ఆఫ్ఘనిస్ధాన్ ను ఇక ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆ దేశ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ అమెరికాను కోరారు. ద్వైపాక్షిక భద్రతా ఒప్పందంపై సంతకం పెట్టకుండా ఉండడం ద్వారా అమెరికా వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నట్లు కనిపిస్తున్న కర్జాయ్ మరోసారి అమెరికా దుర్నీతిని ఎండగట్టారు. ఆఫ్హన్ లో 93 శాతం ప్రాంతాన్ని ఇప్పటికే ఆఫ్ఘన్ సైనికులు కాపాడుతున్నారని, ఇక అమెరికా సైనికుల అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. 2014 అనంతరం కూడా అమెరికా బలగాలను ఆఫ్ఘన్ కొనసాగించేందుకు వీలు కల్పించే బైలేటరల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అవసరం లేదని చెబుతూ ఆయన సంతకం చేయడానికి నిరాకరిస్తున్నారు.
ఏప్రిల్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో హమీద్ కర్జాయ్ మళ్ళీ నిలబడడానికి అక్కడి రాజ్యాంగం అంగీకరించదు. వరుసగా రెండు సార్లు అధ్యక్ష పదవి నిర్వహించిన కర్జాయ్ 2009 లో రెండోసారి ఎన్నికయినప్పటి నుండి అమెరికాపై విమర్శలు ప్రారంభించారు. కర్జాయ్ అవినీతిపరుడని అమెరికా ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు చేయడమే దీనికి కారణమని పశ్చిమ పత్రికలు వివరణ ఇస్తాయి. అయితే కర్జాయ్ చెప్పే కారణాలు వేరు.
చిత్తానుసారం అర్ధరాత్రి వేళల్లో గ్రామాలపై బడి ఇళ్ళల్లో దూరి మరీ నిద్రిస్తున్న ఆఫ్ఘన్ ప్రజలను కాల్చి చంపడం అమెరికా సైనికులకు రివాజుగా మారిందని, 2014 అనంతరం కూడా అమెరికా సైనికులు ఆఫ్ఘన్ లో కొనసాగితే ప్రజల కష్టాలు కొనసాగుతాయని కర్జాయ్ గత కొన్నేళ్లుగా చెబుతున్నారు.
శనివారం ఆఫ్ఘన్ పార్లమెంటులో చివరిసారి చేసిన ప్రసంగంలో కూడా కర్జాయ్ దాదాపు ఇవే మాటలు చెప్పారు. ఆఫ్ఘన్ సైనికులకు శిక్షణ ఇవ్వడానికి, మిగిలి ఉన్న ఆల్-ఖైదా టెర్రరిస్టులను వేటాడడానికి తమ సైనికులు అవసరం అన్న అమెరికా వాదనను కర్జాయ్ కొట్టిపారేశారు. చిత్రం ఏమిటంటే ద్వైపాక్షిక భద్రతా ఒప్పందాన్ని కర్జాయ్ తిరస్కరిస్తుండగా ఏప్రిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 10 మంది అభ్యర్ధులూ ఒప్పందానికి అంగీకారం చెప్పేశారు. తాను ప్రభుత్వంలో ఉన్నంతవరకు ఒప్పందంపై సంతకం చేసేది లేదని కర్జాయ్ స్పష్టం చేశారు.
2001 లో బిన్ లాడెన్ సాకు చూపి ఆఫ్ఘనిస్ధాన్ పై దురాక్రమణ దాడి జరిపిన అమెరికా తానే కర్జాయ్ ని అధికారంలో నిలిపింది. అనంతరం తూతూమంత్రంగా జరిపిన ఎన్నికల్లో కర్జాయ్ గెలిచినట్లు ప్రకటించింది. ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తూనే 2009 ఎన్నికల్లో కూడా అధ్యక్షుడు కావడానికి సహకరించింది. కానీ అమెరికా ఆర్ధిక శక్తి బలహీనం కావడం, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అమెరికా వ్యతిరేక శక్తులు బలపడడంతో కర్జాయ్ పై అమెరికా అదుపు కోల్పోయినట్లు కనిపిస్తోంది.
2009 నుండి కర్జాయ్ ఆఫ్ఘన్ జాతీయవాదిగా మాట్లాడడం ప్రారంభించాడు. ఈ రోజు (మార్చి 15) ప్రసంగంలో కూడా అదే ధోరణి కనపరిచాడు. “అలవాటుగా గానీ లేదా జోక్యం చేసుకోవాలన్న కోరికతో గానీ ఉన్న విదేశాలు ఆఫ్ఘన్ లో జోక్యం చేసుకోవడానికి వీలు లేదని నేను స్పష్టం చేయదలిచాను” అని కర్జాయ్ తన ప్రసంగంలో పేర్కొన్నాడు. 2001 నాటి దాడి ద్వారా యుద్ధాన్ని ఆఫ్ఘనిస్తాన్ పై బలవంతంగా రుద్దారని ఆయన ఆరోపించారు. టెర్రరిస్టుల ఆశ్రయాల మీదికి గానీ, టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్న దేశాల మీదికి గానీ అమెరికా వెళ్ళి ఉన్నట్లయితే ఆఫ్ఘన్ కి కాస్త శాంతి దక్కి ఉండేదని అమెరికాను దెప్పి పొడిచాడు. కర్జాయ్ ఉద్దేశ్యంలో ఉన్న దేశం పాకిస్తానే అనడం సందేహం లేదు.
ఆఫ్ఘనిస్ధాన్ దేశాన్ని కాపాడుకునే స్ధితిలో ఆఫ్ఘన్ సైన్యం ఉన్నదని కాబట్టి అంతర్జాతీయ బలగాల సహాయం తమకు అవసరం లేదని కర్జాయ్ పార్లమెంటుకు తెలిపారు. శాంతి ప్రక్రియలో చేరాల్సిందిగా ఆయన తాలిబాన్ ను మరోసారి అభ్యర్ధించాడు. అదే సమయంలో తాలిబాన్ నాయకత్వాన్ని పాకిస్తాన్ కాపాడుతోందని ఆరోపణలు ఎక్కుపెట్టాడు. శాంతి ప్రక్రియలో పాలు పంచుకుంటున్న తాలిబాన్ నాయకుడిని చంపడంలో పాకిస్ధాన్ పాత్ర ఉందని కూడా ఆయన ఆరోపించాడు.
కర్జాయ్ మొదటి పదవీకాలంలో అమెరికా సైనికులు అనేకసార్లు బాంబిగ్ దాడులులు జరిపి లక్షలాది అమాయక పౌరులను బలిగొన్నా ఆయన నోరు విప్పలేదు. పైగా అమెరికా విదిలించే డాలర్ నిధుల కోసం అంగలార్చాడు. ఇప్పుడు కొత్తగా ఆఫ్ఘన్ ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పడం అంటే, బహుశా ఇరు పక్షాల మధ్య తగిన బేరం కుదరలేదని భావించాల్సి వస్తోంది. ఇరాన్, చైనా లతో సంబంధాలు పెట్టుకోవడం ద్వారా కర్జాయ్ అమెరికాకు గట్టి సవాలే విసిరాడు. కానీ ఆయన తర్వాత వచ్చే అధ్యక్షుడు ఎలాగూ అమెరికాతో ఒప్పందంపై సంతకం చేసే అవకాశాలు కనిపిస్తున్నందున అమెరికా సైన్యం ఆఫ్ఘన్ లో కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వృద్ధ నారీ పతివ్రతః అన్నట్లు. తీరా పదవి కాలం ముగిసే సరికి…..కర్జాయ్ కి ఆఫ్ఘన్ మీద ప్రేమ పుడుతోందన్న మాట.
@ అన్నట్లు విశేఖర్ గారు. రెండో పేరా రెండో లైన్ లో కర్జాయ్ వరుసగా రెండు సంవత్సరాలు అని అన్నారు. అది రెండు సార్లు అని కదా…!
అవును. రెండుసార్లు అని ఉండాలి. సవరిస్తున్నా.