దేశంలో నాలుగో కూటమి రూపు దిద్దుకుంటున్నట్లు కనిపిస్తోంది. నిన్నటి దాకా వామపక్ష పార్టీలతో సీట్ల సర్దుబాటుకోసం చర్చలు జరిపిన జయలలిత లెఫ్ట్ తో చర్చలు ముగిస్తున్నట్లు హఠాత్తుగా ప్రకటించారు. దానితో వామపక్షాలు, ఇతర కిచిడి పార్టీలు ఏర్పాటు చేసిన ‘ఆల్టర్నేట్ ఫ్రంట్’ లో జయలలిత చేరిక ఆగిపోయింది.
ఎ.ఐ.డి.ఏం.కె అధినేత్రి వామపక్షాలతో ఎన్నికల బంధం తెంచుకోవడం ఒక ఎత్తయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ఫోన్ చేయడం మరో ఎత్తు. ఈ ఫోన్ కాల్ తో మమత బెనర్జీ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ కు మరోసారి ప్రాణం పోసినట్లయింది. చిన్నగా అన్నా హజారే మద్దతు సంపాదించిన మమత బెనర్జీ ఇప్పుడు మరో ముఖ్యమంత్రి జయలలిత మద్దతు కూడా సంపాదించినట్లు కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఫెడరల్ ఫ్రంట్ గా ఏర్పడాలని మమత ప్రతిపాదిస్తున్న సంగతి తెలిసింది.
ఇప్పుడిక ఫెడరల్ ఫ్రంట్, ఆల్టర్నేట్ ఫ్రంట్… వీటిల్లో ఏది ధర్డ్ ఫ్రంటో తేలాల్సి ఉంది. వామపక్షాలు, ఎస్.పి, బి.జె.డి, జె.డి(యు) తదితర పార్టీల కూటమి తమను తాము ధర్డ్ ఫ్రంట్ గా చెప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. ధర్డ్ ఫ్రంట్ పేరుతో గతంలో చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఆ పేరు అచ్చిరాలేదని ఆ పార్టీలు భావిస్తున్నాయేమో తెలియదు గానీ, ప్రత్యామ్న్యాయ ఫ్రంట్ గా తమను పిలుచుకుంటున్నాయి.
ఫెడరల్ ఫ్రంట్ అయినా, ఆల్టర్నేట్ ఫ్రంట్ అయినా ఆచరణలో అది ధర్డ్ ఫ్రంట్ అవుతుంది. యు.పి.ఎ, ఎన్.డి.ఎ కూటములు కాకుండా మరో కూటమి ఏర్పడితే అది ధర్డ్ ఫ్రంట్ కాక మరేమవుతుంది. మరో కూటమి అంటూ ఏర్పడితే ఫోర్త్ ఫ్రంట్ అవుతుంది. ఇంకో కూటమి వస్తే, గిస్తే ఫిఫ్త్ ఫ్రంట్….
ఏది ధర్డ్ ఫ్రంట్ అయినా మమతకు ఫోన్ చేయడం ద్వారా వామపక్షాల ఆశలను జయలలిత నీరుగార్చింది. దేశంలో మూడో ఫ్రంట్ పేరుతో వామపక్షాలను, సో కాల్డ్ లౌకిక పార్టీలను కలిపి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ జాతీయ స్ధాయిలో ఏర్పాటు చేయడానికి వామపక్షాలు ఎన్నాళ్లుగానో కలలు కంటున్నాయి. వచ్చే ఎన్నికల కోసం వామపక్షాలు కష్టపడి ధర్డ్ ఫ్రంట్ ఇక రూపం ఏర్పాటు చేసి గోడరాతలు రాసుకుంటుండగా చివరి నిమిషంలో ఆ రాతలను జయలలిత చెరిపేస్తున్నారు.
చెరిపేయడం ఒక సంగతి. కానీ ఆ చెరిపేయడంలో తన స్వంత పోషణ ఉండడమే అసలు విషయం. దేశంలో ప్రధాన మంత్రి పదవిని కాంక్షిస్తున్నవారు ఇప్పుడు లెక్కకు మిక్కిలిగా తయారయ్యారు. జయలలిత చెప్పలేదు గానీ ఆమె అనుచరులు ఇప్పటికే ఆమెను ప్రధానిగా చూడాలని ఉందని కోరుతూ ప్రకటించారు. మమత బెనర్జీ కూడా ఒక పోటీదారు అని పత్రికల అభిభాషణ. ముఖ్యమంత్రిగా ఉండడం ఆమెకు ఇదే మొదటిసారి అయినా గతంలో కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం ఉండనే ఉంది.
ఇక ఆల్టర్నేట్ ఫ్రంట్ లో అయితే అభ్యర్ధులకు కొరవ లేదు. ములాయం సింగ్ యాదవ్, నితీశ్ కుమార్, బిజూ పట్నాయక్, దేవెగౌడ ఇత్యాది నాయకులంతా ప్రధాని కుర్చీలో రుమాలు వేసుకున్నారు.
ఆల్టర్నేట్ ఫ్రంట్ కాంగ్రెస్/యు.పి.ఎ కోసమే అని బి.జె.పి వాదన. ఆ లెక్కన ఫెడరల్ ఫ్రంట్ బి.జె.పి/ఎన్.డి.ఎ కోసం అని భావించాలా?
ఎన్ని ఫ్రంట్లు వచ్చినా పార్టీ ప్రింటయ్యేలోగ రాజకీయ రూపురేఖలు చిత్ర విచిత్రంగా మారుతునే ఎక్కడవేసిన గొంగళి అక్కడే వుంటుంది. ప్రధాని పదవి మీద మహిళాలోకానికి ఎనలేని ఆసక్తి. వీరందరికి సోనియా స్ఫూర్తి.
మారుతున్న రాజకీయాలలొ దేశం పురోగతి సాధించాలంటే మరుగుజ్జుఈ ప్రాంతీయ పార్టీలతో కూడిన కప్పల తక్కెడ లాంటి ఫ్రంట్లు పనికి రావు. ఇలంటి ప్రయోగాలు ఇదివరలొ చూసిన అనుభవము ప్రజలకుంది. అన్ని సార్లు ప్రజలు మోసపోతారని అనుకోవద్దు .
ప్రాంతీయ పార్టీల హవా పెరిగిపోతుండడంతో…..కూటముల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఓ పది మంది ఎంపీలున్న ప్రతి పార్టీ నేతకు తాను ప్రధానమంత్రిని కావాలన్న కోరిక. క్రమంగా కాంగ్రెస్, బీజేపీల ప్రాబల్యం కూడా తగ్గిపోతోంది. అందుకే భవిష్యత్ లో ఈ తరహా కూటములు మరిన్ని వస్తాయి. పార్టీ విధానాలు, సిద్ధాంతాలు ప్రాతిపదికగా కాకుండా కేవలం….ప్రధాని పదవి.., మంత్రి పదవులే లక్ష్యంగా కూటములు తమ పావులు కదుపుతాయి. మన హైదరాబాద్ లో మేయర్ పదవిని పంచుకున్నట్లు….ప్రధాని పదవిని కూడా….కొంత కాలం ఓ పార్టీ, ఆ తర్వాతం కొంత కాలం మరోపార్టీ పంచుకునే పరిస్థితి కూడా రావచ్చు.