ప్రమాదానికి గురయిందని భావిస్తున్న Flight MH370 మలేషియా విమానం వెతుకులాటలో సహాయం చేయాలని మలేషియా ఇండియాను కోరింది. కౌలాలంపూర్ నుండి ఈశాన్య దిశగా ప్రయాణమై బీజింగ్ చేరాల్సిన విమానం మధ్యలోనే వెనక్కి మళ్ళీ పశ్చిమ దిశగా మలక్కా ద్వీపాల వరకు వచ్చినట్లు ఆ దేశ మిలట్రీ అధికారులు చెప్పడంతో ఇండియా సాయం అవసరం అయింది.
మలక్కా ద్వీపాలకు సమీపంలోనే అండమాన్ నికోబార్ ద్వీపాలు ఉన్నాయి. అండమాన్, నికోబార్ ద్వీపాల్లో భారత నావికా బలగాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ బలగాల సహాయంతో అండమాన్ సముద్రంలో వెతకాలని మలేషియా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మలేషియా నుండి విజ్ఞప్తి అందిన విషయాన్ని భారత విదేశాంగ శాఖ ధృవీకరించింది.
“నిన్నటి నుండి మలేషియా, ఇండియాలు సంబంధంలో ఉన్నాయి. కాంటాక్ట్ పాయింట్స్ గురించి చర్చిస్తున్నాము. ఎలాంటి సహాయం అవసరమో ఈ కాంటాక్ట్ పాయింట్ లు నిర్ధారిస్తారు. ఇండియా ఎంతవరకు సాయం అందించగలదో కూడా వీరు నిర్ధారిస్తారు” అని విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. ఇండియా ఏ ప్రాంతంలో వెతుకులాట నిర్వహించేది ఇంకా నిర్ణయించలేదని సదరు ప్రతినిధి తెలిపారు.
విమానం అదృశ్యం అయిన మూడు రోజుల తర్వాత మలేషియా మిలట్రీ తమ దేశానికి పశ్చిమ దిశలో విమానం ఆచూకీ ఉన్నట్లుగా రాడార్ ద్వారా కనుగొన్నామని చెప్పడంతో కలకలం రేగింది. దక్షిణ చైనా సముద్రంలో కౌలాలంపూర్ నుండి ఒక గంట లోపు ప్రయాణ దూరంలో అదృశ్యమైన విమానం వెనక్కి మళ్లినట్లుగా రాడార్ రికార్డులు సూచించాయని మలేషియా మిలట్రీ అధికారులు మొదట చెప్పారు.
ద.చై.సముద్రంలో అదృశ్యం అయిన విమానం ఆనవాళ్ళు మరో రెండు గంటల తర్వాత మలక్కా దీవుల వద్ద ప్రత్యక్షం అయినట్లుగా తాము గుర్తించామని వారు బుధవారం పత్రికలకు తెలిపారు. పత్రికలకు బుధవారం చెప్పినప్పటికీ అమెరికా నౌకలు, విమానాలు ప్రమాదం జరిగిన మరుసటి రోజు నుండే మలక్కా ద్వీపాల వద్ద వెతకడం బట్టి ఈ సంగతి ముందే వివిధ ప్రభుత్వాల (కనీసం మలేషియా, అమెరికాల) దృష్టిలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
ఈ నేపధ్యంలో వియత్నాం తమ వెతుకులాట ప్రయత్నాలను పాక్షికంగా ఉపసంహరించుకుంది. మలక్కా దీవుల వరకు విమానం వెళ్ళినట్లయితే వియత్నాం తమ సముద్ర జలాల్లో వెతికీ ప్రయోజనం ఉండదు.
అయితే మలేషియా అధికారులు గుర్తించిన అంశం నిర్ధారణగా చెప్పడానికి ఆ దేశ ప్రభుత్వం వెనకాడుతోంది. రాడార్ లో గుర్తించిన అంశాలు సరైనవి కాకపోవచ్చని, అలాగని పూర్తిగా కొట్టిపారేయగలది కూడా కాదని తెలుస్తోంది. విమానంలో రాడార్ గుర్తించగల వ్యవస్ధలు సరిగ్గా పని చేయని పక్షంలో రాడార్ తెరపై కనిపించే దృశ్యాలను నిర్ధారించడం కష్టం అని నిపుణులు చెబుతున్నారు.
విమానం ఎటు ప్రయాణించింది సరిగ్గా చెప్పడంలో మలేషియా విఫలం అవుతోందని, ఇస్తున్న సమాచారం కూడా సమగ్రంగా లేదని అందువలన తమ వెతుకులాటను విరమిస్తున్నామని వియత్నాం ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ తర్వాత మళ్ళీ పూర్తి స్ధాయిలో అన్వేషణ ప్రారంభించామని తెలిపింది. ఈసారి భూభాగంలో కూడా అన్వేషిస్తున్నామని తెలిపింది.
అండమాన్, నికోబార్ దీవుల వద్ద కూడా ఇప్పుడు పూర్తిస్ధాయిలో అన్వేషణ జరుగుతోంది. అలాగే దక్షిణ చైనా సముద్రంలో కూడా తీవ్ర అన్వేషణ జరుగుతోంది. ఈ మేరకు చైనా ప్రభుత్వం మరొక్కసారి సముద్రం జల్లెడ పట్టాలని నిర్ణయించింది. ఎక్కడ వెతకాలి అన్న విషయంలో ఏర్పడ్డ అయోమయం మిస్టరీని మరింత తీవ్రం చేస్తోంది. నమ్మకంగా అన్వేషణ చేయగల అవకాశం లేనట్లవుతోంది.
మలేషియా ఏవియేషన్ అధికారులకు, మిలట్రీ అధికారులకు మధ్య కూడా సమన్వయం లేకుండా పోయింది. విమానం పశ్చిమ దిశలో ప్రయాణించి మలక్కా దీవుల వరకు వచ్చిందన్న మిలట్రీ అధికారుల అవగాహనను నిర్ధారించడానికి ఆ దేశ ఏవియేషన్ అధికారులు నిరాకరించారు. మలక్కా దీవులకు అటూ, ఇటూ ఉన్న ధాయిలాండ్, వియత్నాంలు కూడా తమ రాడార్ లు అలాంటి సూచనలను రికార్డు చేయలేదని స్పష్టం చేశాయి.
మలక్కా దీవుల వరకు విమానం ప్రయాణించిన సంగతి నిజమే అయితే 35,000 అడుగుల ఎత్తులో విమానం అకస్మాత్తుగా అదుపు తప్పిపోయి ఉండవచ్చన్న సిద్ధాంతాన్ని మార్చుకోవలసి ఉంటుంది. ఏ కారణం వల్ల అయినా అంత ఎత్తున ప్రమాదం సభవించినందునే విమాన శకలాలు కనిపెట్టడం కష్టం అవుతోందని ఇప్పటివరకు భావిస్తున్నారు. అలా కాకుండా మలక్కా దీవుల వరకు విమానం వచ్చి ఉంటే దాదాపు 500 కి.మీ వరకూ అది క్షేమంగా ప్రయాణించిందని అర్ధం.
విమానం అదృశ్యం తర్వాత ఎలాంటి సాక్ష్యామూ లభించకపోవడం వల్ల ఇన్ని అనుమానాలు, సిద్ధాంతాలు పుట్టుకొస్తున్నాయి. ఆశలయితే ఏం జరిగిందో తెలియడానికి కనీసం శకలాలు దొరికేవరకయినా ఆగవలసిందే.
Sir, Flight MH480 కాదుFlight MH370 Typing mistake పడింది kindly clear it.
Thanks.
?!
Hi ?!, Thanks.