ఆచూకీ లేని విమానం, మోగుతున్న సెల్ ఫోన్లు -ఫోటోలు


అనూహ్య పరిస్ధితుల్లో అదృశ్యం అయిన మలేషియా విమానం కోసం సముద్రం జల్లెడ పడుతున్నా ఇంకా ఫలితం దక్కలేదు. మొత్తం 10 దేశాలకు చెందిన విమానాలు, హెలికాప్టర్లు, నౌకలు గాలింపు చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. ఉద్రిక్తతలకు ఆలవాలం అయిన దక్షిణ చైనా సముద్రంలో సముద్ర జలాల హక్కులపై నెలకొన్న తగాదాలను పక్కనబెట్టి మరీ ఆయా దేశాలకు చెందిన మిలట్రీ విమానాలు, సివిల్ ఏవియేషన్ విభాగాలు, సముద్ర రక్షక బలగాలు, తీర రక్షక బలగాలు (కోస్ట్ గార్డ్)  గాలింపు జరుపుతున్నాయి.

విచిత్రంగా విమానంలో ప్రయాణించిన వారి సెల్ ఫోన్లు కొన్ని ఇప్పటికీ మోగు తున్నాయని వారి బంధువులు చెబుతున్నారు. అదృశ్యం అయిన విమానంలో మూడింట రెండొంతుల ప్రయాణీకులు చైనీయులే. చైనా సోషల్ వెబ్ సైట్ QQ లో కొందరి ప్రయాణీకుల ఖాతాలు తెరిచి ఉన్నట్లు తెలియడంతో మిస్టరీ మరింత తీవ్రం అయింది.

ఒక ప్రయాణీకుడి QQ ఖాతా చురుకుగా (ఆన్ లైన్ లో) ఉండడం చూసిన బంధువులు పోలీసు అధికారులను పిలిచి తమ కంప్యూటర్ చూపించారు. పోలీసులు వచ్చేసరికి సదరు బంధువులను మరింత దుఃఖంలో ముంచుతూ ప్రయాణికుడి ఖాతా స్టేటస్ మారిపోయింది. అనగా పోలీసులు వచ్చేలోపుగానే సదరు ఖాతాను ఆపరేట్ చేసినట్లు అర్ధం. విమానం కూలిపోయినట్లయితే సోషల్ వెబ్ సైట్ లో స్టేటస్ మార్చడం ఎలా సాధ్యం అన్నది అంతుచిక్కని మిస్టరీగా మారిందని డెయిలీ మెయిల్ (బ్రిటన్) పత్రిక తెలిపింది.

కనీసం 19 మంది చైనా ప్రయాణీకుల సెల్ ఫోన్లు విమానం అదృశ్యం అయ్యాక కూడా రింగ్ అయ్యాయని చైనా పత్రికలు చెప్పాయి. అయితే ఫోన్ రింగ్ అవుతున్నా బదులు రాలేదు. ఆ తర్వాత కొన్ని ఫోన్లు రింగ్ అవ్వడం ఆగిపోగా మరికొన్ని ఇంకా రింగ్ అవుతున్నాయని తెలుస్తోంది. అదృశ్యం అయిన విమానం Flight MH370 సిబ్బందికి చెందిన ఒకరిద్దరి ఫోన్లు కూడా రింగ్ అయ్యాయని మలేషియా అధికారులు చెప్పడం విశేషం.

“మేము ఇప్పటి వరకూ అన్ని ప్రయత్నాలూ చేశాము. ఈ విమానం గురించి మంచి వార్త వినే అవకాశం, నమ్మకం దాదాపు లేవు” అని వియత్నాం తరపున వెతుకుతున్న బృందాలకు నాయకత్వం వహిస్తున్న ‘ఫామ్ కుయ్ టీయ్’ చెప్పారని రాయిటర్స్ తెలిపింది.

ఇదిలా ఉండగా చోరికి గురయిన పాస్ పోర్ట్ ని ఉపయోగించిన ఇద్దరు ఇరానియన్ ప్రయాణీకుల్లో ఒకరు జర్మనీలో ఉన్న తన తల్లి వద్దకు వెళ్తున్నారని, ఆయన అక్కడ ఆశ్రయం కోరుతున్నారని పత్రికలు తెలిపాయి. రెండో ప్రయాణీకుడు కూడా ఇరానియనే అయినప్పటికీ ఆయన గురించిన వివరాలు తెలియలేదు. `

విమానం శిధిలాలు కనిపెట్టడం ఇప్పుడు తక్షణ అవసరం. ప్రమాదానికి కారణం తెలుసుకోవాలన్నా, ప్రయాణీకుల బంధువులకు ఏదో ఒక సమాధానం చెప్పాలన్నా శిధిలాలు దొరికితేనే సాధ్యం అవుతుంది. శిధిలాలు దొరక్కపోవడం, అసలు ఎలాంటి ఊహా చేయడానికి వీల్లేని పరిస్ధితి ఏర్పడడం వలన పరిపరి విధాలుగా ఆలోచన చేయాల్సి వస్తోంది. ఎటువంటి సాక్ష్యము దొరక్కపోవడం వలన ఒక పరిధి, పరిమితి లేని అనుమానాలకు ఆస్కారం ఏర్పడింది.

ఇప్పటివరకూ మలేషియా భూభాగం తూర్పు వైపునే వెతుకులాట చేపట్టిన మలేషియా అధికారులు ఇప్పుడు పశ్చిమ తీరంపై కూడా దృష్టి సారించారు. నిజానికి ఇక్కడ నిన్నటి నుండే అమెరికా నౌకలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. దీనితో విమానం కూలిపోయే ముందు దారి తప్పి ఉండవచ్చన్న ఊహాగానాలకు పని పెట్టినట్లయింది. అదృశ్యం కావడానికి ముందు విమానం U-టర్న్ తీసుకుందని భావించేందుకు మిలట్రీ రాడార్లలో రికార్డయిన విమాన మార్గం ఆస్కారం కలిగించిందని మలేషియా అధికారులు తెలిపారు.

విమానంలో అత్యధికులు చైనీయులే. దీనితో చైనా పెద్ద సంఖ్యలో విమానాలను, నౌకలను రంగంలోకి దింపి వెతికిస్తోంది. తమ ఉపగ్రహాలను కూడా వెతుకులాటకు చైనా వినియోగిస్తోంది. వియత్నాం నౌకలు, విమానాలు కూడా సెర్చ్ ఆపరేషన్లలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నాయి.

టెర్రరిస్టు దాడి జరిగి ఉంటుందన్న సూచనను మలేషియా కొట్టివేస్తోంది. విమానంలో దాడి జరిగింది అనేందుకు ఎటువంటి సాక్ష్యాలు, సూచనలూ లేవని తెలిపింది.

వివిధ నౌకలు, హెలికాప్టర్లు, విమానాలు నిర్వహిస్తున్న సెర్చ్ ఆపరేషన్ లను కింది ఫొటోల్లో చూడవచ్చు. ఈ ఫోటోలను డెయిలీ మెయిల్ ప్రచురించింది.

One thought on “ఆచూకీ లేని విమానం, మోగుతున్న సెల్ ఫోన్లు -ఫోటోలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s