ప్రశ్న: సరళీకరణ విధానాలు దేశానికి మంచివే కదా?


హరీష్:

ఇవాళ ప్రభాత్ పట్నాయక్ గారి ఇంటర్వ్యూ ఈనాడులో ప్రచురించారు. సరళీకరణ వల్ల  ఆర్ధిక అసమానతలు పెరిగాయని ఆయన వివరించారు. కాని ఆ సరళీకరణ విదానాల వల్లనే మనం ఆర్థికంగా మెరుగయ్యామని చెప్తుంటారు కదా. మేమూ అలానే అనుకుంటున్నాం. చాలా  మంది కొత్తవాళ్ళకి అవకాశాలు అందించాయి  కదండి. దాని గురుంచి కాస్త విపులంగా వివరించగలరు.

సమాధానం:

ప్రభాత్ పట్నాయక్ గారు చెప్పింది నిజమే. సరళీకరణ విధానాలు ప్రజల కోసం ప్రవేశపెట్టినవి కావు. భారత దేశ మార్కెట్ ను విదేశీ కంపెనీల ప్రవేశానికి అనువుగా మార్చడానికి ప్రవేశపెట్టినవే సరళీకరణ విధానాలు. ఇందులో భారత ప్రజల ప్రయోజనాలు ఇసుమంతయినా లేవు. కనీసం భారత దేశంలోని జాతీయ పెట్టుబడుదారులకు కూడా అనుకూలం కావు. విదేశీ బహుళజాతి కంపెనీలకు ఏజంటు గిరీ చేసే ధనిక వర్గాలు మన దేశంలో ఉన్నాయి. వారే మన దేశాన్ని ప్రస్తుతం ఏలుతున్నారు. వారికి తప్ప సరళీకరణ విధానాలు ఇతర భారతీయులు ఎవ్వరికీ ఉపయోగపడవు. పైగా దేశాన్ని మరింత పరాధీనత లోకి నెట్టివేస్తాయి.

సరళీకరణ అంటే దేన్ని సరళీకరించడం అన్న ప్రశ్న సహజంగా తలెత్తాలి. ఆ ప్రశ్న వస్తే మనకు వచ్చే సమాధానం: ఒక్క మాటలో ‘భారత మార్కెట్’ అని చెప్పవచ్చు. వివిధ కంపెనీలు వివిధ ఉత్పత్తులను తయారు చేశాక వాటిని అమ్ముకోవడానికి మార్కెట్ కావాలి. అనగా కొనుగోలుదారులు కావాలి. పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీలకు అప్పటికే అందుబాటులో ఉన్న మార్కెట్ సరిపోలేదు.(వారికి ఎప్పటికీ సరిపోవు. అది వేరే కధ.) కాబట్టి తమకు అందకుండా దూరంగా ఉన్న మార్కెట్లు ఏమన్నా ఉంటే అవి కూడా వారికి కావాలి. దూరం అంటే కి.మీ లలో కొలిచే భౌతిక దూరం అని కాదు. వివిధ చట్టాల రూపంలో ఆయా దేశాలు ఏర్పరచుకున్న రక్షణల వల్ల అందుబాటులో లేని దూరం అని.

వారికి దూరంగా ఉన్న మార్కెట్లు ఏవి? ఏ దేశాల్లోనైతే ప్రభుత్వ రంగ పరిశ్రమలు జాస్తిగా ఉన్నాయో, ఏ దేశాల్లోనైతే విదేశీ కంపెనీల మార్కెట్ దోపిడీని నిరోధించడానికి పటిష్టమైన చట్టాలు చేసుకున్నారో ఆ దేశాల మార్కెట్లు వారికి దూరంగా ఉన్నాయి. అందులో భారత దేశం ఒకటి. దీనర్ధం భారత దేశంలో అచ్చంగా (absolute) పటిష్టమైన చట్టాలు ఉన్నాయని కాదు. సాపేక్షికంగా (relative) చూస్తే 1990 వరకు మన దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రధానంగా ఉత్పత్తులు చేశాయి. అంటే ఇక్కడి మార్కెట్ కూడా ప్రధానంగా ప్రభుత్వ రంగ కంపెనీల ఆధీనంలోనే ఉందని అర్ధం.

ప్రభుత్వ రంగ పరిశ్రమల వల్ల ఉన్నత స్ధాయి విద్యావంతులతో పాటు వివిధ విద్యా స్ధాయిలలోని విద్యావంతులకు కూడా స్ధిరమైన ఉపాధి లభించింది. తద్వారా లక్షలాది కుటుంబాలు లబ్ది పొందాయి. సదరు ప్రభుత్వ రంగ కంపెనీలపై ఆధారపడి దేశ వ్యాపితంగా పదుల లక్షల సంఖ్యలో (కోట్లలో కాకపోతే) చిన్న, మధ్య పరిశ్రమలు నడిచేవి. వాటిలో కూడా మరిన్ని కోట్ల మంది ఉపాధి పొందారు. ఇవన్నీ కలిసి దేశంలో ఎక్కువమంది కుటుంబాలకు కొనుగోలు శక్తి మెరుగ్గా ఉండేది. ఇది రైతుల పంటలకు, చేతి వృత్తులవారి ఉత్పత్తులకు గిరాకీ ఏర్పరిచాయి. ఆ విధంగా స్వయం ఉపాధి ద్వారా, స్వయం శ్రమ ద్వారా కూడా అనేకమంది ఇతరులు జీవనం సాగించారు.

ఈ పరిస్ధితిని సరళీకరణ విధానాలు తలకిందులు చేశాయి. సరళీకరణ పేరుతో మనవాళ్లు విదేశీ ప్రైవేటు బహుళజాతి కంపెనీలకు  గేట్లు బార్లా తెరిచారు. వాటివద్ద అప్పటికే ట్రిలియన్ల కొద్దీ పెట్టుబడి పోగుబడి ఉంది. అభివృద్ధి చెందిన టెక్నాలజీ కూడా ఉంది. ఈ పెట్టుబడి, టెక్నాలజీల ద్వారా వారు తమ సరుకులను ప్రారంభంలో తక్కువ రేట్లకు ఇవ్వగలరు. ఆ విధంగా మార్కెట్ ను క్రమంగా వశం చేసుకున్నాక క్రమంగా ధరలు పెంచి పాత లాభాలు కూడా రాబట్టుకుంటారు. కానీ విదేశీ కంపెనీల సరుకులు అమ్ముడు అవ్వాలంటే అప్పటికే ఇక్కడ అమ్ముడు అవుతున్న సరుకుల అమ్మకం ఆగిపోవాలి. అనగా మన ప్రభుత్వ రంగ కంపెనీలు ఉత్పత్తి మానేయాలి. అనగా మనకు స్ధిరమైన ఉపాధి ఇస్తున్న ప్రభుత్వరంగ కంపెనీలు మూసేయాలి.

పరిశ్రమలు మూసేస్తే కార్మికులు ఊరుకోరు. సమ్మెలు చేస్తారు. కాబట్టి చట్టాలను సవరించాలి. కార్మికులు సమ్మెలు చేయకుండా చట్టాలు చేయాలి. అసలు వారికి సంఘం పెట్టుకునే హక్కే లేకుండా చేయాలి. పి.వి-మన్మోహన్ ప్రభుత్వం మొదలుకొని ఆ తర్వాత ప్రభుత్వాలన్నీ సరిగ్గా అదే చేశాయి. గతంలో 7 గురు కార్మికులతో సంఘం పెట్టుకోవచ్చు. ఇప్పుడు కనీసం 100 మంది ఉంటేగానీ సంఘం పెట్టడానికి వీల్లేదు. అలాగని చట్టం మార్చేశారు. ఇది కూడా సరళీకరణలో భాగమే. అంటే స్ధానిక ప్రభుత్వ రంగం మరియు ప్రజల ప్రయోజనాలను కాపాడే చట్టాలను నీరు గార్చారు. పోనీ 100 మందితోనైనా సంఘం పెట్టుకోనిస్తున్నారా అంటే అదీ లేదు. కొన్నేళ్ళ క్రితం హోండా కార్ల కంపెనీలో సంఘం పెట్టుకున్నందుకు మన తెలుగు కార్మికులనే నొయిడాలో ఒక పార్కులో వేసి కుళ్ళ బొడిచారు పోలీసులు.

ఇలా దేశీయ పరిశ్రమలకు, ప్రజలకు వ్యతిరేకంగానూ, విదేశీ మరియు ప్రైవేటు కంపెనీలకు అనుకూలంగానూ చట్టాల్ని మార్చేయ్యడం కూడా సరళీకరణలో భాగమే. దీనిని deregulation అని కూడా అంటారు. విదేశీ ప్రైవేటు కంపెనీల విచ్చలవిడి ప్రవేశాన్ని నిరోధించడానికి ఏర్పాటు చేసుకున్న నియంత్రణలను (regulations) తొలగించడం కాబట్టి డీ-రెగ్యులేషన్ అన్నమాట!

ప్రభుత్వ రంగ పరిశ్రమలను మూసేసే పని కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులా చేస్తే ఎన్.డి.ఏ ప్రభుత్వం ఏకంగా ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పరిచుకుంది. అరుణ్ శౌరి నేతృత్వంలో Disinvestment శాఖను ఏర్పాటు చేసిన ఘనత బి.జె.పి సొంతం. పబ్లిక్ సెక్టార్ ను క్రమంగా నీరుగార్చి, అదృశ్యం చేయడం వల్ల భారత ప్రజలకి ఉపాధి పోయింది. ఉన్న ఉపాధి పోయింది. ప్లస్ కొత్త ఉపాధి ఆగిపోయింది. సమ్మె హక్కు పోయింది. సంఘం పెట్టుకునే హక్కు పోయింది. ప్రభుత్వ రంగంపై ఆధారపడిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలు లక్షల సంఖ్యలో మూతపడి కోట్లమంది వీధిన పడ్డారు.

పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలను మూసేయడానికి ప్రభుత్వాలు ఏ రోటి కాడ ఆ పాట పాడాయి. నష్టాలు వస్తుంటేనేమో నష్టాలు వస్తున్నాయి కనుక మూసేస్తున్నాం అన్నారు. లాభాలు వస్తుంటేనేమో పెట్టుబడులు, టెక్నాలజీ కావాలి కనుక షేర్లు అమ్మేస్తున్నాం అన్నారు. అన్నీ ఉంటేనేమో పోటీ ఉంటే ధరలు తగ్గి సరుకులు సరసంగా జనానికి అందుబాటులో ఉంటాయ్ అన్నారు. కొన్నిసార్లు పబ్లిక్ సెక్టార్ లో అవినీతి పెరిగింది అన్నారు. కొన్నిసార్లు సామర్ధ్యం లేదు అన్నారు. ఏ కారణమూ పని చేయదు అనుకుంటే ఏమీ చెప్పకుండానే బలవంతంగా మూసేశారు. అవినీతి పెరిగితే దానికి కారణం ఎవరు? ప్రభుత్వాలే. ఎవరైతే ఈ కారణం చెప్పారో వారే ఆ అవినీతికి, నష్టాలకు, సామర్ధ్యం తగ్గడానికి కారణం.

ఇవన్నీ ఒక రోజులో జరిగిన పరిణామాలు కావు. గత 25 సం.లుగా క్రమంగా జరిగిన పరిణామాలు. పోటీ, సామర్ధ్యం, పెట్టుబడి, టెక్నాలజీ తదితర సాకులు చూపి ప్రభుత్వాలు విదేశీ కంపెనీలకు గేట్లు తెరుస్తుంటే ఆ సాకులను నమ్మే ముందు జనం తరచుగా ఒక అంశాన్ని విస్మరిస్తారు. అదేంటంటే మనం బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా ఎందుకు పోరాడాం? దేశంలోని ఖనిజ, భూ వనరులను కొల్లగొట్టి తమ కంపెనీలకు ముడి పధార్ధాలుగా తరలించడమే కాకుండా వాటితో తయారు చేసిన ఉత్పత్తులను తిరిగి మన దేశంలో అమ్ముతున్నందుకే గదా. దీనివల్ల దేశీయ ఆర్ధిక వ్యవస్ధ బ్రిటిష్ కంపెనీల చేతికి వెళ్ళిపోయినందునే కదా.

మళ్ళీ అవే కంపెనీలను దేశంలోకి తిరిగి ఆహ్వానిస్తే అది మనకు మంచి ఎలా అయ్యింది? విదేశీ కంపెనీల వల్ల 1947 కు మునుపు జరగని మంచి 1990 తర్వాత ఎలా జరుగుతుంది? ఇది మౌలిక ప్రశ్న. ఏ నెహ్రూవియన్ విధానాలనైతే గొప్పగా మన పాలకులు పొగిడారో అవే విధానాలను రాక్షసీకరిస్తూ సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టారంటే మన పాలకులు ప్రయోజనాలు ఎవరితో ఉన్నాయో అర్ధం కావడం లేదా?

సరళీకరణ వల్ల కొత్తవారికి అవకాశాలు వచ్చాయి అనడం శుద్ధ అబద్ధం. పబ్లిక్ సెక్టార్ కంపెనీలు మూసేస్తే ఉపాధి పోయింది గాని కొత్తవి ఎలా వచ్చాయి? సాఫ్ట్ వేర్ రంగం దానికదే కొత్త రంగం. సాఫ్ట్ వేర్ రంగం విద్యావంతుల్లోనే వెట్టిచాకిరీ వర్గాన్ని తయారు చేసుకుంది తప్ప పాత ఉపాధిని అదేమీ కాపాడలేదు. పైగా ఉద్యోగులకు బొత్తిగా రక్షణలు లేని ప్రైవేటు రంగంలోని ఉపాధి అది. అది స్ధిరమైన ఉపాధి కాదు.

పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలకు వచ్చే లాభాలు ప్రభుత్వ వద్దనే ఉంటాయి. ఆ డబ్బు తిరిగి ప్రజలకి ఉపయోగించడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. ప్రైవేటీకరణ తర్వాత ఈ లాభాలు ప్రైవేటు వ్యక్తుల వద్ద కేంద్రీకృతం అవుతాయి. అనగా సంపదల కేంద్రీకరణ మరింత పెరుగుతుంది. ప్రయివేటీకరణ ఎంత ఉధృతంగా జరిగితే సంపదలు అంత ఎక్కువగా కొద్ది మంది వద్ద కేంద్రీకృతం అవుతుంది. ఇది దేశంలో బిలియనీర్ల సంఖ్యను పెంచింది. అనగా ఆదాయ అంతరాలను తీవ్రం చేసింది. అలాగే రైతులు, చేతి వృత్తుల వారి మార్కెట్ ను విదేశీ కంపెనీల పరం చేసింది.

అంతేకాదు. సరళీకరణ వల్ల ఆర్ధిక వ్యవస్ధ స్ధిరత్వం కూడా దెబ్బతింటుంది. ప్రైవేటు కంపెనీలు తమ పెట్టుబడులను ఎక్కడ లాభాలు వస్తే అక్కడికి తరలిస్తాయి. గ్లోబలీకరణ యుగంలో దాదాపు అన్నీ దేశాల్లో deregulation జరగడం వల్ల వారికి ఈ అవకాశం చిక్కింది. తద్వారా ప్రపంచంలో ఏ మూల చిన్న పరిణామం జరిగినా అవి దేశ ఆర్ధిక వ్యవస్ధపై ప్రభావం చూపుతాయి.

ఈ అంశాన్ని ఇంకా బహుముఖ దిశల్లో వివరించవచ్చు. ఇప్పటికే ఎక్కువయింది. ఒక ఐడియా వస్తే చాలు అని భావిస్తూ ఇక్కడితో ముగిస్తున్నాను.

(ఇంకా ఇతర మిత్రుల ప్రశ్నలు ఉన్నాయి. చందుతులసి, బ్రహ్మయ్య తదితర మిత్రుల ప్రశ్నలు ఉన్నాయి. వీలు వెంబడి వారికి సమాధానం ఇవ్వగలనని గ్రహించగలరు. -విశేఖర్)

One thought on “ప్రశ్న: సరళీకరణ విధానాలు దేశానికి మంచివే కదా?

  1. శేఖర్ గారు వివరించినందుకు ధన్యవాదాలూ … మరి మన దేశంలో తిరిగి ప్రభుత్వ రంగాలను స్థాపించడానికి ప్రోత్సాహం అందించడం కానీ, ఉన్నవాటికి చేయూత ఇవ్వడం కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ముందుకు వచ్చే ఆస్కారాలు చాలా చాలా తక్కువ…. మఱ్ఱి చేట్టుల్లాగా పాతుకుపోయిన నీడల్లో మన ప్రభుత్వాలు పని చేసుకుపోతుంటే ఎప్పటికీ మారుతుంది?!…. చచిపోతాయి ఆ నీడల్లో.. ఇప్పటికే చాలా సంస్థల చేతుల్లో ఇరుక్కుపోయాయి..
    ఆ కబంద హస్తాల నుంచి బయటికి పడే మార్గాలు ఏవి??

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s