాజాగా మలేషియా ప్రకటించింది. బహుశా పైలట్లలో ఎవరన్నా ఆత్మహత్యకు ప్రయత్నించారా అన్న కోణాన్ని పరిశోధిస్తున్నామని ఆ దేశం తెలిపింది. మలేషియా ప్రభుత్వం తమ సమాచారాన్ని కాస్త త్వరగా బైటపెట్టి ఉంటే విలువైన సమయం వృధా అయ్యేది కాదని చైనా విమర్శించింది.

“అల్ రైట్, గుడ్ నైట్.” విమానం కాక్ పిట్ నుండి చివరిగా రికార్డయిన మాటలు ఇవి. ఈ మాటలు చెప్పిన కొద్ది నిమిషాలకే విమానం కదలికలను ప్రసారం చేసే ట్రాన్స్ పాండర్ ఆఫ్ చేయపడింది. ఆ వెంటనే విమానం వెనక్కి మళ్లి పశ్చిమ దిశగా ప్రయాణించినట్లు వివిధ దేశాల శాటిలైట్లు, విమానం బేస్ ట్రాన్సీవర్లు రికార్డు చేశాయి. ఈ మాటలు చెప్పింది 52 సం.ల పైలట్ అని మొదట చెప్పిన మలేషియా, ఇప్పుడు కాదని చెబుతోంది. 27 సం.ల కో పైలట్ ఈ మాటలు అన్నారని ఇప్పుడు చెబుతోంది.

రెండేళ్ల క్రితం ఇద్దరు ఆస్ట్రేలియా యువతులను కాక్ పిట్ లోకి ఆహ్వానించి జల్సా చేశారని ఈ కో-పైలట్ పై ఆరోపణలు వెలువడ్డాయి. సదరు జల్సా ఫోటోలను ఆస్ట్రేలియా యువతుల్లోని ఒకరు డెయిలీ మెయిల్ పత్రికకు విడుదల చేశారు. విమానం ఆచూకీ తెలియలేదంటే అందులో ప్రయాణీకులతో పాటు పైలట్ల కుటుంబాలు కూడా ఆందోళనతో ఉంటాయి. ఇలాంటి పరిస్ధితుల్లో రెండేళ్ల నాడు అమ్మాయిలతో ఫ్లిర్టింగ్ చేసిన ఫోటోల్ని ప్రచురించాల్సిన అవసరం ఏమిటి?

దానికి ఆ అమ్మాయి, ‘విమానం ఆచూకీ గురించి ఎవరికి ఏమీ తెలియడం లేదని పత్రికల్లో చూశాను. ఈ ఫోటోలు విడుదల చేస్తే ఏదో ఒక సమాచారం ఇచ్చినట్లవుతుందని బైటపెడుతున్నాను” అని. ఇది నమ్మదగ్గ కారణం కాజాలదు. బహుశా నిజం ఏమిటంటే బ్రిటన్ పత్రికలు వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి సంచలన వార్తలు, ఫోటోలు ప్రచురించడంలో దిట్టలు. ఆ పత్రికలకు నీతి, నియమం అంటూ ఏమీ ఉండవు. సెల్ ఫోన్లు, ఈ మెయిళ్ళు హ్యాక్ చేసి తారలు, సెలబ్రిటీల జీవితాల్లోకి తొంగి చూసి వాటిని సంచలనం చేయడం ద్వారా డబ్బు సంపాదించడానికి అవి అలవాటు పడ్డాయి. డెయిలీ మెయిల్ వెబ్ సైట్ కి ఇప్పుడు వెళ్ళినా అవే కనిపిస్తాయి.

డెయిలీ మెయిల్ లేదా అలాంటి పత్రిక ఇవ్వజూపిన సొమ్ముకి ఆశపడి సదరు యువతి ఫోటోలను విడుదల చేసి ఉండవచ్చని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. కో పైలట్ ఫరీక్ అబ్దుల్ హమీద్ కుటుంబీకులు కూడా ఈ విషయమై తీవ్ర నిరసన తెలిపారు. బ్రిటిష్ పత్రికల హ్యాకింగ్ దురలవాట్లపై అక్కడ ఒక పార్లమెంటరీ కమిటీ విచారణ కూడా నిర్వహిస్తోంది. రెండేళ్ల క్రితం బద్దలయిన ఈ కుంభకోణం ఫలితంగా స్టార్ ఛానెళ్ల యజమాని రూపర్డ్ మర్డోక్ కి చెందిన వందేళ్ళ నాటి పత్రిక సైతం మూతపడింది.

ఇప్పుడు కో పైలట్ చివరిసారి చెప్పిన మాటలే ఆత్మహత్య అనుమానం వైపుకి మళ్లించాయి. ఆత్మహత్య చేసుకోవడానికి మరో 238 మంది ప్రాణాలను బలిపెట్టే అవకాశాలు ఉన్నాయా అన్నది అనుమానంగా కనిపిస్తోంది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక అయితే ఏకంగా 9/11 తరహాలో భారత్ పై టెర్రరిస్టు దాడి చేయడానికే విమానాన్ని దారి మళ్లించారని ఓ కధనం ప్రచురించింది. సాధారణంగా టెర్రరిస్టు దాడుల గురించి ముందస్తు సమాచారం ఓం ప్రధమం అమెరికా వద్దే దొరుకుతుంది. 26/11 ముంబై దాడుల గురించి తాము ముందే హెచ్చరించామని కూడా అమెరికా తెలిపింది.

తీరా చూస్తే సదరు దాడులకు రెక్కీ నిర్వహించింది సి.ఐ.ఏ ఏజంట్ డేవిడ్ హేడ్లీ అని వెల్లడి అయింది. ఒకవేళ దాడులకు పురిగల్పిందే సి.ఐ.ఏ అయితే అమెరికా వద్ద ముందస్తు సమాచారం ఎందుకు ఉండదు? భారత్ పై టెర్రరిస్టు దాడికి మలేషియా విమానాన్ని దారిమళ్ళించారన్న న్యూయార్క్ టైమ్స్ కధనం నిజమే అయితే మళ్ళీ అమెరికా వద్ద ముందస్తు సమాచారం ఉందని భావించాలేమో తెలియాల్సి ఉంది. మలేషియా, చైనా, వియత్నాం తదితర ఆగ్నేయాసియా దేశాలన్నీ దక్షిణ చైనా సముద్రంలో వెతుకుతుంటే, అమెరికా ఒక్కటే అండమాన్ సముద్రంలోనూ, మలక్కా ద్వీపాల వద్దా అన్వేషణ సాగించింది. దీనర్ధం ఇప్పుడు కూడా అమెరికా వద్ద ముందస్తు సమాచారం ఉన్నట్లనేనా?

విమానం అదృశ్యం అయిన మార్చి 8 తేదీ తెల్లవారు ఝాము గం 1:19 ని.లకు కో-పైలట్ ఫరీక్ “ఆల్ రైట్, గుడ్ నైట్” అని కంట్రోలర్ అధికారులతో అన్నట్లుగా రికార్డ్ అయిందని మలేషియా వెల్లడి చేసింది. విమానంలో ఉండే ACARS కమ్యూనికేషన్స్ వ్యవస్ధ ద్వారా ఈ మాటలు ప్రసారం అయ్యాయి. విమానం నుండి చివరి డేటా ప్రసారం అయిన (అనగా ట్రాన్స్ పాండర్ ని ఆఫ్ చేసిన) 12 ని.ల తర్వాత ఈ మాటల్ని కో-పైలట్ అన్నట్లు తెలుస్తోంది.

మలేషియా పోలీసులు పైలట్, కో-పైలట్ ఇరువురి ఇళ్లను తనిఖీ చేశారు. ఇరువురి ఇళ్లలోనూ పైలట్ సిములేటర్లు దొరికాయని వారు తెలిపారు. అనగా విమానంలో లేకుండానే విమానం నడుపుతున్నట్లు ప్రాక్టీస్ చేసే యంత్ర పరికరాలు ఇరువురి ఇళ్ళలో దొరికాయి. కానీ ఇలా సిములేటర్లను ఇళ్ళలో ఉంచుకోవడం అసాధారణం ఏమీ కాదు. నిజానికి ఈ అనుమానాలు రాక మునుపే పైలట్ ఇంట్లో సిములేటర్ ఉన్నట్లు ఆయన మిత్రులు, కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకి విమానాలు తప్ప వేరే లోకం లేదని, ఇంట్లో కూడా సిములేటర్ పెట్టుకున్నారని చెబుతూ ఈ సంగతి వెల్లడించారు. అదీ కాక తమ వద్ద కూడా సిములేటర్లు ఉన్నాయంటూ పలువురు ఇతర మలేషియా విమాన సిబ్బంది ప్రకటించారు.

Photos: Daily Mail

పైలట్ జహరి అహ్మద్ షా మలేషియాలోని ఓ ప్రతిపక్ష నాయకుడు అన్వర్ ఇబ్రాహీం అభిమాని అని తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీ సభ్యత్వం కూడా ఆయనకి ఉన్నదని సమాచారం. లైంగిక అత్యాచారానికి (సోడొమి) పాల్పడిన ఆరోపణలతో ఆయనను చాలా యేళ్ళ క్రితం జైల్లోకి నేట్టారు. విమానం అదృశ్యం కావడానికి రెండు రోజుల ముందే ఆయనను దోషికి కోర్టు తేల్చింది. ఈ నేపధ్యంలో పైలట్ విపరీత ప్రవర్తనకు దిగారా అన్న అనుమానాలు తలెత్తాయి. కానీ అలాంటి సాక్ష్యాలేవీ ఆయన ఇంటిలో గానీ, సర్వీసులో గానీ లభ్యం కాలేదు. మలేషియా అధికారులు పైలట్ వైపు నుండి ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు.

మరి కో-పైలట్ పై అనుమానమా అంటే అదే విచారణ జరుగుతోందని రవాణా మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ తెలిపారు. ప్రయాణికుల్లో రెండొంతులు చైనా పౌరులే గనుక వారి నేపధ్యాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని మలేషియా, చైనాను కోరింది.

విమానం వెనక్కి మళ్లిన అనంతరం ఉత్తర మలేషియాపై ప్రయాణిస్తుండగా అది చాలా కిందుగా ప్రయాణించిందని, రాడార్ కంటికి చిక్కకుండా ఉండడానికే ఇలా చేశారని మలేషియా అధికారులు చెప్పడం మరో విశేషం. 35,000 అడుగుల ఎత్తుకి వెళ్ళిన విమానం అకస్మాత్తుగా 5,000 అడుగుల ఎత్తుకు దిగిందని, కొద్ది సేపు 45,000 అడుగుల ఎత్తున కూడా ప్రయాణించిందని శాటిలైట్ సంకేతాల ద్వారా తెలిసిందని వారు చెప్పారు. విమానం కిందికి ప్రయాణించిందని భావించిన సమయంలోనే ఉత్తర మలేషియాలోని కొందరు పౌరులు తాము పెద్ద లైట్లు చూశామని, భారీ శబ్దం విన్నామని చెప్పడంతో శాటిలైట్ సంకేతాలు ధ్రువపడినట్లు భావిస్తున్నారు.  

ఇదిలా ఉండగా హిందూ మహాసముద్రంలో ప్రస్తుతం విస్తృతంగా అన్వేషణ సాగుతోంది. ఆస్ట్రేలియా, ఇండియాల తో పాటు 24 దేశాల వరకు ఈ అన్వేషణలో భాగం పంచుకుంటున్నాయి. ఇండోనేషియా నుండి హిందూ మహాసముద్రం వరకు ఈ అన్వేషణ సాగుతోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s