భారత దేశంలో పండగలు సాంస్కృతిక కలయికలకు వేదికలుగా నిలుస్తాయి. శ్రీరామనవమి రోజున రాముడి కళ్యాణం, వినాయక చవితి సందర్భంగా వినాయక నిమజ్జనం, దీపావళి రోజున బాణసంచా పేలుళ్లు, సంక్రాంతి సంబరాల్లో పంటలు, అల్లుళ్ళ సందడి మొదలయినవన్నీ భారత దేశంలో సాంస్కృతిక జీవనాన్ని ప్రతిబింబిస్తాయి.
ఈ పండగలు కాకుండా వివిధ నదుల వద్ద జరిగే పుష్కరాలు, కుంభమేళాల సంగతి చెప్పనే అవసరం లేదు. రోజువారీ శ్రామిక జీవితం నుండి ఆటవిడుపుగానూ, పూర్వీకులు సాధించిన విజయాలను సెలెబ్రేట్ చేసుకునే రోజులుగానూ మొదలయిన ఈ పండగలు క్రమంగా హిందూ మతం స్వాధీనం చేసుకుందని సామాజిక పరిశీలకులు చెబుతారు.
ఇదే తరహా పండగలు క్రైస్తవులకు ఏమన్నా ఉన్నాయా? అన్న ప్రశ్న ఎవరి మనసులోనన్నా ఉదయిస్తే గనుక వారి ఆలోచన ఒక పద్ధతిలో వెళ్లిందని నిస్సందేహంగా భావించవచ్చు. ఎందుకంటే పశ్చిమ దేశాల్లో కేధలిక్కులు జరుపుకునే అతి పెద్ద పండగ ‘కార్నివాల్’ కూడా మన హిందూ పండగల లాగా మొదట గ్రామీణ సంస్కృతిగా మొదలై చివరికి రోమన్ కేధలిక్ మతం ఒడిలోకి వెళ్లిపోయిందే.
ఈస్టర్ పండగకి ఒక 6 వారాల ముందు పశ్చిమ దేశాల్లో కార్నివాల్ సంరభం మొదలవుతుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ఈ సంబరాలు పెద్ద పెద్ద ఊరేగింపులు, సర్కస్ లు, విచిత్ర వేషధారణలతో సాగుతూ పతాక శీర్షికలకు ఎక్కుతాయి. వీటిల్లో బ్రెజిల్ లో జరిగే కార్నివాల్, అందునా సాంబ నృత్యాలతో జరిగే కార్నివాల్ మహా గొప్ప ప్రాచుర్యం పొందింది.
గమనించదగిన విషయం ఏమిటంటే క్రైస్తవ మతం ఇటు ఆసియా దేశాలకు కూడా పాకినప్పటికీ ముఖ్యంగా కేధలిక్ మతం ఇటు కూడా వచ్చినప్పటికీ వారు కార్నివాల్ జరుపుకోరు. దానికి కారణం ఆసియాలో పూర్వ గ్రామీణ (ఫోక్) సంస్కృతుల్లో తమకంటూ ప్రత్యేకమైన సంబరాలు ఉన్నాయి. అనగా కేధలిక్ సంస్కృతిలో భాగమైన కార్నివాల్ ని దిగుమతి చేసుకునే అవసరం వారికి లేకుండా పోయింది.
కార్నివాల్ ని తలదన్నిన పండగలు, పబ్బాలు ఉన్నపుడు పరాయి సంబరాలు చేసుకునే అవసరం ఉండదు. ఫిలిప్పైన్ దేశంలో రోమన్ కేధలిక్ మతం బాగా వ్యాప్తిలో ఉన్నప్పటికీ అక్కడ కార్నివాల్ జరగదు. కింద ఇండియా వరకు వచ్చేసరికి ఎక్కువగా ప్రొటెస్టెంట్ క్రైస్తవ మతం వ్యాప్తి చెందడంతో కార్నివాల్ ఇటు కూడా రాలేదు. ఎందుకంటే ప్రొటెస్టెంట్ లు కార్నివాల్ జరపరు.
ఇప్పుడు ఒక స్పష్టమైన రూపాన్ని సంతరించుకున్న మతాలు ఏవీ కూడా గతంలో ఇదే పద్ధతిలో లేవు. అవి ఎక్కడికి వెళితే అక్కడ స్ధానిక ఆచారాలను, పండగలను కలుపుకుంటూ ఒక రూపాన్ని సంతరించుకున్నాయి. ఇలా కలుపుకోవడంలో ముఖ్య పాత్ర పోషించిన కారణం ఏమిటంటే ఆయా కాలాల్లోని పాలకుల ఆర్ధిక, రాజకీయ అవసరాలే.
ఆర్ధిక పాలనను విస్తరించుకోవడానికి రాజకీయులు లక్ష్యిత ప్రాంతాల్లోని సంస్కృతీ అలవాట్లను మొదట ఆకళింపు చేసుకుని తమవిగా చేసుకోవడం ఒక విధానంగా అమలు చేసినందునే ఒకే మతంలో వివిధ ప్రత్యేక ఆచారాలతో పాటు సాధారణీకరించబడిన పద్ధతులు కూడా కనిపిస్తాయి. భారత దేశం అనేకానేక సంస్కృతుల సంగమం కనుక ఇక్కడి హిందూమతం కూడా అనేకానేక దేవుళ్ళకు (ముక్కోటి దేవతలు) నిలయం అయింది.
కింద ఇచ్చిన ఫోటోలు పశ్చిమ దేశాల్లో కేధలిక్ మతం ఉన్న దేశాల్లోని కార్నివాల్ సంబరాలకు సంబంధించినవి. వీటిల్లో ఎక్కువ బ్రెజిల్ కి చెందినవి. ది అట్లాంటిక్ పత్రిక వీటిని ప్రచురించింది.