పశ్చిమ రాజ్యాల తెరవెనుక మంతనాలను వెక్కిరిస్తూ క్రిమియా పార్లమెంటు రష్యాలో విలీనం చెందడానికి ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత (Teritorial Integrity) ను రష్యా ఉల్లంఘించిందని ఆరోపిస్తూ అమెరికా, ఇ.యులు ఒకవైపు రష్యాపై ఆంక్షల బెదిరింపులు కొనసాగిస్తుండగానే క్రిమియా పార్లమెంటు తన పని తాను చేసుకుపోయింది. 1954లో సోవియట్ హయాంలో ఉక్రెయిన్ కు కానుకగా ఇవ్వబడిన క్రిమియా ఇప్పుడు మళ్ళీ స్వస్ధలం చేరడానికి రంగం సిద్ధం అయింది.
మార్చి 16 తేదీన జరగబోయే రిఫరెండంలో ప్రజలు ఆమోదించాకనే క్రిమియా పార్లమెంటు నిర్ణయం అమలులోకి వస్తుంది. రిఫరెండం మొదట మార్చి 30 తేదీన జరుపుతామని క్రిమియా ప్రభుత్వం చెప్పింది.
అయితే ఆ తేదీని ముందుకు జరిపి మార్చి 16 తేదీనే రిఫరెండం జరుగుతుందని ప్రకటించింది. పరిస్ధితి అధ్యయనం పేరుతో పశ్చిమ రాజ్యాల తరపున క్రిమియాలో అడుగు పెట్టిన ఐరాస ప్రతినిధి క్రిమియా ప్రజలు తీవ్ర నిరసన తెలియజేయడంతో విమానాశ్రయం నుండి బైటికి రాకుండానే వెనక్కి వెళ్ళిపోయారు. ప్రజాస్వామ్యాన్ని గుత్తకు తీసుకున్నట్లు ప్రవర్తించే పశ్చిమ పత్రికలు క్రిమియా పార్లమెంటు నిర్ణయంపై అప్పుడే విషం కక్కడం ప్రారంభించాయి. బహుశా ఉక్రెయిన్ లో జరిగినట్లుగా హింసాత్మక చర్యలతో క్రిమియా పార్లమెంటును ఆక్రమిస్తే అది ప్రజాస్వామ్యంగా చాటుకుని పొంగిపోతాయి కాబోలు!
క్రిమియాలో సగం మందికి పైగా ప్రజలు రష్యన్లు కాగా 95 శాతం మంది రష్యన్ భాష మాట్లాడతారు. ఉక్రెయిన్ లో అధికారాన్ని లాక్కున్న కూటమి ప్రభుత్వం ఉక్రెయిన్ భాష తప్ప మరో భాషను వినియోగించడానికి వీలు లేదని, రెండో భాషగా రష్యన్ ను గుర్తించడాన్ని రద్దు చేస్తున్నామని చెబుతూ డిక్రీ జారీ చేయడంతో క్రిమియాలో ఉక్రెయిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన మొదలయింది. ఈ ఆందోళనలను రష్యా ప్రేరేపితంగా చెప్పుకుని పశ్చిమ పత్రికలు రాసుకుని సంతృప్తి పడ్డాయి.

EU, US, Russia foreign ministers meet in Paris
చారిత్రకంగా యూరేసియాలోని అనేక సామ్రాజ్యాల మధ్య చేతులు మారిన క్రిమియా భౌగోళికంగా రష్యాలో భాగంగా ఉంటూ వచ్చింది. 1954లో అప్పటి సోవియట్ రష్యా (USSR) అధినేత నికిట కృశ్చెవ్ (ఉక్రెయిన్ జాతీయుడు) క్రిమియాను ఉక్రెయిన్ కు బహుమతిగా ఇచ్చిన తర్వాత మాత్రమే అది ఉక్రెయిన్ లో భాగం అయింది. క్రిమియా పార్లమెంటు నిర్ణయంతో రష్యా ఫెడరేషన్ లో మళ్ళీ భాగం కావడానికి మార్గం సుగమం అయింది. మార్చి 16 రిఫరెండంఫలితాల ద్వారా అంతిమ నిర్ణయం జరుగుతుంది.
“రష్యన్ ఫెడరేషన్ లో సభ్య ప్రాంతంగా సభ్యత్వ హక్కులతో క్రిమియా కలిసిపోవడానికి పార్లమెంటు ఏకగ్రీవంగా నిర్ణయించింది” అని ఆర్.ఐ.ఏ నొవొస్తి వార్తా సంస్ధ తెలిపింది. రిఫరెండం మార్చి 16 కు ముందుకు జరిపామని క్రిమియా ఉప ప్రధాని ప్రకటించారని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆమోదం లేకుండా ఈ ప్రకటన వచ్చి ఉండదని రాయిటర్స్ వ్యాఖ్యానించింది.
రష్యాపై ఆంక్షలు విధిస్తామని ఊగిపోతూ గాండ్రించిన యూరోపియన్ యూనియన్ నేతలు చివరికి హెచ్చరికల పిల్లి కూతలతో సరిపెట్టారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో అమెరికా, ఇ.యు, రష్యా, ఉక్రెయిన్ విదేశీ మంత్రుల సమావేశం జరిగింది. ఉక్రెయిన్ నూతన ప్రభుత్వం నియమించిన విదేశీ మంత్రిని గుర్తించడానికి రష్యా నిరాకరించడంతో ఇరు దేశాల విదేశీ మంత్రులతో విడివిడిగా అమెరికా, ఇ.యు లు సమావేశాలు జరిపాయి.
క్రిమియా విషయంలో మధ్యవర్తిత్వానికి అంగీకరించాలని అమెరికా, ఇ.యు ఒత్తిడి చేసినప్పటికీ అందుకు రష్యా అంగీకరించలేదు. అది క్రిమియా ప్రజలు, పార్లమెంటు నిర్ణయించుకుంటారని చెప్పి వారి మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించారు రష్యా విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్. ఈ రోజు రోమ్ లో అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ, రష్యా విదేశీ మంత్రి లావరోవ్ మళ్ళీ కలుసుకుని చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. క్రిమియా పార్లమెంటు నిర్ణయం పూర్తయినందున ఈ సమావేశం వల్ల కొత్తగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చు.
ఇ.యు దేశాల శిఖరాగ్ర సమావేశం బ్రసెల్స్ (బెల్జియం, ఇ.యు ల రాజధాని) లో జరగనుంది. ఇందులో కూడా ఉక్రెయిన్, క్రిమియాల విషయం చర్చకు రానున్నది. రష్యాపై ఆంక్షలు విధించే అంశం కూడా చర్చకు రావచ్చు. అయితే ఆంక్షల బెదిరింపు ఆచరణకు రాకపోవచ్చని రాయిటర్స్ విశ్లేషించింది. దీనికి కారణం జర్మనీ, బ్రిటన్ ల వెనుకడుగే. జర్మనీ ఇ.యుకు ఆర్ధిక నాయకుడు కాగా, బ్రిటన్ ద్రవ్య కేంద్రం. ఈ రెండు దేశాలే కాకుండా దాదాపు యూరోపియన్ దేశాలన్నీ రష్యా సహజ వాయువు సరఫరాపై ఆధారపడ్డవే.
రష్యాకు యుద్ధ నౌకలు అమ్మే కాంట్రాక్టు ఒకటి ఫ్రాన్స్ చేతుల్లో ఉంది. దాన్ని రద్దు చేసుకునే ఉద్దేశ్యం ఫ్రాన్స్ కి లేదు. రష్యా పెట్టుబడులకు మంత్రసాని పని చేయడం ద్వారా లండన్ ఫైనాన్స్ కంపెనీలు భారీ లబ్ది పొందుతున్నాయి. ఇక జర్మనీ కంపెనీలు 22 బిలియన్ డాలర్ల మేర రష్యాలో పెట్టుబడులు పెట్టి ఉన్నాయి. ఇవన్నీ వదులుకునేందుకు ఈ దేశాలు సిద్ధపడడం కలలో మాట. కాబట్టి రష్యాపై ఆంక్షలు ఇ.యు కే అంతిమంగా నష్టకరం. రష్యా-అమెరికాల వాణిజ్యం కంటే రష్యా-ఇ.యు ల మధ్య వాణిజ్యం దాదాపు మూడు రెట్లు ఎక్కువ. అందువలన ఆంక్షలు విధించాలన్న అమెరికా ఒత్తిడి ఫలించే అవకాశం లేదు.
రష్యా అధికారులపై వీసా నిషేధం, ఆస్తుల స్తంభన లాంటి ఆంక్షలు విధించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా చెబుతోంది. రష్యా వ్యాపారాలపై కూడా ఆంక్షలు విధిస్తానని చెబుతోంది. వారాలకు బదులు రోజుల్లోనే ఈ ఆంక్షలు విధిస్తానని కూడా చెబుతోంది. ఈ బెదిరింపుల నేపధ్యంలో రష్యా కరెన్సీ రూబుల్ స్వల్పంగా బలహీనపడినట్లు తెలుస్తున్నది.
పశ్చిమ దేశాలు తాము అధికారంలోకి తెచ్చిన ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఖాళీ వాగ్దానాల బిస్కెట్లు విసురుతున్నాయి. ఇ.యు 11 బిలియన్ యూరోల రుణం ప్రకటించింది. అయితే దీనికి ‘షరతులు వర్తించును’ అని తెలిపింది. అప్పుకోసం వచ్చిన దేశాలకు ఐ.ఎం.ఎఫ్ ఎప్పుడూ విధించే ‘వ్యవస్ధాగత సర్దుబాటు కార్యక్రమం’ (Structural Adjustment Programme -SAP) అమలు విషయమై ఐ.ఎం.ఎఫ్ తో జరిగే చర్చలు సఫలం అయితేనే తాము రుణం ఇస్తామని ఇ.యు తెగేసి చెప్పింది. ఎస్.ఏ.పి అంటే ఉన్న వ్యవస్ధను పూర్తిగా పశ్చిమ దేశాల ఆర్ధిక వ్యవస్ధల అవసరాలకు అనుగుణంగా మార్చడం. దానికి పైకి అందమైన పదజాలం అల్లి సుందరంగా కనపడేట్లు చేస్తారు. ఈ పనికి నియమించబడిన సంస్ధే ఐ.ఎం.ఎఫ్. ఐ.ఎం.ఎఫ్ కోరల్లో చిక్కుకుని ఆరోగ్యంగా బైటపడ్డ దేశం ఇంతవరకు లేదు. ఉక్రెయిన్ లో జరిగిన హింసాత్మక ప్రభుత్వ కూల్చివేత చివరికి ఈ విధంగా ఉక్రెయిన్ ప్రజలకు దరిద్ర శాసనం లిఖిస్తోంది.