రక్షణ మంత్రి అరక్కపరంబిల్ కురియన్ ఆంటోని 2014 ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. స్వయంగా చెప్పలేదు గానీ ఒక కేరళ కాంగ్రెస్ నాయకునితో చెప్పించారు. రాజ్యసభ సభ్యులయిన ఎ.కె.ఆంటోని గతంలో కూడా ఎప్పుడూ లోక్ సభకు పోటీ చేసిన రికార్డు లేదు.
ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించడం ద్వారా ఆంటోని కొద్ది సేపు వార్తల్లో వ్యక్తి అయ్యారు. కానీ అంతకు మునుపు ఆయన వేరే కారణాల వల్ల వార్తల్లో నిలిచారు. భారత నావికా బలగాలకు చెందిన జలాంతర్గాముల్లోనూ, నౌకల్లోనూ వరుస ప్రమాదాలు జరగడమే ఆ కారణం.
ప్రమాదాలు జరిగినప్పుడు, కుంభకోణాలు జరిగినప్పుడు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడంలో ఆంటోనికి పేరుంది. కానీ ఈసారి మాత్రం ఆయన తన సొంత సాంప్రదాయాన్ని ఎందుకనో పాటించలేదు. ఒకటి కాదు, రెండు కాదు.. వరుసగా నాలుగైదు ప్రమాదాలు జరిగినా ఆయన రాజీనామా చేయలేదు. పైగా నావికాదళ అధిపతి జోషి రాజీనామా చేసిన వెంటనే ఆమోదించి బాధ్యత ఆయనపైకి నెట్టినంత పని చేశారు.
RIP అంటే Rest In Peace అని అర్ధం. ఇంటర్నెట్ స్లాంగ్ పదాల్లో ఇదొకటి అనుకుంటాను. రక్షణ మంత్రిగా ఆంటోని క్రెడిట్ అంతా నావికా బలగాల శవ పేటికలే అని కార్టూన్ సూచిస్తోంది. త్వరలో ప్రభుత్వం దిగిపోతోంది కనుక ఆయన బల్ల పైన శవ పేటికలు తప్ప ఆమోదించేందుకు మరో ఫైల్ లేదు.
సాధారణంగా బల్ల పైన IN, OUT డబ్బాలు ఉంటాయి. అవేమీ లేకుండా ఒక్క శవ పేటికలే ఉండడాన్ని బట్టి ప్రమాదాలకు ఆయన్ని పూర్తి బాధ్యుడిగా కార్టూనిస్టు చూస్తున్నారా?
వ్యక్తిగతంగా మన్మోహన్, ఆంటోని అవినీతి పరులు కాకపోవచ్చు. కాని స్వార్థ రాజకీయాలకు నెలవైన కాంగ్రెస్ తో అంటకాగడం దాని అవినీతి కార్యక్రమాలన్నిటికి వంత పాడడం వలన వీరు కూడా అవినీతి పరులైనారు. అవినీతి విధానాలకు సహకరించి అవినీతి పరులు అవుతున్నారు.