రిఫరెండం: రష్యాలో విలీనానికే క్రిమియన్ల ఓటు


Crimea referendum

క్రిమియాలో జరిగిన ‘ప్రజాభిప్రాయ సేకరణ’ ఫలితాలు వెలువడ్డాయి. రష్యాలో చేరడానికే ప్రజలు భారీ సంఖ్యలో మొగ్గు చూపారు. గతంలో ఎన్నడూ లేనంత సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్న క్రిమియా ప్రజలు ఉక్రెయిన్ లో బలప్రయోగంతో అధికారం చేపట్టిన పాలకుల పట్ల తమ తీవ్ర వ్యతిరేకతను రిఫరెండంలో స్పష్టంగా వ్యక్తం చేశారు. 80 శాతం వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోగా వారిలో 97 శాతం మంది రష్యాతో పునరేకీకరణకే ఓటు వేశారు.

1954 వరకు క్రిమియా రష్యాలో భాగంగానే ఉండేది. రష్యన్లు ఎక్కువ సంఖ్యలో నివసించే క్రిమియా భాష, సంస్కృతి, వ్యాపార వాణిజ్యాలు… ఇలా ఏ విధంగా చూసినా రష్యాతోనే ఎక్కువ సంబంధ భాంధవ్యాలు కలిగి ఉన్న ప్రాంతం. అప్పటి సోవియట్ రస్యా నేత నికిటా కృశ్చెవ్ ఉక్రెయిన్ కి చెందినవాడే. 1954లో ఆయన క్రిమియాను ఉక్రెయిన్ లో భాగం చేశాడు. అనంతరం సోవియట్ విచ్ఛిన్నం తర్వాత కూడా క్రిమియా ఉక్రెయిన్ తోనే ఉండిపోయింది. ఇప్పుడు తాజా రిఫరెండం ద్వారా క్రిమియా మళ్ళీ యధా స్ధానానికి చేరినట్లయింది.

రిఫరెండం ఫలితాలు వెలువడిన అనంతరం క్రిమియాను స్వతంత్ర రాజ్యంగా అక్కడి పార్లమెంటు ప్రకటించింది. రష్యాలో విలీనం అయ్యే ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఈ విషయమై రష్యా నేతలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. రిఫరెండం ముగిసింది కనుక క్రిమియా రష్యాలో చేరడం ఇక లాంఛన ప్రాయమేనని ఫలితాలను ఉద్దేశిస్తూ రష్యా ప్రభుత్వం వ్యాఖ్యానించింది.

ఉక్రెయిన్ ప్రభుత్వం కింద ఉన్న వివిధ క్రిమియా ఆస్తులను జాతీయం చేస్తున్నామని క్రిమియా పార్లమెంటు ఆమోదించిన తీర్మానం తెలిపింది. ఇక నుండి ఈ ఆస్తులు క్రిమియా రిపబ్లిక్ ఆస్తులుగా ఉంటాయని తీర్మానం తెలిపింది. ఉక్రెయిన్-రష్యాలో గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు క్రిమియాలో రష్యా సైనిక స్ధావరం ఏర్పరచుకుంది. ఒప్పందం ప్రకారం ఈ స్ధావరంలో 16,000 మంది సైనికుల వరకు రష్యా ఉంచవచ్చు. కానీ ప్రస్తుతం అక్కడ ఉన్నది 8,000 మంది సైనికులు మాత్రమే. ఈ సైనికులనే క్రిమియా ఆక్రమణదారులుగా పశ్చిమ పత్రికలు భారీగా దుష్ప్రచారం చేస్తున్నాయి.

విచిత్రం ఏమిటంటే ప్రజాస్వామ్యం గురించి తెగ గొంతు చించుకునే పశ్చిమ దేశాలు, పత్రికలు క్రిమియా రిఫరెండంను గుర్తించడం లేదని ప్రకటించడం. ఉక్రెయిన్ ప్రజలు సాధారణ ఎన్నికల ద్వారా ఎన్నుకున్న యనుకోవిచ్ ప్రభుత్వాన్ని హింసాత్మక ఆందోళనల ద్వారా భారీ రక్తపాతం ద్వారా కూల్చివేసిన ప్రభుత్వాన్ని న్యాయబద్ధ ప్రభుత్వంగా గుర్తించిన పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా, ఇ.యులు అదే నోటితో క్రిమియా రిఫరెండంను అన్యాయంగా ప్రకటించడం బట్టి ‘ప్రజాస్వామ్యానికి వారు ఇచ్చే నిర్వచనం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

ఏ దేశంలోనైనా, ఆ దేశాన్ని ఏలేది పచ్చి నియంతే అయినా ఆ ప్రభుత్వం అమెరికా, ఇ.యుల వాణిజ్య ప్రయోజనాలకు జో హుకుం అంటే ఆదిక బ్రహ్మాండమైన ప్రజాస్వామ్యం అన్నట్లే. ఎంత పక్కాగా జరిగిన ఎన్నికల్లో నెగ్గినా ఆ ప్రభుత్వం పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఆదిక అత్యంత పచ్చి నియంతృత్వ, అభివృద్ధి నిరోధకర ప్రభుత్వం అయినట్లే. పశ్చిమ దేశాల ఈ ద్వంద్వ విధానం ఇప్పటికీ అనేకసార్లు రుజువైన తిరుగులేని సత్యం. అయితే ప్రధాన అంతర్జాతీయ కార్పొరేట్ పత్రికలన్నీ పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీల ఆధీనంలోనే ఉండడంతో వారు చెప్పిందే ప్రజాస్వామ్యంగా చెలామణి అవుతోంది. వారు ప్రచారం చేసే అవాస్తవాలే నిజాలుగా వాడుకలోకి వస్తున్నాయి.

క్రిమియా విషయంలో కూడా పశ్చిమ పత్రికలు పచ్చి అబద్ధాలను ప్రచారంలో పెట్టాయి. క్రిమియాపై రష్యా దండెత్తిందని, దురాక్రమించిందని, తుపాకులు చూపి ఓటింగ్ జరిపారనీ… ఇలా అనేక అబద్ధాలు నిస్సిగ్గుగా ప్రచారం చేశాయి. కానీ ఉక్రెయిన్ లో అక్రమంగా రక్తపాతం జరిపి అధికారం లాక్కున్న ప్రభుత్వం స్నైపర్లను నియమించి తమ తరపున ఆందోళన చేస్తున్న కిరాయి ఆందోళనకారులను సైతం కాల్పులు జరిపి హత్య చేయించిందని, అటు పోలీసులను ఇటు ఆందోళనకారులను ఇరువురిని స్నైపర్లను నియోగించి చంపించిందని ఇ.యు, ఎస్టోనియా విదేశీ మంత్రుల సంభాషణ ద్వారా వెల్లడి అయినప్పటికీ ఒక్క పశ్చిమ పత్రికా దానిని ప్రచురించలేదు.

ఈ నేపధ్యంలో క్రిమియా రిఫరెండం పైన కూడా పశ్చిమ పత్రికలు విషం కక్కుతున్నాయి. అమెరికా, ఇ.యు లు ఈ రిఫరెండంను సాకుగా చూపుతూ రష్యాపై ఆంక్షలు విధించేందుకు సిద్ధపడుతున్నాయి. క్రిమియా నేతలు మాత్రం అమెరికా, ఇ.యుల హెచ్చరికలను పెడచెవిన పెడుతున్నారు. రష్యాతో విలీనంపై చర్చించడానికి ఒక ప్రతినిధి బృందాన్ని క్రిమియా పార్లమెంటు పంపుతోంది. క్రిమియా రిఫరెండంను గుర్తించాలని ఐరాసకు వర్తమానం పంపింది.

ఇదిలా ఉండగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాల్లో రష్యా అనుకూల ఆందోళనలు తీవ్రం అవుతున్నాయి. దోనెత్స్క్, ఖార్కివ్, లుషేన్ స్కీ తదితర తూర్పు రాష్ట్రాల్లో మళ్ళీ ఆందోళనలు పెచ్చరిల్లాయి. రష్యా సరిహద్దుకు సమీపంలో ఉండే సహజ వాయువు పంపిణీ కేంద్రాన్ని ఉక్రెయిన్ ప్రభుత్వంలోని నియో-నాజీ గ్రూపులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడంతో రష్యా బలగాలు నివారించాయి. ప్రస్తుతం ఈ గ్యాస్ పంపిణీ కేంద్రం రష్యా సేనల ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. పొరుగునే ఉన్న గ్రామాన్ని రష్యా సేనలు అదుపులోకి తీసుకున్నప్పటికీ ఆ తర్వాత వెనక్కి వెళ్ళాయని ది హిందు తెలిపింది.

బహుశా మునుముందు కూడా రష్యా, ఉక్రెయిన్ ల మధ్య అడపాదడపా ఘర్షణలు చెలరేగే అవకాశం కనిపిస్తోంది. రష్యా ప్రయోజనాలు నాటో, పశ్చిమ దేశాల ఆధీనంలోకి వెళ్లకుండా ఉండాలంటే రష్యా క్రియాశీలకంగా వ్యవహరించడం తప్ప మరో దారి లేదు. రష్యా ఏ మాత్రం అవకాశం ఇచ్చినా రష్యా ఉనికికే భంగం కలిగించే ఎత్తుగడలను అమెరికా, ఇ.యులు అమలు చేయడం ఖాయం.

ఉభయ జర్మనీల విలీనం సందర్భంగా నాటో మిలట్రీ కూటమిని ఒక్క అంగుళం కూడా తూర్పుకు విస్తరించబోమని అమెరికా, ఇ.యులు అప్పటి రష్యా నేత గోర్భచెవ్ కు వాగ్దానం ఇచ్చాయి. కానీ ఈ ఒప్పందం జరిగిన కొద్ది నెలలకే నాటో తూర్పు విస్తరణ, ఇ.యు విస్తరణ కూడా జరిగిపోయాయి. ఉక్రెయిన్ పొరుగునే ఉన్న లాట్వియా, లిధియేనియా, ఏస్తోనియా దేశాల వరకు ఇ.యు, నాటో లు విస్తరించాయి. కనుక రష్యా అప్రమత్తంగా లేనట్లయితే అది రష్యాకే కాదు, మొత్తం ప్రపంచంలోని భౌగోళిక రాజకీయాలలోనే అసమ తూకం ఏర్పడి పశ్చిమ దేశాలు మరింత దూకుడుగా సామ్రాజ్యవాద విస్తరణకు పాల్పడే అవకాశాలు మెండుగా ఉనాయి.

9 thoughts on “రిఫరెండం: రష్యాలో విలీనానికే క్రిమియన్ల ఓటు

 1. ఎట్టకేలకు క్రిమియన్లు…ఏం కోరుకుంటున్నారో…. ప్రపంచానికి అధికారికంగా తెలిసి వచ్చింది. ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం ఎవరికైనా సమంజసం.

  అన్నట్లు శేఖర్ గారు. అసలు-ఉక్రెయిన్, క్రిమియా వ్యవహారం అసలు గుట్టు…, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలపై…అదుపు కోసమేనని చాలా చోట్ల చదివాను. ఈ విషయంపై కొంచెం వివరంగా ఓ పోస్టు మీకు వీలైనప్పుడు రాయరా…?

 2. ఉక్రేయిన్ వ్యవహారంలో మీ ధోరణి పూర్తిగా రష్యాకు మద్దతుగా కనిపిస్తోంది.
  అమెరికన్ సామ్రాజ్యవాదానికి, దాని మద్దతుదార్లకు వ్యతిరేకంగా ఉక్రెయిన్లో రష్యా చర్యలను ఎటువంటి విమర్శా లేకుండా ఆమోదించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, భిన్న ధృవ ప్రపంచాన్ని మీరు ఊహిస్తున్నట్లుగా కనపడుతోంది. ఈ అవగాహనతో చైనా, రష్యాలను గురించి, అవి అమెరికాకు సవాల్ గా నిలబడడాన్ని గురించి మీరు పలు సందర్భాలలో రాసారు. ఆయా సందర్భాలలో అవి సవ్యమైనవైనా, అవి కూడా పెట్టుబడిదారీ దేశాలే కదా. వాటి ప్రయోజనాలకు భిన్నంగా, ప్రపంచ శాంతికోసమంటూ ప్రత్యేకంగా ఏమీ చేయవు కదా.
  అమెరికాకు, రష్యా-చైనాలకు మధ్య పోటీ మార్కెట్ల కోసం, తమ ప్రయోజనాల కోసం తప్ప మరొకటి కాదు. అటువంటప్పుడు వాటిలోనుండి భిన్నధృవ ప్రపంచాన్ని ( వాటి కుండే స్థల, కాల పరిమితులతో తప్ప) ఎలా ఊహించగలం.
  ఒక పక్కన అమెరికా అనుకూల ప్రచారం, మరో పక్క రష్యా అనుకూల ప్రచారాల మధ్య, మరో వాస్తవాన్ని మీరు పట్టించుకోలేదు. ఉక్రెయిన్ లో జరుగుతున్న ఘర్షణ, రష్యన్- అమెరికన్ పెట్టుబడిదారుల మధ్య జరుగుతున్న ఘర్షణ అనీ, దీనిలోకి జాతి విద్వేషాలను ఉద్దేశపూర్వకంగా లాగుతున్నారనీ ఆరోపిస్తూ, ఉక్రెయిన్, రష్యన్ జాతుల శ్రామిక ప్రజల ఐక్యతను కోరుతూ కొన్ని వామ పక్ష శక్తులు జరిగిన ప్రదర్శనలను మీరు ప్రస్తావించలేదు.
  పూర్తిగా రష్యా అనుకూల వైఖరి తీసుకోవడం వల్ల మీ వ్యాసాలలో ఆధునిక ఉక్రెయిన్ చరిత్ర, దాని క్రమంలో రష్యా- ఉక్రెయిన్ సంబంధాలలో ఏర్పడిన సంఘర్షణ, ఐక్యతలు, ’జాతుల బంధిఖాన”కు వ్యతిరేకంగా లెనిన్ ప్రతిపాదించిన జాతుల స్వేచ్చ, స్వయం నిర్ణయాధికారపు వాగ్దానాల చరిత్రకు తావు లేకుండా పోయింది. ఈ స్వప్నం క్రమంగా కరిగి, సామ్రాజ్య వాద శక్తుల ప్రాభల్య వేటలో, తూర్పు యూరప్- జాతుల పరస్పర ఘర్షణలకు, మారణ హోమాలకు, ప్రాంతాల నిరంతర చీలికలకు ఎలా సాక్ష్యంగా నిలబడిందీ కనీసం తడమడానికి కూడా వీలు లేకుండా పోయింది.
  ఈ సందర్భంలో చైనా జోక్యం లేకపోవడం గురించి మీరు అసహన పడడం నాకు మరీ మరీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చైనా, రష్యాలు ఇటీవలి కాలంలో, కనీసం ఆఫ్ఘన్ మీద అమెరికా దాడి దగ్గరనుండి ఇప్పటి వరకు జరిగిన ఎన్ని సంఘటనలలో జోక్యం చేసుకున్నాయి? ఎన్ని సార్లు వ్యతిరేకత ప్రదిర్శించాయి? ఇటీవల ఇరాన్, సిరియా సందర్భాలలో, అదీ అక్కడి భౌగోళిక ప్రాధాన్యత, ఆయిల్ ల మీద ప్రేమతో మాత్రమే అవి జోక్యం చేసుకున్నాయి. ఈ విషయం మీకు తెలియదనుకోను.
  ఉక్రెయిన్ విషయంలో రష్యా వైపు నుండి కాకుండా, మీ సహజ వైఖరితో ఆలోచించినట్లయితే పాఠకులకు ఎంతో విలువైన విశ్లేషణను, చూపును అందిగలిగి ఉండేవాళ్ళు. ఈ ఘర్షణలో సామాన్య ప్రజానీకపు భవిష్యత్తును ఆందోళనతో, సానుభూతిగా అవలోకించగలిగే వాళ్ళు. ఈ సందర్భాన్ని ఉక్రెయిన్- క్రిమియా- రష్యా ప్రాంతాల సమస్యగానో, జాతుల సమస్యగానో మాత్రమే కాకుండా ప్రజల పక్షాన మరింత లోతుగా అవగాహన చేసుకొనే వాళ్ళు.
  శత్రువుకు శత్రువు ఎల్లవేళలా మిత్రుడు కాబోడు అన్న నానుడిని కూడా మీరు విప్పిచెప్పగలిగి ఉండేవాళ్ళు.

 3. నాగరాజు గారూ

  మీరు చెప్పిన అంశాలు నా దృష్టిలో ఉన్నాయి. ఉక్రెయిన్ కు సంబంధించిన కనీస పూర్తి స్ధాయి విశ్లేషణకు నేనింకా పూనుకోలేదు. ప్రస్తుతానికి ఆయా సంఘటనలను పరిమిత కోణంలో మాత్రమే రాస్తున్నాను.

  ఏక ధ్రువ ప్రపంచం, బహుళ ధృవ ప్రపంచంగా మారే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. అదింకా ఒక రూపానికి రాలేదు. ప్రత్యామ్న్యాయ కేంద్రాలు ఎదగకుండా ఉండడానికి అమెరికా గట్టి ప్రతిఘటన ఇస్తోంది. కొన్ని విజయాలు కూడా నమోదు చేస్తోంది. ఉక్రెయిన్ లో ప్రభుత్వ మార్పు అమెరికా శిబిరానికి పెద్ద విజయం. సిరియాలో పోగొట్టుకున్న పరువు ఉక్రెయిన్ లో అమెరికా రాబట్టుకుంది.

  ఇప్పటి స్ధల, కాల పరిమితుల వరకు చూస్తే బహుళ ధృవ ప్రపంచం ఆవిష్కృతం కాకుండా అమెరికా, ఇ.యు లు ఇస్తున్న గట్టి పోటీ ప్రధాన ధోరణిగా కనిపిస్తోంది. బహుళ ధృవ ప్రపంచంలో మూడో ప్రపంచ దేశాల్లో సాపేక్షికంగా మరింత ప్రజాస్వామిక వాతావరణం ఏర్పరిచే అవకాశం ఉంటుంది. అమెరికా శిబిరం క్రమంగా ఫాసిస్టు పోకడలు అవలంబిస్తోంది. ఉక్రెయిన్ లో రెండు ఫాసిస్టు గ్రూపులకు అది మద్దతు ఇచ్చింది. వాటిలో ఒకటి యూదు వ్యతిరేకం అయినా అమెరికా లెక్క చేయలేదు. లిబియాను రాజ్య రహితంగా (లేదా బలహీన రాజ్యం) చేయడంలోనే అమెరికా తన ప్రయోజనాలు చూస్తోంది. సిరియాలోనూ అదే ప్రయత్నించి రష్యా వల్ల ప్రస్తుతానికి విఫలం అయింది. ఆఫ్రికాలో కూడా ఫ్రాన్స్ ను ముందు పెట్టి ముస్లిం టెర్రరిస్టు గ్రూపులను పోషిస్తోంది.

  ఉక్రెయిన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడి క్రిమియా కోసం రష్యా ముందుకు వచ్చిన దశలో పుతిన్ ఒక ఇంటర్వూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ చదివితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. తమ దేశంలో తాము చేస్తున్న తప్పులను కూడా ఆయన అంగీకరిస్తూ చాలా ప్రజాస్వామిక ధోరణిని కనపరిచాడు. అమెరికా నేతృత్వంలో ముందుకు వస్తున్న ఫాసిస్టు పోకడలు పుతిన్ ను ప్రజాస్వామికవాదిగా నిలవడానికి ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ దేశంలో ప్రతిపక్షాల పట్లా, పుస్సి రైట్ లాంటి విపరీత ధోరణుల పట్లా పుతిన్ అనుసరించిన విధానం సాపేక్షికంగా ప్రజాస్వామికంగా ఉంది. పశ్చిమ పత్రికల ఆధిపత్యం వలన రష్యా రాజకీయాల గురించి బైటి ప్రపంచానికి చాలా తక్కువగా తెలుస్తోంది.

  ఇప్పటి సంధి పరిస్ధితుల్లో గ్లోబల్ స్ధాయిలో అమెరికా సామ్రాజ్యవాదాన్ని బలహీనపరచడమే విప్లవ, ప్రజాస్వామిక శక్తులకు లక్ష్యంగా ఉండాలని నా భావన. దానర్ధం రష్యాను సమర్ధించాలని కాదు. తమ దేశంలో కూడా క్రమక్రమంగా ఫాసిస్టు విధానాలను అవలంబిస్తూ, ఇతర దేశాలపై కూడా అదే పోకడలు అవలంబించాలని అమెరికా బలవంతపెడుతోంది. ఇటువంటి దశలో అమెరికాతో తలపడుతున్న రష్యా, చైనాల (broadly speaking BRICS) తప్పులను ఎత్తి చూపడం సందర్భం వచ్చినప్పుడు చేయాలని నా సాధారణ అవగాహన. Particularity of contradiction కి వచ్చినపుడు రష్యా, చైనాల వ్యవస్ధలు ఎలాగూ చర్చకు వస్తాయి. (ఉదా: చైనాలో బో గ్జిలాయ్ వ్యవహారం).

  రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా స్టాలిన్, మావోలు అవలంబించిన ఎత్తుగడలను ప్రస్తుత సందర్భానికి (బ్రాడ్ గా) సరిపోతాయి. కాకపోతే అప్పుడు సోషలిస్టు దేశాలు, ఉద్యమాలు ఉన్నాయి, ఇప్పుడు ఉద్యమాలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా చాలా బలహీనంగా. ఈ పరిస్ధితిల్లో ప్రపంచ స్ధాయిలో బహుళ ధృవ ప్రపంచం ఏర్పాటుకు దారి తీసే పరిణామాలను సానుకూలంగా విశ్లేషించాలి కదా. అలాగే దానికి వ్యతిరేకంగా యధాతధ స్ధితిని కాపాడ్డానికి దూకుడుగా జరుగుతున్న యత్నాలను అంతే దూకుడుగా తెలియజేయాల్సిన అవసరం లేదా? అమెరికా దూకుడును విమర్శించినపుడు సహజంగానే అది ప్రత్యర్ధికి మద్దతుగా కనిపించవచ్చు.

  ఉక్రెయిన్ లో పాత ప్రభుత్వం పూర్తిగా రష్యా అనుకూలం కాదు. అలాగని పశ్చిమ పత్రికలు ప్రచారం చేస్తున్నాయి. ప్రజలకు అనుకూలం అసలే కాదు. సాంప్రదాయక కులీన వర్గాలకు మాత్రమే ఆయన మద్దతుదారు. ఆ వర్గాల ప్రయోజనాలు రష్యాతో ఎక్కువగా ముడిపడి ఉన్నాయి. ఇ.యు తో ఒప్పందం అయితే ఈ వర్గాల ప్రయోజనాలు కాపాడబడతాయని ఆశించగా వారు విధించిన షరతులు పూర్తిగా వారికి వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకే ఆ ఒప్పందాన్ని యనుకోవిచ్ తిరస్కరించాడు. అంతే తప్ప రష్యా కోసం తిరస్కరించలేదు. ఈ విషయాన్ని పుతిన్ కూడా వివిధ సందర్భాల్లో చెప్పాడు.

  మనం గమనించాల్సిన మరో పరిణామం నాటో విస్తరణ. ఇ.యు చేరిక తర్వాత మిగిలేది నాటోయే. ఉక్రెయిన్ కూడా నాటోలో చేరితే బహుళ ధృవ ప్రపంచం ఆవిష్కరణకు అవకాశాలు ఇంకా తగ్గిపోతాయి.

  వీటన్నింటి రీత్యా ఆయా అంశాలను పరిమితంగా విశ్లేషించినపుదు రష్యా అనుకూలంగా కనిపిస్తోందని మీ వ్యాఖ్య ద్వారా అర్ధం అవుతోంది. కానీ దీనికి నేపధ్యం గ్లోబల్ రాజకీయ రంగ పరిశీలన మాత్రమే. ఉక్రెయిన్ పరిణామాలపై వివరమైన విశ్లేషణ నేనింకా రాయలేదు. అది పరిశీలనలోనే ఉంది.

 4. మిత్రమా
  భిన్నధృవ ప్రపంచం,లేదా బహుళ ధృవ ప్రపంచం అనే పారిభాషిక పదం మీరు భావజాలపరంగా ఉపయోగిస్తున్నారా లేక సైనిక పరంగా, భౌగోళికంగా ఒక ప్రాంతంపై ఆధిపత్యాన్ని వహించగల శక్తులనుద్దేశిస్తూ వాడుతున్నారా?
  సైనికపరంగా,భౌగోళికంగా ఒక ప్రాంతంపై ఆధిపత్యాన్ని వహించే శక్తులనుద్దేశించచినదయితే అవి రష్యా, చైనా, అమెరికా, నాటో లాంటి పేర్లతో పరస్పరం తలపడుతూ వేరువేరుగా కనిపిస్తాయి.
  ఇక భావజాల పరంగా చూసినట్లయితే పైన చెప్పిన ఆధిపత్య వ్యవస్థలన్నింటిలోనూ సామ్రాజ్యవాదమనే సారూప్యత మనకు కనిపిస్తోంది. అప్పుడు వాటిని ఇక భిన్నంగానో బహుళంగానో చూడజాలం.
  కాబట్టి బహుళ ధృవ ప్రపంచమనే పదబంధాన్ని మీరొక సారి తరచి చూసుకోవాలి.
  బహుళ ధృవ ప్రపంచం అనే పద బంధం ఐరోపా కేంద్రిత భావజాలానికి (పూర్తి వ్యతిరేకంగా కూడాను) భిన్నంగా, స్థానికతకు చోటుకలిగిస్తూ, ఒక ప్రత్యామ్నాయంగా భావజాల చర్చలో ప్రతిపాదించబడి, వాడబడుతున్నది. ఆలోచనల స్థాయిలోనూ, ప్రయోగాల రూపంలోనూ ఉన్న ఇది వాస్తవానికి ఇంకా ఉనికిలోకి రాలేదనే చెప్పాలి.
  ఈ అవగాహనతో ఉక్రెయిన్ సమస్యను పరిశీలిస్తే- అమెరికా అయినా, రష్యా అయినా, చైనా అయినా యూరో సెంట్రిక్ డెవలప్ మెంట్ నమూనా లోనే పయనిస్తున్నవి. కాబట్టి వీటిమధ్య బహుళత్వమనేది కనిపించదు. సారూప్యతే కనిపిస్తుంది.

 5. నాగరాజు గారు.” బహుళ ధృవ ప్రపంచం అనే ప్రశ్న భావజాల పరంగానా…లేక భూగోళంపై ఆధిపత్యంపై వహించగల శక్తుల నుద్దేశించి వాడుతున్నారా..?” అన్న ప్రశ్న చాలా కొత్తగా..,లోతుగానూ, ఇప్పటి వరకూ రష్యా, అమెరికాల వ్యవహారాలు, ఆ మాటకొస్తే అన్ని అంతర్జాతీయ వ్యవహారాలను ఒక కొత్త కోణంలో చూసేలా చేస్తుందనడంలో సందేహం లేదు.
  బహుశా భవిష్యత్ లో భావజాల పరంగానే కాక….ప్రపంచ రాజకీయాల్లో ఈ భావన కీలక పాత్ర పోషించడం ఖాయం. ఐతే ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా…ప్రపంచంపై ఆధిపత్యం వహిస్తున్న అమెరికాకు అంతో ఇంతో చెక్ పెట్టగల దేశాలు రష్యా, చైనా తప్ప మరో ప్రత్యామ్నాయం ఉందా..?
  మీరు ప్రస్తావించిన భావజాల భిన్నధృవ ప్రపంచం….ఆలోచనల రూపంలో తప్ప ఉనికిలోకి రావడం సాధ్యమవుతుందా…? అంటే మార్క్సిజాన్ని రష్యా నాయకత్వం విశ్వసించి ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నించడం వల్లనే కదా..పెట్టుబడి దారీ విధానానికి మరో ప్రత్యామ్నాయం ఉందని ప్రపంచానికి తెలిసింది. రష్యానో, చైనానో మార్క్సిజం ఆధారంగా ( మొదటోనైనా) తమ ప్రభుత్వ విధానాలను రూపొందించడం వల్లనే కదా… ఆ వాదం నిలబడగలగింది.
  మీరు చెబుతున్న భావజాల బహుళ ధృవ ప్రపంచానికి ప్రాతిపదిక కేవలం స్థానికతేనా..? ఇంకా ఏమైనా ఉన్నాయా..?
  కేవలం స్థానికత ఆధారంగా ఇతర ప్రపంచ దేశాలన్నీ ఒక్కటై …అమెరికా, రష్యా, లేదా చైనా, ఇతర యూరోపియన్ దేశాల దోపిడీ విధానాలకు పోటీదారులుగా ఏర్పడగలవా…?
  ఒక వేళ ఏర్పడగలవని మీరు భావిస్తే అది ఏ విధంగా సాధ్యమో కొంచెం వివరంగా చెప్పగలరు.

 6. నాగరాజు గారూ మీ వ్యాఖ్యల లోటు గమనించారా? మీరు ఎంటర్ అయితే చాలు చర్చకు ఒక పరమార్ధం వచ్చేస్తుంది. ఇక మీదే ఆలస్యం.

 7. భిన్న ధృవ ప్రపంచం అనే పద బంధం చాలా వరకు ఇప్పట్లో వేరు వేరు ఆధిపత్య శక్తులను ఉద్దేశించే వాడుతున్నారు. ఇలా వీరు తెలిసే వాడుతున్నారా లేక మరేమన్నానా అనేది ఆలోచించాల్సిన విషయం. చరిత్రను ఏక ధృవ ప్రపంచం, ద్వి ధృవ ప్రపంచం, త్రి ధృవ లేక బహుళ ధృవ ప్రపంచంగా విశ్లేషించేటప్పుడు వీరు వివిధ భౌగోళిక ప్రాంతాలపై ఆధిపత్యాన్ని వహిస్తున్న శక్తులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రాచీన కాలంలో రోమ్ ఆధిపత్యం, ఆధునిక ప్రపంచంలో ఇంగ్లండు, ఆ తర్వాత అమెరికా- రష్యా, ఇప్పుడు చైనా, ఇంకా దక్షిణాసియా లాంటి పరిమిత ప్రాంతంలో ఇండియా లాంటి దేశాలు కూడా ఈ విశ్లేషణలో ఆధిపత్య శక్తులుగా గుర్తించ బడుతున్నాయి. ఈ పద్ధతిలో వీరు ఏక ధృవ ప్రపంచం, ద్వి ధృవ ప్రపంచం, బహుళ ధృవ ప్రపంచం వంటి పదబంధాలను యధేచ్చగా వాడుతూ చెలామణీ చేస్తున్నారు.
  వర్తమాన ప్రపంచ చరిత్రలో వీటిని మార్కెట్ శక్తులుగానే చూడాల్సి ఉంటుంది. వీటి వెనుక దన్నుగా సైన్యం, భౌగోళిక రాజకీయాలు ఉంటాయి. ప్రపంచంలో వివిధ మార్కెట్ శక్తులు ఉనికిలోకి వచ్చి, తమ ప్రభావాన్ని చూపగలగడం ఆరోగ్యకరమైన పరిణామంగా పెట్టుబడిదారీ అర్థ శాస్త్రం చెబుతుంటుంది. కానీ బహుళ మార్కెట్ శక్తులు సామ్రాజ్య వాద యుగంలో బతికి బట్ట కట్ట జాలవని మార్క్సిస్ట్ అర్థ శాస్త్రం వివరిస్తోంది.
  నిరంత సంక్షోభాల నడుమ మోనోపాలి కేపిటల్ అదే ఉరవడితో కొనసాగలేదని చరిత్ర మనకు చెబుతోంది. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్య స్థానాన్ని అమెరికా చేజిక్కించుకోవడం, అది కూడా తన ప్రాభల్యాన్ని కొనసాగించడం కోసం నిరంతరం యుద్ధాలను అడ్డుపెట్టుకోవలసి రావడం మనకు తెలుసు. ఈ నేపథ్యంలో తాజాగా చైనా మార్కెట్ శక్తిగా ముందుకు వస్తోంది. రష్యా తన పూర్వ వైభవాన్ని కోల్పోయినప్పటికీ సైనికంగా ప్రాభావిక స్థితిలో ఉండడం, వనరుల రీత్యా సంపద్వంతమైన భౌగోళిక ప్రాంతంలో ఇంకా అంతో ఇంతో తన ప్రభావాన్ని వేయగలగడం దాన్ని వార్తలలో నిలుపుతోంది.
  చైనా, రష్యా, అమెరికా, యూరోపియన్ దేశాలు, ఇంకా తరతమ స్థాయిలలో భారత్ లాంటి దేశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ వీటినే బహుళ ధృవ ప్రపంచంగా చూపెడుతున్న విశ్లేషణలో మాయ ఉంది. ’మరో ప్రత్యామ్నయం లేదు’(there is no alternative) అన్న నినాదపు బూకరింపు ఉంది. నిజానికి భౌగోళిక శక్తుల ప్రాతిపదికగా ఈ విశ్లేషణ కొనసాగినప్పటికీ, దీనికి అంతరాళంలో మార్మికంగా భావజాల పరమైన ప్రాతిపదిక ఉంది. భావజాల పరంగా భిన్నత్వాన్ని, బహుళతాన్ని అంగీకరించకపోవడమే ఆ మార్మికత. ఒక వేళ ’బహుళ ధృవ ప్రపంచం’ ఏర్పడినా అది పెట్టుబడిదారీ సూత్రాలకనుగుణంగా సాగేవిగా ఉండాలనే కాంక్షే ఈ చర్చలో భావజాల పరమైన అంశాలకు చోటు లేకుండ చేస్తోంది.
  బహుళ ధృవ ప్రపంచం అనే భావన గ్రాంస్కీ రాతాలలో కనిపిస్తుంది. ఆధిపత్యం అన్న భావనను వివరిస్తూ, దీని గురించి రెండు అంశాలుగా ఆయన వివరిస్తాడు. బలమైన పెట్టుబడిదారీ దేశాలలోనే కమ్యునిష్ట్ విప్లవం విజయవంతమవుతుందన్న మార్క్స్ సూత్రీకరణకు భిన్నంగా రష్యాలో ఎలా విప్లవం విజయవంతమైనదనే విషయాన్ని వివరిస్తూ, మార్క్సిజాన్ని రష్యన్ సమాజానికి లెనిన్ అన్వయించిన తీరును ఆయన ’స్థానికత’కు ఉదాహరణగా చెప్పుకొస్తాడు. స్థానికత అనేది గ్రాంస్కీ ఆలోచనలలో అలా ఒక ముఖ్య భాగమయింది. దీనిని ఆయన యూరో సెంట్రిక్ భావజాలానికి వ్యతిరేకంగా ముందుకు తెస్తాడు. సంస్కృతి, నాగరికత, అభివృద్ధి, విప్లవం వంటి భావనలను యూరోపియన్ నమూనాలలో కాకుండా దేశ సామాజిక స్థితిగతులకు, అవసరాలకు అనుగుణంగా అవగాహన చేసుకొని, వాటిని మార్పు దిశగా అన్వయం చేసుకోవడానికి ఆయన వీటిని ప్రతిపాదిస్తాడు. ఇది మొదటి అంశం.
  అభివృద్ధి అంటే పెట్టుబడిదారీ తరహా అభివృద్ధి మాత్రమే అని, నాగరికత అంటే ఇలాగే ఉండాలనీ, సంస్కృతీ అంటే ఫలానా రంగు, రుచీ, వాసనలతో ఉండాలనీ, ప్రగతీ, అభివృద్ధీ, విప్లవాలకు చట్రాలుంటాయనే భావనలను ఆయన “ఆధిపత్యం” అనే పదాన్ని కేంద్రంగా చేసుకొని వివరిస్తాడు. వీటన్నింటినీ ఖండిస్తూ, స్థానికతను ప్రత్యామ్నాయంగా ప్రతిపాదిస్తాడు. స్థానికతకు ఉదాహరణగా లెనిన్ అన్వయాన్ని ఆయన ఎత్తిపడతాడు.
  ఇటువంటి సృజనాత్మకమైన అవగాహన, అన్వయాలనుండే బహుళ ధృవ ప్రపంచాలు ఉనికిలోనికి వస్తాయని ఆయన ఊహిస్తాడు. ఇది గ్రాంస్కీ చెప్పిన రెండవ అంశం. ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన చెప్పిన ఈ రెండు అంశాలు, అభివృద్ధి అంటే వల్డ్ బ్యాంక్ చెప్పేది కాదనీ, దానికి వ్యతిరేకంగా దేశాలు తమంతట తాము కనుగొని ఆచరించేవని వివరిస్తున్నాయి.
  బహుళ ధృవ ప్రపంచం గురించిన ఈ విశ్లేషణ పూర్తిగా భావజాల పరమయిన అంశాల వెలుగులో ఉంది. ఇది పెట్టుబడిదారీ విశ్లేషకులు చెబుతున్న మాటల గారడీగా కాకుండా నిజమైన బహుళత్వానికీ, వైవిధ్యానికీ చోటు కలిగిస్తుంది.
  కనుక బహుళ ధృవ ప్రపంచాన్ని గురించిన ఆలోచనలలో ఈ తేడా ఎరుకలో ఉండాలని ఆశిద్దాం.

 8. బహుళ ధృవ ప్రపంచం గురించి ఒక కొత్త కోణాన్ని చాలా బాగా వివరించారు. ప్రపంచ రాజకీయాల్ని ఈ కోణంలోంచి విశ్లేషిస్తే…వాటి వెనుక అసలు కారణాలు మరింత స్పష్టంగా అవగతమవుతాయి. విలువైన మీ సమాచారానికి కృతజ్ఞతలు నాగరాజు గారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s