35 వేల అడుగుల ఎత్తునుండి కుప్ప కూలిందని భావిస్తున్న మలేషియా విమానం ఆచూకీ దొరకనే లేదు. ప్రపంచం అంతా ‘ఫ్లైట్ ఎంహెచ్370’ కోసం ఆతృతగా ఎదురు చూస్తుండగానే అమెరికాలో మరో ప్రమాదం నమోదయింది. న్యూయార్క్ నగరం లోని అప్పర్ మన్ హటన్ (ఈస్ట్ హర్లేమ్) లో పేలుడు సంభవించడంతో రెండు భవనాలు కుప్ప కూలాయి. ఈ పేలుడుకు పైపుల నుండి వంట గ్యాస్ లీక్ అవడం కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. పేలుడులో ముగ్గురు మరణించారని గురువారం వరకు నిర్ధారించారు. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
బుధవారం (మార్చి 12, స్ధానిక కాలమానం ప్రకారం ఉదయం 9:30 గం.ల ప్రాంతంలో) జరిగిన ఈ ప్రమాదంలో 36 మంది వరకు గాయపడ్డారని రాయిటర్స్ తెలిపింది. చాలామంది ఆచూకీ దొరకలేదు. అసలు భవనాల్లో ఎంతమంది ఉన్నదీ నిర్ధారణ కాలేదు. ఎక్కువగా నివాస భవనాలు ఉండే అప్పర్ మన్ హటన్ లో 116 స్ట్రీట్, పార్క్ ఎవెన్యూ ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. రెండు భవనాలు అపార్ట్ మెంట్ లే అనీ, కూలిపోయిన శిధిలాల నుండి పెద్ద ఎత్తున దుమ్ము, ధూళి పొగలుగా అల్లుకున్నదని పత్రికలు తెలిపాయి. ఎంతమంది ఆచూకీ తెలియలేదో వివరాలు ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు.
ఉదయం గం. 9:13 ని.లకు ‘కన్సాలిడేటెడ్ ఎడిసన్’ భవనంలో గ్యాస్ లీక్ అవుతున్న వాసన వెలువడిందని పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. అంతకుముందు రోజే గ్యాస్ వాసన ఛాయలు వచ్చినప్పటికీ పట్టించుకోలేదని, బుధవారం ఈ వాసన పెరగడంతో పోలీసులకు ఫోన్ చేశారని స్ధానికులు చెప్పారు. అయితే పోలీసులు సరిగ్గా అక్కడికి వచ్చే సమయానికి పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించి రెండు భవనాలు కూలిపోయాయి. గ్యాస్ లీక్ వల్లనే భవనాలు కూలిపోయాయని పోలీసులు ఇంకా ప్రకటించలేదు.
పేలుడు ధాటికి శిధిలాలు సమీపంలోని భవనాల పై కప్పుల మీదికి ఎగసిపడినట్లు తెలుస్తోంది. పేలుడు జరిగింది ఒక భవనంలోనే అయినప్పటికీ ఆ ధాటికి పక్కనే ఉన్న మరో 5 అంతస్తుల భవనం కూడా కూలిపోయిందని పత్రికలు తెలిపాయి. ఒక్కో భవనంలో 15 అపార్ట్ మెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చోటులో లాటిన్ దేశాల సంతతి కార్మిక వర్గ ప్రజలు ఎక్కువగా నివసిస్తారని రాయిటర్స్ తెలిపింది. ఎంతమంది ఆచూకీ తెలియనిది చెప్పడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. మేయర్ బిల్ డి బ్లాసియో మాత్రం గ్యాస్ లీక్ వల్లనే పేలుడు జరిగి ఉండవచ్చని తెలిపారు.
గ్యాస్ వాసన వచ్చిన భవనంలోని వారు కాకుండా పక్కనే ఉన్న భవనంలో నివశిస్తున్న వ్యక్తి ఒకరు పోలీసులకు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసిన 15 ని.లకే భవనం కూలిపోయిందని పోలీసులు తెలిపారు. గత సంవత్సరం మే నెలలో కూలిన భవనం నుండి గ్యాస్ లీక్ అయిన సంఘటన జరిగిందని అయితే అప్పటికి సమస్యను పరిష్కరించారని తెలుస్తోంది. గ్యాస్ మళ్ళీ లీక్ అవ్వడాన్ని బట్టి ఈసారి ప్రాణాలను కూడా బలిగొనడాన్ని బట్టి సమస్య పరిష్కారం తాత్కాలిక ప్రాతిపదికనే జరిగినట్లు అనుమానం కలుగుతోంది.
“గ్యాస్ పేలుడు, అనంతరం జరిగిన అగ్ని ప్రమాదం పై మేము విచారణ జరుపుతున్నాం” అని నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ అధికారులు ప్రకటించారు. దాన్ని బట్టి కనీసం ఈ విభాగం వరకు గ్యాస్ లీక్ వల్ల పేలుడు జరిగిందని నిర్ధారణకు వచ్చారని భావించవచ్చు. ‘అనేకమంది’ ఆచూకీ లభ్యం కాలేదని మేయర్ డి బ్లాసియో తెలిపారు. “జనాన్ని హెచ్చరించడానికి సమయం కూడా లేకుండా పోయింది. ప్రతిఒక్కరినీ కనుగొని వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నాం” అని ఆయన తెలిపారు.
పేలుడు జరిగినప్పుడు అనేకమంది భూ కంపం వచ్చినట్లు భావించారు. ఇళ్ళల్లో పలు వస్తువ్గులు స్ధాన భ్రంశం చెంది కింద పడిపోవడంతో భూకంపం అని భావిస్తూ బైటికి పరుగెత్తారు. “ఉన్నట్లుండి పెద్ద శబ్దం వచ్చింది. గోడలు ఒక్కసారిగా కూలిపోవడం మొదలయింది. కిటికీలు ఎగిరిపోయాయి. చచ్చాననే అనుకున్నాను” అని ఒక మహిళ చెప్పారని రాయిటర్స్ తెలిపింది. అయితే పొగురువాళ్ళు జామ్ అయిన ఆమె అపార్ట్ మెంట్ తలుపును గట్టిగా మోది తెరవడంతో ప్రాణాలతో బైటపడింది.
న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రకారం ఇంకా 9 మంది ఆచూకీ కోసం పోలీసులు, ఇతర సహాయక వాలంటీర్లు వెతుకుతున్నారు. కొందరు వీధిలో పార్క్ చేసి ఉన్న కార్లలో ఇరుక్కుని ఉన్నారని వారి వాహనాలపైన భవనం శిధిలాలు పడ్డాయని పత్రిక తెలిపింది. దాదాపు 250 మంది వరకు అగ్నిమాపక బలగాలు మంటలను ఆర్పడంలో నిమగ్నం అయ్యాయి. శిధిలాలను తొలగించి ఇరుక్కుపోయినవారిని కాపాడడం ప్రస్తుతం ప్రధాన సమస్య.
http://bigstory.ap.org/article/us-judge-dismisses-charges-indian-diplomat-case