: అదిగదిగో, ఒక సీనియర్ నాయకుడు… పోటీ చేయడానికి సిద్ధమై వస్తున్నారు!
: నో, ధాంక్ యూ!
***
రాయల సీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధులు దొరకడం లేదని ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం వాడుకలో ఉన్న జోక్! కానీ దేశవ్యాపితంగా కూడా కాంగ్రెస్ ది అదే పరిస్ధితని ఈ కార్టూన్ సూచిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ తరపున పోటీ చేసే సీనియర్ నాయకులు లేరని కార్టూన్ చెబుతోంది.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మొదట రక్షణ మంత్రి ఆంటోని ప్రకటించారు. ఆ తర్వాత అస్త్ర సన్యాసం చేసేవారి సంఖ్య క్రమం తప్పకుండా పెరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ విభజనలో కీలక పాత్ర పోషించిన జైరాం రమేష్ కూడా తాను పోటీలో లేనని ప్రకటించారు. సీమ, ఆంధ్రలో మాత్రం కాంగ్రెస్ కు అభ్యర్ధులు కరువేమీ కాదని ఆర్భాటంగా ప్రకటించిన జైరాం సీనియర్లు పోతే యువకులకు అవకాశం వస్తుంది అని ముక్తాయించారు.
పశ్చిమ బెంగాల్ మాజీ పి.సి.సి అధ్యక్షులు మనాస్ భూనియా, ప్రదీప్ భట్టాచార్య లు తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పత్రికలు రాస్తున్నాయి. కాగా అబ్దుల్ మన్నాన్, శంకర్ సింగ్ లాంటి ఇతర సీనియర్లు కూడా వారి తోవలోనే నడిచి ఎన్నికలకు రామ్ రామ్ చెప్పేశారు. అయితే ఇతర నాయకులు మాత్రం బెంగాల్ లో టికెట్ల కోసం క్యూ కడుతున్నారట.
తమిళనాడులోనూ కాంగ్రెస్ ది ఇదే పరిస్ధితి. కొందరు సీనియర్ నాయకులు తాము పోటీ చేయకుండా తమ కుమారులకు టికెట్ ఇవ్వాలని కోరడం విశేషం. వీరిలో పి.చిదంబరం కూడా ఒకరు. శివగంగ నుండి చిదంబరం పోటీ చేయాలని హై కమాండ్ కోరుతుంటే, ఆయన మాత్రం తన కుమారుడు కార్తీ చేత పోటీ చేయించాలని ఉబలాటపడుతున్నట్లు తెలుస్తోంది.
సీనియర్ నేతలు జి.కె.వాసన్, కె.వి.తంగబాలు లాంటివారు తాము పోటీ చేయబోమని, కాంగ్రెస్ అభ్యర్ధుల తరపున రాష్ట్ర వ్యాపితంగా ప్రచారం చేస్తామని చేప్పారు. పోటీ చేయకుండా ఉండడానికి వారు ఇలా పార్టీ పనికి అంకితం అవుతున్నారన్నమాట! ఆ విధంగా వారు స్వామి కార్యం (ఎన్నికల ప్రచారం), స్వకార్యం (పోటీని తప్పించుకోవడం) రెండూ నెరవేర్చుతారు.
మరో తమిళ సీనియర్ నేత, పర్యావరణ మంత్రి జయంతి నటరాజన్ కూడా పోటీకి విముఖంగా ఉన్నట్లు సమాచారం. అధిష్టానం అయితే సిటింగ్ అభ్యర్ధులు 8 మందీ పోటీ చేయాలని కోరుతోంది. సీనియర్ల వ్యవహారం నచ్చని యువనేత మానిక టాగోర్, పోటీ చేయని సీనియర్లకు మరో పదేళ్ళు అవకాశం ఇవ్వకూడదని డిమాండ్ చేస్తూ హై కమాండ్ కు లేఖ రాశారు. రాజీవ్ గాంధీ హంతకులను జయలలిత విడుదల చేసిన సంఘటన ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చినా సీనియర్లు వెనక్కి తగ్గడం పట్ల యువనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ కాంగ్రెస్ నేత, ఎన్.సి.పి అగ్రనేత అయిన శరద్ పవార్ కూడా అస్త్ర సన్యాసం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య మోడిని మెచ్చుకున్న పవార్ తనకు ఎలాగూ గెలిచే అవకాశం లేదని భావిస్తున్నట్లుంది.
ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే అనేకమంది సీనియర్ నేతలు ఏకంగా వలస వెళ్తున్నారు. కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో తెదేపా గడప తొక్కుతుండడంతో ఆ పార్టీ మరో కాంగ్రెస్ పార్టీగా మారుతోందని టి.డి.పి నేతలు అసహనం వ్యక్తం చేసేంతగా కాంగ్రెస్ నేతల తొక్కిసలాట జరుగుతోంది. టి.జి.వెంకటేశ్, ఏరాసు, గంటా, దివాకర్ రెడ్డి తదితర నాయకులు ఇప్పటికే పలాయనం చిత్తగించగా మంత్రిగా పని చేస్తున్న
కావూరి కూడా టి.ఫి.పిలో తువాలు వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన బహిరంగంగానే కాంగ్రెస్, సోనియాలను విమర్శిస్తున్నారు. దానితో ఆయనపై వలస అనుమానాలు బలపడ్డాయి. తన వారసులు కూడా రాజకీయ ప్రవేశం చేస్తున్నారని, కానీ వారు ఏ పార్టీలో వెళ్ళేది జనం నిర్ణయిస్తారని ఆయన గొప్పగా ప్రకటించేశారు. ఉన్న పార్టీలో కాకుండా పక్క పార్టీలో చేరదలిస్తే ఆ వంక జనం మీదికి నెట్టేయడం నాయకులు తమ తెలివితేటలుగా భ్రమిస్తున్నారు. అక్కడికి జనానికి అదేమీ తెలియని అమాయకులైనట్లు!
ఈ విధంగా కాంగ్రెస్ నుండి కొందరు సీనియర్ల వలసలు, మరి కొందరి అస్త్ర సన్యాసాల నేపధ్యంలో పై కార్టూన్ ఎంతో సందర్భోచితం.
అభ్యర్ధుల కోసం టెండర్ల పద్ధతి ప్రవేశపెట్టక తప్పదు.
“కావూరి కూడా టి.ఫి.పిలో తువాలు వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి”….!!టి.ఫి.పి??ot T.D.P??