ప్రపంచంలో అత్యంత అస్ధిర (volatile) ప్రాంతం మధ్య ప్రాచ్యం. అరబ్ వసంతం పేరుతో గత మూడేళ్లుగా అక్కడ జరుగుతున్న పరిణామాలు ఈ సంగతిని మరోసారి నిరూపించాయి. మధ్య ప్రాచ్యంలో కూడా అత్యంత భావోద్వేగ ప్రేరక సమస్య పాలస్తీనా సమస్య. ప్రపంచ వ్యాపితంగా విస్తరించిన క్రైస్తవ, ఇస్లాం, యూదు మతాలకు జన్మస్ధలం అయిన పాలస్తీనా సమస్య సహజంగానే అనేక ప్రపంచ రాజకీయాలకు కేంద్రంగా కొనసాగుతోంది. ఫలితంగా పాలస్తీనాలో జరిగే పరిణామాలు ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తుండగా, మధ్య ప్రాచ్యంలోని పొరుగు దేశాలలో జరిగే పరిణామాలు పాలస్తీనా ప్రజలను అటో, ఇటో కదిలించక మానవు.
ఈజిప్టులో ముస్లిం బ్రదర్ హుడ్ ప్రభుత్వాన్ని అక్కడి మిలట్రీ మరోసారి కూల్చివేసిన దరిమిలా ఆ దేశంలోనూ, పాలస్తీనాలోనూ జరుగుతున్న పరిణామాలు ఈ కోవలోనివే. ఇజ్రాయెల్ అష్ట దిగ్బంధనం మధ్య గాజాలో ప్రభుత్వం నడుపుతున్న హమాస్ సంస్ధకు ఇప్పుడు కష్టాలు తీవ్రం అయ్యాయి. ముస్లిం బ్రదర్ హుడ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్లూ హమాస్ కొత్త ఉత్సాహం సంతరించుకుంది. ఖతార్ లాంటి కొత్త మిత్రులు కూడా సమకూరారు. కానీ ఈజిప్టు ముస్లిం బ్రదర్ హుడ్ ప్రభుత్వాన్ని సౌదీ అరేబియా ప్రత్యక్ష సహకారంతోనూ, అమెరికా పరోక్ష అండతోనూ మిలట్రీ కూల్చివేయడంతో హమాస్ కి మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి.
ఉత్తర ఆఫ్రికాలోని ట్యునీషియాలో 2011 జనవరిలో ప్రారంభం అయిన ప్రజల ఆందోళనలు త్వరలోనే ఈజిప్టు, బహ్రెయిన్, యెమెన్, టర్కీ, సౌదీ అరేబియా దేశాలకు విస్తరించగా, ఆ వంక చూపి పశ్చిమ దేశాలు లిబియా, సిరియా లలో బలవంతపు ఆందోళనలను చొప్పించాయి. ఈజిప్టు ప్రజల ఆందోళనలకు మద్దతుగా నిలిచిన ఎన్.జి.ఓ సంస్ధలు ముబారక్ నేతృత్వంలోని మిలట్రీ నియంతృత్వాన్ని కూల్చివేసేవరకు ప్రజలతో ఉన్నట్లు నటించాయి. ఆందోళనలలో భాగం పంచుకున్న ముస్లిం బ్రదర్ హుడ్ మొట్టమొదటి ప్రజాస్వామ్య ఎన్నికల్లో అధికారం చేపట్టిన తర్వాత తమ అసలు పని ప్రారంభించాయి. ఒకటిన్నరేళ్లు అధికారంలో కొనసాగనిచ్చి ప్రజల్లోని లిబరల్ శక్తుల అండతో మరోసారి ఆందోళనలకు తెరతీసి మిలట్రీ కుట్రకు సహాయం చేశాయి. దానితో ముస్లిం బ్రదర్ హుడ్ ప్రభుత్వం కూలిపోయి హమాస్ మరోసారి ఒంటరిదైంది.
ఇప్పుడు ఈజిప్టును ఏలుతున్న మిలట్రీ ప్రభుత్వం ఇజ్రాయెల్ అనుకూల చర్యలను వేగవంతం చేస్తోంది. ఈజిప్టులో భాగమైన సినాయ్ ద్వీపకల్పంలో హమాస్ మిలిటెంట్ల కార్యకలాపాలను సాగనీయకుండా అడ్డుకుంటోంది. చివరికి ఈజిప్టులో కూడా హమాస్ కార్యాలయాలు, సమావేశాలు సాగకుండా ఆటంకపరుస్తోంది. ఇవన్నీ ఇజ్రాయెల్ ను సంతృప్తిపరిచే చర్యలే.
హోస్నీ ముబారక్ నియంతృత్వం కూల్చివేతను సమర్ధించ్చినందుకు అమెరికా పట్ల అసంతృప్తి ప్రకటించిన ఇజ్రాయెల్ ఈజిప్టు మిలట్రీ మళ్ళీ అధికారంలోకి రావడంతో కులాసా అయింది. గాజా లోని హమాస్ ప్రభుత్వం పై నిర్బంధాన్ని మరింత తీవ్రం చేసే విధంగా ఈజిప్టును ప్తోత్సాహిస్తోంది. గాజాకు ఎటువంటి సరఫరాలు అందకుండా అష్ట దిగ్బంధనం కావించిన ఇజ్రాయెల్ ఆ ప్రాంతాన్ని ప్రపంచంలోని అతిపెద్ద బహిరంగ జైలుగా మార్చిన సంగతి విదితమే. ముస్లిం బ్రదర్ హుడ్ ప్రభుత్వం కొనసాగినన్నాళ్లూ కాస్త ఊపిరి పీల్చుకున్న పాలస్తీనా ప్రజలు మళ్ళీ వాణిజ్య, భౌతిక ఆంక్షల నడుమ మరింత దుర్భర జీవనంలోకి వెళ్ళిపోయారు.
Gaza Underground Economy: ఇజ్రాయెల్ దిగ్బంధనం వలన భూగర్భ సొరంగాల ద్వారా జరిగే సరుకుల సరఫరాయే గాజా ప్రజల జీవనాధారం.
మంగళవారం (మార్చి 4) ఈజిప్టులోని ఒక కోర్టు తమ దేశంలో హమాస్ కార్యకలాపాలను నిషేధిస్తూ రూలింగ్ జారీ చేసింది. హమాస్ నాయకులు గాజా, ఈజిప్టు సరిహద్దు గుండా ఎలాగో ఈజిప్టులోకి ప్రవేశించి తమ సంస్ధ కార్యకలాపాలు నిర్వహించుకుంటారు. వీటిలో కొన్ని రహస్యంగా జరిగితే కొన్ని ఈజిప్టు అధికారుల అనుమతితో జరుగుతాయి. ఇలా ప్రభుత్వ అనుమతితో జరిగే కార్యకలాపాలు ఇక మీదట జరగడానికి వీలు లేదని ఒక కోర్టు రూలింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ ఒత్తిడి, ప్రోద్బలంతోనే కోర్టు నిర్ణయం వెలువడిందని పరిశీలకులు భావిస్తున్నారు.
హమాస్ నాయకుడు సమి అబు జుహ్రీ సైతం ఈ అనుమానాలే వ్యక్తం చేశాడు. ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసమే ఈజిప్టు నాయకులు పని చేస్తున్నారని ఆయన దుయ్యబట్టాడు. హమాస్ కార్యకలాపాలపై విధించిన నిషేధం నిజానికి కోర్టు నిర్ణయం కాదనీ, అది రాజకీయ నిర్ణయం అనీ, దానికి కోర్టును అడ్డం పెట్టుకున్నారని ఆయన విమర్శించాడు. “ఇజ్రాయెల్ ఆక్రమణ వ్యతిరేక ప్రతిఘటనకు ఈజిప్టు మద్దతు ఇవ్వాలి. అంతేతప్ప ఇజ్రాయెల్ కు కాదు. ఈ నిర్ణయం వలన పాలస్తీనా ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గాజా దిగ్బంధనాన్ని ఇజ్రాయెల్ మరింత కట్టుదిట్టం చేయడానికి దోహదపడుతుంది” అని జుహ్రీ వ్యాఖ్యానించాడు.
ఈజిప్టులో ముస్లిం బ్రదర్ హుడ్, మిలట్రీ రెండు అధికార కేంద్రాలు. ఈ రెండింటి మధ్య ఉన్న వైరుధ్యం తీవ్రమైనప్పుడల్లా హమాస్ పై ప్రభావం పడడం అనివార్యంగా జరిగే పరిణామం. ముస్లిం బ్రదర్ హుడ్ కు ప్రజల్లో పలుకుబడి ఉన్నప్పటికీ అమెరికా అండతో దానిని అణచి ఉంచడంలో మిలట్రీ సఫలం అయింది. అరబ్ వసంతం దరిమిలా మిలట్రీ వెనుక ఉన్న పాలక వర్గాలు తాత్కాలికంగా వెనుకడుగు వేశాయి. ముస్లిం బ్రదర్ హుడ్ ప్రభుత్వం కూడా అమెరికాకు అనుకూలంగానే వ్యవహరించినప్పటికీ ప్రాంతీయంగా హమాస్ శక్తివంతం కావడానికి అది దోహదపడడంతో ఇజ్రాయెల్ ఒత్తిడితో బ్రదర్ హుడ్ ప్రభుత్వం కూలిపోవడానికి అమెరికా పరోక్షంగా సహకరించింది. తద్వారా ప్రాంతీయ రాజకీయాల్లో ఇజ్రాయెల్ మరోసారి పై చేయి సాధించింది.
హమాస్ కి వ్యతిరేకంగా ఈజిప్టు మిలట్రీ ప్రభుత్వం తీసుకున్న మరో చర్య గాజా, ఈజిప్టుల మధ్య ఉన్న సొరంగాలను ధ్వంసం చేయడం. గాజాను ఇజ్రాయెల్ సైన్యాలు చుట్టుముట్టినందున అక్కడికి చీమ కూడా చొరబడే పరిస్ధితి లేదు. దానితో గాజా ప్రజల జీవనానికి అంతా గాజా-ఈజిప్టు సరిహద్దులో ఉన్న భూగర్భ సొరంగాలే ఆధారం. ఈ సొరంగాల ద్వారా వచ్చే సరుకులే గాజా ప్రజల్ని బతికిస్తున్నాయి. ఇంత పెద్ద ఘోరం సంవత్సరాల తరబడి (2007 నుండి) సాగుతున్నప్పటికీ ఐరాస గానీ, ఆమ్నెస్టీ, హ్యూమన్ రైట్స్ వాచ్ లాంటి సంస్ధలు గానీ ఇజ్రాయెల్ ను ఒక్క మాటా అనవు. ఒకవేళ అన్నా అవి కాగితాలకే పరిమితం.
గాజా, ఈజిప్టుల మధ్య దాదాపు 1200 వరకు భూగర్భ సొరంగాలు ఉండగా వీటిలో మెజారిటీ సొరంగాలను కొత్త మిలట్రీ ప్రభుత్వం ధ్వంసం చేసింది. గాజా ప్రజలకు సరుకులు ఇవ్వడానికి ప్రపంచం నలుమూలల నుండి వివిధ సంస్ధల కార్యకర్తలు ఓడల పై వెళ్ళి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. అలాంటి ఒక ఓడల వరుస పైన ఇజ్రాయెల్ మిలట్రీ దాడి చేసి 12 మందిని చంపేసినా ఐరాస, అమెరికా, ఇ.యులు కిమ్మనలేదు.
ప్రపంచం పశ్చిమ రాజ్యాల (అమెరికా, ఇ.యు) గుప్పిట నుండి విముక్తి చెందినపుడే పాలస్తీనా ప్రజలకు విముక్తి. అది ఎప్పుడన్నదే సమస్య.