కావాలనే దారి మార్చారు -మలేషియా ప్రధాని


మలేషియా ఎయిర్ లైన్స్ విమానాన్ని కావాలనే దారి మళ్లించారని మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ ధృవీకరించారు. అయితే విమానం హైజాక్ కి గరయిందని మాత్రం ఆయన చెప్పలేదు. మరిన్ని వివరాలు తెలిస్తే తప్ప హైజాక్ కి గురయింది లేనిదీ ధృవీకరించడం సాధ్యం కాదని మలేషియా భావిస్తోంది. విమానం కమ్యూనికేషన్లు మరియు ట్రాకింగ్ వ్యవస్ధలను ఉద్దేశ్యపూర్వకంగానే మూసివేసి విమానాన్ని దారి మళ్లించారని నజీబ్ తెలిపారు.

ప్రధాని నజీబ్ విలేఖరులకు ఈ సంగతి చెప్పిన తర్వాత పోలీసులు విమానం పైలట్ ఇంటిని తనిఖీ చేయడానికి వెళ్లారని రాయిటర్స్ తెలిపింది. అదృశ్యం అయిన విమానం గురించిన సాక్ష్యాలు ఏమన్నా లభిస్తాయేమోనని పోలీసులు పైలట్ ఇంటిని వెతకడానికి నిర్ణయించుకున్నారు. మలేషియాకు తూర్పు దిశగా (దక్షిణ చైనా సముద్రం, వియత్నాం) సాగుతున్న అన్వేషణను ఇక ముగిస్తున్నామని నజీబ్ ప్రకటించారు. అంటే విమానాన్ని దారి మళ్లించి పశ్చిమ దిశగా తీసుకెళ్లారని ప్రభుత్వం పూర్తిగా నిర్ధారించుకుందని భావించవచ్చు.

“విమానాన్ని హైజాక్ చేశారని పత్రికలు రాస్తున్నాయి. కానీ నేను స్పష్టంగా చెప్పదలిచింది ఏమిటంటే MH370 విమానం పక్కకు ఎందుకు మళ్ళింది అన్న విషయం తెలుసుకోవడానికి మేము ఇంకా అన్ని అవకాశాలను పరిశోధించే దశలోనే ఉన్నామని” అని నజీబ్ పత్రికలకు తెలిపారు.

మార్చి 8 తేదీన అదృశ్యం అయిన మలేషియా విమానం దక్షిణ చైనా సముద్రం మీద అదృశ్యం కావడంతో సముద్రంలో కూలిపోయి ఉండవచ్చని మలేషియా అధికారులు భావించారు. అయితే విమానం దిశ మార్చుకుని పశ్చిమ దిశగా 750 మైళ్ళ వరకు ప్రయాణించి ఉండవచ్చని మిలట్రీ రాడార్ లో రికార్డయిన సంకేతాలను బట్టి గుర్తించడం ప్రారంభించారు. క్రమంగా ఈ అంశం పైనే పరిశోధన కేంద్రీకృతం అయింది. చివరకు ప్రధాని సైతం అదే నిర్ధారించడంతో ఇండియా నుండి మధ్య ఆసియా వరకు విమానం వెళ్ళి ఉండవచ్చని ఊహిస్తున్నారు.

విమానంలో ఉన్న 2/3 వంతు ప్రయాణీకులు చైనీయులు కావడంతో చైనా అంతకంతకు అసహనం వ్యక్తం చేయడం ప్రారంభించింది. మలేషియా తన పరిశోధనను వేగవంతం చేయాలని అందుబాటులో ఉన్న సమాచారాన్ని మరింత సమగ్రంగా తమతో పంచుకోవాలని డిమాండ్ చేసింది. మలేషియా అధికారుల పరిశోధనలో భాగం పంచుకోడానికి తమ బృందాన్ని కూడా పంపిస్తున్నామని శనివారం చైనా ప్రకటించింది.

మలేషియా ప్రధాని ఇచ్చిన సమాచారం ప్రకారం విమానం నుండి వచ్చిన సంకేతాలను చివరిసారిగా శాటిలైట్లు రికార్డు చేశాయి. ఇవి మార్చి 8 ఉదయం (స్ధానిక కాలమానం) గం. 8:11 ని.లకు రికార్డు అయ్యాయి. అనగా అర్ధరాత్రి కౌలాలంపూర్ బయలుదేరిన విమానం ఈశాన్య దిశలో 40 నిమిషాల సేపు దక్షిణ చైనా సముద్రం మీద ప్రయాణించి అనంతరం వెనక్కి మళ్ళి పశ్చిమ దిశగా ప్రయాణించింది. పౌర విమాన రాడార్ నుండి అదృశ్యం అయిన దగ్గర్నుండి ఇది దాదాపు 7 గంటల ప్రయాణం.

మలేషియా పశ్చిమ తీరం పైన ప్రయాణించినట్లు మిలట్రీ రాడార్ లో తెల్లవారు ఝాము గం. 2:15 ని.లకు రికార్డ్ అయిన గుర్తు తెలియని విమానం నిజానికి MH370 విమానమే అని శాటిలైట్ సంకేతాల ద్వారా ధ్రువపడిందని మలేషియా ప్రధాని నజీబ్ తెలిపారు. “మిలట్రీ రాడార్ పై కనిపించినప్పటి వరకూ, ఆ తర్వాత విమానం కదలికలు ఉద్దేశ్యపూర్వకంగానే జరిగాయని, విమానంలో ఉన్నవారు ఎవరో ఉద్దేశ్యపూర్వకంగా విమానాన్ని దిశ మళ్లించారని ధ్రువపడుతోంది” అని నజీబ్ తెలిపారు.

విమానం నుండి అందిన సంకేతాలను శాటిలైట్ లు రికార్డు చేశాయని సదరు రికార్డులను బట్టి విమానం ఉనికి రెండు కారిడార్ లలో ఉన్నట్లు భావిస్తున్నామని నజీబ్ తెలిపారు. ఉత్తర ధాయిలాండ్ నుండి కజకిస్ధాన్, తుర్క్ మెనిస్ధాన్ దేశాల సరిహద్దు వరకూ ఉన్న ఉత్తర కారిడార్ ఒకటి కాగా,  ఇండోనేషియా నుండి దక్షిణ హిందూ మహా సముద్రం వరకు విస్తరించిన దక్షిణ కారిడార్ మరొకటి అని నజీబ్ వివరించారు.

ప్రపంచ పటంపై అర్ధ చంద్రాకారంలో కనిపించే ఈ కారిడార్ శాటిలైట్ సంకేతాలు గుర్తించిన ట్రాక్ మాత్రమే. విమానం ఖచ్చితంగా ఈ కారిడార్ వెంటే ప్రయాణించిందని అర్ధం కాదు. కానీ తన ప్రయాణంలో ఏదో ఒక దశలో ఈ కారిడార్ లోకి విమానం ప్రవేశించింది. అలా ప్రవేశించిన మేరకు విమానం సంకేతాలను శాటిలైట్లు రికార్డు చేశాయి.

విమానం బహుశా దక్షిణ హిందూ మహా సముద్రం వరకు వెళ్ళి ఉండవచ్చని అక్కడ ఇంధనం నిండుకోవడంతో సముద్రంలో కూలిపోయి ఉండవచ్చని అమెరికా విశ్లేషిస్తోంది. శాటిలైట్ లు రికార్డ్ చేసిన సంకేతాలను బట్టి ఇలా భావించవచ్చని అమెరికా చెబుతోంది.

ఇది కాకుండా మరో అవకాశం కూడా గుర్తిస్తున్నారు. విమానం వాయవ్య దిశలో ప్రయాణం కొనసాగించి భారత భూభాగం పైకి వచ్చి ఉండవచ్చు. అయితే భారత భూభాగం మీదికి అట్టే దూరం ప్రయాణించకపోయి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి కారణం భారత దేశం శక్తివంతమైన వాయు రక్షణ వ్యవస్ధను ఏర్పాటు చేసుకోవడమే. విమానం ఏ మాత్రం భారత వాయు మండలంలోకి వచ్చినా భారత రాడార్ లు దానిని గుర్తించడం వెంటనే మిలట్రీ విమానాలను పంపి ఏదో ఒక చోట దింపడం జరిగి ఉండేది.

చివరికి శాటిలైట్ సంకేతాలను బట్టి కూడా విమానం ఆచూకీ లభించకపోవడం అందరినీ వేధిస్తున్న ప్రశ్నగా మిగిలిపోయింది. సాధారణంగా రాడార్ చివరిసారి రికార్డు చేసిన సంకేతాలను బట్టి అదృశ్యమైన చోటులో వెతికితే విమాన శకలాలు లభిస్తాయి. కానీ మలేషియా విమానం కోసం డజనుకు పైగా దేశాలు పదుల సంఖ్యలో విమానాలు, నౌకలు పెట్టి వెతికినా ఆచూకీ దొరకకపోవడం అంతు చిక్కని మిస్టరీ అయింది.

మనిషి విజ్ఞానానికి ఉన్న పరిమితి ఏమిటో ఇంత త్వరగా తెలియడం సానుకూల విషయం కాగా 239 మంది ప్రాణాలతో అది ముడిపడి ఉండడం విషాధకారకం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s