
Russian military vessels are anchored at a navy base in the Ukrainian Black Sea port of Sevastopol, Crimea, February 27, 2014 (Reuters)
ఉక్రెయిన్ విషయంలో పరమ అబద్ధాలను ప్రచారంలో పెట్టిన అమెరికాను రష్యా ఎడా పెడా కడిగిపారేసింది. ద్వంద్వ నీతిని అనుసరించే అమెరికా, సిగ్గు లేకుండా తనకు నీతులు చెప్పడం ఏమిటని జాడించింది. స్వతంత్ర దేశాల మీదికి దండెత్తి ఆక్రమించుకునే నీచ చరిత్ర అమెరికాదే తప్ప తనది కాదని గుర్తు చేసింది. తప్పుడు కారణాలతో అమెరికా సాగించిన దండయాత్రలు, మానవ హననాల జాబితా చదివింది. ఉక్రెయిన్ లో కృత్రిమ ఆందోళనలను రెచ్చగొట్టింది చాలక తనపై తప్పుడు ప్రచారానికి లంకించుకోవడం ఏమిటని నిలదీసింది.
ఉక్రెయిన్ లో అధికారం లాక్కున్న కూటమి ప్రభుత్వానికి అక్కడి ప్రజల మద్దతు లేని విషయం అంతకంతకూ బైటికి వెల్లడి అవుతుండడంతో అమెరికా ప్రచార వ్యూహంతో తన పాత్రను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఫాక్ట్ షీట్ పేరుతో ’10 పుతిన్ తప్పుడు వాదనలు’ అంటూ ఒక పత్రం విడుదల చేసింది. ఉక్రెయిన్ పరిణామాలపై రష్యా అధ్యక్షుడు మీడియాతో మాట్లాడిన అనంతరం ఈ పత్రాన్ని అమెరికా విడుదల చేసింది. అమెరికా ద్వంద్వ నీతిని పుతిన్ బట్టబయలు చేయడంతో ప్రభుత్వపరంగానే సరికొత్త అబద్ధాలను సృష్టించి ప్రచారంలో పెట్టాల్సిన అగత్యం అమెరికాకు దాపురించిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అమెరికా ఫ్యాక్ట్ షీట్ ను ఉద్దేశిస్తూ రష్యా విదేశాంగ శాఖ తన వెబ్ సైట్ లో అమెరికా దుర్నీతిని ఎండగట్టింది. “(అమెరికా) విదేశాంగ శాఖ సిగ్గు లేకుండా జరిగిన ఘటనలకు ఏకపక్షంగా తప్పుడు అర్ధాలు ఇచ్చుకుంటోంది. మైదాన్ ఆందోళనలను తానే పెంచి పోషించాననీ, న్యాయబద్ధమైన ప్రభుత్వాన్ని హింసాత్మకంగా కూల్చివేసేందుకు ప్రోత్సహించాననీ తద్వారా కీవ్ లో తమను తాము న్యాయబద్ధ ప్రభుత్వంగా చెప్పుకుంటున్న వారికి మార్గం సుగమం చేశామనీ అంగీకరించడానికి అమెరికాకు ఇష్టం లేకపోవచ్చన్నది నిజమే” అని రష్యా విదేశీ శాఖ ప్రతినిధి అలెక్జాండర్ లూకాషెవిక్ వ్యాఖ్యానించారు.
అమెరికా అత్యంత అధమస్ధాయికి దిగజారి చేపట్టిన తప్పుడు ప్రచారానికి తాము స్పందించడం లేదని లూకాషెవిక్ తెలిపారు. “మేము ఒకటి మాత్రం చెప్పగలం. ఆమోదయోగ్యం కాని అహంభావంతోనూ, నిజం పైన తమకు మాత్రమే గుత్త హక్కులు ఉన్నాయనీ భ్రమించే ఒక నటనతోనూ మేము మళ్ళీ వ్యవహరిస్తున్నామని మా దృష్టిలో ఉన్నది” అని రష్యా విదేశాంగ శాఖ వెబ్ సైట్ లో పోస్ట్ చేసిన ప్రకటనలో లూకాషెవిక్ అన్నారు. అంతర్జాతీయ చట్టాలను పాటించడంలో, ఇతర దేశాల సార్వబౌమ హక్కులను గౌరవించడంలో లెక్చర్లు ఇచ్చే నైతిక అర్హత అమెరికాకి అస్సలు లేనే లేదన్నారు.
“మాజీ యుగోస్లోవియాలో సాగించిన బాంబు దాడుల మాటేమిటి? లేదా కృత్రిమంగా తయారు చేసిన కారణం చూపి ఇరాక్ పై సాగించిన దాడి సంగతేమిటి?” అని లూకాషెవిక్ ప్రశ్నించారు. అమెరికా భద్రతకు ఏ మాత్రం ప్రమాదం లేనప్పటికీ విదేశాలలో జోక్యం చేసుకున్న చరిత్ర అమెరికా సొంతం అని ఎత్తి చూపారు. వియత్నాం, లెబనాన్, డొమినికన్ రిపబ్లిక్, గ్రెనడా, లిబియా, పనామా తదితర దేశాల ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు.
“అయినప్పటికీ, తమ దేశస్ధులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న రష్యాను నిందించడానికి అమెరికా ధైర్యం చేస్తోంది. క్రిమియాలో మెజారిటీ ప్రజలు రష్యన్లు. తీవ్రవాద-జాతీయ శక్తులు మరొకసారి మైదాన్ ఆందోళనల తరహాలో రక్తసిక్త దురాక్రమణకు పూనుకోకుండా రష్యా నిరోధించింది” అని దురాక్రమణ ఎవరిదో రష్యా గుర్తు చేసింది. అమెరికన్ నమూనాలతో ఉక్రెయిన్ సరిపోలేదని, అంతమాత్రాన నిందలను రష్యా మీదికి మళ్లించడం తగదని హెచ్చరించింది.
క్రిమియాపై రష్యా దాడి చేసిందని అమెరికా ఆరోపిస్తున్నది. కాని అక్కడ ఆ ఛాయలే లేవన్నది ప్రపంచానికి కనిపిస్తున్న నిజం. ఉక్రెయిన్ లో పార్లమెంటుపై దాడి చేసి రక్తపాతం సృష్టించడం ద్వారా ప్రభుత్వ పగ్గాలను స్వాధీనం చేసుకున్నట్లే క్రిమియా పార్లమెంటును కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రైవేటు బలగాలను పంపారు. రష్యా చేతులు ముడుచుకుని ఉన్నట్లయితే కీవ్ రక్తపాతం లాంటిదే క్రిమియాలో మరోసారి చూడాల్సి వచ్చేది.
కీవ్ లో అధికారం లాక్కున్న కూటమి ప్రభుత్వమే ప్రైవేటుగా స్నైపర్లను నియమించి అటు పోలీసులను, ఇటు సొంత ఆందోళనకారులను చంపించిందన్న నిజం లీక్ అయిన నేపధ్యంలో క్రిమియాలో రష్యా తీసుకున్న జాగ్రత్త ఎంత అవసరమో తెలుస్తుంది. అదీకాక క్రిమియాలో 25,000 మంది సైనికులను ఉంచడానికి రష్యా-ఉక్రెయిన్-క్రిమియా ల మధ్య ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం గురించి తనకు తెలియనట్లుగానే అమెరికా వ్యవహరించడం మరో నాటకం.
ఈ మధ్య కాలంలో (కనీసం గత 50 యేళ్లలో) అమెరికా దురాక్రమణ దాడుల గురించిన పచ్చి నిజాలను ఇంత బహిరంగంగా మరో ప్రభుత్వ అధికారులు ప్రపంచానికి చాటి చెప్పిన ఉదాహరణలు లేవు. రష్యా విదేశీ మంత్రి లూకాషెవిక్ ఆ పని చేశారు. అమెరికా సామ్రాజ్య పతన దిశలో సాగుతున్న ప్రయాణంలో ఇదొక మైలురాయిగా చూడవచ్చు.
పాత విషయాలు గురించి ఎక్కువ argue చెయ్యను కాని, ఇప్పుడు రష్యా చేసింది కరెక్ట్ కాదేమో అనిపిస్తొన్ది. Russians ఎక్కువ వున్నారని వాళ్ళు Cremia ని ఆక్రమిస్తే, అదే రూల్ శ్రీలంక కి కూడా అప్లై చెయ్యాలేమో. ఎందుకంటే అక్కడ తమాళిలు ఎక్కువ వున్నారు కాబట్టి ఇండియా వెళ్లి జాఫ్న ని ఆక్రమించాలి.