మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుండి చైనా రాజధాని బీజింగ్ కు బయలుదేరిన బోయింగ్-777 విమానం ఒకటి సముద్రంలో కూలిపోయినట్లు భయపడుతున్నారు. బయలుదేరిన 40 నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తో సంబంధాలు తెగిపోయిన విమానం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దక్షిణ చైనా సముద్రంలో 10 నుండి 15 కి.మీ మేరకు విస్తరించి ఉన్న ఇంధనం చూసి అనుమానించిన వియత్నాం నావికా దళాల ద్వారా మొదట సమాచారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం 239 మంది ఉన్నారు. వీరిలో 12 మంది సిబ్బంది కాగా మిగిలినవారు ప్రయాణీకులు. ఫ్లైట్ ఎంహెచ్370 గా పిలిచే ఈ విమానం ఎక్కడ కూలిపోయిందీ ఇంకా కనుగొనలేదని ఎన్.బి.సి లాంటి పత్రికలు చెబుతుండగా ది హిందూ మాత్రం తో చూ ద్వీపానికి 250 కి.మీ దూరంలో కూలినట్లు చెబుతోంది. ఈ మేరకు వియత్నాం నావికా దళ అధికారి రియర్ అడ్మిరల్ ఎంగో వాన్ ఫాట్ సమాచారం ఇచ్చారని వార్తా ఏజన్సీలను ఉటంకిస్తూ ది హిందు తెలిపింది.
ప్రమాదం గురించి నివేదించేనాటికి వియత్నాం నావికాదళాల వద్ద రక్షణ పడవలు ఏమీ లేకపోవడంతో రెస్క్యూ ప్రయత్నాలు చేయలేదని తెలుస్తోంది. విమానం సముద్రంలో కూలిపోయి ఉండవచ్చని చైనా మీడియా చెబుతోందని జిన్ హువా వార్తా సంస్ధ తెలిపింది. ప్రమాదానికి గురయిన విమానం ప్రయాణీకుల్లో అత్యధికులు చైనీయులే. 152 మంది చైనీయులు కాగా 38 మంది మలేషియన్లు. మృతి చెందినట్లు భావిస్తున్నవారిలో 5గురు భారతీయులు కూడా ఉన్నారు. 7గురు ఇండోనేషియన్లు కాగా ఆస్ట్రేలియా నుండి 6గురు, ఫ్రాన్స్ దేయస్ధులు ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 14 దేశాల వారు విమానంలో ఉన్నారు.
మలేషియా ఎయిర్ లైన్స్ సంస్ధ వారు తమ దేశ ప్రభుత్వంతో కలిసి వెతికే పనిలో ఉన్నారని పత్రికలు తెలిపాయి. విమానం బీజింగ్ విమానాశ్రయంలో దిగాల్సి ఉండడంతో అక్కడ బాధితుల రక్త సంబంధీకులు పెద్ద మొత్తంలో చేరి విలపిస్తున్నారు. అధికారులు వారిని సమీపంలోని హోటల్ కి తీసుకెళ్లి ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. మలేషియాన్ ఎయిర్ లైన్స్ ఉద్యోగులు ఎవరు కనపడినా విలేఖరులు చుట్టుముట్టి ప్రశ్నలతో వేధిస్తున్నారు. బాధితుల బంధువులు విలపిస్తున్నా పట్టించుకోకుండా ఫోటోలు తీయడానికీ, వారి చేత మాట్లాడించడానికీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.
ప్రమాదం జరగబోతున్న సంగతిని పైలట్లు తెలియజేకపోవడం పట్ల పలువురు నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిందని భావిస్తున్న సమయానికి విమానం 35,000 అడుగుల ఎత్తులో ఎగురుతోందని తెలుస్తోంది. అంత ఎత్తున ఉన్న విమానానికి ప్రమాదవశాత్తూ ఇంధనం అందకపోయినా 40 నిమిషాల పాటు గాలిలో ఎగరగల సామర్ధ్యం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అలాంటి ప్రమాదం కాకపోయినా అంత ఎత్తునుండి సముద్రంలో కూలిపోయేలోపు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కార్యాలయానికి సమాచారం ఇవ్వడానికి బోలెడు సమయం మిగిలి ఉంటుందని అయినా పైలట్ల నుండి అస్సలు సమాచారం లేకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు.
వివిధ విమానయాన నిపుణులు, పరిశీలకులు 2009 నాటి ఎయిర్ ఫ్రాన్స్ ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అట్లాంటిక్ సముద్రంలో కూలిన ఎయిర్ ఫ్రాన్స్ 447 విమానం 216 మందిని బలిగొంది. ఒక్కరూ ప్రాణాలతో మిగల్లేడు. మంచు స్ఫటికాలు విమానం వేగాన్ని కొలిచే సెన్సార్లను పనిచేయనీయకుండా చేయడంతో పైలట్లు విమానంపై అదుపు కోల్పోయారని దానితో విమానం కూలిపోయిందని విచారణలో తేలింది. అప్పడు కూడా ఇప్పటిలాగే తెల్లవారు ఝామున విమానం కూలిపోయిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన 2 సం.ల తర్వాత గాని విమాన శిధిలాలను కనిపెట్టలేకపోయారు.
అయితే ఆధునిక విమానాలు దాదాపు సకల సౌకర్యాలతో నిర్మించబడి ఉండడంతో ప్రస్తుత ప్రమాదానికి కారణం ఊహించలేకున్నారు. అందునా బోయింగ్-777 విమానం భద్రత విషయంలో అత్యున్నత ప్రమాణాలు కలిగినదిగా రికార్డు ఉన్న మోడల్ అనీ తెలుస్తోంది.
అంతర్జాతీయ విమానయానంలో ఉగ్రవాద చర్యలు ప్రపంచ దేశాలకు ఒక సవాల్. అధిగమించే ప్రయత్నంలో ఒకోసారి ఇటువంటి ప్రమాదాలు మానవత్వాన్ని పైశాచకీయం పైచెయ్యితో అణగదొక్కే నరమేధ ప్రక్రియ. మనసుకు మనిషికి మధ్య జరిగే ఈ వికృత సంఘర్షణలో ప్రతిసారి మనసులేని మానవుడు వికటాట్టహాసంతో జీవిహింసకు పాల్పడుతున్నాడు. యాధృచ్చికమైతే దర్యాప్తు లేదా యధాతధమైన ఉగ్రవాదమైతే మాత్రం సభ్య ప్రపంచం గర్హించవలసిన సమయం.